‘చంద్ర’, ‘బాల’ పేర్లతో చిత్రకారునిగా, ఇల్లస్ట్రేటర్‌గా, కార్టూనిస్ట్ గా, డిజైనర్‌గా ప్రసిద్ధి చెందిన మైదం చంద్రశేఖర్ దీర్ఘ అనారోగ్యంతో 28-04-2021న హైదరాబాదులో తన 75వ యేట మరణించారు. ఆయన 28 ఆగస్టు 1946న వరంగల్ జిల్లా గన్నాసరి గ్రామంలో జన్మించారు.
తన చిన్ననాటి నుంచే చిత్రాలు గీయటం ప్రారంభించిన చంద్ర, హైస్కూలు విద్యార్థిగా ఎం.ఎఫ్. హుస్సేన్, కొండపల్లి శేషగిరిరావుల చిత్రాల ప్రతికృతులను చిత్రించారు. బాపుకు ఏకలవ్య శిష్యునిగా చెప్పుకున్న చంద్ర త్వరలోనే తనదైన సొంత గీత, రాత ఏర్పరచుకున్నారు. 13 ఏళ్ళకే కార్టూన్లు గీశారు. కేవలం స్వయంకృషితో చిత్రకారునిగా ఎదిగిన ఆయన ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదివారు. తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని కష్టనష్టాలను భరించి తన కాళ్ళపై తాను నిలబడ్డారు. ‘మయూరి’, ‘జ్యోత్స్న’, ‘యువ’, ‘అపరాధ పరిశోధన’, ‘జ్యోతి’ పత్రికల్లో పనిచేశారు.
ఎన్నో ప్రగతిశీల కవితలకు స్ఫూర్తివంతమైన చిత్రాలు వేశారు. 1970-76 మధ్య విప్లవ రచయితల సంఘంలో సభ్యునిగా కృషి చేశారు. ఖమ్మంలో జరిగిన మొదటి విరసం సభలో తన చిత్రాలను ప్రదర్శించారు. ఎమర్జన్సీలో పలు రచయితలతో పాటు జైలులో వున్నారు. 1977 ఆగస్టులో ప్రారంభించిన ‘ప్రజాసాహితి’కి కొన్ని నెలలపాటు ముఖచిత్రాలు వేశారు. ‘ప్రజాసాహితి’ నూరవ సంచికకు విశిష్టమైన ముఖచిత్రం వేశారు.
చంద్ర కథారచయిత కూడా. దాదాపు 150 కథలు రాశారు. వాటిలో ‘12 కథలు’ శీర్షికతో ఒక కథా సంకలనం వెలువరించారు. మిత్రులతో కలసి న్యూ వేవ్ రైటర్స్ పేరుతో ‘పోరు’ అనే కథాసంకలనం ప్రచురించారు.
‘చిల్లర దేవుళ్ళు’, ‘ఊరుమ్మడి బ్రతుకులు’, ‘చలిచీమలు’, ‘తరం మారింది’ లాంటి 20 సినిమాలకు, పలు లఘు చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేశారు. హైదరాబాదు సార్వత్రిక విశ్వవిద్యాలయంలో చిత్రకళా ఉపాధ్యాయునిగా, చిత్రకళపై ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. వ్యాసాలు రాశారు. రెండు వేలకు పైగా వ్యంగ్య చిత్రాలు గీశారు. ఎన్నో పుస్తకాలకు ముఖచిత్రాలు వేశారు.
వియత్నాంపై అమెరికా వేసిన బాంబు దాడిపై వీరి చిత్రం క్యూబాలో జరిగిన తొమ్మిదవ అంతర్జాతీయ యువజన ఉత్సవాలకు ఎన్నికైంది.
‘చంద్ర’ మరణానికి ‘ప్రజాసాహితి’ సంతాపాన్ని ప్రకటిస్తోంది. వారి కుటుంబ సభ్యుల దుఃఖంలో పాలు పంచుకుంటోంది.