వలస ‘దుఃఖ’ భారతం

వలస ‘దుఃఖ’ భారతం

డా. జి.వి. కృష్ణయ్య ‘వలస భారతం’ దీర్ఘకవితపై సమీక్షాప్రసంగం

– డా. ఎ.కె. ప్రభాకర్

     డా॥ జి. వి. కృష్ణయ్య ‘వలస భారతం’ దీర్ఘ కవిత చదువుతుంటే నాకు పిల్లలు పాడుకునే రెండు పాటలు గుర్తొచ్చాయి.

     ఒకటి : ‘రింగా రింగా రోజస్‌ … … … వి ఆల్‌ ఫాల్‌ డౌన్‌’

     రెండు : ‘ఎంతెంత దూరం … కోసెడు కోసెడు దూరం …’

     ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ 19 కారణంగా చనిపోతున్నవాళ్ళని చూసినపుడు మొదటి పాట, దేశంలో అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మికులు రోడ్డున పడ్డప్పుడు రెండో పాట గుర్తుకు రావడం సహజమేనేమో! సాధారణంగా రహదారులు ‘నాగరికత’కు ప్రతీకలు అంటారు. కానీ కరోనా కాలంలో రోడ్లు అనాగరికతకూ, అమానవీయతకూ పాదులుగా తయారయ్యాయి.

     దూరదృష్టి లేని పాలకుల నిర్వాకం వల్ల దేశమంతటా అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ విధించడంతో కోట్లాది కార్మికులు ప్రాణభయంతో యింటి ముఖం పట్టారు. మట్టికాళ్ళతో, వొట్టికాళ్ళతో, ఆకలిదప్పులతో, గమ్యం లేని దారుల్లో మండుటెండలో కరిగిన తార్రోడ్ల మీద రైలు పట్టాల మీద వందల వేలు మైళ్ళు నడవటానికి సిద్ధపడ్డారు. భద్రజీవులు విశ్రాంతివర్గం యిళ్ళల్లో నీడపట్టున సురక్షణ సూత్రాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే శ్రమజీవులు బజారు పాలయ్యారు. 70 ఏళ్ళకి పైగా స్వాతంత్య్ర ఫలాలివి. పెట్టుబడి సమాజపు క్రూర పరిహాసానికి తార్కాణం యిది.

     పసిబిడ్డలు, బిడ్డల తల్లులు, వృద్ధులు నెత్తిన తట్టా బుట్టా పెట్టుకుని వేసిన నెత్తుటి పాదముద్రలతో రోడ్లు రక్తనదులయ్యాయి. నెలలు నిండిన స్త్రీలు రహదారుల్లోనే ప్రసవించారు. మరణించిన తల్లి శవంపై పడి శిశువులు స్తన్యం కోసం రోదించారు. ఈ వలస విషాద పాపం పాలకులదే. పాలకుల అభివృద్ధి మంత్రం ఎన్ని అపస్వరాల వూకదంపుడు పాటో తెలిసిపోయింది.

     కోట్లాదిమంది శ్రమజీవులు రోడ్లమీదికి రావడంతో దేశం యావత్తూ నిలిచిపోయింది. సమస్తం స్తంభించిపోయింది. అన్ని పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రవాణా సౌకర్యం లేదు. వారు గమ్యస్థానాలకు చేరేందుకు ఖర్చు ఎవరో వొకరు భరించాలి కదా! ప్రభుత్వాలు పట్టించుకోలేదు, పనికి పెట్టుకున్న యజమానులు పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లు కనపడకుండా పోయారు. జీతభత్యాల్లేవు. రోజు గడవదు. పొయ్యిలో పిల్లి లేవదు. పుట్టిన వూరు పిలుస్తోంది. కాబట్టే అక్కడ్నుంచి బయలుదేరాల్సి వచ్చింది. కరోనాకు చచ్చిపోతావు తండ్రీ అంటే, కరోనాకు కాదు ఆకలికి చచ్చిపోతామన్నారు. ఆకలి చావుకంటే ఈ కరోనా గొప్పదేంకాదు. ఇటువంటి చావులు అనేకం చూశామని చెప్పి వాళ్ళు కదులుతూనే వున్నారు. ఎవరూ వీరి బాధ పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకున్నారంటే – ‘ఒక నీటిపంపు దాహం తీర్చింది / ఒక చెట్టుకొమ్మ నీడనిచ్చి సేదతీర్చింది…. చాకిరితో ఆకలి తీర్చుకున్న చేతులు / చేతులు చాపి ఆర్ద్రంగా అర్థించాయి’.

     వర్తమాన సమాజంలో వలసల సమస్య అసమాన అభివృద్ధి వికృత ఫలితమే అని డాక్టర్‌ జి.వి.కృష్ణయ్య భావించాడు. దేశంలో గిడసబారిన అభివృద్ధి, సంపద పంపిణీలో అసమత్వం ఆయన్ని కలచి వేశాయి. ‘జీవిత గమనంలో తారసపడి హృదయాన్ని స్పృశించి ఘర్షణ రేపిన ఘటనలూ, మనసులో చెరిగిపోని సన్నివేశాలూ, పత్రికల్లో వార్తలూ, దూరవాణిలో దృశ్యాలు, ఆర్థిక అసమానతలూ, అశాంతి, మరెన్నో అనుభూతులు మనసులో గుచ్చుకున్నపుడు మనిషిగా స్పందించాను, రచయితగా అక్షరీకరించాను’ అంటాడు. వలస భారతం దీర్ఘకావ్యం ఆ క్రమంలోనే వెలువడింది. కావ్యం పొడవునా యీ మానవీయ స్పందనే కనబడుతుంది.

              మనిషిమీద నమ్మకాన్ని వదిలేస్తున్న తరుణంలో…

              మనిషికోసం మనిషి గాక

              మనిషికి మనిషే పోటీగా మసలుతున్న సమాజంలో

              ఒక్కరికోసం పదుగురు

              పదుగురికోసం ప్రతిఒక్కరు

     అంటూ కష్టకాలంలో కవి కష్టజీవికి రెండు వైపులా నిలబడితే – ఆకలితీర్చిన ఆశ్రయమిచ్చిన చెప్పులు తొడిగిన దయామయులు కొందరు అండగా నిలిచారు!

     ఇటువంటి దీర్ఘ కవితల్లో ప్రతి ఖండికలో / అధ్యాయంలో రచయిత తన దృక్పథాన్ని చెప్పాలి. దృక్పథపరమైన కంటెన్యుటీ లేకపోతే, ఆ ఏకసూత్రత, ఆ అంతస్సూత్రం లేకపోతే దీర్ఘకవిత ఏ ముక్కకాముక్క విడిపోతుంది. నగ్నముని కొయ్యగుర్రంలో తుఫాను నెపంమీద రాజ్య స్వభావం, వరవరరావు సముద్రంలో సముద్రం ప్రతీకగా విప్లవోద్యమం, ఛాయారాజ్‌ శ్రీకాకుళంలో శ్రీకాకుళోద్యమ స్ఫూర్తి … యిలా కవిత మొత్తం వొక యితివృత్తాన్ని అల్లుకుని ఆ కీలకాంశం చుట్టూ తిరుగుతుంది. అందులోనే కవి దృక్పథం వుంటుంది. భావజాలం వుంటుంది. అది కేంద్ర స్థానంలో వుంటుంది. అందుకే దాన్ని నేను గడియారంలోని స్ప్రింగుతో పోల్చాను. కేంద్రం నుంచి ఆ ప్రకంపనల కారణంగా గడియారం స్ప్రింగుద్వారా గడియారం ముళ్ళు తిరుగుతూ వుంటుంది. గడియారం ముళ్ళు తిరగాలంటే, కావ్యం నడవాలంటే ఈ అంతస్సూత్రం వుండాల్సిందే! వలస భారతం కూడా కరోనా నెపంగా కార్మిక శక్తితో నడిచే సంపద చుట్టూ దేశ దళారీ ఆర్ధిక వ్యవస్థ చుట్టూ ప్రపంచ పెట్టుబడీదారి దుర్మార్గాల చుట్టూ నడిచింది. కృష్ణయ్య వలస భారతం వచ్చిన సందర్భంలోనే నల్లెల రాజయ్య సంకలనం చేసిన ‘దుఃఖ పాదం’, బిల్లా మహేందర్‌ సంపాదకత్వంలో ‘వలస దుఃఖం’ వెలువడ్డాయి. వీటన్నిటినీ ఒక దగ్గర చేర్చి చూసినప్పుడు వలస భారతం సమగ్ర చిత్రం రూపుకడుతుంది.

              సరే, యింతకీ …

              రవాణాకూడా కల్పించలేని రాజ్యం … ఉన్నట్టా లేనట్టా!?.

              దరిద్రాన్ని మూటకట్టుకుని దారెమ్మట పోతుంటే …

              దారిదోపిడీ దొంగలన్నారు! బందిపోట్ల గుంపన్నారు!

     ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘శ్రామిక రైళ్ళు’ పెద్ద అభాస. ఘరానా మోసం. పాదాలు పుండైన బడుగు జీవుల దగ్గర డబుల్‌ చార్జీలు వసూలు చేశారు. ఆహా, ఏమి ఔదార్యం!? అలా 430 కోట్ల ఆదాయం వచ్చిందని సిగ్గులేని ప్రకటనలు చేసుకున్నారు.

     నిన్న అయోధ్యలో రామాలయాన్ని కట్టించడానికి శంకుస్థాపన చేసిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్‌ (ఆయన ‘యోగి’ అట) వలస కార్మికులమీద, వస్తువులమీద స్ప్రే చేసినట్లు, క్రిమిసంహారక మందు చల్లించాడు. వాళ్ళని ఎక్కడా మనుషుల్లాగా గుర్తించలేదు. కేవలం దాతల సాయంతో కొందరయినా బయటపడ్డారు. ‘కన్నీళ్ళతో కరచాలనం చేద్దామన్నా / కరోనా అనుమతించని కాలంలో…. వాళ్ళకు కరోనా పరీక్షలు చేశారు. ఇళ్ళకు పోకుండా వాళ్ళనసలు కదలకుండా చేయాలనే కుట్ర జరిగింది.

     డచ్‌ దేశపు ఆర్థికవేత్త జాన్‌ బ్రెమన్‌ వలస కార్మికుల్ని Foot Loose Labour (ఫుట్‌ లూజ్‌ లేబర్‌) అంటాడు. స్థాన బలం లేని వలస కార్మికుల్ని ఏ హక్కులూ లేని బానిసలుగా దోచుకోవచ్చనే అతి పెద్ద కుట్ర ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుడు అమలుచేస్తున్నాడు. ఇక్కడ కూడా కార్మికులు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత లాక్డౌన్‌ ఎత్తేస్తే వారి ప్రాజెక్టులన్నీ ఏమవుతాయి. గోడ కట్టే ట్రంప్‌ ఫిలాసఫీ ఒకటుందికదా! మెక్సికోకు అమెరికాకు మధ్య ట్రంపు గోడ కడదామనుకున్నాడు కదా!

     నిజానికి అమెరికాలో వలస కార్మికులు లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోతది. కుదేలయిపోతది. భారతదేశంలో కూడా వలస కార్మికులు వారి గమ్యస్థానాలకు చేరిపోతే ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమై పోతదని ఎక్కడికక్కడ ఆపేశారు (దేశ ఆర్ధిక వ్యవస్థ కాదు ధనస్వాముల ఆర్ధిక వ్యవస్థ). ఇది ‘‘ఒక కుట్ర’’ అని గ్రహించాడు ఈ రచయిత. ఆ కుట్రని కవితాత్మకంగా బహిర్గతం చేశాడు అయితే, వీళ్ళెవరు – ఎక్కడినుంచి వస్తున్నారు అంటే ఇక్కడ అద్భుతమైన కవితా పంక్తులున్నాయి. ఎక్కడివారు ఈ వలస కార్మికులు?

     ‘పైరుపచ్చ విప్లవంలో/ రాలిపడిన తాలు గింజలా?’

     నికార్సయిన రాజకీయ ఆర్థిక ప్రకటన యిది. రచయిత ఎంత హాయిగా, స్పష్టంగా కవితాత్మక వ్యక్తీకరణతో యీ మాటన్నాడు!! హరిత విప్లవాలు, నీలి విప్లవాలు, క్షీర విప్లవాలుంటాయి. కానీ, ఇవన్నీ మనిషి బతకలేని విప్లవాలు. బ్రతుకునిచ్చే విప్లవాలను మరిచిపోయి మనవాళ్ళు ఈ విప్లవాల గురించి మాట్లాడుతున్నారు. హరిత విప్లవం ఏంచేసింది? నోటికాడ కూడు ఎలా తీసేసింది! సంప్రదాయ పంటల్ని, తృణధాన్యాల్ని ఎన్నింటిని నాశనం చేసింది? ఈ విప్లవాలన్నీ ఏం సాధించాయి? అందుకే, రాలిపడిన తాలుగింజలా అన్నారాయన. హరిత విప్లవంలో గట్టిగింజులు ఎవరికి పోయాయి? తాలుగింజలుగా ఎవరు మిగిలిపోయారు ? ఇదీ కవి లేవనెత్తిన ప్రధానమైన ప్రశ్న.

     ‘నీలి విప్లవ అలల తాకిడికి / ఊపిరాడక ఒడ్డున పడ్డ చేపపిల్లలా?’

     రచయిత దృక్పథం పద్నాలుగు అధ్యాయాల్లో నిండుగా కనపడుతుంది, కానీ కొన్నిచోట్ల కవితాత్మకంగా కనపడుతుందన్నపుడు నాకీ అద్భుతమైన పంక్తులు కనపడ్డాయి. అక్కడే

     ‘క్షీర విప్లవ మథనానికి / వట్టిపోయిన పాడెగేదెలాంటి రైతులా?’

     అంటాడు. క్షీర విప్లవ మథనమన్నది కొత్తగావుంది! కార్పొరేట్‌ మార్కెట్లో దళారుల లాభాల మండీలో విశ్వ విపణిలో ఆ రైతులు కూలీలుగా ఎలా అయ్యారు.

     ‘సేద్యం పనులు కరువయ్యాయి / కులవృత్తులు కూలిపోయాయి / కమతాలు తరిగిపోయాయి / గ్రామీణ జీవితం విధ్వంసమైంది / పల్లెజీవితం పరాయిదైపోయింది / పట్నంనిండా అల్లుకున్న పల్లెతీగ!!’

     మొదటి అధ్యాయంలో చెప్పినదానికి కొనసాగింపిది. వ్యవసాయాన్నీ – తదనుబంధ వృత్తుల్నీ ఆశ్రయించినవాళ్ళే వలస కార్మికులుగా మారారు. గ్రామీణ కూలీలు అర్బన్‌ లేబర్‌గా మారారు. వీళ్ళకు ఒక ప్రాంతం ఉందా, ఒక కులం ఉందా, ఒక మతం వుందా? ఉంటాయి కానీ వీటన్నింటికంటే దోపిడీకి గురవడం అన్న ఒక సామాన్య సూత్రం వుంది. అది వర్గం అని కవి సూచన.

              తెలంగాణలో బిల్డింగ్‌ కట్టే ఆంధ్రామేస్త్రీ

              ఆంధ్రాలో కాలువ తవ్వే పాలమూరు కూలీ

              హార్డువేర్‌ షాపులో గుమస్తాలుగా గుజరాతీలు

     ఇక్కడ ఒక గమ్మత్తయిన మాట వుంది. ‘మార్వాడీ మిఠాయి కొట్లో బందరు కూలీ’. మనకందరకూ బందరు మిఠాయి ఫేమస్‌. కానీ ఆ బందరు మిఠాయి చేసే ఆయన ఏమయ్యాడు. మార్వాడీ మిఠాయి కొట్లో కూలీగా మారాడు. ఇదీ గ్రహించాల్సిన విషయం. రచయిత భావజాలం మొత్తం కావ్యంలో ఎక్కడా మిస్సవలేదు. అలా మిస్సయి వుంటే, దీర్ఘకావ్యానికుండాల్సిన బిగువు, నిర్మాణం, శిల్పం దెబ్బతినేవి. అలా దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా అల్లుకుంటూ వచ్చాడు. పొలిటికల్‌ ఎకానమీకి సంబంధించిన ఎన్నో అంశాల్ని సూక్ష్మంగా పరిశీలించాడు. నిర్దుష్టంగా వ్యాఖ్యానించాడు.

     వీళ్ళంతా గూటికి చేరడానికి ఇంకా నడుస్తూనే వున్నారు. వీరు మరలా వస్తారు అంటాడు ప్రసాదమూర్తి ఒక కవితలో…

              ‘నా రెక్కతో దుమ్ముదులిపి

              పట్టాలెక్కించడానికి మళ్ళీ వస్తా’

     ఇందాక సూర్యసాగర్‌గారు ఈ పద్నాలుగు అధ్యాయాల తర్వాత ఇంకా నాలుగు అధ్యాయాలు వున్నాయన్నారుగదా! బహుశా ఆ నాలుగు అధ్యాయాల్లో వీరు మళ్ళీ రావాలని ఆశించివుండొచ్చు. ఇళ్ళకి చేరుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వారి బతుకు తెరువు ఎలా? మళ్ళీ ఉపాధి కోసం క్యూ కట్టినపుడు దోపిడీ రూపం ఎలా వుండబోతుంది? దానికి అంతం ఎక్కడ?

     మహాభారతం పద్దెనిమిది పర్వాలతో మహాప్రస్థానం దగ్గర ఆగిపోయింది. కానీ, ఈ వలస మహాప్రస్థానం  సమసమాజం ఏర్పడేవరకూ ఆగదు.

     గేదెలు కాచే బీహారోళ్ళు / గ్రానైట్‌ గనిలో ఝార్ఖండ్‌ మనిషి / ఆక్వా లేబరు తమిళతంబి / యుపి యంపి బెంగాల్‌ బస్తర్‌ నుండి వచ్చిన సెంట్రింగ్‌ మేస్త్రీ, ప్లంబర్‌, ప్లైవుడ్‌ వర్కర్‌…. వీళ్ళంతా ఏమౌతారు? రచయిత ఇక్కడొక మాట అంటాడు.

              ‘అభివృద్ధొక తారకమంత్రం

              రాజకీయ నాయకుల కుతంత్రం

              ఆర్థిక ప్యాకేజి ఒక దేవతావస్త్రం

              కార్పొరేట్‌ వర్గాలకు అమృతభాండం’

     కార్పోరేట్‌ వర్గాలకు అది అమృతభాండంగా ఎలా మారింది. ప్రొ. జ్యోతి రాణిగారు రాసిన కరపత్రంలో ఆత్మ నిర్భర భారత్‌ కాదిది అన్నారు. మన పాలకులకు ‘ఆత్మ’ కార్పోరేట్‌. సామాన్యులకు యిది ఆత్మ దుర్భర భారత్‌.

     మన ప్రధానమంత్రి మోడీ చాలా గమ్మత్తయిన వాక్యాలు మాట్లాడుతూ వుంటారు. ఆయన ఉపయోగించే ప్రధానమైన వాక్యాల్లో… ‘మనం సంక్షోభంలో వున్నాం, నిజమేకానీ, సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలి’ అనేది వొకటి. ఈమాట అందరూ వాడతారు. చంద్రబాబునాయుడు, జగన్మోహన్‌ రెడ్డి, కెసిఆర్‌ కూడా వాడతారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుందామనేవాళ్ళే అందరూ. అయితే ఎవరి సంక్షోభం, ఎవరికి అవకాశంగా మారుతుంది. కరోనా సంక్షోభం కార్పోరేట్‌ వర్గాలకు అవకాశంగా మారుతుంది. అలాగే పాలక వర్గాలకు అవకాశంగా మారింది. తొంభైశాతం అంగవైకల్యం వున్న సాయిబాబాను పెరోల్‌ మీద విడుదల చేయాలన్నా, ఎనభైయేళ్ళ వరవరరావుని బెయిల్‌ పై విడుదల చేయాలన్నా కరోనా వుంది, లాక్డౌన్‌ వుంది కాబట్టి విడుదల చేయడానికి వీలుకాదు.

     సి.ఎ.ఎ.కి వ్యతిరేకంగా షాహిన్బాగ్లో జరిగిన ఉద్యమం ఏమైంది? అది కరోనా కారణంగా ఆగలేదు. కరోనా సంక్షోభాన్ని పాలకవర్గాలు అవకాశంగా మార్చుకుని అణచివేశారు. కాశ్మీర్లో ఏం జరిగింది. ఏం జరుగుతోంది? కరోనా సంక్షోభాన్ని ప్రభుత్వం అవకాశంగా తీసుకుంది. ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కరోనా కార్పెట్‌ కింద అమలు పరుస్తున్నారు. కార్పోరేట్‌ ఎలా తయారయ్యిందంటే, కరోనా కార్పెట్‌ కింద పాములా తయారయ్యింది. రూరల్‌ జర్నలిస్టు సాయినాథ్‌ ‘కరువుని అందరూ ప్రేమిస్తారు’ అంటారు. అలాగే కరోనాని కూడా అందరూ ప్రేమిస్తారు. పాలకులు, వాళ్ళ తాబేదార్లు అవినీతి అధికారులు అందరూ ప్రేమిస్తారు. కరోనా వారికలా వుపయోగపడుతుంది మరి!

     విద్యాలయాల్లో వున్న టీచర్స్‌ అందరూ ఏమయ్యారు. తరగతి గదిలో 40 – 60 మందికి చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఆన్ల్కెన్లో 100 – 200 మందికి ఒకేసారి పాఠం చెప్పడం ద్వారా టీచర్స్‌ ఉపాధి కోల్పోయారు. జీతాల్లేవు. మామూలుగానే టీచర్లకు వేసవి సెలవులకు జీతాలివ్వరు. అసంఘటిత రంగమేకాదు సంఘటిత రంగంలోకూడా ఇలాంటి పరిస్థితి వుంది. కొందరు టీచర్లు కూరగాయలు అమ్ముతున్నారు. డాక్టరేట్‌ చేసినాయన తాపీపని చేస్తున్నాడు. అమెరికా వెళ్ళిన మన సాఫ్ట్‌వేర్స్‌ ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు శాసనాలు చేస్తుంటాడు. హెచ్‌1 వీసాలు రద్దుచేస్తానంటాడు. ప్రపంచ వ్యాప్తంగా పాలకులు ప్రజావ్యతిరేకమైన చట్టాల్ని తీసుకరావడానికి, చర్యలు చేపట్టడానికి ఈ కరోనా ఒక అవకాశంగా ఉపయోగపడింది. ఈ కుతంత్రాన్నే రచయిత బహిర్గతం చేశాడు.

              ‘ఈ పాలకులు కోళ్ళ కోసుపందాల నిర్వాహకులు

              మార్కెట్‌ బేరగాళ్ళ తైనాతీలు

              కార్పొరేట్‌ కోటీశ్వరుల దళారీలు!’

     తర్వాతి ఖండికలో రచయిత ఒక మాటంటాడు. ‘వైరసుక్కూడా వర్గస్వభావమున్నట్లుంది’ అంటాడు. సహజంగా వైరస్‌కు వర్గ స్వభావముండదు. అది అందరినీ తాకుతుంది. జైల్లో ఖైదీని తాకుతుంది. ఇంట్లోవుండే సెలెబ్రిటీకి తాకుతుంది. అలాగే డిల్లీ మర్కజ్‌ నుంచి వచ్చిన ముస్లీమును తాకుతుంది, రోడ్డుమీద నడుస్తున్న వలస కార్మికుడ్ని తాకుతుంది. ‘విశ్రాంతి తీసుకోండి, మంచి ఆహారం తీసుకోండి, విటమిన్స్‌ వేసుకోండి, ఆ వైద్యం చేయించుకోండి, ఈ వైద్యం చేయించుకోండి’ అంటారు. ఐసోలేషన్లో ఉండమంటారు. అసలు ఉండటానికి ఇల్లెక్కడుంది? ఇంట్లో వొంటరి గదులు ఎక్కడున్నాయి.

              ‘ఊరిచివర నివాసాలు ఊపిరాడని ఉద్గారాలు

              దుర్గంధం నిత్యజీవన నేస్తమై సాగుతోంది

              చీకటి గదులు చిరుగుల గుడిసెలు

              తడికె చాటున స్నానపు గదులు

              మురికివాడలో బెత్తెడు రూములో

              గంపెడు పిల్లలతో ఆలుమగలు

              అందరు వాడేదొకటే ఉమ్మడి టాయిలెట్‌!

     మరి ఐసొలేషన్‌ కుదురుతుందా? అంటే, వైరస్‌కు వర్గస్వభావం లేదుగానీ, పేదరికానికి వుంది. కరోనాకు వర్గం లేదు. కులం లేదు. మతం లేదు. కానీ పాలకులకు వర్గం వుంది. కులం వుంది. మతం వుంది. అందుకనే భౌతిక దూరం సామాజిక దూరమై ‘ధర్మ’ బద్ధతని సాధించటానికి పూనుకుంది. సందులో సడేమియా లా తరతరాల అంటరానితనం ఆదర్శమైంది.

     భౌతిక దూరం పాటించండి. బయటకు రాకుండా క్వారంటైన్లో వుండండి. బయటకు రాకుండా మనకు కడుపు నిండతదా? సంక్షేమం ద్వారా, సబ్సిడీ ద్వారా ఇచ్చే ఆహార ధాన్యాలు ఎక్కడికి పోయాయి?

              ఎలుకలు తిన్నా ముక్కిపోతున్నా / ధాన్యం నిల్వలు బయటకు రావు!

     ….                ….                …..               …..

              ఆకలి తీరితే దొరకరు పనికని / ఆధారం తుంచి క్షుద్భాధను చూపి ఆశలు పెంచీ /

              అటు కదలక ఇటు కదలక ఎటూ మెదలక / గుదిబండను మెడలో తగిలిస్తారు!

     ఇందువలన రచయిత వైరస్‌కి వర్గస్వభావముందని చెబుతున్నాడు. పాలకులకు, పాలక విధానాలకు వర్గస్వభావం వుంటుంది. అందుకే వలస కార్మికుడికి బతుకుదెరువుండదు.

     ‘స్వేదబిందువు తత్వం బోధపడని చోట చాకిరీ చెమట కేకలు వినపడవు!’.  కరోనా వ్యాపించడానికి  మతం రంగు పులమడానికి ప్రయత్నించారు.

              మర్కజ్‌తో విజృంభించిందని మతలబు

              మతం రంగు పులమాలని ఉన్మాదపు తహతహలు!

     కవి దృష్టి నుంచి యే సామాజికాంశమూ తప్పిపోలేదు. అందుకే, పాలకులకు, పాలక విధానాలకు మతం వుంటుందని తీర్మానించాడు.

     రాత్రి తొమ్మిది గంటలకు, తొమ్మిది దీపాలు వెలిగించాలట! 9×130 కోట్లమంది దీపాలు వెలిగిస్తే ఆ దీపకాంతిలో కరోనా వైరస్‌ పారిపోతుందట! ఆ కాంతిలో చప్పట్లు కొడితే ఆ శబ్దం కరోనాను చంపేస్తదంట! నవగ్రహాలు శాంతిస్తాయంట. శంఖాలు వూదారు, గంటలు కొట్టారు… మరి పారిపోలేదేం? భారతదేశంలో కరోనా వైరస్‌కు దీపాలు వెలిగించడమే వాక్సిన్‌ అనుకుందామా? మరి లాక్డౌన్‌ మరలా మరలా కొనసాగుతుంది… కరోనా ఇంకా విజృంభిస్తుంది. వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఇదంతా యేంటి? ఎంత వంచన?!

     ఇవాళ పొద్దుట్నుంచి ఒక ప్రచారం జరుగుతోంది. రష్యాదేశం వ్యాక్సిన్‌ కనిపెట్టిందని, వ్యాక్సిన్‌ ఒక మాఫియా! ప్రపంచ వ్యాప్తంగా 230 దేశాల్లో వ్యాక్సిన్‌ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు  తామే ముందు కనిపెట్టాలని ఆరాటం. ఎవడు ముందు కనిపెడతాడో వాడు మార్కెట్ని తమ గుప్పిట్లో పెట్టుకోవచ్చని. ప్రపంచ వ్యాప్తంగా ఒక థియరీ కూడా వుంది – ఫార్మా కంపెనీవాళ్ళే కరోనాపట్ల భయాన్ని వ్యాపింపజేసి మార్కెట్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.

              ‘నేడు కరోనా వాక్సిన్‌కై ఎదురు చూస్తున్నారు

              సైన్స్‌ పట్ల మక్కువ పెరిగింది

              మనిషి ఆలోచనా దృక్పథంలో మార్పు వచ్చింది’

              అంటాడు కవి.

     నిజానికి అదే సమయంలో మూఢవిశ్వాసాలు కూడా పెరిగాయి. గోమూత్రం కోవిడ్‌ని పారదోలుతుందనీ, హనుమాన్‌ చాలీసా పారాయణం చేస్తే కరోనా పరారవుతుందనీ, బాబాజీ పాపడ్‌ తింటే రోగం దరిచేరదనీ, రామమందిర నిర్మాణమే సర్వ జగద్రక్ష అనీ ప్రచారం చేశారు. నేరం శత్రు దేశంపై మోపారు. కరోనా ఎక్కడ పుట్టిందో / ఎలా పుట్టిందో కంటే అది నేర్పిన గుణపాఠమే అత్యవసరం!

     దీర్ఘకావ్యం పొడవునా దృక్పథానికి తగిన శిల్పాన్ని ఉపయోగించినా –

     ‘మానవ సంబంధాలన్నీ / ఆర్థిక సంబంధాలేనని మార్క్స్‌ చెప్పాడు. / మనిషీ ఒక సరుకే, లాభమే సర్వస్వమని క్యాపిటలిజం ఉద్ఘాటిస్తుంది!’

     ఇలా కొన్ని చోట్ల కవి శుద్ధవచనమై పోతాడు. దీర్ఘకవితలో యీ ప్రమాదం ఎప్పుడూ వుంటుంది. అయితే దృక్పథబలమే కావ్యాన్ని నడిపింది.

     ఆ క్రమంలో ఈ వలసలు దినసరి కూలీలతో ఆగవంటూ వివిధ రంగాలపై, ఉపాధిపై దాని ప్రభావం ఎలా వుంటుందో కూడా చెప్పాడు. రోడ్డుమార్జిన్‌ వ్యాపారులు, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, సాఫ్ట్వేర్‌ ఉద్యోగులు ఇలా అందరూ ఒక అభధ్రతలో వున్నారు. వీరందర్నీ ఐక్యం చేయవలసిన రాజకీయ శక్తులు సైతం ముక్కలైపోయి వున్నాయి. శ్రామిక శక్తులన్నిటినీ వొక తాటిపైకి తెచ్చి నాయకత్వం వహించాల్సిన కార్మిక వర్గం ఆ బాధ్యత నుంచి పక్కకి తొలగిపోయి ‘ట్రేడ్‌ యూనియనిజానికి’ పరిమితమైపోయింది. అనేక జాతీయ కార్మిక సంఘాలు కార్మిక వర్గ స్వభావం కోల్పోయాయి. అందుకే కవి ప్రజా రాజకీయాల అవసరాన్ని గుర్తించి యిలా అంటాడు :

              ‘నాటి జన రాజకీయం మసకబారి పోయింది

              వ్యక్తిపూజను నినదించే భజన రాజకీయంగా మారింది

              నేడు కుదుళ్ళు తెగిన విభజన రాజకీయం కొనసాగుతుంది’

     అయినప్పటికీ దోపిడికీ అణచివేతకూ గురయ్యే ప్రజా సమూహాలన్నీ వొకటై శ్రమజీవులపై  అమలవుతున్న దుర్మార్గానికి వ్యతిరేకంగా నిలబడతారనీ, నిలబడి కలబడతారనీ రచయిత డాక్టర్‌ కృష్ణయ్య ఒక ఆశావహదృక్పథంతో వలస భారతానికి భరతవాక్యం పలికాడు.

              ‘ఎప్పటికైనా ఈ వలస దుఃఖం

              పిడికిళ్ళెత్తి ఎరుపెక్కిన ఎర్రెర్రని ఆగ్రహంగా

              మారకుంటుందా? మార్చుకుంటుందా?

              మారాకు తొడగకుంటుందా?!

     ‘మన ఫిర్యాదుల్ని అందుకోడానికి ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు. ఏనాడో చచ్చిపోయిన వ్యక్తులు మనల్ని పరిపాలిస్తున్నారు. వారి కోరలు మనలోకి చాలా లోతుగా దిగి ఉన్నాయి. ఈ తరుణంలో మన ముందున్న ఏకైక మార్గం పోరాటం ఒక్కటే. బతకడానికి పోరాటం. కాస్త ఊపిరి తీసుకోడానికి పోరాటం. కనీస హక్కుల కోసం పోరాటం.’ (అరుంధతీ రాయ్‌)

     ఇది ఫిర్యాదుల యుగం కాదని యీ కవికి తెలుసు. పోరాడక తప్పదనీ తెలుసు. కార్పోరేట్‌, మతం రెండూ కరోనాగా మిలాఖతైన వికృత రాజకీయ సందర్భంలో పోరాడే శక్తులు వొకటై నిలవాలని చెప్పిన ‘వలస భారతం’ కవి డా॥ కృష్ణయ్యకు అభినందనలతో … సెలవ్‌.

(కాలంకాని కాలం కరోనా కాలంలో ఆగస్టు 9, 2020న జనసాహితి తొలి ‘జూమ్‌’ మీటింగ్‌లో చేసిన ప్రసంగం ఆధారంగా…)

admin

leave a comment

Create Account



Log In Your Account