కళ ఎవరికోసమని ప్రశ్నించిన ‘మెఫిస్టో’ (1981)

కళ ఎవరికోసమని ప్రశ్నించిన ‘మెఫిస్టో’ (1981)

– బాలాజీ (కోల్ కతా)

          సుప్రసిద్ధ హంగేరియన్ దర్శకుడు ఈస్త్వాన్ జాబో 1981లో నిర్మించిన సినిమా ‘మెఫిస్టో’. జాబో పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా ఇది. సినిమాకు మూలం జర్మన్ రచయిత క్లాస్ మాన్ ఇదే పేరుతో రాసిన నవల. ఈ నవలకు నాటక రూపాలు కూడా చాలా వచ్చాయి. ఫాసిస్టు జర్మనీలో హెండ్రిక్ హాఫ్గెన్ అనే రంగస్థల నటుడి అంచెలంచెల ఎదుగుదలను చెబుతుంది ఈ కథ. నిజజీవిత నటుడు గుస్తఫ్ గ్రుంజెన్స్ జీవితం ఆధారంగా రచయిత ఈ నవలను రాశాడు. ప్రభుత్వాధినేతలకూ, నటులకూ మధ్య ఉండే గమ్మత్తైన సంబంధాన్ని వివరిస్తుంది ఈ కథ. దేశాన్ని నియంతృత్వం కబళిస్తున్నప్పుడు ‘కళాకారుడా! నీవెటువైపు?’ అని ప్రశ్నిస్తుంది.

సినిమా కథ :

          అది 1920ల నాటి జర్మనీ. చిన్న ఓడరేవు పట్టణం హంబుర్గ్. హంబుర్గ్ ఆర్టిస్ట్స్ థియేటర్లో నటుడు, దర్శకుడు హెండ్రిక్ హాఫ్గెన్. అతడితో పాటు ఒట్టో ఉల్రిచ్స్, హన్స్ మిక్లాస్ తదితరులు ఆ థియేటర్ను నమ్ముకుని స్ట్రగుల్ చేస్తున్నారు. ప్రజల్ని చైతన్యపరచడానికి “రివల్యూషనరీ థియేటర్” అవసరమని భావిస్తారు ఆ మిత్రబృందం. హెండ్రిక్ అహంభావి. అందర్నీ మించినవాడిలా ప్రవర్తిస్తూ వుంటాడు. బెర్లిన్ నటి డోరా మార్టిన్ ప్రదర్శన చూడకుండానే ‘మీ నటన ఆద్భుతం’ అని అభినందించి దొరికిపోతాడు. హన్స్ మిక్లాస్ నాజీ పార్టీ సమర్థకుడు. తోటి యూదు నటుల్ని అవమానపరుస్తుంటాడు. అందుకే అతడ్ని హెండ్రిక్ నాటక కంపెనీ నుండి బహిష్కరిస్తాడు. హెండ్రిక్ కి డాన్సు నేర్పే అమ్మాయి జూలియెట్. ఆమె తల్లి ఆఫ్రికన్ కావడం వల్ల ఆమె నల్లగా వుంటుంది. అయినా ఆమెను ప్రేయసిగా భావిస్తాడు. సినిమా ఆరంభంలో అతడు సోషలిస్టు. కానీ సినిమా ఆఖరయ్యేసరికి నాజీల సాంస్కృతిక బానిస. ఈ పరిణామ క్రమానికి కారణం వేగంగా పైకెదగాలన్న అతడి బలమైన ఆకాంక్షే.

          చిన్న వూరి నటుడిగా మిగిలాననీ, తగినంత గుర్తింపు రావడంలేదనీ అతడి బెంగ. మహానగరంలో పెద్ద స్టేజిపై ‘మెఫిస్టో’ లాంటి పాత్ర వేసి వేలాది మందిని ఏకకాలంలో మెప్పించాలన్నది అతడి కల. ఆర్థికంగానూ ఎదగాలి. ఆ కల సాధించడానికి అధికార పార్టీ పెద్దాయన కుమార్తె బార్బరాను అర్జెంటుగా ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుంటాడు. మామయ్య, యూదు నటి డోరా మార్టిన్ రికమండేషన్లతో బెర్లిన్ స్టేట్ థియేటర్ లో ఉద్యోగం సంపాదిస్తాడు. అతడి సంపాదన మూడు రెట్లు పెరుగుతుంది. భర్త అవకాశవాదాన్ని గ్రహించిన బార్బరా అతడికి దూరంగా వుంటుంది. హెండ్రిక్ జూలియెట్ కోసం బెర్లిన్ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. వారాంతాల్లో ఆమె వద్దకు వెళ్తుంటాడు. అవకాశాల్ని పసిగట్టి వినియోగించుకోవడం తెలిసిన హెండ్రిక్ చివరికి ‘ఫౌస్ట్’ నాటకంలో తను కోరుకున్న ‘మెఫిస్టో’ పాత్రను కైవశం చేసుకుంటాడు. సినిమాల్లోనూ అవకాశాలు సంపాదిస్తాడు.

          హెండ్రిక్ స్పెయిన్ లో ఒక సినిమా షూటింగులో వుండగా జర్మనీలో నాజీలు అధికారంలోకి వస్తారు. అందుకే నాజీల బ్లాక్ లిస్టులో తన పేరు ఉన్నందున షూటింగు తర్వాత జర్మనీకి కాకుండా పారిస్ కు వెళతాడు హెండ్రిక్. పారిస్ లో అతడి భార్య సెటిలై వుంది. పారిస్ లో ఉండగా హంబర్గ్ థియేటర్లోని పాత స్నేహితురాలి నుండి అతడికో ఉత్తరం వస్తుంది. “నాజీ ప్రైమ్ మినిస్టర్ కి కాబోయో భార్య లొట్టే మీ నటనాభిమాని. ఆమె వేస్తున్న తొలినాటికలో ఆమె సరసన నటించడానికి అంగీకరిస్తే, సురక్షితంగా జర్మనీకి రావచ్చు. ప్రైమ్ మినిస్టర్ సంరక్షణలోనే బెర్లిన్ లో వుండొచ్చు. బెర్లిన్ నీ కోసం ఎదురుచూస్తోంది” – అని ఆ ఉత్తరంలో సూచిస్తుంది ఆ స్నేహితురాలు ఏంజెలికా. ఆ ప్రస్తావనను ఆనందంగా ఒప్పుకుంటాడు హెండ్రిక్. ఏ ఆదర్శాలూ అతడికి అడ్డురావు. ‘ప్రవాసంలో వుంటూ నాజీ వ్యతిరేక పోరాటం చెయ్యి’ అంటూ భార్య, స్నేహితులు చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టి బెర్లిన్ కు బయల్దేరుతాడు. “నేనో నటుడ్ని. నా పని నటించడం వరకే. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. నాకు జర్మనీ తప్ప మరో భాష రాదు. విదేశాల్లో అనామకుడిలా వుండేకంటే మాతృగడ్డపై మాతృభాషలో నటించాలనుకోవడం నేరమెలా అవుతుంది?” – అని సర్దిచెప్పుకుంటాడు. అది ఇతరుల కోసం విన్పించే వాదన మాత్రమే. అసలు విషయం బెర్లిన్ లో చవిచూసిన లైమ్ లైట్ ను వదులుకోలేక పోవడం! ‘కమ్యూనిస్టు కార్యకలాపాలు ఒకప్పటి దూకుడు తప్పిదాలు’ అన్నంత సులువుగా ప్రైమ్ మినిస్టర్ కి సర్దిచెప్పి తన గతాన్ని కడిగేసుకుంటాడు. లొట్టే సిఫారసుతో మళ్లీ ‘మెఫిస్టో పాత్రను దక్కించుకుంటాడు. తన అభినయంతో ప్రైమ్ మినిస్టర్ను మెప్పించి అతడి ముద్దుల ‘మెఫిస్టో’ అయిపోతాడు.

          కమ్యూనిస్టులు, యూదుల ఊచకోత ఒకవైపు సాగుతూ వుంటే, నాజీల చేతి నెత్తుటి మెతుకులు తింటూ అంచెలంచెలుగా పైకెదుగుతాడు హెండ్రిక్. సంస్కృతి గురించి అతడి అవగాహన వేరు, నాజీలు విధిస్తున్న షరతులు వేరు. అయినా తన ఆదర్శాన్నీ, అంతరాత్మనూ బలిపెట్టి జాతీయ రంగస్థల అధ్యక్షుడి హోదాకు చేరుతాడు. కాన్సెంట్రేషన్ క్యాంపులో పడివున్న పాత మిత్రుడు ఒట్టో ఉల్రిచ్ ను ప్రైమ్ మినిస్టర్ మద్దతుతో విడిపించి, అతడికి స్టేట్ థియేటర్లో ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇదిలావుంటే, ఒకప్పటి నాజీ భక్తుడైన హన్స్ మిక్లాస్ కథ మరో విధంగా మలుపు తిరుగుతుంది. తను కోరిన ‘అచ్చేదినాలు’ ఇవి కావని కనువిప్పు కలుగుతుంది మిక్లాస్ కు. నాజీ దురాగతాలకు వ్యతిరేకంగా థియేటర్ నటుల సంతకాల సేకరణ మొదలు పెడతాడు. హెండ్రిక్ ఇచ్చిన చిన్న సమాచారం మిక్లాస్ చావుకి కారణమౌతుంది. తోటి నటులు అతడ్ని ముద్దాయిలా చూస్తారు. థియేటర్ మొత్తం గాలించి మరీ నాజీ వ్యతిరేక కరపత్రాలను ఏరి, వాటిని రహస్యంగా తగలబెట్టే దృశ్యం చూస్తే అతడు నాజీలకు ఎంత నమ్మకస్తుడిగా మసలుకోవాలనుకుంటున్నాడో మనకర్థమౌతుంది.

          మొదటి భార్య బార్బరా అతడికి విడాకులు ఇచ్చేస్తుంది. జర్మన్ జాతి స్వచ్ఛత సిద్ధాంతానికి జూలియెట్ అడ్డుకావడంతో ఆమెను అరెస్టు చేయించి, మళ్లీ తనే ఆమెను కాపాడి పేరిస్ కి పంపిస్తున్నట్టు నాటకమాడతాడు. తోటి నటితో జరిగిన రెండో పెళ్లికి స్వయానా ప్రైమ్ మినిస్టర్ రావడం అతడికి చాలా గర్వకారణంగా వుంటుంది. ఉల్రిచ్స్ మరోసారి రహస్య కమ్యూనిస్టు కార్యకలాపాల్లో పాల్గొని, మళ్లీ అరెస్టవుతాడు. అతడి ప్రాణబిక్ష కోసం రెండోసారి ప్రైమ్ మినిస్టర్ దగ్గరకు వెళతాడు హెండ్రిక్. ‘నువ్వీ విషయాల్లో తలదూర్చకు. ఒక విశ్వాసఘాతకుడి కోసం సిఫార్సు తీసుకొచ్చావా? నువ్వు కేవలం ఒక నటుడివన్న సంగతి గుర్తుంచుకో! గెటౌట్!’ అని ప్రైమ్ మినిస్టర్ అతడ్ని కసిరేసి గెంటేయడంతో, హెండ్రిక్ కి తనేమిటో, ఆ సెటప్ లో తన స్థానమేమిటో అర్ధమౌతుంది. ఇంకా కొంత వివేకం మిగిలివున్న అతడికి తన తప్పు తెలుస్తుంది కానీ ఇక చేసేదేం లేదు. ఉల్రిచ్ మరణవార్త విన్న తర్వాత అతడి అంతర్మథనం మరింత పెరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ తనను ‘మెఫిస్టో’ అని ప్రేమగా పిలుస్తుంటే ముగ్ధుడయ్యేవాడు. కానీ తను కాదు ‘మెఫిస్టో! ఆ నాజీ ప్రభువే నిజమైన ‘మెఫిస్టో’. తను ఆ ‘మెఫిస్టో’ దయ్యం దగ్గర ఆత్మను తాకట్టు పెట్టిన ‘ఫౌస్ట్’ మాత్రమే! అయినా – “తనేం చేయగలడూ! తనో మామూలు నటుడు మాత్రమే.”

          అతడి తదుపరి ప్రదర్శన షేక్స్ పియర్ ‘హెమ్లెట్’. నిరాసక్తంగానే, నీరసంగానే అభినయం చేస్తాడు. కానీ అది కూడా తెగ నచ్చేస్తుంది ప్రైమ్ మినిస్టర్ గారికి. అతడు ప్రశంసాపూర్వకంగా హెండ్రిక్ ను ఒక స్టేడియంకు తీసుకువెళతాడు. ‘ఈ స్టేడియంలో నీ ప్రదర్శన ఏర్పాటు చేస్తాను. లక్షమంది జనాలు నీ నటన తిలకిస్తారు. వెళ్లు! నువ్వు నీ యోగ్యతకు తగ్గ స్థానంలోకి వెళ్లు!’ – అంటూ హెండ్రిక్ ను స్టేడియం మధ్యకు పంపిస్తాడు. అతడికి సర్ ప్రైజ్ ఇస్తూ, అతడిపై నలువైపుల నుండి ఫ్లాష్ లైట్లు వేయిస్తాడు. ‘ఈ లైమ్ లైటును నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా?’ అని ప్రైమ్ మినిస్టర్ అరుస్తుంటాడు. మిరుమిట్లు గొలిపే ఆ కాంతికి అతడి కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏదీ కానరాక, అటూ, ఇటూ పరిగెడుతుంటాడు. అత్మను అమ్ముకున్నాక లభించిన లైమ్ లైట్ అతడ్ని అంధుడ్ని చేసేసింది. కళ్లకు చేతులు అడ్డం పెట్టుకుంటూ, “వీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారు? నేను కేవలం నటుడ్ని మాత్రమే!” – అంటూ తనలో తాను గొణుక్కుంటాడు.

          ఈ సినిమాలో ప్రధాన పాత్రను వేసిన క్లాస్ మారియా బ్రాండవర్ చాలా అద్భుతంగా నటించాడు. అతని మనోభావాల మార్పులను చూపే క్లోజప్పులు ఈ సినిమాలో చాలా వున్నాయి. ఆస్కారు అవార్డు గెల్చుకున్న మొట్టమొదటి విదేశీ సినిమా ఇదే. వ్యాపారపరంగా కూడా ఆమెరికా కెనడాల్లో అత్యధిక కలెక్షన్లు సంపాదించిన హంగేరియన్ సినిమా. కాన్స్ లో ఈ సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు దొరికింది. ఫిల్మ్ సొసైటీలు ఈ సినిమాను చాలాసార్లు ప్రదర్శించాయి. నియంతృత్వాలు రాజ్యమేలే ప్రతిసారీ ఈ కథ ప్రాసంగికమౌతూ వుంటుంది. ‘కళాకారుడా! నీవెటువైపో తేల్చుకో’ అని ఘోషిస్తుంది ఈ కథ.

          ఈ కథను బెంగాలీ నాటకంగా ప్రముఖ రంగస్థల, సినీ దర్శకుడు సుమన్ ముఖోపాధ్యాయ చాలా ఏళ్లుగా ప్రదర్శిస్తున్నాడు. 2002లో గుజరాత్ ఊచకోత సమయంలో ఒకసారి, 2012లో తృణమూల్ అత్యాచారాలకు వ్యతిరేకంగా మరోసారీ ప్రదర్శించారు. మతతత్త్వ శక్తులు బెంగాలును కైవశం చేసుకోవాలని చూస్తున్న ఎలక్షన్ల సీజన్లో మూడోసారి ఈ నాటకం వేస్తున్నారు. ఎలక్షన్ల ముందు వేస్తున్న మూడు షోలూ హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ నాటకంలో యూదుల్ని గొర్రెల్లా కాన్సెంట్రేషన్ క్యాంపులకు తరలిస్తున్న విషయాన్ని సంభాషణల్లోనే కళ్లకు కట్టారు. “జైలులో ఒక కమ్యూనిస్టు రంగస్థల నటుడ్ని ఉరితీసినపుడు 6000 మంది తోటి ఖైదీలు అతడి కోసం ఒకేసారి గొంతెత్తి పాటపాడారు. ఆ క్షణంలో అతడెంత మహానటుడి స్థాయికి ఎదిగాడో అర్థమైందా?!” – అంటూ ఒక స్నేహితురాలు హెండ్రిక్ కు చెబుతున్న దృశ్యం ఒకటి ఈ నాటకంలో వుంది. ఆ మాట విన్నప్పుడు “ఆ అమరుడి ముందు తను మరుగుజ్జే, ప్రజల కోసం పోరాడి, మరణించినవాడే మహానటుడు” అని భావిస్తూ పశ్చాత్తాపపడతాడు హెండ్రిక్. నాటకంలో ఈ పాత్రను సినీ నటుడు అనిర్బాన్ భట్టాచార్య చాలా అద్భుతంగా నటించాడు. ఈ నాటకం ఆఖర్లో ‘బెల్లా చావ్’ ఇటలీ పోరాటగానం నేపథ్యంలో బ్లాక్ లైవ్స్ మేటర్, అరబ్ స్ప్రింగ్, ఎస్ఆర్ సీ – సిఎఎ వ్యతిరేక పోరాటం , రైతు ఉద్యమాలు, గౌరీ లంకేశ్ హత్య, రోహిత్ వేముల హత్య తదితర వీడియోల మాంతాజ్ ను చూపించారు. దాదాపు 1500 మంది ప్రేక్షకులు పూనకం వచ్చినంతలా చైతన్యవంతులై హాలు నుంచి బయటకు వస్తారు. సినీ, నాటకరంగాల్లో ప్రసిద్ధులైన చాలా మంది నటులు కేవలం పది రోజుల రిహార్సల్స్ తో ఈ నాటకాన్ని ప్రదర్శించారు.

          ఎన్ని దాడులు జరిగినా, తమ ఆత్మను తాకట్టు పెట్టకుండా కొందరు కళాకారులు ప్రజానుకూల స్వరాలను వినిపిస్తున్నారు. వారికి సెల్యూట్ చేస్తుందీసినిమా.

admin

leave a comment

Create Account



Log In Your Account