ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, అరసం బాధ్యులు అయిన నిసార్ కోవిడ్-19 వ్యాధితో హైదరాబాద్‌లో 10 జూలై 2020న మరణించారు. ఆయన నల్లగొండ జిల్లా సుద్దాల గ్రామంలో జన్మించారు.
తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావంతో పెరిగిన నిసార్ చిన్నప్పటి నుండి జానపదాలను ప్రజాగేయాలుగా మలచి పాడటంలో నేర్పరి. సుద్దాల హన్మంతు స్ఫూర్తితో ఉద్యమాలలోకి వచ్చిన ఆయన ప్రతి ప్రజా సమస్యను ప్రజలకర్ధమయ్యే జానపదాలతో పాటలుగా మలిచేవారు. ‘పల్లె సుద్దులు’ కళారూపంలో ఒదిగిపోయి నటించేవారు. మూడు దశాబ్ధాలుగా ప్రజానాట్యమండలి కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రతి వేదిక మీద తన గళాన్ని విన్పించేవారు. ‘ఇప్టా’లో జాతీయ కౌన్సిల్ సభ్యునిగా వుంటూ ఇతర రాష్ట్రాలలోనూ అనేక కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంలో కార్మికులకు అండగా నిలబడుతూ వారి సమస్యలను ఎలుగెత్తి చాటారు. ఎన్‌ఆర్‌సి, సిఎఎలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో జరిగిన ఉద్యమాలను నిర్వహించారు. రచయిత, కవి, కళాకారుడు అయిన నిసార్ మృతికి జనసాహితి సంతాపం ప్రకటిస్తోంది. వారి కుటుంబసభ్యులకు, సంస్థలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తుంది.