నవయుగ ఫిల్మ్స్ మేనేజర్‌గా పనిచేసి, చలనచిత్ర ప్రకటనలలో, ప్రచారంలో వినూత్నమైన విజయవంతమైన ప్రయోగాలు చేసిన అభ్యుదయవాది కాట్రగడ్డ నరసయ్య తన 96వ ఏట – 31 అగస్టు 2020న విజయవాడలో మరణించారు.
విజయవాడలో ప్రముఖ కమ్యూనిస్టు కుటుంబమైన కాట్రగడ్డ కుటుంబసభ్యుడైన నరసయ్య బెనారస్ హిందూ యూనివర్శిటీలో విద్యార్థిగా వున్నపుడే – 1943లో తెనాలి సమీపాన పెదపూడి గ్రామంలో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం నెల రోజులపాటు నిర్వహించిన సాహిత్య పాఠశాలకు హాజరయ్యారు. నవయుగలో పనిచేశారు. రిటైరైన తర్వాత విజయవాడ నగర అభివృద్ధికీ, సీనియర్ సిటిజన్స్ సౌకర్యాలకీ, శరీర అవయవదాన ఉద్యమానికీ కృషిచేశారు. విజయవాడ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షునిగా పనిచేశారు. 1993లోనే రైతుబజారు నిర్వహించారు.
ఎందరు విమర్శించినా, దూరదృష్టితో ఊరిచివర మొగల్రాజపురంలో మధు కళామండపం కట్టారు. ఇప్పుడు ఊరు అభివృద్ధికాగా అది నగరానికి నట్టనడిమిన ఉన్న మధుమాలక్ష్మి చాంబర్స్ గా కొనసాగుతూంది. చివరి సంవత్సరాలలో నడవలేని పరిస్థితుల్లో అందరితో ఫోన్లలో మాట్లాడుతూ తన భావాలను పంచుకునేవారు. వారి మరణానికి ‘ప్రజాసాహితి’ సంతాపం ప్రకటిస్తూంది.