– సిహెచ్. మధు
జీవన చరమాంకం ప్రారంభమయ్యింది
సూర్యుడు పశ్చిమాన పరుగును
అరచేతితో ఆపేసాను
ఆపన్నుల హస్తం, అభిమాన సూర్యుల వెలుగు
నాకు అమృతం పోస్తున్నాయి
అస్తమయం సహజాతి సహజం
కానీ తాత్కాలికంగా ఓడిపోతుంది
పర్వతాల అడ్డు తొలగిపోతుంది
డెబ్బది సంవత్సరాల చెట్టు
శిశిరంలోకి ప్రవేశించింది
ఆకులు రాలిపోతున్నాయి
కొమ్మలు బలంగానే వున్నాయి
మళ్లీ ఆకులు చిగురిస్తాయి
గాలి, నీరు నేనేగా
నేల బలం నాలో నిక్షిప్తమయివుంది
నా మనసులో ముళ్లు – రాళ్లు వున్నాయి
నా మనసులో ఘర్షణ –
ముళ్లు – రాళ్లు ఎవరిని గాయం చేయకుండా
జాగ్రత్త పడ్డాను
నా మనసులో మల్లెలు, ఎర్రమందారాలున్నాయి
వికసించాలని,
ఆకాశం అందుకోవాలని ఆరాటపడ్డాను
పోరాటం పోరాటం అని అరిచాను
వెలుగు చీకటి సమానం కావచ్చు
చీకటి కనిపిస్తున్నా –
నిరాశ నిప్పురవ్వ కాకుండా
నక్షత్రాలను పరిచాను
వెన్నెల అందించాను
జీవితం సాగరం అందాలు చూడవచ్చు
సామాజిక పరిణామం ప్రపంచీకరణ
అరణ్యంలో చిక్కుకుపోయాను
నేను ఓడిపోయానని చెప్పటంలేదు
పోరాటం ఓడిపోతుందా?
జనం నీడలో
ప్రజల కొరకు జీవించటం
ప్రజల కొరకు మరణించటం
సూర్యునిలాగా
జనం కొరకు పోరాటం
జనం కొరకు వీర మరణం
సూర్యుడు లాగానే
కాలం అన్ని రకాల వుండదు
రంగు రంగుల ప్రపంచం
ఒక దోపిడి ప్రపంచం
దోపిడి ప్రపంచంలో
తెలుగు రాష్ట్రం ఒక భాగం
శ్రమ – ఉత్పత్తి – సంపద
ఎవరూ గుర్తించటంలేదు
వెలుగు లేకపోతే జీవితమెక్కడ?
వెన్నెల లేకపోతే ఆనందమెక్కడ
జీవితం – ఆనందం మరిపించటానికి
ప్రపంచీకరణ విషం
దోపిడిలేని ప్రపంచం కావాలని
చీకటి లేని లోకం కావాలని
జనమంతా పోరాడారు
జనం ముందు వెనుక నేను
అందరమూ ఓడిపోయాం
రాజీపడటం, రాజ్యమేలటం
మేధావుల లక్షణం
సూర్యుడు రాజీపడ్డాడా?
చంద్రుడు లొంగిపోయాడా?
కవులు ప్రజాగానం మర్చిపోయారు
పాలకులు ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు
అని పొగడుతున్నారు
జనం శ్రమ చెమట కనిపించదు
దోపిడి ప్రపంచంలో
జనం ఆకలి చావుల మధ్య
సంపద సృష్టించే హస్తాలు
నీరసపడిపోయాయి
నీరసం నిస్తేజం నిర్వీర్యం
జనం బ్రతుకు
నా భారత్ కు కాదు
నా రైతు కాదు
నా బ్రతుకే కాదు
ప్రపంచ దోపిడీలో –
శ్రమ – సంపద గద్దలపాలు
శ్రమైక్య జీవన సౌందర్యం ఓడిపోయింది
పంట పండించే రైతు ఆకలి తీరదు
శ్రమ చేతులకు అన్నం కరువు
కష్టం సొమ్ము ఎటుపోయింది?
సంపద ఎవరి పాలయ్యింది?
ఆకాశం నిర్మలంగా లేదు
మేఘావృతమయి చీకటిగా వుంది
చుక్కలు తళ తళ మెరవటంలేదు
భయంతో వణికిపోతున్నాయి
సూర్యుడు ఎక్కడ వున్నాడో జాడలేదు
గాలి, నీరు వణుకుతున్న
నియంతృత్వ రాజ్యంలో
ప్రజాస్వామ్యం గద్దలపాలు
నా కవిత ఆకాశం ఎత్తు ఎగిరినా
ఆయుధం కావటం లేదు
నా పాట గాలి మోసిన
పోరాటం కావటం లేదు
ప్రజల పిడికిలి ప్రశ్నకావటం లేదు
ఇది చరమాంక గీతం కాదు
ఉదయగీతం