– మౌళి
నడిచినడిచి బొబ్బలెక్కిన కాళ్ళతో..
ఏడ్చిఏడ్చికన్నీళ్లగాయపు కళ్ళతో..
చండ్ర చండ్రం ఎండదెబ్బల ఒళ్ళుతో..
తూలితూలి నెత్తురోడు పాదాలతో..
‘‘ఆకలంతా నడుస్తుంది’’..
అవిసిఅవిసిన గుండెతో..
జారిపోయిన మనసుతో..
సడలిపోయిన ఆశతో..
అన్నమెండిన కడుపుతో..
నిద్రలేని రాత్రిసెగతో ..
భద్రమెరుగని జాగరణతో..
ఊపిరాడని వయసుతో..
‘‘ఆకలంతా నడుస్తుంది’’..
తల్లినేమో మోస్తులేక
తల్లి బాధను చూడలేక
తల్లి ఆకలి తీర్చలేక..
తల్లి కోసం చావలేక..
తల్లినొదిలి పారిపోక..
తూలిపడుతూ తుళ్ళిపడుతూ
‘‘ఆకలంతా నడుస్తుంది’’..
రోడ్డు మార్గం, రైలు మార్గం..
అడ్డదారుల రాళ్ల మార్గం..
పొలందారుల పొదలమార్గం
ఒంటిచేత్తో వంటిచెమటతో
స్నానమెరుగని మరకబట్టతో
‘‘ఆకలంతా నడుస్తుంది’’..
దిక్కులెతికినా దిక్కుతోచక..
మాటలగిడే హక్కులేక..
ముక్కులుతున్నా మందులేక..
ముక్కుకైనా ముసుగు లేక..
ఏడ్పుఘోషతో, కంటిధారతో
తల్లి జ్వరముకు తాళలేక
ఆకలంతా నడుస్తుంది..
…..
నా దేశం.. ‘‘ఆకలంతా నడుస్తుంది’’..
క్రాంతి
వలస కూలీల దిక్కుతోచని స్థితిగతులను కళ్లకుకట్టినట్టు చెప్తుంది ఈ కవిత! రచయిత మంచి సామాజిక దృక్పథం , బాధ్యత కలిగినవారని అర్థమవుతోంది..ఇటువంటి కవిత్వమే ప్రజల కవిత్వం, కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం..! 👍