సకల జీవుల పూదోటరా నేల

సకల జీవుల పూదోటరా నేల

– వంగర లక్ష్మీకాంత్

తెల్ల తుమ్మ తంగేడు కరక్కాయ ఊటలో

ఊరివచ్చిన తోలు చెప్పులా

వైరస్సు ధూళి మహా సముద్రంలో

మునిగి – నాని – ఈదివచ్చిన వాడా

వీరుడా – శూరుడా – మానవుడా!

కాష్టంబూడిద వళ్ళంతా పులుముకున్న శివుడిలా

సూక్ష్మక్రిమి సున్నం లోపలా – బయటా

తాపడం వేసుకుని ఊరేగుతున్న

నవ్య రుద్రుడివిరా నువ్వు

వీరుడా – శూరుడా – మానవుడా!

‘కరోనా’ ఓ చిన్న దుమ్ము కణం

దాన్ని చూసి కటకట – గడబిడ, యెబ్బే!

నిలబడి కట్టడి పెట్టలేక ‘బేర్‌’ మని

నిన్ను నువ్వే కట్టేసుకున్నావా ?

వీరుడా – శూరుడా – మానవుడా!

సకల జీవులకు – ఏక కణులకంటె ముందే పుట్టిన

నీ తాతకు తాత – ముని ముత్తాత

ఈ ‘అల్ప – నిర్జీవ – జీవి’, ఒట్టు! నీ తోబుట్టువే

నీకెందుకు ఖేదం మిగిల్చింది?

వీరుడా – శూరుడా – మానవుడా!

మట్టిని మట్టిగా – జీవిని జీవిగా జీవించనిచ్చావా?

ఆకలి – అడవి – ఆకాశంలోని చందమామ

నీ లాభాల పరుసవేది అయిన వేళ

నీవొక్కడివే సుఖంగా ఎలా బ్రతుకగలవు ?

వీరుడా – శూరుడా – మానవుడా!

స్వేచ్ఛగా పుట్టిన సంకెళ్ళలో ఉన్నవాడా

బహిరంగ జైళ్ళలో మగ్గుతున్న మానవుడా

స్వగృహ నిర్బంధం – భౌతిక దూరం

పిరికి మందు – ఇప్పుడు నీకెందుకు?

వీరుడా – శూరుడా – మానవుడా!

రేచువలె – త్రాచువలె తరిమికొట్టి

మిసైలు వలే ధ్వంసించి – కణం కణానికి

శత్రు దుర్భేధ్య దుర్గం కట్టి కరోనాకి బహిరంగ ఖైదు

ఇవ్వగల ఏకైక ‘శక్తి’ ఎందుకు నీలో నిదురిస్తున్నది ?

వీరుడా – శూరుడా – మానవుడా!

లాభాల దండుకు ఆరోగ్యం అంగడి సరుకు

అందుకే నీతోబుట్టువును నీకే శత్రువుగా నిలబెట్టింది

నువ్వు మునకలేసిన మహాసముద్రం

విషపు క్రిముల పుట్టగా ముందుకు నెట్టింది

వీరుడా – శూరుడా – మానవుడా!

సార్సు – మెర్సు – ఎబోలా – కరోనా పేరేదైనా వైరస్సే

అది ‘అల్ప – నిర్జీవ – జీవి’ జీవనయాత్రే

దాన్ని నిలేసేది – తోకలు కత్తిరించేది

రోగ నిరోధక శక్తి – ప్రజారోగ్య యుక్తి

వీరుడా – శూరుడా – మానవుడా!

ఈ శక్తి – యుక్తులను హరించిన లాభాల దండు

అడ్డమై నిలిచి ఉన్నది, దాని నడ్డి విరుచు

వైరస్సు దండు కట్టింది – నువ్వు భుజం కలుపు

వైరస్సుల – సూక్ష్మజీవుల – సకల జీవుల పూదోటరా నేలా

వీరుడా – శూరుడా – మానవుడా!

admin

leave a comment

Create Account



Log In Your Account