చిలుకలు వాలని చెట్టు

చిలుకలు వాలని చెట్టు

– కె. భానుమూర్తి

తూరుపు తెల వారక ముందే

సూర్యుడు పొద్దు పొడవక ముందే

ముఖానికి ఇంత పసుపు పులుముకొని

నుదుటన ఇంత సింధూరం అద్దుకొని

రంగురంగుల సీతాకోకచిలుకల కోసం

తనని తాను సింగారించుకుని

సిద్ధ పరుచుకుంటుంది మా ఊరి బడితల్లి

గుంపులు గుంపులుగా

వచ్చే నును వెచ్చని కిరణాల కోసం

భుజాలకతుక్కొని జట్లు జట్లుగా

వచ్చే పూల గుత్తుల గుబాళింపుల కోసం

ఎదురుచూస్తోంది మా ఊరి చదువులమ్మ

ఏ శిశిరం కాటేసిందొ

ఏ వేరు పురుగు తొలిచేసిందో

ఇప్పుడు మా ఊరి బడి

చిలకలు వాలని చెట్టయ్యింది.

నాలుగు నెలలయ్యింది.

నాబడి ముఖాన నవ్వు లేదు

నోట మాట లేదు

నల్లబల్లపై వెలుగుపూల పూత లేదు

ప్రపంచానికి ప్రభాత భేరిలా

గణ గణ గణ గణ మోత లేదు

వంద గొంతులు ఒక్కటై పలికే

ఏక కేంద్రక నాదం

జనగణమన గీత లేదు.

ఇప్పుడు నా చదువుల తల్లి

సీతాకోక చిలుకలు ఎగరని తోటయింది.

ఏ కుబుసం కప్పేసిందో

ఏ గ్రహణం కమ్మేసిందో

ఇప్పుడు నా బడి

అనకొండ నోట చిక్కిన కుందేలు అయ్యింది.

తల్లి నుండి తప్పిపోయిన లేగదూడలు

ఎక్కడున్నాయో!, ఎలా తల్లడిల్లుతున్నయో

ఆ తప్పటడుగులు మళ్ళీ ఎప్పుడు

ఈ తల్లి గుండెలపై నాట్యం చేస్తాయో!

ఆ లేత పెదవులు మళ్ళీ ఎప్పుడు

ఈ తల్లి పొదుగు పొడుస్తూ కుడుస్తాయో!

కాసుల వేటలో

ఏ కార్పోరేటు

కుట్ర ఇది

ఆధిపత్య పోరులో

ఏ పెట్టుబడి సృష్టించిన మహమ్మారి ఇది

సమస్త మానవ జాతిని

కలుగులో కుక్కేసిన

ఏ వికృత క్రీడ ఇది.

ఈ ప్రశ్నల జవాబుల కోసమయినా

నా బడి తల్లి తెరుచుకోవాలి.

నల్లబల్లపై జవాబుల

వెలుగుపూలు పూయించాలి

admin

leave a comment

Create AccountLog In Your Account