ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కళాశాలలు మన దేశంలో ఉన్న ప్రసిద్ధ విద్యాసంస్థలు. అటువంటి విద్యాసంస్థలలోనే కులవివక్ష బహిరంగంగా, నిర్భీతితో ప్రదర్శించబడిందంటే – సమాజంలోనూ, సామాన్య విద్యాలయాలలో ఈ వివక్ష ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఖరగ్‌పూర్ ఐఐటి సంఘటన తెలియచేస్తూంది. అసోసియేట్ ప్రొఫెసర్ సీమాసింగ్ ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థుల బ్రిడ్జి కోర్సులో భాగంగా ఆన్‌లైన్‌లో పాఠం చెప్పటం పూర్తయిన తర్వాత విద్యార్థులు జనగణమణ పాటపాడి, భారత్ మాతాకీ జై! అంటూ ముగించారు. ఆ విద్యార్థులు లేచి నుంచోకుండా పాట పాడారంటూ, బ్లడీ బాస్టర్డ్స్, షేమ్ లెస్ క్రీచర్స్, ఇడియాటిక్ పీపుల్ వంటి అనేక అవమానకరమైన, కులపరమైన పదాలతో అకారణంగా కులోన్మాదంతో ఊగిపోతూ దుర్భాషలాడింది. అంతేనా – వాళ్ళని తిట్టినందుకు తనకేం భయం లేదని, మీరు కావాలంటే ఎస్సీ, ఎస్టీ, మంత్రిత్వ శాఖకు లేదా స్త్రీ, శిశు మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసుకోమని సవాల్ విసిరింది.
ఐఐటిలలో, సెంట్రల్ యూనివర్శిటీలలో అస్పృశ్యతా భావం అంటరానితనం రూపం మార్చుకుని ఆధిపత్య భావజాలంతో దళితులను ఆత్మన్యూనతా భావంలోకి నెట్టివేస్తూ వుంది. రోహిత్ వేముల సంఘటన అందుకు ఉదాహరణ. రోహిత్ వేముల ఆత్మహత్య మొదటిది కాదు, చివరిదీ కాదు. ఈ ఆత్మహత్యలన్నీ వ్యవస్థీకృత హత్యలే. ప్రస్తుత బిజెపి ప్రభుత్వ పాలనలో, మనుధర్మాన్ని, నిచ్చెనమెట్ల కులసమాజాన్ని పెంచి పోషిస్తూన్న కాలంలో సమాజంలోనూ, విద్యాసంస్థలలోనూ, అన్నిచోట్లా వివక్ష మరింతగా పెరిగిపోతూన్న దానికి నిదర్శనమే సీమాసింగ్ వంటి అధ్యాపకురాలు కులోన్మాదంతో దుర్భాషలాడటం.
దళితులు, ఆదివాసీలు, అణగారిన శ్రామిక ప్రజలంతా ఐక్యమై ఉద్యమించిననాడే ఈ వివక్షను ఎదుర్కోగలమని చరిత్ర మనకు తెలియచేస్తూంది. కుల వివక్షకు నిలువెత్తు నిదర్శనంగా వున్న సీమాసింగ్‌ను వెంటనే విధుల నుండి తొలగించాలి.