అమరవీరులందరికీ విప్లవ అరుణారుణ వందనాలు

అమరవీరులందరికీ విప్లవ అరుణారుణ వందనాలు

ఆంగ్లమూలం : పంకజ్ ప్రసూన్                      తెలుగు : కొత్తపల్లి రవిబాబు

(స్వేచ్ఛ, సమానత్వం, దోపిడీరహిత ప్రపంచం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులందరికీ మన విప్లవ అరుణారుణ వందనాలు)

                    నిరంకుశులకు, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా

                    కవిత్వం ఒక ఆయుధంగా వుంటుంది.

                    టునీసియాలో, ఈజిప్టులో, సిరియాలో

                    యెమెన్‌లో, బహ్త్రైన్‌లో, మలేసియాలో

                    స్వాతంత్య్ర పతాకాన్ని ఎత్తిపట్టిన వారికి,

                    అన్యాయానికీ, దోపిడీకి వ్యతిరేకంగా

                    ఒక విభిన్నమైన బాణీలో

                    విప్లవ సంగీతాన్ని వినిపించినవారికి,

                    సత్యమే మరణిస్తుందని బుకాయించినవారికి

                    అది చెబుతోంది.

                    సత్యమే సదా సజీవంగా వుంటుందని!

                    హుందాగా జీవించాలనే

                    ఆశావసంతాన్ని కలగన్నవారికి

                    మత్తుగొలిపే ఆ ఆమని దగ్గరకు

                    స్వాగతం –

                    నేను నమస్కరిస్తున్నా

                    మేము నమస్కరిస్తున్నాం

                    సత్యం కోసం అమరులైనవారికి

                    వందనాలర్పిద్దాం!

                    869

                    జాంబ్‌ తిరుగుబాటుకు1 దండాలు

                    ఐదు లక్షల బానిసలకు

                    నాయకత్వం వహించి

                        ఆలీ ఇబ్న్‌ మహమ్మద్‌

                    చిన్న చిన్న తిరుగుబాట్ల పరంపరతో

                    ఇరాన్‌ నుండి ఇరాక్‌ వరకు గల

                    శక్తిమంతమైన, నిరంకుశ, అవినీతిలేని

                    సామ్రాజ్యాలను

                    వణికించేసాడు 9వ శతాబ్దంలో

                        1579

                        గాస్పర్‌ యంగా2కు వందనం

                    ఆఫ్రికాలోని గాబన్‌ నుండి తెచ్చిన బానిస

                    బింరా రాజు పుత్రుడు

                    తన బానిస మిత్రులతో కలసి

                    స్పానియార్డ్స్‌కు వ్యతిరేకంగా

                    మెక్సికోలో బానిసల తిరుగుబాటుకు

                    నాయకత్వం వహించాడు!

                    శత్రువును ఓడించాడు

                    బానిసలకు సొంత పట్టణాలను నిర్మించాడు

                    యంగాకు వందలాది వందనాలు

                        1712

                    బానిసలైన ఆఫ్రికన్లపై అమానుష చిత్రహింసలు

                    వుంచారు వారిని దారుణమైన పరిస్థితుల్లో

                    కోపోద్రిక్తులైన ఇరవై ముగ్గురు బానిసలు

                    ధైర్యంగా ముందుకురికారు

                    బుల్లెట్ల వర్షం కురిపించారు

                    తొమ్మండుగురు తెల్లవారిని చంపేసారు

                    నేరస్తులైన తెల్ల వలసదారులు

                    తమ కిరాయి సైన్యంతో

                    డెబ్భైమంది నల్లవారిని పట్టుకొని

                    వారిలో 21 మంది తిరుగుబాటుదారులను

                    నిప్పుపై కాల్చిన కోళ్ళలాగా

                    సజీవ దహనం చేశారు.

                    అది మొట్టమొదటి బానిస తిరుగుబాటు!

                    సజీవ దహనమైన

                    ఆ 21 మందికి మా వందనం

                        1757

                    భయభ్రాంత పాలన సాగించింది

                    ఈస్ట్‌ ఇండియా కంపెనీ

                    వారి అమానుష, అనాగరిక పాలన

                    సహించలేక ఫకీర్లు, సన్యాసులు ఎదురు తిరిగారు

                    సాయుధులయ్యారు

                    దస్‌నామా నాగాలు, మదారి సూఫీలు,

                    హిందువులు, ముస్లిములు –

                    సాధువులందరూ

                    విదేశీ పాలన నుండి విముక్తి కొరకు

                    తొలి సమరానికి శ్రీకారం చుట్టారు

                    జల్పాయిగురికి చెందిన

                    బైకుంతపూర్‌ అడవుల్లో,

                    ముర్షిదాబాద్‌ పరిసరాల్లో

                    150 మంది ఫకీర్లు చనిపోయారు

                    సన్యాసి – ఫకీర్‌ తిరుగుబాటుకు వందనం

                 మజ్నూషా3, భవానీ పాథక్‌4, దేవి చౌధురాణి5 లకు వందనం

                    1798

                    మిడ్నపూర్‌, బింకూర, జంగల్‌ మహల్‌లోని

                    అటవీ భూముల్లో

                    ఆటవికులైన ఆదివాసులు, గిరిజనులు

                    సారించారు తమ విల్లంబులు

                    సంధించారు బాణాలను

                    బ్రిటీషు వలసదారులకు వ్యతిరేకంగా

                    దొంగలనీ, ఎలుకలు తినేవారని,

                    పందులనీ, అవమానించబడ్డ వారి తిరుగుబాటుకు

                    దొంగల తిరుగుబాటని పేరుపెట్టారు

                    ఆదివాసీలను ఘోరంగా చంపేసారు

                    వారి నాయకుడు దుర్జాన్‌సింగ్‌కు6 ను హత్యచేశారు

                    ఆ తిరుగుబాటుదార్లకు మన వందనం

                        1784

                        బాబాతిల్కా మంజీహ్7

                    నీకు జోహార్‌,

                    నీకు వందనం!

                    భారతదేశ మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు

                    వలసదార్లను ఎదురించిన మొదటి యోధుడు

                    మొదటి పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించినవాడు

                    మొదటి స్వాతంత్య్రగేయాన్ని రచించినవాడు

                    విల్లు, బాణాలతో చంపారు

                    చెట్టుకు ఉరివేశారు

                    మనం మరచిపోయిన

                    ఆయనకు వందనం!

                        1787

                    మసాచుసెట్స్ లో రాజభవనాల్లో కులుకుతున్న

                    దోపిడీదార్లయిన పిల్ల జమీందార్లకు

                    పీడకలగా మారిన

                        షేయాస్‌8 తిరుగుబాటుకు వందనం

                    వేయిమంది షేయాస్‌లను అరెస్టు చేశారు

                    ఐదుగురిని చంపేశారు

                    తిరుగుబాటును అణచివేశారు

                    కాని 2011లో

                    మరల న్యూయార్క్ లో మురికి సంపన్నుల ప్రాంతంలో

                    ఆక్యుపై వాల్‌స్ట్రీట్‌ ఉద్యమంగా

                    ప్రజల కోపాగ్నితో నూతన

                    అవతారంతో ప్రజ్వరిల్లింది.

                        1806 – 1816

                    విప్లవ జ్వాలలు

                    మిడ్నపూర్‌ సాల్‌ అడవులను చుట్టుముట్టాయి

                    అవి ఒక దశాబ్దం వరకు మండుతూనే వున్నాయి

                    ఆ వీరుల్ని ప్రజా శత్రువులు చంపేశారు

                    అచల్‌సిన్హా9 అతని 200 మంది అనుచరులు

                    అమరజీవులు –

                    వారందరికీ వందనం.

                        1858

                    జోహార్‌!

                    సెల్యూట్‌!

                    వీరనారాయణసింగ్‌ బింజావర్‌10 కి

                    అది 1856

                    చత్తీస్‌గడ్‌ అటవీ ప్రాంతమంతా

                   గొప్ప కరవు వ్యాపించింది

                    ఆకలితో చనిపోయారు ప్రజలు

                    సోనాఖాన్‌ భూస్వాములు, వర్తకులు

                    పేదల నుండి కాజేసిన

                    ధాన్యం తమ గోదాముల్లో దాయగా,

                    ఆయన నాయకత్వంలో వాటిని లూటీ చేశారు

                    పేదవారికి ధాన్యాన్ని పంచి పెట్టాడు

                    భూస్వాములు, వలసదార్లు కుట్ర చేసారు

                    అతన్ని అరెస్టు చేశారు

                    బహిరంగంగా ఉరితీసారు!

                        1862

                    జోహార్‌!

                    యు కియాంగ్‌ నాంగ్‌ బా11

                    ఇంటిపన్నుతో పాటు ఆదాయపన్ను –

                    తమలపాకులు – వక్కలపై మరో పన్ను

                    విధించబోతున్న సమయాన

                        జైన్‌టియాలు భీకరంగా తిరగబడ్డారు.

                    వారి నాయకుడు, మార్గదర్శి

                    యువకుడైన యు కియాంగ్‌ నాంగ్‌ బా

                    అతనిలా అన్నాడు :

                    ‘‘మానవ జీవితంలో స్వేచ్ఛ

                    అత్యంత ముఖ్యమైన అంశం

                    స్వేచ్ఛలేని దేశం

                    బతికి వున్నట్లే కాదు’’

                    వందలాది జైన్‌టియాలను చంపేశారు

                    యూకియాంగ్‌ నాంగ్‌బాను

                    మోసంతో ఖైదు చేసి

                    బహిరంగంగా ఉరితీశారు

                    ఉరికంబం నుంచి ఆయన ప్రవచించాడు

                    ‘‘ఉరికి వేలాడుతూ నా తల తూర్పు వైపు తిరిగితే

                    వందేళ్ళలోపే మనం విముక్తులవుతాం

                    పడమరకు తిరిగితే అనంత బానిసత్వమే’’

                    వాస్తవమైంది ఆయన జ్యోతిష్యం

                    వందేళ్ళలోపే ఇండియా విముక్తిని సాధించుకొంది.

                        1885

                    జోహార్‌

                    ఒక కుగ్రామానికి చెందిన

                    నలుగురు ముర్మురు సోదరులకు

                    దుమ్‌కా జిల్లాలోని భగ్నాదిహ్12 గ్రామంలో

                    విప్లవకారులే అందరూ

                        సిద్దూ, కన్హూ, చాంద్‌, భైరవ్‌లు –

                    వారి భూమిని కబ్జా చేశారు

                    బ్రిటీష్‌ వలసదార్లు, వడ్డీ వ్యాపారులు, జమీందార్లు

                    వారి స్త్రీలనవమానించారు

                    అమాయక సంతాలులను బానిసలుగా మార్చారు

                    సంతాలులను

                    మోసం చేశారు

                    అవమానించారు

                    సిద్దూ, కన్హూ, చాంద్‌, భైరవ్‌ల

                    నాయకత్వంలో

                    సంతాల్‌ తిరుగుబాటు ప్రారంభమైంది

                    సంతాల్‌ ప్రాంతమంతా వ్యాపించింది

                    నేరస్తులకు పీడకలగా పరిణమించింది

                    బ్రిటీషు పాలనా ఛాయలను నాశనం చేసింది

                    ఆ నేరస్తులు మోసం చేసి

                    సిద్దూ, కన్హూ, చాంద్‌, భైరవ్‌లను

                    చంపేశారు.

                    పదివేలమంది సంతాలులను చంపేశారు

                    తిరుగుబాటును అణచివేశారు.

                    అదే హుల్‌ విప్లవం

                    … అయితేనేం –

                    సంతాల్‌ తిరుగుబాటు గాధ ఎన్నటికీ సజీవమే!

                        1871

                    అది కాంగోలోని న్యాన్‌గ్వే13 మార్కెట్‌

                    1500 మంది ప్రజలు చేరారు అక్కడ

                    వారిలో అత్యధికులు స్త్రీలు

                    నల్గురు అరబ్‌ బానిస యజమానులు

                    ప్రవేశించారు ఆ మార్కెట్‌లోకి

                    భయభ్రాంతులై పారిపోతున్న

                    ఆ ప్రజలపై పేల్చారు తుపాకులు

                    చంపేశారు 600 మంది అమాయకులను

                    చనిపోయిన వారందరికీ వందనాలు.

                    1900

                    విప్లవ అగ్నిపర్వతం పేలింది

                    వేడివేడి లావా ప్రవహించింది

                    ఉల్గులాన్‌ అనే ముండా తిరుగుబాటుకు

                    బిర్సాముండా14 శ్రీకారం చుట్టాడు

                    బిర్సాముండా – ధర్తీ అబా – జాతిపిత!

                    డిక్కులను (బయట నుంచి వచ్చినవారిని)

                    కాల్చివేస్తూ,

                    పోలీసు స్టేషన్లనూ, చర్చీలను తగలబెడుతూ

                    వడ్డీ వ్యాపారుల, జమీందారుల

                    ఆస్తులపై దాడులు చేస్తూ

                    బిర్సా రాజ్యపు శ్వేత పతాకాన్ని

                    సమున్నతంగా ఎగరేశాడు

                    వలస ప్రభుత్వం వణికిపోయింది

                    డంబరీ కొండలపై సమావేశమైన

                    ముండా యోధులపై

                    దాడిచేశారు బ్రిటీషు ముష్కరులు

                    వేలాది స్వాతంత్య్ర సమరయోధులను చంపేశారు

                    బిర్సాముండాను పట్టుకున్నారు

                    25వ ఏటనే

                    జైలులో చంపేశారు –

                    అతణ్ణి హతమార్చారు –

                    కాని –

                    ఉల్‌గులాన్‌ – విప్లవం

                    కొనసాగుతుంది –

                    వర్ధిల్లాలి ఉల్‌గులాన్‌

                    ధర్తీ అబా – జాతిపిత బిర్సాముండా వర్ధిల్లాలి!

                    22 జనవరి 1905

                    పుతిలోవ్‌ కర్మాగారపు

                    కార్మికుల దీన, విషాద పరిస్థితి చూసి

                    చలించిపోయిన మతాధికారి

                    జార్జి గేపన్‌15 కు వందనం!

                    అది జార్‌ చక్రవర్తుల రష్యా

                    క్రూరుడు, నిరంకుశుడు, నియంత, అణచివేతదారుడు

                    రెండవ నికొలస్‌ జారీచేశాడు ఆజ్ఞ

                    కార్మికులు పన్నెండు గంటలు పనిచేయాలని

                    శనివారమైతే పదిగంటలే అని

                    అన్నిటి ధరలూ పెంచేశాడు

                    కార్మికుల కూలీ మాత్రం తగ్గించేశాడు

                    గేపన్‌ అనే అమాయకుడు

                    ఇదంతా జార్‌కు తెలియదనుకున్నాడు

                    ఇవన్నీ క్రింది అధికారుల ఆగడాలనుకున్నాడు

                    ఫాదర్‌ గేపన్‌

                    వేలాది కార్మికులను సమీకరించి

                    జార్‌గారి వింటర్‌ పాలెస్‌కు

                    విజ్ఞప్తి చేయడానికెళ్ళగా

                    వారికి బుల్లెట్ల వర్షం ఆహ్వానం పల్కింది

                    తూటాలు వేలమందిని బలిగొన్నాయి

                    కార్మికుల నోరు నొక్కేశారు

                    ఉద్యమం విఫలమైంది

                    కాని అది ఈ విషపు రాచరికాన్ని

                    బ్రద్దలు గొట్టిన విప్లవానికి

                    ఇంధనాన్ని సమకూర్చింది

                    25 అక్టోబరు 1917

                    20వ శతాబ్దపు మహావిప్లవం

                    కార్మిక, కర్షక విప్లవం

                    లెనిన్‌, స్టాలిన్‌ నేతృత్వంలో

                    అక్టోబరు విప్లవం

                    ఆ విప్లవానికి అరుణారుణ వందనం!

                    విప్లవ కవిత్వంలో కొత్త పుటలు చేరాయి

                    అవి అరుణారుణ పుటలు

                    రష్యా, చైనా, సగం యూరప్‌

                    క్యూబా, వియత్నాం, లావోస్‌

                    అన్నీ అరుణారుణం

                    వారందరికీ

                    ఎర్రెర్రని దండాలు!

                    1921

                    ఇస్తాంబుల్‌ వీధుల్లోకి వ్యాపించింది విప్లవం

                    విప్లవ సైన్యం కవాతు చేసింది

                    వారి నాయకుడు ముస్తఫా సూఫీ16

                    నియంత కిరాయి హంతకులు

                    కత్తితో పొడిచి అతన్ని చంపేశారు

                    శవాన్ని నల్ల సముద్రంలో పడేశారు

                    నల్ల సముద్రం ఎరుపెక్కింది

                    ముస్తఫా సూఫీకి సలాం!

                    మార్హబా! వందనం!

                    1923

                    స్వేచ్ఛాజ్వాల

                    ఆంధ్రప్రదేశ్‌లో దావానలమై చెలరేగింది

                    రంప విప్లవానికి వందనం

                    చింతపల్లి అల్లూరి సీతారామరాజుకు

                    వందనం!

                    1950

                    గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌!

                    సూడిస్‌మాన్‌17కు వందనం

                    గొప్ప సమీకరణదారుడు!

                    ఓడిన 20 మిలియన్లను

                    చురుకైన విప్లవ సైన్యంగా సమీకరించాడు

                    కానీ ఇండోనీషియాలో

                    విప్లవం విఫలమైంది

                    వేలాదిమంది కామ్రేడ్లు

                    ఊచకోతకు గురయ్యారు

                    సూడిస్‌మాన్‌ను ఉరికంబం ఎక్కించారు.

                        1952

                    కెన్యా అడవుల నుండి

                    ఒక నినాదం ప్రతిధ్వనించింది

                    ‘‘మజ్నుగు విండే ఉలాయా

                    మాఫ్రికా అపాతే ఉహురు’’

                    ‘‘ఐరోపా వారు ఐరోపాకు తిరిగిపోవాలి

                    ఆఫ్రికన్లు తమ స్వేచ్ఛను తిరిగి పొందాలి’’

                    ముసలీ, ముతకా, పిల్లా, జెల్లా

                    పిడుగుల్లా గర్జించారు

                    యుమా! యుమా!

                    వెళ్లిపొండి! వెళ్ళిపొండి!

                    – హద్దులు లేని ఉద్రేక ప్రదర్శన

                    అణచివేతకు, అన్యాయానికి గురైన

                    జాతీయవాదుల స్పందన!

                    ‘మావ్‌, మావ్‌’, స్వాతంత్య్ర సమరయోధులు

                    వలస సంకెళ్ళ నుండి

                    కెన్యాను విముక్తి చేస్తామని ప్రతినబూనారు

                    అది మావ్‌ మావ్‌ తిరుగుబాటు

                    హబాం!

                    వందనం

                    ఆరుగురు కపెన్‌ గురియా18 లకు

                    బిల్దాద్‌ కగ్గియా, కుంగు కరంబూ,

                    జోమో కెన్యట్టా, ఫ్రెడ్‌ కుబాయ్‌,

                    పాల్‌నెడీ, అచియాంగ్‌ ఒనెకో!

                    మీకు మా సెల్యూట్‌!

                    1961

                        పాట్రిస్‌ లుముంబా19కు సెల్యూట్‌!

                    ప్రజాస్వామికంగా మొట్టమొదటిసారి

                    ఎన్నికైన కాంగో ప్రధానమంత్రి

                    ఆఫ్రికన్ల అస్తిత్వం కోసం పోరాడినవాడు

                    ఆయన ఇలా అన్నాడు :

                    ‘‘ఆఫ్రికన్‌ సోదరులారా!

                    వెయ్యేళ్ళపాటు జంతువుల్లా బాధలు పడ్డారు

                    మీ చితాభస్మం ఎడారుల్లో వీచే

                    గాలిలో కలసి పోయింది

                    మీ నియంతలు మాత్రం విలాసవంతమైన

                    మాయా దేవాలయాలు కట్టుకున్నారు

                    మీ ఆత్మ సంరక్షణ కోసం, మీ బాధలు తగ్గించడానికి

                    అనాగరికులకు పిడిగుద్దుల హక్కు

                    తెల్లవారికి కొరడాదెబ్బల హక్కు

                    మీకైతే చనిపోయే హక్కు

                    మీరు ఏడ్వగలరు కూడా

                    నేరస్థ వలస దేశం బెల్జియం

                    కాంగోలోని విలువైన కాపర్‌, బంగారం, యురేనియంలను

                    దోపిడీ చేసినవారు,

                    ప్రజాస్వామ్యమని జబ్బలు చరుచుకునే

                    అగ్రరాజ్యమైన అమెరికాతో కుట్ర చేశారు

                    లుముంబాను అరెస్టు చేశారు

                    చితకబాదారు

                    చిత్రహింసలు పెట్టారు

                    చెట్టు వద్ద నిలబెట్టి

                    అతనిపై కాల్పులు జరిపి చంపేసారు

                    అతని శవాన్ని ముక్కలుగా నరికి

                    యాసిడ్‌ పీపాలో పడేసి కరగించివేశారు

                    ఈ నేరస్థులు ఇంకా

                    ఇంకా ప్రజాస్వామ్య సూత్రాలు,

                    ప్రవచించడమూ,

                    ప్రజాస్వామ్య గేయాలు

                    ఆలపించడమూ

                    సిగ్గుచేటైన విషయం.

                      11 సెప్టెంబరు 1973

                    చిలీ స్టేడియంలో

                    చిత్రహింసలకు గురిచేస్తూ

                    అతని వ్రేళ్ళు నరుకుతూ వుంటే

                    అతని జీవితంలో ఆఖరిపాట రాశాడు

                    అది అసంపూర్తిగా మిగిలిపోయింది

                    నెత్తురోడుతున్న వ్రేళ్ళద్వారా

                    వచ్చిన అంతిమ గీతం అది –

                    బుల్లెట్ల వర్షం శరీరంపై కురుస్తుండగా

                    అతను రాశాడు

                    భయభ్రాంత వాతావరణం గురించి

                    నేను పాడి తీరాల్సిన పరిస్థితిలో

                    పాడటం ఎంత కష్టం!

                    మౌనమూ,

                    బాధామయ అరుపులూ

                    నా పాటకు ముగింపు

                    మహోన్నతుడు

                    విక్టర్‌ జారా20కు వందనం

                      17 డిసెంబరు 2010

                        మహమ్మద్‌ బౌజిజి21

                    వీధుల్లో తిరిగి అమ్ముకునేవాడు –

                    టునీసియాలో చిన్న పట్టణం సిదిబౌజిత్‌లో

                    అతి పేదలకు ఆయన పండ్లు, కూరగాయలు

                    ఉచితంగా ఇచ్చేవాడు

                    అతనిపై ఆప్యాయతతో ప్రజలు అతన్ని

                    తీపిహల్వా – బస్‌బూసా అని పిలిచేవారు

                    నిజానికి అతనే బీదవాడు

                    ఆర్గురు పిల్లల కుటుంబం

                    వ్యాపారం చేసుకునే అనుమతి లేదు

                    పోలీసులకు లంచం కావాలి

                    మున్సిపల్‌ ఉద్యోగులకు లంచం కావాలి

                    అతడి సామాను స్వాధీనం చేసుకున్నారు

                    వేధింపులు, అవమానాలతో విసిగి, వేసారిపోయాడు

                    ఒక గ్యాసు పీపా సంపాదించాడు

                    నట్టనడిరోడ్డు మధ్య నిలబడి

                    ‘‘నేనెలా బతకాలో చెప్పండి’’ అంటూ అరుస్తూ

                    తనకు తానే నిప్పంటించుకున్నాడు

                    చనిపోయాడు.

                    అతని అంతిమయాత్రకు వచ్చారు

                    ఐదువేలమంది ప్రజలు

                    కోపోద్రిక్త జనం నినదించారు

                    ‘‘నీ చావుకు ప్రతీకారం తీర్చుకుంటాం!

                    ప్రస్తుతం నీ మరణానికి విలపిస్తాం!

                    నీ మరణానికి కారణమైనవారు

                    విలపించేట్లు చేస్తాం’’

                    ఆత్మగౌరవ విప్లవం – థవ్రాట్‌-అల్‌-కరా-మహ్

                    ప్రారంభమైంది

                    దానినే పిలిచారు జాస్మిన్‌ విప్లవం అని

                    టునీసియా జాతీయ పుష్పం – మల్లెపూవు

                    ఈ మల్లె విప్లవం

                    నియంత జివి ఎల్‌ అబిదిని బెన్‌ ఆలీని

                    కూలద్రోసిన

                    మహమ్మద్‌ బౌజిజి

                    ‘వా అలేకుం సలాం’!

                      17 జూన్‌ 2011

                    సలామ్‌!

                    మెరుగైన మారిటోనియా22కోసం

                    ప్రజలందరికీ సమానమైన న్యాయం అందాలని

                    అధ్యక్ష ప్రాసాదం ముందే, నౌక్‌ఛోట్‌23లో

                    సజీవ దహనమయ్యాడు

                        యాకూబ్‌ దహాబ్‌24

                    దానితో

                    ఈజిప్టులోనూ, అరబ్‌ ప్రపంచంలోనూ

                    విప్లవాలు ప్రారంభమయ్యాయి.

                    సలాం నీకు

                    ఈజిప్ట్ కు చెందిన ఆస్మా మహ్ ఫౌజ్‌24!

                    సలాం నీకు సిరియాకు చెందిన

                      రజాన్‌ జైటోవా25!

                    సలాం నీకు యెమెన్‌కు చెందిన

                        తవాక్కుల్‌ కర్మాన్‌26!

                    ఇలా ఎందరెందరో

                    విప్లవ జ్వాల మండుతూనే వుంటుంది

                    ఎన్నటికీ ఆరిపోదు –

                    కొన్నాళ్ళు నివురుగప్పి వుండొచ్చు

                    కాని లోలోపల రాజుతూనే వుంటుంది

                    దాని ఏకైక మిత్రుడు కవిత్వమే

                    కవిత్వమూ ఎన్నటికీ తలవంచదు

                    అది సజీవంగా మండుతూనే వుంటుంది

                    విప్లవ జ్వాలలనెగదోస్తుంటుంది

                    ముందు వరుసలో నిలబడి

                    విప్లవ మహాకావ్యాన్ని కొనసాగిస్తుంటుంది.

                    అది ఇంకా అసంపూర్ణమే

                    ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ అంతుబట్టదు

                    అప్పటివరకు ఎన్నో కొత్త పేర్లు

                    వచ్చి చేరుతుంటాయి

                    రక్త ప్లావితమైన అధ్యాయాలతో

                    వందనం వారందరికీ

                    అందరికీ సెల్యూట్‌!

వివరణలు :

1. జాంజ్‌ తిరుగుబాటు : అబ్బాసిర్‌ కాలిఫేట్‌కు వ్యతిరేకంగా 869 నుండి 883 వరకు సాగిన నల్ల బానిసల తిరుగుబాటు.

          ఆలీ ఇబ్న్‌ మహమ్మద్‌ నాయకత్వంలో బంటూ భాషీయులైన బానిసలు (జాంజి) సెప్టెంబరు 869 నుండి 14 ఏళ్లపాటు చేసిన తిరుగుబాటు.

          ఈ బానిసలను తూర్పు ఆఫ్రికా తీరప్రాంతాల నుండి బంధించి మధ్య ఆసియాకు తెచ్చి చవుడు నేలల్లో చవుడు తీసేయడానికి ఉపయోగించేవారు. ఈ తిరుగుబాటులో వేలాదిమంది చనిపోయారు. వీరు గెరిల్లా యుద్ధం చేసి, ఆక్రమించిన ప్రాంతాల్లో పరిపాలించేవారు.

2. గాస్పర్‌ యంగా : (జననం 1545). ఆఫ్రికన్‌ మెక్సికోలో మరూన్‌ బానిసల కాలనీకి నాయకుడు. 1609లో కాలనీపై స్పానిష్‌ దాడిని ప్రతిఘటించాడు. 1618లో మరూన్‌ సెటిల్మెంట్‌ స్వపరిపాలనపై స్పానిష్‌ వలస ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. మెక్సికో జాతీయ వీరునిగా ప్రసిద్ధుడు.

3. మజ్నూషా; 4. భవానీ పాథన్‌; 5. దేవి చౌధురాణి : మజ్ను షా మేవాట్‌కు చెందిన సూఫీసన్యాసి. మజ్నుఫకీర్‌గా ప్రసిద్ధుడు. సన్యాసుల – ఫకీర్‌ల తిరుగుబాటు బీహార్‌ – బెంగాల్‌ ప్రాంతాలకు వ్యాపించింది.

          భవానీ పాథన్‌, దేవి చౌధురాణిలు, మజ్నూషా అనుచరులు ఈస్ట్‌ ఇండియా కంపెనీ కార్యాలయాలపై గెరిల్లా మరియు Positional యుద్ధ పద్ధతుల్లో సాగిన ఫకీర్ల – సన్యాసుల ప్రతిఘటన 1760లో ప్రారంభమై 1770 వరకు కొనసాగింది. 50 వేలమంది తిరుగుబాటుదార్లు పాల్గొన్నారు. భూస్వాములు, వడ్డీ వ్యాపారులను, బ్రిటిష్‌ వర్తకులు, సైనిక అధికారులపై ప్రధానంగా దాడులు చేశారు. భవాని పాథన్‌ భోజ్‌పురి బ్రాహ్మణుడు – మజ్నూషా మిత్రుడు – అనుచరుడు.

6. దుర్జన్‌సింగ్‌ : బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ పన్నులు బాగా పెంచగా, పిల్ల జమీందార్లు, రైతులు, పేద రైతులు 1798లో చువార్‌ ఆదివాసులు దుర్జన్‌సింగ్‌ అనే జమీ పోగొట్టుకున్న మిడ్నపూర్‌ జమీందార్లు నాయకత్వాన, 15 వందల మంది చేసిన తిరుగుబాటు దాడులు. మే 1798లో  రాయపూర్‌లోని  చువార్స్‌ లో ఒక బజారు, ఒక కచేరి తగలబెట్టారు. దుర్జన్‌సింగ్‌ 30 గ్రామాలపై అదుపు సాధించాడు.

          బెంగాల్‌లోని  స్థానిక ఆదిమవాసీ తెగవారిని బ్రిటీషువారు నిందాపూర్వకమైన పదం చువార్‌ అని, అంటే పంది అని పిలిచేవారు. ఈ పోరాటాలలో బ్రిటీషువారు 200 మంది తిరుగుబాటుదారులకు మరణశిక్ష విధించారు. దీనిని జంగల్‌మహల్‌ స్వాతంత్య్ర పోరాటంగా పిల్చారు.

          చువార్‌ తిరుగుబాటు 1798-99లో మిడ్నపూర్‌ జిల్లాలోని బింకూరలో జరిగింది.

7. బాబా తిల్కా మంజీహ్ : (1 ఫిబ్రవరి 1750-1785)

          ఈయన సంతాల్‌ కుటుంబంలో బీహార్‌లోని సుల్తాన్‌ గంజ్‌ ప్రాంతంలోని తిల్కపూర్‌ కుగ్రామంలో జన్మించారు. తండ్రి సుందర ముర్ము. తన కుటుంబంపైనా, ఆదివాసీలపైన బ్రిటీషువారి క్రూర పరిపాలనను బాల్యం నుండీ అనుభవించాడు. అగస్టస్‌ క్లీవ్‌లాండ్‌ అనే బ్రిటీష్‌ సూపరింటెండెంటు, కమీషనర్‌ను మాటువేసి, చంపేయడంతో బ్రిటీష్‌ ప్రభుత్వం వణికిపోయింది.

          తిల్కా తన విప్లవ మిత్రులతో సమావేశం కాగా, ఒక ద్రోహి అందించిన సమాచారంతో బ్రిటీష్‌వారు దాడిచేయగా,  తిల్కా తప్పించుకున్నాడు – పలువురు సంతాలులు అమరులయ్యారు. తిల్కా సుల్తాన్‌గంజ్‌, భగల్పూర్‌ పర్వత ప్రాంతాలకు తప్పించుకొని వెళ్ళాడు. ఒక గెరిల్లా యుద్ధంలో 1785లో పట్టుకొని చంపేసి రావి / మర్రి చెట్టుకి వేలాడదీశారు. గుర్రపు తోకకు కట్టేసి, లాక్కుని పోయి భగల్పూర్‌ కలక్టర్‌ ఇంటి వద్ద ఆ చెట్టుకి వేలాడేశారు. ఇప్పుడు ఆ ప్రదేశంలోనే అతని విగ్రహాన్ని ప్రతిష్టించారు. భగల్పూర్‌ విశ్వవిద్యాలయానికి తిల్కామంజీ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టారు.

8. షేయాస్‌ తిరుగుబాటు : (31 అగస్టు 1786 – జూన్‌ 1787)

          పశ్చిమ స్ప్రింగ్‌ ఫీల్డ్ లోని మెసాచుసెట్స్ తో ప్రభుత్వం పెంచిన పన్నులకు వ్యతిరేకంగా, ఆర్థిక సమస్యలపైనా, పౌరహక్కుల కోసం, అన్యాయాలకు వ్యతిరేకంగానూ నాలుగు వేలమంది డేనియల్‌ షేయాస్‌ నాయకత్వాన చేసిన తిరుగుబాటు.

9. అచల్‌ సిన్హా : 1806లో బోంగీర్‌ లాయక్స్‌ ల భూమిని బ్రిటీషువారు స్వాధీనం చేసుకున్నారు. అచల్‌ సిన్హా నాయకత్వాన లాయక్‌లు తిరుగుబాటు చేశారు. ద్రోహం వలన అచల్‌ సిన్హా పట్టుబడ్డాడు. 200 మంది లాయక్‌లు ఈ ఘర్షణలో చనిపోయారు. అచల్‌ సిన్హాను కాల్చి చంపేశారు.

10. వీరనారాయణసింగ్‌ బింజావర్‌ : (1795-1857)

          చత్తీస్‌ఘడ్‌  స్వాతంత్య్ర  సమరయోధుడు, ధాన్యవ్యాపారి వద్ద ఉన్న ధాన్య నిల్వలను లూటీ చేసి కరువుతో బాధపడుతున్న పేదలకు పంచినందుకు 1856లో బ్రిటీషు సైన్యం అరెస్టు చేసింది. కాని జైలు నుంచి తప్పించుకొని పారిపోయాడు. 500 మంది సైనికదళం ఆయనది. ఆ తర్వాత మరల పట్టుపడగా 10 డిసెంబర్‌ 1857లో మరణశిక్షకు గురయ్యాడు.

          చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంకు వీరి పేరు పెట్టింది.

11. యు కియాంగ్‌ నాంగ్‌బా : మేఘాలయ స్వాతంత్య్ర సమరయోధుడు. 30 డిసెంబరు 1862లో జొవాయి పట్టణంలో బ్రిటీషువారు ఈయన్ను బహిరంగంగా ఉరితీశారు. భారత ప్రభుత్వం 2001లో ఆయన జ్ఞాపకంగా తపాలా బిళ్ళను విడుదల చేసింది. జొవాయిలో 1967లో ఆయన పేరుతో ప్రభుత్వ కళాశాల స్థాపించారు.

12. భగ్నాదిహ్ : జార్ఖండ్‌లోని ఒక గ్రామం. సంతాలుల తిరుగుబాటుకు ప్రధాన కేంద్రం.

          30 జూన్‌ 1885లో ఈ గ్రామపు పొలాల్లో సమావేశమై, సంతాలులు సిద్దు, కన్హు ముర్ముల నాయకత్వంలో స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఇప్పటికీ ప్రతి ఏడాదీ జూన్‌ 30న అక్కడ షహీద్‌ మేళా జరుగుతూ వుంది.

13. న్యాన్‌గ్వే : కాంగోలోని ఒక పట్టణం. ఇది 1860 ప్రాంతాల్లో ఏర్పడింది. 19వ శతాబ్దపు చివరి వరకు బానిస వ్యాపారం ఇక్కడ జరిగింది.

14. బిర్సా ముండా : (15.11.1875 – 9.6.1900) ముండా తెగకు చెందిన భారతీయ ఆదివాసీ పోరాట యోధుడు.

15. జార్జి గేపన్‌ : (17.2.1870 – 10.4.1906) రష్యన్‌ మతాధికారి, కార్మిక నాయకుడు.

          1905 జనవరి 22న సార్వత్రిక సమ్మె జరిగిన తర్వాత రోజు, కార్మికులు గేపన్‌ నాయకత్వాన శాంతియుతంగా జార్‌కు విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్తున్న ప్రదర్శనపై కాల్పులతో రక్తప్లావితం కాగా దానిని చరిత్రకారులు Bloody Sunday అని పిలిచారు.

          గేపన్‌ రష్యన్‌ ఫ్యాక్టరీ వర్కర్స్‌ అసెంబ్లీకి నాయకునిగా పనిచేశాడు. ఆ తర్వాత అతన్ని పోలీసు ఇన్‌ఫార్మర్‌గా తలచి, సోషలిస్టు రెవల్యూషన్‌ పార్టీవారు మరణశిక్ష విధించి చంపేశారు.

16. ముస్తఫా సూఫీ : (14.5.1883 – 28.1.1921) టర్కీ దేశస్థుడు. విద్యాభ్యాసం తర్వాత పారిస్‌లో టర్కిష్‌ వార్తాపత్రిక  ‘ఇఫామ్‌’కు సంపాదకునిగా పనిచేశారు.

          1913లో మహమ్మద్‌ పాషా హత్యకేసులో నిందితునిగా 15 ఏళ్ళపాటు నల్ల సముద్ర తీర ప్రాంతంలో వున్న సినోప్‌లో ప్రవాసశిక్ష అనుభవిస్తున్న క్రమంలో అక్కడే అతని కమ్యూనిస్టు మిత్రులతో, భార్యతో సహా 1921 జనవరి 28న చంపబడ్డాడు.

17. సూడిస్‌మాన్‌ : (1920 – 1968) ఇండోనీసియా కమ్యూనిస్టు పార్టీ (PKI)కి 1958 – 65లో ప్రధాన కార్యదర్శి.

          డచ్‌ వ్యతిరేక జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. జపాన్‌ ఇండోనీసియాను ఆక్రమించిన కాలంలో సూడిస్‌మాన్‌ PKIలో చేరాడు. అప్పటికే అది ఫాసిజానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఫాసిస్టు వ్యతిరేక ప్రచారం చేస్తున్నందుకు 1942 సెప్టెంబరులో జపాన్‌వారు అరెస్టు చేశారు. జైలులో 1945 వరకు తోటి ఖైదీలను సంఘటితపరిచారు. విడుదలైన తర్వాత ఇండోనీసియా సోషలిస్టు యూత్‌కు సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు. 1948లో PKI పాలిట్‌బ్యూరో కేంద్రకమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. గెరిల్లా ప్రతిఘటనా దళానికి నాయకునిగా వున్నకాలంలో 1966 డిశంబరులో డచ్‌వారు అరెస్టు చేశారు. 9 నెలలు జైలు జీవితం గడిపారు.

18. కపెన్‌ గురియాలు : మావ్‌ మావ్‌ పార్టీ ద్వారా కెన్యాలోని తెల్లజాతివారినందరినీ హతమార్చడానికి కుట్ర చేశారనే ఆరోపణపై తరువాత పాదాల్లో పేర్కొన్న ఆర్గురినీ 1952లో అరెస్టు చేసి కెపన్‌ గురియా అనే చోట 1952-53లో విచారించారు. కనుక వారిని కపన్‌ గురియాలు అన్నారు. విచారణ తర్వాత ఉత్తర కెన్యాలో జైలులో పెట్టారు.

19. పాట్రిస్‌ లుముంబా : (2.7.1925 – 17.6.1961) కాంగో మొదటి ప్రధానమంత్రిగా జూన్‌ 1960 నుండి సెప్టెంబరు  1960 వరకు పనిచేశారు.

          1958 నుండి హత్యకు గురి అయ్యేంత వరకు కాంగో జాతీయ ఉద్యమ పార్టీ (MNC)కి నాయకత్వం వహించారు.

          1960లో కాంగో స్వతంత్ర దేశమైన తర్వాత జరిగిన సైనిక తిరుగుబాటునణచడానికి అమెరికా, ఐక్యరాజ్యసమితులు సహాయం అర్ధించి విఫలుడయ్యాడు. బెల్జియం సహకారంతో వేర్పాటువాదుల ఉద్యమం అణచాలనుకున్నాడు. కాని వారు సహాయపడకపోవడంతో సోవియట్‌ యూనియన్‌ సహాయం తీసుకున్నాడు. సైనిక తిరుగుబాటుతో ఏర్పడిన మొబుటు ప్రభుత్వ ఖైదీగా బెల్జియం అధికార కాల్పుల దళం చేతిలో మరణించాడు. 2002లో అలా కాల్చివేయడం తాము చేసిన తప్పేనని బెల్జియం క్షమాపణ ప్రకటించింది.

20. విక్టర్‌ జారా : (28.9.1932 – 16.9.1973) : చిలీకి చెందిన ఉపాధ్యాయుడు. రంగస్థల దర్శకుడు, కవి, గాయకుడు, కమ్యూనిస్టు, రాజకీయ క్రియాశీల కార్యకర్త. 11 సెప్టెంబర్‌ 1973లో చిలీలో అలెండీ ప్రభుత్వాన్ని కూలద్రోసిన అగస్టో పినోచెట్‌ నిరంకుశ పాలనలో ఈయన్ని చిత్రహింసలకు గురిచేశారు.

          చిలీ స్టేడియంకు తీసుకుపోయి గిటారు వాయించే చేతివ్రేళ్ళను ఒక్కొక్కటి నరుకుతూ హేళన చేస్తూ గిటారు వాయించమని బెదిరిస్తూ చిత్రహింసలు పెట్టారు. జారా గిటారు వాయించకపోయినా చిలియన్‌ నియంతలపై ఒక నిరసన గేయాన్ని ఆలపించాడు. దానితో ఇంకా రెచ్చిపోయిన శత్రు సైనికులు అతని తలలోకి బులెట్‌ పేల్చారు. శరీరమంతటా 40 బుల్లెట్లున్నాయి.

          42 ఏళ్ళ తర్వాత ఆనాటి సైనికాధికారులపై హత్యానేరంపై విచారణ సాగింది.

21. మహ్మద్‌ బౌజిజి : (29.3.1984 – 4.1.2011) : అరబ్‌ వసంతం (Arab Spring) ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సంఘటనకు కారకుడు బౌజిజి. ఆయన టునీసియాలో వీధి వీధి తిరిగి అమ్ముకునే వ్యాపారి. తాను అమ్మే వస్తువులను జప్తు చేసిన మునిసిపల్‌ అధికారిణిల వేధింపులకు, పోలీసుల బెదిరింపులకు విసిగి తనకు తాను నిప్పు అంటించుకున్నాడు. 17.12.2010న కాలిన గాయాలతో 4.1.2011న చనిపోయాడు. అతని మరణంతో చెలరేగిన ఉద్యమ ఫలితంగా 14 జనవరి 2011న టునీసియా అధ్యక్షుడు, 23 ఏళ్ళుగా అధికారంలో వున్న జైని ఎల్‌ అబ్దిన్‌బెన్‌ ఆలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. నిరంకుశ ఏక వ్యక్తి పాలనకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో అతని మరణం ఒక మూలమలుపుగా వుంది.

          అతని జ్ఞాపకార్ధం టునీసియా ప్రభుత్వం తపాలా బిళ్ళను విడుదల చేసింది.

22. మారిటోనియా : నార్త్‌ వెస్ట్‌ ఆఫ్రికాలో ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ దేశం.

23. నౌక్‌ ఛోట్‌ : మారిటోనియా దేశపు రాజధాని నగరం.

24. యామాబ్‌ దహోబ్‌ : మారిటోనియాలో ప్రజాస్వామిక సంస్కరణలు, ఖైదీల విడుదల, అవినీతి నిర్మూలన కోరుతూ బౌజిజి తరహాలోనే, ఆ దేశపు రాజధానిలో అధ్యక్ష భవనం ముందే 17 జనవరి 2011లో నిప్పంటించుకొని, కాలిన గాయాలతో జనవరి 23న చనిపోయాడు.

24. ఆస్మా మహ్ ఫౌజ్‌ : (1.2.1985) 2011 ఈజిప్టు విప్లవానికి బీజారోపణ చేసిన మహిళ – ఈమె ఏప్రిల్‌ 6 యువజన ఉద్యమాన్ని ప్రారంభించిన కార్యకర్త.

25. రజాన్‌ జైటోవా : రాజకీయ ఖైదీల విడుదల కోసం సిరియాలో కృషిచేసిన మహిళా బృంద సభ్యురాలు.

          దానా జవాబ్రా అనే మహిళా ఇంజనీరును, నిరంకుశ అధ్యక్షుడు బషాల్‌ ఆల్‌ అస్సాద్‌ 16 మార్చి 2011లో నిర్బంధానికి గురిచేశాడు. ఆమెను జైలులో చాల బాధలు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు వెల్లువెత్తాయి. డేరాలో 15 మంది విద్యార్థులని అరెస్టుచేసి చిత్రహింసలు పెట్టడాన్ని నిరసించారు. టునీసియా, ఈజిప్టుల్లోలాగ పాలకుల పతనాన్ని ప్రజలు కోరుతూ ప్రదర్శనలు చేశారు.

          రజాన్‌ జైటోవా ప్రసిద్ధ మహిళా లాయరు. 36 మంది నిరసనకారులను సమర్ధించారు. ఆమెను అరెస్టు చేసినా తప్పించుకుని పారిపోయింది.

26. తవాక్కుల్‌ కర్మాల్‌ : యెమెన్‌ నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత.

          పాత్రికేయురాలు, రాజకీయవేత్త, మానవహక్కుల కార్యకర్త. 2011 యెమెన్‌ తిరుగుబాటులో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ‘ఉక్కు మహిళ’గా విప్లవమాతగా యెమన్‌ ప్రజలు ఆమెను సంబోధిస్తారు.

admin

leave a comment

Create AccountLog In Your Account