ఓ! కాలుష్యమా!

ఓ! కాలుష్యమా!

– ఎస్. శంకరరావు

          ఆదిపత్య దురహంకార

          అక్రమ సంతానమా!

          కాలం కనుసన్నలలో

          వికసించిన యమపాశమా!

          నగ్న శిధిలీకృత వ్యవస్థ

          సృజించిన విష బీజమా!

          ప్రకృతిని పట్టిపీడించే

          హీన సంస్కృతి రాజసమా!

          విషవాయు జ్వాలల

          కాలుష్యమా! ఓ  కాలుష్యమా!

          నీ దుర్నీతి ఫలితం

          ప్రతి ఇంటా ప్రతి వాడా

          క్షణం క్షణం మృత్యు భయం!

          నాడు బోపాల్‌- నేడు విశాఖ

          రేపు కొవ్వాడ చిక్కోలు

          అణువణువూ మరణమృదంగం!

          కాలం గుప్పెట్లో

          నీ స్వార్థం సరుకు మయం

          వాడొక సరుకు – వీడొక సరుకు

          పరాయీకరణ మాఫియా సరుకు

          విజృంభించే విద్వేష సరుకు!

          నీ వ్యాపార సంస్కృతి

          లాభాలే పరమావధి

          అదిగదిగో ప్రమాదకర రసాయనాల వ్యాపారం

          ఇదిగిదిగో శవాల గుట్టల పై కోటలు కట్టే వ్యాపారం

          కాదేదీ నీ వ్యాపారానికనర్హం!

          నీవు

          కాలము పెంచి పోషించిన

          విషతుల్య పర్యావరణ అంగడివు

          నీలో దాగి ఉన్నది

          నిరంకుశ కర్కశత్వం

          ప్రమాదమని తెలిసినా బేఖాతరు-బేఖాతరు!

          నేడు

          నీ విజృంభణలో

          హాహా కారాలు – ఆవేదనలు

          మాడి మసిబారుతున్న పచ్చిక బయలు

          రాలిపోతున్న ప్రాణాలు

          నెత్తురు చిందిస్తున్న శరీర కణాలు

          అప్పుడే కాలుష్యంపై నీళ్లు జల్లుతూ

          యంత్రాంగ రేటింగులు

          ఒక్కసారిగా

          వేడి నెత్తురు చల్లబడే దేహాలు!

          ప్రపంచీకరణ కనుసన్నలలో

          ఎన్నెన్నో మానవ జీవన విధ్వంసాలు!

          కాలంపై కన్నెర్ర జేస్తూ

          పిడికిళ్లు బిగుస్తున్నాయి

          ఊరేగింపులు కదులుతున్నాయి

          కాలుష్య రహిత ప్రపంచం దిశగా…..

          వర్గ రహిత సమాజ దిశగా………

admin

leave a comment

Create AccountLog In Your Account