– గౌరీశంకర్
‘నారాయణా ఏవైందిరా అందరూ అలా గాభరా పడతన్రు?’ ఆదుర్దాగా అడిగాడు గోపాలం.
మన కిష్ణగాడు పురుగుల మందు తాగీసేడ్రా!
అమ్మమ్మ! అంత కస్టం ఏటొచ్చిందిరా ఆడికి!
‘‘నీకెప్పుడూ సెప్పనేదేటి? ఈడు గాజువాకలో ఒక ఆసామీ దగ్గిర సీటీ కట్టేవోడు. ఆడీ కరోనా అడావిడ్లో జెండా ఎత్తీసి, కరోనా కంటే పెద్ద జబ్బులొచ్చీలా సేసి ఎల్లిపోండట….’’
‘అయితే…. సచ్చిపోడవేనేట్రా అన్నిటికీ మందు…..?’
‘కూతురు పెల్లి సెయ్యనీకి అయిదు లచ్చలకి సీటీ ఏసినాడంట, మన బతుకులేపాటిరా అయిదు లచ్చలంటే….!’
అయిదు లచ్చలే…. పెద్ద దెబ్బేరా…. పోలీసు కంప్లైంటివ్వలేదా మరి?
‘అదీ అయ్యింది…. పారిపోయినోడు అంత బేగ దొరుకుతాడేట్రా? దొరికినా ఐపి పెట్టీసినోడు ఎక్కడ్నించి తెచ్చిత్తాడ్రా?…. ఒకేల దొరికినా పోలీసులు నొక్కెత్తారు….’
అదీ నిజవేలే…. ఇంతకీ ఇప్పుడెలగుందాడికి?
‘కడుపులోది కక్కించేరు…. ఇంకా సుహ రానేదు…. ఏటవుద్దో మరి…. అయినా ఇట్టా మంది సొమ్ము నొక్కీసి పారిపోయే దొంగనా కొడుకుల్ని ఉరిదీస్సినా తప్పునేదురా…. పాపం ఇంకా ఎంతమంది ఉసురు దీస్కుంటారో….?’
పాపం! ఆడుగానీ, ఆడి పెల్లంగానీ ఓ మంచి గుడ్డ ముక్కేసుకోడం నానెప్పుడూ సూడ్నేదురా…. కడుపు కట్టుకోని పైసా, పైసా కూడగట్టి ఆడికి ముడుపు గట్టేసినారు….
‘అదే అంతన్నాను నానూను…. గుంటల్ని సదవించుకోనీకో, సిన్న బూమ్ముక్క అమర్సుకోడానికో, సిన్నా సితకా కొంప గట్టుకోనీకో ఎంతమందో ఆడికాడ సీటీలు గట్టుంటారు…. యింతమందిని ముంచీసి ఆడు ఏటి బావుకుంటాడ్రా?….’ అయినా నాకు దెలీకంటన్నాననుకో గానీ మన్లాంటి సిన్నసిన్నోల్నే అందరూ మోసం జేత్తారేట్రా….?’
‘కాకపోతే! సొమ్ములున్న గొప్పోల్లు ఇలా సిన్న సిన్న సిటీలు గట్టుకుంటారేట్రా? ఏ బంగారాలమీనో, ఏ బూవుల మీనో నేకపోతే సేర్లు మీనో ఎట్టుకుంటారు గానీ….’
డ్యూటీ ముగించుకొని అప్పుడే అటుగా వచ్చిన ఫారెస్టు వెంకటరావు వీళ్ళతో కలిసాడు. ‘‘మీరన్న మాటలన్నీ నిజమేరా, ఇప్పుడు చూడండి మన్లాంటోల్ల పరిస్థితి ఏటయ్యిందో, రోడ్డు పక్కన చిన్నా చితకా యాపారాలు చేసుకునీవోల్లు, రకరకాల కూలిపన్లకెల్లీవోల్లు, రిక్షాలు తొక్కీవోల్లు, చెప్పులు కుట్టుకునీవోల్లు, దుకాణాల్లో పన్జేసీవోల్లు…. ఇలా ఎన్ని కోట్లమంది ఈ మహమ్మారి పుణ్యమా అని పనుల్లేకుండా, కడుపుకి కనీసపాటి తిండి లేకుండా అగోరిత్తన్నాం. నా కాంటాక్టు ఉజ్జోగం ఉంటాదో, ఊడుతాదో, పీకమీద కత్తిలాగుంది. ఇతర దేశాలు పేదల్ని, వలస కార్మికుల్నీ ఆదుకోడానికి పెద్ద పెద్ద మొత్తాల్లో నిధులు విడుదల చేస్తుంటే మన వస్తాదులు సూసీ సూడనట్టు విదిలిస్తున్నారు. మనకి తెలీడం లేదుగానీ పంటలమ్ముడుపోక, ఆకలికి తట్టుకోలేక, రోగానికి వైద్యం అందక ఎంతమంది కాటికెల్లిపోతన్నారో? మరీల్లందరూ మన కిష్ణగాడిలాగే ఎవురో ఒకర్ని నమ్ముకొని మోసపోయినట్టే గదరా…. ఏటంటారు?’’
‘‘మీరెన్నైనా సెప్పండిగానొరే, మామూలు ముడుసుల్లోనే అబిమానం, జాలి ఉంటాయిరా…. అందుకనే పెతిపోటా ఎవలో ఒకలు దిక్కూ మొక్కూ లేనోల్లకి ఏదో ఒకటి అందిత్తా వున్నారు…. ఓటుకి నోటిచ్చి కొనుక్కున్న నాయాల్లకి జనం మీద జాలెందుకుంటదిరా?’’
‘‘అమ్మమ్మ, అలగనీకు! ఆల్లకీ మనసులున్నాయి అందులో అబిమానాలు కూడా ఉన్నాయి. అందుకనే జాలిపడి మొన్ననే ఓ యాబైమంది పెద్దమనుషులు బ్యాంకుల్నుండి తీస్కున్నప్పులు చెల్లించలేక తలెత్తుకోని తిరగలేక, ఇక్కడి జనాలకి మొకాలు సూపించలేక ఇమానాలెక్కి, అంటే ఎక్కించి అంపీసినారనుకో, విదేశాలకి పోయినోల్లయ్యి తక్కువలో తక్కువ ఒక డెబ్బై వేల కోట్లు మాఫీ చేస్సేరు. పాపం పువ్వులమ్ముకున్న సోట కట్టెలమ్ముకోలేక విదేశాలకెల్లిపోనారూ, యింత సిన్న మొత్తాలు దీర్సలేక అక్కడెన్ని అగసాట్లు పడతన్నారో, అసలే విదేశాల్లో కరోనా పెట్రేగిపోతంది, ఇలగైనా మందేశానికి ఎలిపొచ్చెత్తారు అని ఆలోసించి ఆలోసించి, కొంతమంది పెద్దమనుసులు బాగుపడాలంటే ఎంతమంది సిన్నోల్లు, అంటే మన్లాంటోల్లు, పోయినా పర్వాలేదని ఎక్కడో పెద్దోరు సెప్పిన్రంట గదా…. అదన్నమాట సంగతి. ఇప్పుడ్లాల్ల కోసరం విమానాల్ని అంపించి మరీ దీస్కొత్తారు!’’
‘సెబ్బాసురా ఎంకట్రావా! మొన్న దేవరాపల్లి సంతకి దెచ్చిన కూరగాయలిక రేట్లు పడిపోనాయని రైతులు ఆటినక్కడే పారీసి పోనారు…. మాయదారి వరసమొచ్చి అర్టితోటల్నీ, మావిడి తోటల్నీ, కోతకొచ్చిన వరిపంటల్నీ నాశినం జేసి పోనాది. లచ్చలమంది ఉన్నసోట బతకదారినేక కొంపా గోడూ, పెల్లాం పిల్లల్నీ ఒగ్గీసి దేశింకాని దేశాలట్టుకోని పనీపాటూ, తిండీ తిప్పలూ నేకుండా గుండిలవిసిపోయీనాగ మైల్లకి మైల్లు నడుసుకొని ఎలిపొచ్చెత్తన్రు, సత్తే నా మట్టిలోనే సత్తాననుకొని. ఈల్లనెవ్వుల్నీ పట్టించుకోని నాయాల్లు మంది సొమ్ముతో జల్సాల్జేసుకొని కోట్లకి కోట్లు ఎగనామం ఎట్టీసినోల్లకి మాపీ జేసినారన్నమాట, గొప్పగుందరా! మరి ఆరుగాలం గొడ్డుల్లా కట్టపడి ఎండనక, ఓననక పెజల కడుపుల్నింపే రైతులికి మాపీ జెయ్యరేవిరా?’’
‘‘అంతదాకా ఎందుకురా, అసలు మనకి అప్పులివ్వడానికే ఎన్ని పుర్రాకులు ఎడతన్నారు? ఒకేల అప్పిచ్చినా, నేకపోతే మాపీలు జేసినా సవాలచ్చ కండిసన్లు. సొంత బూవున్నోల్లకే ఇత్తాం…. లచ్చవరకీ మాపీ జేత్తాం…. అతనా మాపీ జేత్తారు కదాని బేంకీకెల్తే పాత బాకీ కింద జమ కట్టీసుకున్నాం అంతన్నారు…. బేంకీలు అప్పులివ్వకే కదరా వడ్డీ మీన వడ్డీకి అప్పుల్దెచ్చి పంటలు పండినా రేటు సరిగ్గా పలక్క ఉసురుల్దీస్కుంటన్నారు….’’
‘‘ఓరి మీ పిచ్చిగానీ ఈ వస్తాదులందర్కీ ఓట్లెచ్చన్లో కోట్లు దెబ్బ ఎవురిత్తార్రా…. నీకాడా, నాకాడా ఏటుందివ్వడానికి బొచ్చె? బేంకీలకెగ్గొట్టిన మారాజులంతా ఏడుకొండలవాడికి ముడుపు గట్టినట్టు ఈల్లకి సమర్పించుకుంతారు. అట్టాంటప్పుడు మాపీలు ఆల్లకి జెయ్యపోతే నీకూ, నాకూ జేత్తర్రా….!
‘‘ఇసిత్రవేటంటే అన్ని పేపర్లూ రైతు, యవుసాయం, గ్రేమాలూ బాగుంటేనే దేశిం బాగుంటాదని కోడై కూత్తన్నాయి. అయినా ఈ వినాయకులికి ఎంత పెద్ద సెవులుంటే ఏం నాబం, అంతా సెవిటోడి ముందు శంకం ఊదినట్టుంది.’’
ఇంతకీ పెద్దోల్లంతా ఆల్లకి అయినోల్లు…. మనం కానోల్లం…. అంతేమరి! అందకేన్రా అయినోల్లకి కంచాలు, కానోల్లకి ఆకులు!! కరోనా కూడా ఆల్లకే కలిసొచ్చింద్రా. పదండి, పదండి…. కిష్ణగాడికెలగుందో…. మనకి మనవే దిక్కు!!