భగత్ సింగ్ అంటే అధ్యయనం! భగత్ సింగ్ అంటే ఆచరణ !!

భగత్ సింగ్ అంటే అధ్యయనం! భగత్ సింగ్ అంటే ఆచరణ !!

– దివికుమార్

          షహీద్‌ భగత్‌సింగ్‌కు మేమే వారసులమంటూ భారతదేశంలో ఉన్న అన్ని విద్యార్థిసంఘాలు ప్రకటించుకుంటాయి. గడిచిన 84 సంవత్సరాల నుండీ విద్యార్ధి, యువజనుల హృదయాలలో గొప్ప దేశభక్తి  పరునిగా, అసమాన త్యాగ ధనునిగా తిరుగులేని విప్లవ ప్రతీకగా నిలిచి, ఉపఖండపు ఉమ్మడి విప్లవ వీరునిగా చెరగని ముద్ర వేసుకొన్నందువల్ల భగత్‌సింగ్‌ మనకు ఆత్మీయుడయ్యాడు. ఆదర్శనీయుడయ్యాడు, విప్లవ దీక్షకు స్ఫూర్తిగా మన మనస్సులలో శాశ్వత స్థానాన్ని పొందాడు.

          పదుల సంఖ్యలో ఉన్న విద్యార్ధి సంఘాలందరికీ ఒకే భగత్‌సింగ్‌ ఆదర్శనీయుడు, స్ఫూర్తి ప్రదాత కావటంలో కొంత అసంబధ్ధత ఏదో ఉందని మనకు అనుమానం రాక మానదు. భగత్‌సింగ్‌ పేరుని, ఆయన కీర్తిని దొంగచాటుగా కొల్లగొడదామనే అవకాశవాదమేదో వుందనే వాస్తవాన్ని కూడా తెలుసుకోవాలి. భగత్‌సింగ్‌ ఆదర్శాల పట్ల మనకు నిజంగా సానుకూలత వుందో లేదో తేలాలంటే భగత్‌సింగ్‌ రచనలను పట్టుదలగా చదివి అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి. 23 ఏళ్ళ వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన భగత్‌సింగ్‌, ఆ వయసుకే నాలుగు భాషలలో చదవనూ, రాయనూ నేర్చిన వాడనీ, నిరంతర కార్యకలాపాల నడుమ కూడా విపరీతంగా పుస్తకాలు చదివినవాడనీ, ఆ విధంగా వివిధ గ్రంధాలను నిశితంగా అధ్యయనం చేయటంలో భగత్‌సింగ్‌ స్పూర్తిని స్వీకరించాల్సి ఉంటుందనీ మనకు అర్ధమవ్వాలి. తాను ఉరికంబానికి బయలుదేరవలసిన సమయంలో కూడా భగత్‌సింగ్‌ లెనిన్‌ జీవిత చరిత్రను అధ్యయనం చేస్తున్నాడు. మనల్ని కూడా లెనిన్‌ జీవితాన్ని అధ్యయనం చేయవలసిందిగా ఆదేశించాడా అన్నట్లు, లెనిన్‌ జీవిత గ్రంధాన్ని సగంలోనే తెరచి, మిగతా కర్తవ్యాన్ని మనకు విడిచి వెళ్ళాడని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి.

          భగత్‌సింగ్‌ జైలులో వుండగా చేసిన రచనలన్నీ దొరకలేదు. ‘నేనెందుకు నాస్తికుడను?’, ‘పంజాబ్‌ విద్యార్ధులకు సందేశం’ అన్నవి మినహా మిగిలిన 5 రచనలూ భగత్‌సింగ్‌ జైలుకు వెళ్ళటానికి ముందు రాసినవి. అన్నీ విలువైనవే. వాటిలో ‘విద్యార్ధులు రాజకీయాలు’, ‘యువత’, ‘అస్పృశ్యతా సమస్య’, ‘దేవుడు-మతం’ వున్నాయి. 72 ఏళ్ళ ‘స్వతంత్ర’ పాలన తర్వాత కూడా అస్పృశ్యతా సమస్య కొత్త రూపాల్లో కొనసాగు తుండటాన్ని అసహ్యించుకోనివారూ, దళిత సమస్యకొక పరిష్కారాన్ని నిజాయితీగా చూపనివారూ భగత్‌సింగ్‌  వారసులు కాలేరు. ‘మతకలహాలూ – నివారణోపాయాలు’ అనే వ్యాసంలో లౌకికవాదపు మౌలిక అవగాహనను భగత్‌సింగ్‌ మనకు అందిస్తాడు.

          ‘‘1914-15 నాటి అమరవీరులు మతం నుంచి రాజకీయాన్ని వేరు చేశారు. మతం మనిషి వ్యక్తిగత విషయమనీ, అందులో మరొకరు జోక్యం చేసుకోరాదనీ చెప్పాలి. రాజకీయాల్లోకి మతం ఎంతమాత్రం దూరరాదు. ఎందుకంటే యిది మనలను స్థిమితంగ కలిసికట్టుగా కూచొని పనిచేయనివ్వదు’’

          ఆధునిక భారత చరిత్రలో రాజకీయాలనుండి మతాన్ని దూరంగా పెట్టిన తొలి ఉద్యమకారులు 1914-15 కాలం నాటి గదర్‌ వీరులు. వీరిలో మన తెలుగువాడు దర్శి చెంచయ్యగారు కూడా వొకరు కావటం మనకు గర్వకారణం.

          భగత్‌సింగ్‌ బృందపు ముందుతరాల విప్లవకారుంతా మతాన్ని గాఢంగా నమ్మినవారు. భగవద్గీత, ఖురాను, గురుగ్రంధ సాహెబ్‌ లాంటి మత గ్రంధాలను తమ చేతిలో వుంచుకుని ఉరికంబాలెక్కినవాళ్ళు. ఆ కాలానికి ‘నేను నాస్తికుడను’ అంటూ అంత స్పష్టంగా ప్రకటించిన మరొక రాజకీయవేత్త లేరు. తన నాస్తికత్వం మానవ వైజ్ఞానిక ప్రగతిపై, శాస్త్రీయ చింతనపై రూపొందినది కనుక, అది తన ఆశయ బలానికి తోడుగా నిలిచి, స్పష్టమైన అవగాహనతో కూడిన ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తోందని భగత్‌సింగ్‌ చెప్పాడు.

          మన తెలుగునాట విప్లవమంటే చంపుడు పందెపు ఆటలాగా ప్రచారంలో వుంది. అందుకు ఉదాహరణగా భగత్‌సింగ్‌ సాండర్స్‌ అనే పోలీసు అధికారిని లాహోరు నగరం నడిబొడ్డున పట్టపగలు చంపటాన్నీ, నాటి కేంద్ర అసెంబ్లీ (నేటి పార్లమెంటు)లో బాంబులు విసరటాన్ని ఉదాహరణగా చూపే వారనేకులున్నారు. అయితే విప్లవమంటే బాంబులూ, పిస్తోళ్ళూ కాదనీ, అమలులో వున్న అసమానతలతో కూడిన దోపిడీ పీడనల వ్యవస్థను సమ్మూలంగా మార్చటానికి కృషి సల్పటమే విప్లవమని చెబుతూ, తాను తన కార్యకలాపాల తొలి రోజులలో మాత్రమే టెర్రరిస్టుననీ భగత్‌సింగ్‌ స్పష్టం చేశాడు. అంతే కాదు అరక్షణంలో  ఉరికంబంపై వేలాడటమో, ఎదురుకాల్పులలో హతమవటమో చాలా తేలికనీ, జీవితకాలం ప్రజలకొరకు కష్టాలకోర్చి నిరంతరాయంగా కృషి సల్పటమే నిజమైన విప్లవ కర్తవ్యమనీ మనకు బోధించినవాడు భగత్‌సింగ్‌. నిజమైన విప్లవకారులు గ్రామాలలో రైతులూ కూలీలుగానూ, పట్టణాలలో కార్మికులుగానూ వున్నారనీ, వారిని సంఘటితపరచటమే అతి ముఖ్య విప్లవ బాధ్యతనీ కూడా చెప్పినవాడు భగత్‌సింగ్‌.

          ‘‘సోషలిజం స్వప్న సీమ కానెకాదు నిజం సుమీ

           ఆకలంత సహజమదీ అన్నమంత అవసరమదీ’’

          అని విద్యార్ధి – యువజనులకు ఆశయాన్ని అందించి వెళ్ళిన భగత్‌సింగ్‌ను లోతుగా అధ్యయనం చేద్దాం. మనకాలపు పరాధీన ఆర్ధిక రాజకీయ పరిస్థితులకూ, మతోన్మాద పూరితమైన, కుల వ్యవస్థతో కుళ్ళి కంపు కొడుతున్న సామాజిక పరిస్థితులకూ, మహిళల పాలిట నాగులకోనగా మారిన నేటి పతన సాంస్కృతిక సమాజానికీ మన అవగాహనను అన్వయించుకుని….. సామాజిక ఉద్యమకారులుగా మనల్ని మనం మలుచుకోవటానికి భగత్‌సింగ్‌ నుండి స్పూర్తిని పొందుదాం.

          భగత్‌సింగ్‌ అర్ధంలో దేశభక్తి అంటే సామ్రాజ్యవాదాన్నుండి దేశాన్ని విముక్తి చేసే కృషి సల్పటం! సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు లొంగటమంటే – దేశ ద్రోహమే !!

          భగత్‌సింగ్‌ అర్ధంలో… గాలిలో దీపంలా మారిన నేటి సామాజిక జీవితాన్ని సమూలంగా మార్చటానికి మన మన ప్రజా ఉద్యమ రంగాలలో నిబద్ధతతో కృషి సల్పటమే విప్లవం. విద్యార్ధి యువజనులు, తాము  చైతన్యవంతులై కార్మిక – కర్షకులలో విప్లవ చైతన్యాన్ని నింపటానికి అంకితం కావటమే నిజమైన త్యాగం.

          భగత్‌సింగ్‌ బోధనలను అధ్యయనం చేద్ధాం!

          భగత్‌సింగ్‌ ఆశయాలను అవగాహన చేసుకుందాం!

          భగత్‌సింగ్‌ మిగిల్చి వెళ్ళిన విప్లవ కర్తవ్యాలను పరిపూర్తి చేద్దాం!

          అందుకు అంకితమయినవారే భగత్‌సింగ్‌కు నిజమైన వారసులుగా గుర్తిద్దాం!!

12-11-2015

admin

Related Posts

leave a comment

Create Account



Log In Your Account