– పల్లిపట్టు
ప్రదర్శించడం బాగానే వుంటాది
అన్నీ అంగట్లో సరుకైన కాలంలో
అన్నిటికీ అమ్ముడుపోవడం అలవాటైన రోజుల్లో
దేన్నైనా పేరుపెట్టిపిలిచి
పెద్దపెద్ద మాటల్లో పొగిడి
ప్రదర్శించడం గొప్పగానే వుంటాది
రంగురంగుల బొమ్మలాటనో
రకరకాలబురిడీల గారడీ మాటనో
నలుగురు మెచ్చుకునేలా
నాలుగు రూకలు మూటకట్టుకునేలా
నాటకాన్ని ప్రదర్శించడం నాటకీయంగానే వుంటాది
లోపాలు కనిపించకుండా
దీపాల వెలుగులో నటించే ముఖాలమై
నవ్వో ఏడుపో పులుముకుని
దీపంచుట్టూ పేడబురగలా తిరిగే వీరభక్తినో
ఏ దేముడేమీ చేయలేని రోగభయాన్నో
వొంటినిండా కప్పుకుని
ఇళ్లముందు ప్రదర్శించడం బలేగానే వుంటాది
చూరుకిందో
వసారాలోలో
జిగేల్మంటూ కులికే వరండాలోనో
అద్దాలుపొదిగిన అంతస్తుల భవంతుల బాల్కనీల్లోనో
ఎదో ఒకటి ప్రదర్శించడం బ్రహ్మాండంగానే వుంటాది
ఇల్లూ వాకిలున్నోడూ
ఇంటిలో కాలు బయటబెట్టకుండా
మూడుపూటలా ముద్దపై చెయ్యేసి
ఏదైనా పైకెత్తి నలగరిలో చూపెట్టి
చెప్పట్లు కొట్టించుకోవడం చాలా బాగానే వుంటాది
చెత్తకుప్పల తావా
మురుగు కాల్వల వొడ్డున
జుమ్మని మోగేదోమల వంతపాటని
మూగిన ఈగలకింద దిక్కులేని శవాన్ని
ఉరిసే ఇళ్లకాడా
కురిసే కన్నీళ్ల ఆకాశం కిందా
ముడ్డిమీద గుడ్డలేని నగరాల వంతెనలు
నెత్తిన నీడలేని దేశదిమ్మర దారులను కూడా
దేశం బొమ్మగీసి బాగానే బాగానే ప్రదర్శించవచ్చు
ఎన్ని ప్రదర్శన్లు చూల్లేదని
ఎన్ని ప్రదర్శనలు కాలేదని
అలవాటైపూడ్సిన ప్రదర్శనలు కదా
మరీ అంత వెగటుగావులే…
ఖాళీ చేతులతో
కాలుతున్న పేగులతో
నగరాలు విసిరేసిన రోడ్లకి వారగా
మిణుకు మిణుకుమంటున్న మన్నుదీపాలను
బతుకెండిపోతున్న బహుముఖలా వొత్తులను
చేతులు పైకెత్తి
చేయి చేయి కలిపి తాళం వేస్తూ
భజనపాటగా ప్రదర్శించడం బాగానే వుంటాది
ఏదైనా ప్రదర్శించడం బాగానే వుంటాది.
*** *** ***