117వ సంచిక, మే 1991
మేడే పై మోహన్ వేసిన చిత్రం ముఖచిత్రంగా వెలువడిన ఈ సంచికలో మేడేపై రాసిన సంపాదకీయాన్ని ‘‘ప్రజారచయితలూ, కళాకారులూ కష్టజీవులకు అండదండలుగా నిలబడి వారి లక్ష్య సాధనకు ఆలంబనగా రూపొందాలి. మరొకసారి మేడే నిర్దేశిస్తున్న కర్తవ్యం ఇదే!’’ అంటూ ముగించారు. దాదా హయత్ రాసిన ‘మసీదు పావురం’ కథ; రామతీర్థ వ్యంగ్య రచన, ‘బ్యాలటోపాఖ్యానం’; జాన్ వెస్లీ రచన ‘సామ్రాజ్యవాదం – ప్రసార సాధనాలు’; ‘మతతత్త్వం – మహిళల జీవితం’పై కాత్యాయని విద్మహే, జ్యోతిరాణి, శోభలు సంయుక్తంగా రాసిన వ్యాసం కాక కె. వెంకట్రామయ్య ‘మొగ్గ మిరుగులు’పై సమీక్ష ఈ సంచికలో ప్రచురించారు.
జొన్నాదుల అప్పారావు, ‘ఎన్నికలొస్తున్నాయి’ శాంతికుమార్, ‘మేడే’; అరణ్యకృష్ణ ‘ద్వేష చైతన్యం’, భాస్కర్ జాధవ్ మరాఠీ కవితకు సూర్యసాగర్ అనువాదం – కవితలు దీనిలో వున్నాయి. రాజశేఖర్ ‘సిక్కోలు అమరవీరుల’పైనా, మతతత్త్వంపై రాజేంద్ర పాటలు రాశారు. మతతత్త్వవాదుల ఆంక్షలు – నిషేధాలుపై ఒక ప్రత్యేక వ్యాసం – ఆంక్షలు – నిషేధాలు శీర్షికలో ప్రచురించారు. ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కవి మూసా జలీల్ గురించి ఛాయరాజ్ వ్యాసం రాశారు. బెజవాడలో గూండాల గుంపుల సంస్కృతినీ, వారి ఆగడాలనూ ఖండిస్తూ UCCRI(ML) నగరశాఖ వేసిన కరపత్రం ‘మనిషిని మనిషి చంపుకునే ఆటవిక సంస్కృతి మనకొద్దు’ అనే కరపత్రాన్ని ‘కరపత్రాలు – కదిలేచరిత్ర’ శీర్షికలో ప్రచురించారు. రాల్ఫ్ ఫాక్స్ ‘నవల – ప్రజలు’కు నాలుగో అధ్యాయం కొత్తపల్లి రవిబాబు అనువాదం కొనసాగింది. చైతన్యవాహినిలో వరంగల్లు, పొన్నెకల్లు, సభల వివరాలూ, కన్నడంలో ‘అయోధ్యలో రావణకాష్టం’ పుస్తకం విడుదల వార్తలూ వున్నాయి. ‘స్వీకారం’లో 9 పుస్తకాల వివరాలిచ్చారు. 1/8 క్రౌన్‌లో 84 పుటలు. వెల : రూ. 4/-