శ్రీ ఆంజనేయం… ప్రసన్నాంజనేయం…

శ్రీ ఆంజనేయం… ప్రసన్నాంజనేయం…

– శంకరం

          ‘‘మాది తెనాలే…. మీది తెనాలే…. అహ మాది తెనాలే….’’

          ‘‘యేట్రా బామ్మర్దీ వడదెబ్బ తగిలిందేటి అలా ఊగిపోతన్నావ్‌?’’

          ‘‘ఊగిపోడం కాదురా…. ఆనందం…. ఆవేశం…. ఉచ్చాహం….’’

          ‘‘దేనికిరో అంతుత్సాహం!’’

          ‘‘దేనికేట్రా పిచ్చిమొకమా? ఆంజినేయుడు తిరప్తిలోనే పుట్నాడట….. పై పెచ్చు మన్తెలుగోడట…. ఆనందంగాకింకేట్రా!’’

          ‘‘వారినీ! దేవుళ్ళకి కూడా భాష, ప్రాంతం లాంటివన్నీ అంటగడతన్నార్రా…. ఇంతకీ ఆంజినేయుడు తెలుగు మాట్టాడినట్టు మనోల్లకెలా తెలిసిందో?’’

          ‘‘వారి మాలోకం, తిరప్తిలో పుట్టినోడు తెలుగు మాట్టాడకపోతే మరేటి మాట్టాడతాడ్రా?’’

          ‘‘అదేరా నానూ అంటన్నాను…. ఆంజనేయుడు తిరపతిలోనే పుట్టినాడని ఈల్లెట్టా కనిపెట్నారని…..?’’

          ‘‘అదేట్రా బావా, అట్టాగంటావ్‌…. శాస్తరాలు తిరగేసి, పురానాలు మరగేసి…. నాలుగు సమ్చరాలు కిందా మీదా అడితే తెలిసొచ్చినాట కదా…. నీకేవీ తెలవనట్లు నన్నడుగుతావేట్రా?’’

          ‘‘అసలికీ…. అనుమంతుడు సంగతి మనకి దేన్నిబట్టి తెలిసిందిరా?’’

          ‘‘దేన్ని బట్టేటి…. రామాయనం బట్టి!’’

          ‘‘కదా! రామాయణం ఎప్పుడు జరిగిందీ, రాముడు ఎప్పుడు రాజ్జెం సేసినాడో నీకు దెల్సురా?’’

          ‘‘అబ్బో! అదెప్పటి మాట…. అదేదో దాపరుగంలోనో, ఇంకెప్పుడో కదా….’’

          ‘‘ద్వాపర యుగం కాదురా…. త్రేతాయుగంలో! త్రేతాయుగవంటే ఎప్పుడో దెల్సా? పది లక్షల సవచ్చరాల క్రితం….’’

          ‘‘అబ్బా! అసలప్పటికి బూమ్మీద మడుసులున్నారంతావా?’’

          ‘‘నాకు దెల్సి మనుసుల గురించి తెల్సి మహా అయితే పది, పదిహేనువేల ఏల్లవుద్దిరా….’’

          ‘‘అట్టైతే రావులోరు అయోజ్జలో పుట్నారని ఎట్టా సెప్పేరంటావ్‌?’’

          ‘‘యెట్టా సెప్పేరో ఓ పక్కనెడదాం. అయోద్యే రాముడు పుట్టిన భూవని సెప్పి, హిందూ జనాల్ని రెచ్చగొట్టి అక్కడున్న మసీదుని నేలమట్టం చేసీసి దేశాన్ని రావణకాష్టం చేస్సేరు…. గ్నాపకవుందా నీకు?’’

          ‘‘అవున్రా బావా, అప్పుడే అనుకుంతాను ఆల్తాలూకా ఓ ముసిలాయన రదయాత్ర కూడా సేసినట్టున్నాడు….’’

          ‘‘దేశవంతా గగ్గోలైపోయింది గదా…. మత ఘర్షణలు కూడా జరిగాయి’’

          ‘‘సివరాకరికేటయింద్రా…. కోరుటు కూడా జెజ్జిమెంటిచ్చీసింది గదా, గదే రావుడు పుట్టిన బూవనీ, అక్కడే గుడి కట్టుకొండని…. మరి దానికేతంతావ్‌?’’

          ‘‘అలగివ్వకేటిసేత్తార్రా? దేశం మొత్తం నూటికెనబైమంది హిందువులైనప్పుడు. అలగివ్వకుండా ఇంకోలాగిస్తే దేశం మళ్ళీ మంటల్లో మాడిపోయుండేది….’’

          ‘‘వురేయ్‌ బావా నువ్వొక ఇందువుడయ్యుండీ ఇట్టా మాట్టాడ్డం బానేదురా….’’

          ‘‘అలగొచ్చినావా…. మొన్న పరిదేశమ్మ పండగ మర్నాడు మా సెల్లికి పేనాలమీదికొత్తే అర్దరాత్రప్పుడు నీకు ఆటో ఎవుడు కట్టేడ్రా…?’’

          ‘‘ఏసుగాడూ….’’

          ‘‘కదా, ఏసుగాడెవడు? కిరస్తానపోడు.’’

          ‘‘మరి పండగనాడు గరికోల్ల కల్లాల్లో తారాజువ్వడి గడ్డికుప్పలు తగలడుతుంటే ఆర్పనీకొచ్చిందెవుల్రా?’’

          ‘‘ఎదుటి వాసలో వున్న పీరు సాయిబు, ఆల్ల పిల్లలూనూ….’’

          ‘‘ఆల్లెవుర్రా? సాయిబులన్నువ్వే అన్నావ్‌….’’

          ‘‘ఇప్పుడియ్యన్నీ ఎందుకురా? నానేటడిగేను? నువ్వేటి సెప్తున్నావ్‌?’’

          ‘‘నువ్వడిగిన కాడికే వత్తన్నాన్రా…. ఈ దేశంల హిందువులొక్కరూ ఆల్లమ్మటాల్లు బతికీడం నేదు. సాయిబులూ, కిరస్తానపోల్లు, మనం అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లా బతుకుతున్నాం రా….’’

          ‘‘ఇప్పుడు కాదన్నదెవర్రా, బావూ?’’

          ‘‘నువ్వు హిందువ్వి కాదా అంటే…. హిందువుల పని రాముడెక్కడ పుట్టేడు? సీతనెప్పుడు పెళ్లి సేసుకుండు? లక్ష్మణాస్వామి నిజంగా పద్నాలుగేళ్ళు తొంగోకుండా ఉన్నాడా? రాముడిదేకులం? అనుమంతుడి తోక ఎంత పొడుగుండీది? అతగాడు తెలుగోడా, మెద్రాసోడా? ఇయ్యట్రా మనవాలోసించాల్సింది….?’’

          ‘‘మొన్ననే గదట్రా శీరావనవమి సేసి ఆంజినేయుడిక్కూడా దండాలెట్టాం. మనూల్లో కూడా గుడి కట్నాం…. నువ్వు కూడా డబ్బులిచ్చినావ్‌?’’

          ‘‘బామ్మర్దీ, నానూ ఈ ఊరోడ్నేగా…. నలుగురితో పాటే నానూను. దేవుడ్నెట్టుకునీది ఆపదొచ్చినప్పుడు కాపాడతాడని మొక్కుకునీకి, మంచి మడుసులుగా ఉంచమనీకి….’’

          ‘‘అంతే అనుకో, గానీ….’’

          ‘‘వురే, నేనో ప్రశ్నడుగతాన్సెప్పరా? కరెట్టుగా శీరామనవమి పండగనాటికే అనుమంతుడెక్కడ పుట్టేడు? అనుమంతుడిదేబాష? అని సడెన్‌గా ఇప్పుడే పెకటించడవెందుకురా, సెప్పు సూద్దాం?’’

          ‘‘ఇది మరీ బావుంది…. ఇన్ని సవచ్చరాల్నుండీ నానా అగసాట్లూ పడి కనిపెట్టి, రావులోరి పండగరోజే రాంబంటు గురించి ఇవరాలు బయటెట్టేరు…. దానిక్కూడా పీక్కుంటావేట్రా?’’

          ‘‘మగనెమలి కన్నీళ్ళు తాగితే ఆడనెమలికి గర్భం వస్తాదట, నమ్ముతావా? మనిషి సెమట సుక్కల్ని సేపలు మింగితే దానికి గర్భం వచ్చి మనుషులు పుడతారట. సముద్రం ఒడ్డున నిలబడి సూర్యుడికి దణ్ణవెట్టి, కొన్ని మంత్రాలు సదివితే గర్భం రాకుండానే పిల్లలు పుట్టెస్తారట. ఇంటన్నావా?’’

          ‘‘ఇంటన్నాను గానీ ఇయ్యన్నీ ఇండానికి ఆచ్చెర్యంగానే వున్నాయి. కాకపోతే….’’

          ‘‘నీ బోటోల్లే దేశం నిండా వుండబట్టి గద్దెమీదున్నోల్ల ఆటలన్నీ సాగుతున్నై.’’

          ‘‘ఎకసెక్కాలకేంగానీ బావా, అరదమయ్యీనాగ సెప్పరాదూ?’’

          ‘‘నానిందాకట చెప్పాను సూడు, అయోధ్యలో మసీదుని కూలగొట్టేసారని. దాన్నిరగ్గొట్టింది హిందూమతాన్నుద్దరిత్తావని ఓట్లు దండుకునే ఇప్పుడున్న ప్రధానమంత్రిగారి పార్టీ. ఆ టయానికి దేశాన్ని పరిపాలిస్తంది మన తెలుగోడు నరసింహారావు. ఆయన్ది కాంగ్రెస్‌ పార్టీ….’’

          ‘‘ఆగాగు…. ఇందూ పార్టీవోడు సాయిబుల మసీదుని ఇరగ్గొట్టెత్తుంటే తెలుగోడు, ఎగస్పార్టీవోడు సూత్తా ఎందుకూరుకున్నాడంటావ్‌? ఆయనగారు కూడా ఇందువే గాబట్టి. అదిగదిరా కోపరేసనంటే అట్టుండాల!’’

          ‘‘పూర్తిగా వినకుండా మధ్యలో ఆపితే ఇలాంటి అర్ధాలే వస్తాయి. ఇందాకట్నుండి అనుమంతుడు మన తెలుగోడు…. తెలుగోడు అని గెంతుతున్నావు కదా! ఆ తెలుగోడైన నరిసింహారావుగారి టైమ్‌లోనే ఇప్పుడు మన తెలుగోళ్ళంతా నెత్తీ నోరూ మొత్తుకుంటా రోడ్లమ్మట ధర్నాలు సేసుకుంటా, ఎర్రని ఎండల్లో కూడా తిరుగుతున్నారు కదా – అదేరా స్టీల్‌ ప్లాంటు ప్రైవేటు చేసెస్తున్నారని – ఆ ప్రైవేటీకరణ ఆయనగారి టైమ్‌లోనే మొదలయ్యింది. అప్పట్నుండే దేశంలోకి చైనా, జపాను, కొరియా, అమెరికా దేసాల్నుండి సరుకులు మన దేశంలోకి వరదలా వచ్చి పడ్డం మొదలయ్యింది. ప్రైవేటు బ్యాంకులు, విదేశీ కంపినీలు వందలు, వేలు మన్దేశంలో యాపారాలెట్టుకొని లక్షల కోట్ల లాభాలు అట్టుకెళ్ళిపోడం మొదలైంది. ఇయ్యన్నీ సామాన్య పెజానీకం కళ్ళల్లో పడకుండా, ఈటికి ఆల్లెవరూ అడ్డుపడకుండా ఉండాలంటే ఏం సెయ్యాల? దేశవంతా అట్టుడికిపోయేలా ఏదో ఒకటి జరగాల. అదే మసీదుని కూలగొట్టడం – దానికంటే ముందు రధయాత్ర ఇవన్నీ దేశ ప్రజల్లో మతపరంగా చిచ్చు పెట్టడానికే. జనం కొట్టుకు ఛస్తుంటే వాళ్ళకి నచ్చిన పనులు వాళ్ళు చేసుకుపోతారన్నమాట. హిందువుల కోపరేషన్‌ కాదు – దేశాన్ని  పీక్కుతినేవాళ్ళ మధ్య కోపరేషన్‌ – అర్ధమయ్యిందా?’’

          ‘‘రావులోరికి గుడి కడతావన్జెప్పి ఇంతింత గోరాలు సేసినారా? బిటీసోడు సేసిందే ఈల్లూ సేత్తన్రన్నమాట – ఇడగొట్టేసి పాలించడం – అమ్మ దొంగనాయాల్లారా, ఎంత గుండిల్దీసిన మొనగాల్రా మీరు! అద్సరేగాని బా….  మరిప్పుడు  ఆంజినేయుడి సంగతి ఎందుకు దీస్కొచ్చారంటావ్‌?’’

          ‘‘అలగడిగీవ్‌ బాగుంది!

          మన్లాగ ఇద్దరు, ముగ్గురు కూకోని మాట్టాడుకోనీకి కూడా ఇప్పుడు బయపడతన్నాం…. దేనికి?’’

          ‘‘ఇంకేటి, కరోనా అమ్మోరు…. పెపంచకాన్నే సుట్టబెట్టేత్తంది…. టివీలో శవాల్ని కుప్పలుగా తగలెయ్యడం సూత్తుంటే ఎన్నుబావులోంచి సలి పుట్టుకొత్తుందిరా….’’

          ‘‘ఇప్పుడిదే దేశాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన సమిస్య. కిందటేడు వచ్చిన కరోనా అన్ని రకాల పెజల్నీ ఎంతలా కిందా మీదా సేసిందో సేసేం. లక్షల కొద్దీ పయ్యూర్లు పోయి పన్లు సేసుకునీవోల్లు మగోల్లు, ఆడోల్లు, సిన్నపిల్లల్తో  సహా మైళ్ళు మైళ్ళు నడిసి నడిసి మధ్యలోనే సనిపోయినోల్లు…. ఏరోజు పేపరు తీసినా, టీవీ చూసినా ఇదే కనబడేది. దానికి తోడు ఆసుపత్రుల్లో మందు నేకపోడం, బెడ్లు సాలకపోడం, వెంటిలేటర్లు దొరక్కపోడం, ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలకి లక్షలు వసూలు సెయ్యడం సూసేం. రెండోసారి వత్తాదని పెద్ది పెద్దోల్లు సెప్పారు, మనోల్లకీ తెలుసు. మరి ఏవైనా నిరుడికీ, ఇప్పటికీ ఈ ఆస్పత్రులు, మందులు, బెడ్లు, టీకాలు సరిపోతన్నాయా? అప్పటికంటే ఇప్పుడు కేసులు విపరీతంగా పెరిగిపోతన్నై. రోజుకి 3 లక్షల కేసులంటే…. నాకు తెలిసి ప్రపంచంలో మనమే ఫస్టు. కనీసం శవాల్ని తగలెట్టనీకి కూడా క్యూలో గంటలు గంటలు నిలబడాల్సొస్తంది. ఇక టీకాల కోసం, ఆస్పత్రుల్లో సేర్చుకోడం కోసం పాపం జబ్బుపడ్దోల్లు, ఆల్ల బందుగులూ ఎన్ని పాట్లు పడతన్రో….’’

          ‘‘నిజవేన్రా బా…. బెమ్మంగార్సెప్పినట్టు సూత్తుంటే కలియుగం ముగిసిపోయీనాగుంది. మాయదారి జీవం పెజల్ని సంపుక తినేత్తుంటే పాపం గవుర్మెంటు మట్టుకు ఏటి సేత్తాదిరా?’’

          ‘‘ఏటి సేత్తాదా? వేల కోట్లు కర్సెట్టి విగ్రహాలు కట్టిత్తాది, లక్షకోట్లు పెట్టి బులెట్‌ ట్రైను ఏయిత్తాది. దేశానికెంత పేరు! పెపంచంలో అతి ఎత్తైన విగ్రహం మా దేశింలోనే వుందంటే మిగిలిందేశాల్లో మనకెంత గౌరువం?’’

          ‘‘పెపంచకంలో లేనియ్యి మందేశింల వున్నాయంతే మనకి గౌరువం కాదేట్రా, అలగంతావేటి?’’

          ‘‘అవున్రా…. పెపంచకం మొత్తం మీద మా దేశంలో కరోనా కేసులెక్కువ, మా దేశంలోనే కరోనా చావులెక్కువ. మేం గొప్పలకి పోయి ఇతర దేశాలకి టీకాలు, మందులు అంపిత్తాం, మా దేశం జనాభాని సంపిత్తాం. ఇదేనా గొప్ప? ఇదేనా గౌరువం? సెప్పరా…. సెప్పు!’’

          ‘‘నిజవేన్రా బా…. నేనంత దూరం ఆలోసించనేకపోయేన్రా…. పెజ పేనాల కంటే ఏదీ ఎక్కువ కాదు కదరా!’’

          ‘‘నీ నోటమ్మట ఈ మాట రావాలనేరా నానిందాకట్నుండీ సూత్తన్నాను. ఏ దేశవైనా ముందు ప్రెజల ఆరోగ్యం సూడాల్రా. అంటే పెజలందరికీ కడుపునిండా తిండి దొరుకుతుందా, శుభ్రమైన నీరు తాగుతున్నారా, ఇళ్ళు, వీధులు అన్నీ శుభ్రంగా వుంటన్నాయా, తగినన్ని ఆసుపత్తుర్లు, డాక్టర్లు, మందులు ఉన్నాయా…. ఇయ్యి కదరా ముఖ్యం. యవుసాయం గిట్టుబాటుగాక లక్షలమంది మన రైతులు సచ్చిపోతున్నార్రా. మన్సిప్పుడు రైతులు బలవంతపు సావులు ఎప్పుడైనా సూసేంరా?’’

          ‘‘కరెస్టుగా సెప్పేవురా! సొమ్ములున్నోల్లూ, లేనోల్లూ అందరూ పైవేటాస్పత్తుర్లికే పోతన్నార్రా. పొలాలు తాకట్టెట్టుకోని, పుస్తులు తాకట్టెట్టుకోని వయిద్యం సేయించుకుంతన్నారు. ఇంకోపక్క పప్పులు, కూరలూ, గేసూ, పిట్రోలూ  అన్ని దరలూ పాపం పెరిగిపోతన్నట్టు పెరిగిపోతన్నై. నువు సెప్పిందాన్ని బట్టి సూత్తే విప్పుడు ఆంజినేయ దండకం మొదలెడతారేవోన్రా.’’

          ‘‘మనకంటే చిన్న చిన్న దేశాలు సరైన సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకున్న కారణంగా అక్కడ కేసులు, మరణాలు బహు తక్కువగా ఉన్నాయి. మహమ్మారి బారి నుండి తేలికగా బయటపడ్డాయి. ఇక్కడ టీకాలకు మూడు రకాల రేట్లు పెట్టారు. ఒకపక్క టీకాలు, మందులు చాలడంలేదు. మరోపక్క ప్రైవేటు ఆస్పత్రుల్లో రేట్లు పెంచుకోమంటున్నారు – ఇదీ మన దేశం పరిస్థితి.’’

          ‘‘బావా! అద్సరేగానీ ఈ మందుషాపులూ, బార్లూ, సినిమాహాల్లూ, గుళ్ళూ, గోపురాలూ అప్పుడు మూస్సీరు గదా మరిప్పుడు ముయ్యనేదేం? ఏటంతావ్‌?’’

          ‘‘కేసులు పెరిగితేనే కదరా ప్రైవేటు కంపినీలు తయారుచేసే టీకాలు, మందులు ఎక్కువగా అమ్ముడుపోయేది.  ఆ పెద్ద పెద్ద కంపినీలే ఈరోజు దేశాల్ని నడుపుతున్నాయి. కిందటేడు డిల్లీలో ఓ ఐదారువేల మంది సాయిబులు ఒకచోట సమావేశాలు పెట్టుకున్నారు. దాని వలన దేశంలో చాలామందికి కరోనా సోకిందని దేశ నాయకులు, హిందూ మత సంస్థలూ గగ్గోలు పెట్టేసారు. ఇప్పుడేమో రెండవ విడత కరోనా పరిస్థితి ఘోరంగా ఉంటుందని తెలిసి కూడా ఈ పెద్దలు హరిద్వార్‌లో లక్షలాదిమంది చేరడానికీ, వేలల్లో కేసులు రావడానికి తగిన ఏర్పాట్లు చేసారు. బాగుంది కదూ?’’

          ‘‘అయితే బావా, ఇవన్నీ పెద్దలందరికీ తెలిసే జరుగుతున్నాయి కదా! మరి మన్లాటోల్లకి దిక్కెవర్రా?’’

          ‘‘అందుకే కదరా ఈ మేళాలు, ఆంజనేయుళ్ళూ, దండకాలునూ!!!’’

admin

leave a comment

Create AccountLog In Your Account