ముప్ఫై ఏళ్ళక్రితం ప్రజాసాహితి

ముప్ఫై ఏళ్ళక్రితం ప్రజాసాహితి

          ‘చీకటి ఖండంపై మండే సూర్యుడు’ ముఖచిత్రంతో 1990 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మూడు నెలలు కలిపి ఒకే సంచికగా ప్రజాసాహితి వెలువడింది. “మా బాధలు మాకు నేర్పిన పోరాటం యిది” అనే శీర్షికతో వచ్చిన సంపాదకీయంలో దక్షిణాఫ్రికా నల్ల ప్రజల నేత నెల్సన్ మండేలాను 26 సం||ల తర్వాత విడుదల చేయటాన్ని పురస్కరించుకొని దక్షిణాఫ్రికాలో సాగుతున్న దోపిడీ విధానాలు, నల్లజాతి ప్రజల పోరాటాలను వివరించారు. మండేలాకు నిండు మనసుతో ప్రజాసాహితి స్వాగతం పలికింది. ‘అతని అసలు పేరు అలజడి’ అన్న వ్యాసంలో నెల్సన్ మండేలా జీవిత చరిత్రను తెలియచేశారు. ‘ఆంక్షలు-నిషేధాలు’ శీర్షికలో – దక్షిణాఫ్రికాలో రచయితలపై, పత్రికలపై శ్వేతజాతి ప్రభుత్వ ఆంక్షలు గురించి వివరించారు. ‘వివేచన’ శీర్షికలో బులేలో జమానే రాయగా రహి అనువాదం చేసిన ‘దక్షిణాఫ్రికాలో కథా సాహిత్య పరిణామమూ – వికాసం’ వ్యాసాన్ని ప్రచురించారు. ‘దేశ దేశాల్లో…..’ శీర్షికలో ప్రజాకళాకారిణి, అమెరికన్ నల్లజాతి గాయని ‘ట్రెసీ చాప్ మాన్’ ప్రజా కళా జీవితాన్ని వివరిస్తూ కె. సంజీవి రాసిన ‘బలమైన నల్లగొంతు ట్రెసీ చాప్ మాన్’ వ్యాసాన్ని, ఆమె పాడిన ‘చౌరస్తా’ గేయాన్ని, ‘తక్షణమే స్వేఛ్చ’ అంటూ నెల్సన్ మండేలాకు అంకితమిస్తూ ఆలపించిన మరో గీతాన్ని అందించారు. ‘నల్ల కలువలు’ శీర్షికలో ‘జబులో ఎస్ డి బిలీ’ రాసిన ‘ఫిడేలు రాగం’ కథను అయోధ్యా రెడ్డి అనువదించారు. ‘అంతర్మధనం’ శీర్షికలో దక్షిణాఫ్రికా కవి ‘డెనిస్ బ్రూటస్’ అనుభవాలు ‘కొండ లోంచి పగటి ఆగ్రహం బుసబుస మంటోంది’ అంతర్మధనాన్ని ఖాదర్ మొహిద్దీన్ అనువదించారు. ‘కవితాఝరి’ శీర్షికలో డెనిస్ బ్రూటస్ రాసిన ‘శిథిలాల మీద సూర్యుడు’, చిల్ చినీ కోకర్ రాసిన ‘కవిగా నా దేశంలో’, డేవిడ్ డియోప్ రాసిన ‘నా తల్లికి’, బ్రేటన్ బ్రేటన్ బా రాసిన ‘ఓ గెరిల్లా మిత్రుని కోసం’, చికాయు థామ్ సీ రాసిన ‘ఉనికి’ ‘సన్నిధి’, లియోపార్డ్ సెంఘోర్ రాసిన ‘ఉపదేశం’, జోసెఫ్ రేబరివేలో రాసిన ‘దానిమ్మకాయ’ – దక్షిణాఫ్రికా కవుల కవితలున్నాయి. నోబెల్ సాహిత్య బహుమతిని అందుకున్న మొదటి ఆఫ్రికా జాతీయుడు నైజీరియాకు చెందిన ఓలె సోయింకా. నోబెల్ బహుమతిని స్వీకరిస్తూ స్టాక్ హోంలో 1986 డిసెంబర్ 8న ఇచ్చిన ఉపన్యాసంలోని కొన్ని భాగాలను ‘ఈ గతం తన వర్తమానాన్ని నిర్దేశించాలి’ అనే శీర్షికతో అందించారు. ‘కవిత’ శీర్షికలో ‘మనందరం నల్లవాళ్ళమే’ – కవితను కొతపల్లి రవిబాబు రాశారు. అవతార్ సింగ్ పాష్ మూడవ వర్ధంతి (మార్చి 23) సందర్భంగా ‘కవితా నివాళి’గా పాష్ మిత్రుడు అజ్మీర్ రోడ్ (కెనడా) 1988లో వాంకోవర్ లో జరిగిన జాతీయ పుస్తకోత్సవం కవి సమ్మేళనంలో చదివిన కవితను కొతపల్లి రవిబాబు అనువదించారు. ‘బలియోపాల్ కథలు’లో భాగంగా ఉదయ్ రాసిన ‘మొదటి బుధవారం’ కథ, ‘కరపత్రాలు – కదిలే చరిత్ర’ శీర్షికలో ‘సాహిత్య అకాడమీలో సాగుతున్న దురాచారాలు’ మీద ‘రైటర్స్ ఫోరం’ కరపత్రాన్ని, ‘రేఖాచిత్రాలు’ శీర్షికలో అక్టోబర్ విప్లవ వెలుగులో రష్యన్ రేఖాచిత్రాలను ప్రతి నెలా ఒకటి ప్రచురించటంలో భాగంగా 1919లో అలెగ్జాండర్ పెట్రోల్ అనే చిత్రకారుడు రూపొందించిన ‘యూరల్స్ ని రక్షించండి! ముందుకు సాగిపోండి’ అనే సందేశాన్నిచ్చే చిత్రాన్ని ముద్రించారు. ‘రాల్ఫ్ ఫాక్స్ గురించి – ఆయన స్పెయిన్ నుంచి రాసిన లేఖాంశాలు – యుద్ధరంగంలో ఆయన వీరోచిత మరణం’ అనే వ్యాసం, నెల్సన్ మండేలాతో పాటు యావజ్జీవ కారాగార శిక్షకు గురయిన ఎనిమిదిమందిలో భారతీయుడైన అహ్మద్ మహమ్మద్ కత్రడా గురించి వివరిస్తూ ‘కేతే’ కత్రడా – నెల్సన్ మండేలా కుడిభుజం’ వ్యాసాన్ని ప్రచురించారు. వెనుక అట్ట మీద 26 సంవత్సరాల జైలు జీవితం తర్వాత విడుదలై, ఆఫ్రికన్ నేషన్ కాంగ్రెస్ డిప్యూటీ ప్రెసిడెంట్ గా ఎన్నికయిన 71 సం||ల నెల్సన్ మండేలా చిత్రంతో పాటు 1976 జూన్ 16న ‘బంటూ విద్యా విధానానికి’ వ్యతిరేకంగా ఉద్యమించిన దక్షిణాఫ్రికా విద్యార్థి యువతరంపై పోలీసులు కాల్పులు జరపగా 13 సం||ల హెక్టర్ పీటన్ సన్ అనే బాలుడు మృతిచెందాడు. అతని మృతదేహంతో సహాధ్యాయులు, అతని చెల్లి క్రోధంతో రోదిస్తూన్న చిత్రాన్ని ముద్రించారు.

admin

leave a comment

Create Account



Log In Your Account