– డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు
నాగరికత పేరుతో ప్రబలుతున్న పరాయీకరణకు దూరంగా కొండల్లో కోనల్లో బతకుతూ, స్వేచ్ఛా వాయువుల్లో పరిభ్రమిస్తూ, స్వచ్ఛ జీవన స్రవంతిలో ఊగితూగే ఆదివాసులు అరచినా, అరచేత్తో చరిచినా కృతకం కాని నాదం కొండలు దద్దరిల్లేలా ప్రతిధ్వనిస్తుంది. వారెన్నడూ లక్ష్య లక్షణాలు తెలిసి ఎలుగెత్తి పాడిన వారుకాదు. తాళ భరతం నేర్చుకొని లయలు మార్చి విన్యాసాలు పలికించడం తెలిసిన వారుకాదు. ఏ ఎండకా గొడుగు పట్టలేని స్వేచ్ఛా జీవులకు లాలనలూ, లావణ్యాలూ ఏం తెలుస్తాయి: అయినా ఆదివాసులు వ్యాపార సౌధాల్లో మాస్క్ మీద మాస్క్ తొడుక్కుంటూ కరుడుగట్టి జీవత్వం నశించిన శిలలు కాదు. ప్రకృతికి పరవశిస్తూ, అందులో భాగమై ఆనందాన్ని అనుభవిస్తూ శుద్ధ సౌందర్యం ఉట్టిపడేలా నాట్యం చేస్తారు. ఆదివాసులు ఆహ్లాదంతో గానం చేస్తే అది స్వచ్ఛసౌందర్య రాగమై ప్రతిధ్వనిస్తుంది. చెట్లల్లో పుట్టల్లో మూర్చనలు సాగి ప్రపంచాన్ని పరవశింపజేస్తుంది. అదే ఆనందంలో మెడకు తగిలించుకున్న డోళ్ళ మీద దరువేస్తే అది మేఘ గర్జనతో మమేకమై గంభీరనాదంతో కొండకోనల్లో ప్రతిధ్వనిస్తుంది. కొంచెం హేతుబద్ధంగా పుట్టుపూర్వోత్తరాలు ఆలోచిస్తే, నాగరికుల జీవనంలో ప్రధాన పాత్ర వహించే సంగీతానికి మూలమైన ధ్వనులన్నీ ఆదివాసుల జానపద సంగీతంలోనే ఉన్నాయనేది తెలుస్తుంది.
వర్గపోరాటంలో అగ్రత్వ ఆధిపత్య అవసరాల ఆక్రమణలో రాసుకున్న పురాణాలు పరిణామ జ్ఞానాన్ని విడిచిపెట్టి కుహనా ప్రమాణాలతో నమ్మిస్తూ సంగీతానికి, అందులోని వాద్యాలకీ కూడా సృష్టికర్తల్ని తయారు చేశారుగాని, నిజానికి ఆనందంలో ఆదిమానవుడు అరచిన అరుపులే సంగీతానికి మూలాలు. వేసిన అడుగులే నాట్యానికి పునాదులు. వైద్య, స్థాపక, పాలక, యుద్ధ విద్యలెలా అభివృద్ధి చెందాయో, అలాగే నిసర్గ సౌందర్య శోభితమైన నాద విద్య కూడా అభివృద్ధి చెందింది. సాహిత్యాన్ని ఎలా మార్గ ప్రమాణాలు చేర్చి రెండుగా విడదీసి ఒక వర్గాన్ని సామాన్యుడికి దూరంగా తీసుకెళ్ళారో, అలాగే సంగీతానికి కూడా మార్గ విలువలుకూర్చి ఒక భాగాన్ని వర్గ విద్యగా మార్చారు. ఆ రంగంతో ఆధిపత్య ధోరణితో వ్యవహరించడం మనం చూస్తున్న సత్యం ! ఆ నేపథ్యంలో రాసుకున్న శాస్త్రాలు పాండిత్యం మార్గ (Classical) సంగీతానికి ఆధారాలుగా నిలిస్తే, సమస్త ప్రకృతి, ఆ ప్రకృతిలో జనించే ధ్వనులూ దేశి (folk) సంగీతానికి ఆధారంగా నిలిచాయి. అయితే ప్రపంచంలోని ఏ జీవరాశి గాని, ఏ ప్రక్రియగాని పరిణామక్రమం నుంచి బైటపడలేవన్న సత్యాన్ని రుజువు చేస్తూ, ఎన్నెన్ని విభజనలు చేసినా అన్ని వైపులా అభివృద్ధిగతమైన మార్పులు జరుగుతూనే ఉంటాయి. మనిషి జీవనం ఏ దిశగా సాగుతుందో అన్నీ అటువైపే నడుస్తాయి. ఆ గమనానికి దేశ, ప్రాంత, వర్గ, వర్ణ భేదాలుండవు. క్రీ.పూ. 3000 సంవత్సరాలకు పూర్వం బాబిలోనియా ప్రాంతంలోని ‘ఉర్’ నగర శిథిలాల్లో లభ్యమైన ఒక తంత్రీవాద్యం భారతదేశంలోని తమిళనాడు ప్రాంతంలో బైటపడిన ‘యాళ్’ అనే వాద్యానికి చాలా దగ్గర పోలికలున్నాయి. ఆనాడు ఈ రెండు ప్రాంతాలకీ కనీస రాకపోకలు కూడా లేవు. ఇది చూసే కొందరు పరిశోధకులు ప్రపంచంలో ఒక కాలంలో జరిగే ఒక మార్పు ప్రాంతాన్ని బట్టి కొద్దిగా వేరుగా ఉన్నా ఒకే ప్రమాణంలో ఉంటుందని నిర్థారించారు.
నగర నాగరికతల మధ్య ఆయా ప్రాంత, మత, జీవన శైలులు చేరి వేరు వేరు మార్గాల్లో, వేరు వేరు పేర్లతో పిలువబడడం మార్గ సంగీతంలో చూస్తాం. ఉదాహరణకి అమీర్ ఖుస్రూ భారతదేశానికి వచ్చే వరకు భారతీయ సంగీతం ఒక్కటే. అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో ఖురాన్ చదవడం కోసం పర్షియా నుంచి వచ్చిన సంగీత పండితుడు అమీర్ ఖుస్రూ, గొప్ప ప్రయోగ శీలి. పర్షియన్ సంగీత మూలాల్ని భారతీయ సంగీతంతో మేళవించి హిందూస్తానీ సంగీతాన్ని రూపొందించాడు. ఉత్తర భారతంలో మహమ్మదీయ ప్రభువుల పాలన వల్ల హిందూస్థానీ సంగీతం బాగా అభివృద్ధి చెందింది. అసలు భారతీయ సంగీతం దక్షిణాదికే పరిమితమై కర్నాటక సంగీతం అనే పేరుతో ప్రసిద్ధమైంది. అలాగే అన్ని దేశాల సంగీత శాఖల్నీ గుర్తించవచ్చు.
ఇలాంటి కలోనియలిస్టిక్ (వలసవాద) స్పర్శ జానపద ఆదివాసీ సంగీతానికి అంటలేదు. కనుకనే ఒక దేశ ఆదివాసి సంగీతాన్ని మరోక దేశ అబారిజాన్ మ్యూజిక్‌కీ పెద్ద వ్యత్యాసం కనిపించదు. అలాగే వాద్య విధానంలోనూ పెద్ద తేడాలుండవు. విశ్వవ్వాప్త సాహచర్యం కనిపిస్తున్నా అది యాదృచ్చికమేగాని వ్యాపార దృష్టితో తెచ్చుకున్న అంటు జాడ్యం కాదు. అది మానవుని అంత:సృజన సామీప్యతకి సంకేతం. ప్రపంచీకరణ చోటు చేసుకున్నాకనే కాదు, మొదటి నుంచీ నాగరిక జీవనుల దృష్టి ఎందుచేతనో ప్రకృతి సిద్ధమైన సౌందర్య సంపద వైపు ఉండేది కాదు. అందరికీ అందని చోట తానుండాలనే స్వార్థ బుద్ధి మూలాలను గుర్తించి వారసత్వ సంపదని కాపాడుకోవాలన్న ఇంగితాన్ని కోల్పోతుంది. ఫలితంగానే ఆదివాసీ, జానపద సంగీత మార్గాలు కులాల, ఉపకులాలను దాటి రాలేక అక్కడే ఆగిపోయాయి. నిన్నటి తమ తమ మూలాలు గుర్తించలేని దశలోకి వెళ్ళిపోయిన సంగీత కళా రంగానికి ఈనాడు తన ఉనికినే కాపాడుకోలేని కాని కాలం ఏర్పడింది. ఈనాటి ఈ ప్రపంచీకరణ జీవన ప్రస్థానంలో రాగాలు భోగాలు ఎవరిక్కావాలి ? అందుకే సంప్రదాయ సంగీతం కూడా నగర మూలల్లో తలదాచుకుంటున్నది.
మరొకవైపు పల్లెలూ పొట్ట చేతపట్టుకుని పట్టణాల వైపు ప్రయాణిస్తున్న స్థితి. నగర నాగరికత పేరుతో విష సంస్కృతిని వ్యాప్తి చేస్తున్న దశ. రైతు నుంచి కూలివాడు వరకూ వ్యవసాయం నుండి గెంటివేయబడుతున్న అవస్థలో, జానపద ఆదివాసీ సంగీతం గురించి మాత్రం వేరుగా చెప్పాలా ? నశించి పోతున్న ప్రకృతిలో అడవి బిడ్డ ఆవాసానికే తావు దొరకని పరిస్థితిలో వారి ఆనందమెక్కడ? వారి సంగీతమెక్కడ ? అడవులు నరికి అంతఃపురాలు వెలసిన చోట ఏ వాదకుడు తనకు మొగిలి కాండం కావాలనీ, జింక చర్మం కావాలని, ఉడుం చర్మంతో కంజీరా మూసుకోవాలనీ అడగ్గలడు ? పొద్దంతా అపార్టుమెంట్ నిర్మాణంలో బొచ్చెలు మోసిన చేతులతో ఏ వాద్యం పలికించగలడు ? ఏమానందం అనుభవించగడు ?
ఇదిలా వుంచి ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే నిచ్చెన మెట్ల సాంఘిక వ్యవస్థలో కులాల అంతరాలను సంగీతానికీ అంటగట్టి ఆదివాసీ గానానికి అస్పృశ్యతని మెడకు చుట్టి, యాచనని అర్హతగా అంటగట్టి నెట్టివేసిన సమాజం మనది. మనిషికి అలవోకగా సిద్ధించే గాయక వారసత్వాన్ని. లయాత్మక పారంపర్య లక్షణాన్ని కృతక భేదాల చాటున దూరం చేసుకున్న దౌర్భాగ్యం మనది. అయినా ఆశచావక ఆ కళల్నే నమ్ముకొని జీవనం సాగిస్తున్న జానపదులు లేకపోలేదు. కాని వాళ్ళే ఆ కళలకు ఆఖరి వారసులని వారికి తెలియదు. ఈ కఠోర సత్యం వాళ్ళు జీవించి ఉండగా వారికి తెలియక పోవడమే మంచిదని అనుకుంటాను. అలాంటప్పుడే ఆశ నుంచి, ఆవేశం నుంచి ఆవిర్భవించే వారి కళా నైపుణ్యం కుంటుపడకుండా సాగిపోతుంది.
ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న ఆదివాసీ సంగీత సౌభాగ్యాన్ని భావితరాలకు తెలియజేయడం కర్తవ్యంగా భావించి, ముందుకొచ్చి నాలుగు దశాబ్దాలుగా కృషిచేస్తున్నారు ఆచార్యుడు జయధీర్ తిరుమలరావు. ఇంత వరకూ నేదునూరి గంగాధరం, బిరుదురాజు రామరాజు వంటి ఎందరో జానపద విజ్ఞానం, సాహిత్యం మీద పరిశోధన చేసినా, వారెవరూ ఆదివాసుల జీవన మూలాలను స్పృశించలేదనే చెప్పవచ్చు. తిరుమలరావు ఆ బాధ్యతనే నెత్తెనేసుకున్నారు. ఫలితంగా ఆదివాసీ కళారుపాలు, ఆ కళలు వారి జీవన శైలిలో భాగం కావడం, వారి సంగీతం, వారి మౌఖిక సాహిత్యం, అవి గానం చేస్తున్న విధానం, వారి వాద్యసంపద ఆయన పరిశోధనలో భాగమైనాయి.
ఆదివాసీ గిరిజన హృదయ స్పందన తనదిగా స్వీకరించిన జయధీర్ తిరుమలరావు అందులోని ఆధిపత్య నిరసన పట్ల బాగా ఆకర్షితులైనారు. గిరిజనులు ఆధారిత కులాలు తమ తమ ఆవేదనని కళారూపాల్లో వ్యక్తపరచిన విధానం గొప్పగా కనిపించింది. ఒకవైపు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తూనే ఆదివాసీ జీవితాల వైపు తన అన్వేషణ సాగించారు. తెలుగు విశ్వవిద్యాలయ ప్రధాన కేంద్రం హైదరాబాదులో పనిచేస్తున్న కాలంలో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోనూ, రాజమండ్రి సాహిత్యపీఠంలో పనిచేస్తున్న కాలంలో ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతల్లోనూ తన పరిశోధన సాగింది.
జయధీర్ తిరుమలరావు అన్వేషణలో తెలుగు రాత ప్రతులు, నిషేధ గీతాలు, ఆదివాసీ జానపద కళలు – సంస్కృతి – ఒక కర్తవ్యం, తెలంగాణ సాయుధ పోరాట పాటలు, ప్రజాకళా రూపాలు, దళిత గీతాలు, మన ముందుకొచ్చాయి. లిపి లేదనుకున్న గోండుజాతి వారి భాషకు ఈయన కృషితో లిపి చేకూరింది. ఆదిలాబాద్ జిల్లా ‘గుంజాల’ గ్రామంలో దొరికిన పది రాత ప్రతులు గోండు భాష లిపికి ఆధారమైనాయి. ‘‘గుంజాల గోండు లిపిలో ఉంది వాచకం’ అనే పుస్తకంలో తిరుమలరావు ఆదివాసులే ఆది సాంస్కృతిక వారసులని రుజువుచేశారు. ఆధారిత కులాల అంతరంగాల నుంచి కుల పురాణాలు వెలికితీసి ప్రపంచానికందించారు. ఇవన్నీ ప్రత్యామ్నాయ పురాణాలు. వీటిలో తలమానికమైన ‘జాంబపురాణం’ తన సంపాదకత్వంలో సేకరించి ముద్రించడం గొప్ప విషయం. ఈ దేశపు కుల వ్యవస్థ అసలు రంగు చూపించే గొప్ప పురాణం ఈ జాంబపురాణం.
మౌఖిక సాహిత్య సేకరణే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న జయధీర్ తిరుమలరావు ఆదివాసుల సంగీత వాద్యాల పట్ల దృష్టి సారించారు. ఆ వాద్యాలు కేవలం నాదాలు పలకడమే కాదు. అవి ధరించి మ్రోగించే వారి చరిత్రకి సాక్ష్యాలు. స్వయం నిర్మిత దేశీయ వాద్యాలు. సమాజంలో ఒక చోట నిలిచి నివసించడానికి కూడా నోచుకోని సంచార జీవనుల జీవన పోరాటానికి ఆలంబనగా నిల్చిన వాద్యాలు. యాచనే జీవనంగా బ్రతుకు భారాన్ని మోస్తున్న ఆధారిత కులాలకు అస్థిత్వ ముద్రలు. నాగరికత ముసుగులో చొచ్చుకొస్తున్న విదేశీ వాద్య హోరు నుంచి తన్ను తాము కాపాడుకుంటూ మూలకు ఒదిగి కొన ఊపిరితో నున్న దేశీయ మూలాలకు ప్రతినిధులు. సంచారంలోనే సర్వస్వాన్ని కాపాడుకుంటున్న సత్యవారసత్యాలు. అటువంటి మౌలిక భావననర్ధం చేసుకున్న జయధీర్ అవి సేకరించి భవిష్యత్తరాలకు కనీసం చూపించడం బాధ్యతగా భావించి వాద్య సేకరణకుపక్రమించారు. అంతే ఎక్కడెక్కడ లభించిన వాద్యాలను సంగ్రహించటం మొదలుపెట్టారు. వాటి ఉనికి తెలిసి అవి దొరక్కపోతే, అవి మ్రోగిన తావు కల్లా వెళ్ళి ప్రయత్నించి మరీ, సేకరించారు. ఆదివాసీ వాద్య పరికరాలన్నీ తన యింటి బిడ్డలై మొలచుకొచ్చాయి.
ఆదివాసీ నగార, నగర నగార, గోండీ డప్పులు, తుడుం, ఢమరుకాలు, వీరణాలు, దుబ్బు వాద్యం, రుంజలు, జమిడికలు, రకరకాల కొమ్ములు, కడ్డీ వాద్యాలు, సమ్మెట్లు, గిరిజన డోళ్ళు, గిల్లికాయలు, ఏక్‌తారాలు, విల్లు వాద్యం, శారద బుర్రలు, చిన్న చిడతలు, అందెం జోళ్ళు, రకరకాల గజ్జెల కట్లు, అందెల డోళ్ళు, గుజ్జడి మొగ్గలు, బుడికెలు, బుర్రవీణ ఇలా రకాల వాద్యాలు ఎన్నెన్నో ఆయన సేకరణలో భాగమైనాయి. ఆ సేకరణలో నాదస్వరం, తవిల్, మృదంగం, కంజీర, ఘటం మోర్సింగ్, తబ్లా వంటి సంప్రదాయ వాద్యాలు కూడా భాగమైనాయి. మొత్తం దాదాపు 220 వాద్యాలు తిరుమలరావు సేకరించి, ప్రదర్శిస్తున్నారు. ఈ కృషిలో ఆయనకి సహకరించినవారు కుటుంబ సభ్యులతో పాటు పాలమూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న గూడూరు మనోజ, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓరియంటల్ మాన్‌స్క్రిప్ట్ లైబ్రరీలో పనిచేసే మెట్టు వెంకట నారాయణ.
ఆ మధ్య ఒక మాస పత్రికలో గూడూరి మనోజ ఈ వాద్యాలను గురించి ఒక వ్యాసం రాశారు. గుంటూరుకు చెందిన, నన్నపనేని పున్నయ్య, లక్ష్మీ నరసమ్మ ట్రస్ట్ వ్యవస్థాపకులు అయ్యన్నరావు ఈ వ్యాసం చూసి స్పందించడమేగాక హైదరాబాదులో జరిగిన ‘మూలధ్వని’ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్నారు. తిరుమలరావు ద్వారా వివరాలు తెలుసుకొని, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బొమ్మడాల శ్రీకృష్ణమూర్తిని కలిసి వారి సహాయంతోపాటు గుంటూరు కళాపరిషత్ వారి సహయం కూడా స్వీకరించి కార్యరూపంలో పెట్టారు. ఫలితంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పద్మావతి వేదికలో వాద్య ప్రదర్శన (Exhibition), అన్నమయ్య కళావేదికపై ఆదివాసీ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 25 నుంచి 28 వరకూ నాలుగు రోజుల పాటు ఆదివాసీ వాద్య ధ్వనులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.
ప్రజాగాయకుడు గోరటి వెంకన్న, డా. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి, ఆలయన్స్ ప్రాంచైస్ డైరెక్టర్ డా. శామ్యూల్ బెర్త్, ప్రాచీన అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొ. మునిరత్నంనాయుడు, నల్లూరి వెంకటేశ్వర్లు మొదలైన చాలా మంది ప్రముఖులతో పాటు ఈ వ్యాసకర్త కూడా ఆయా వాద్యాల ప్రాశస్త్యాన్ని వివరించారు.
వాద్య ప్రదర్శనని వేలాది మంది తిలకించారు. అన్నమయ్య వేదికపై అద్భుతమైన కళా ప్రదర్శన జరిగింది. అదిలాబాద్ జిల్లా నుంచి ‘గుస్సాడి’ అనే ఆదివాసీ నాట్యం ప్రదర్శించడానికి గోండ్లి కళాకారులు వచ్చారు. తలపై నెమలి ఈకలతో చేసిన పెద్ద కిరీటం లాంటి ఆభరణం ధరించి, పిక్కల పైదాకా నల్లటి అంగవస్త్రం ధరించి, శరీరానికంతా విభూతి రాసుకొని, మెడలో పూసల దండలు ధరించి, డప్పుల దరువుతో కలసి వీరు అడుగులేస్తూ నాట్యం చేస్తుంటే ప్రేక్షకులు ఊగిపోయారు. కొత్తగూడెం భద్రాద్రి జిల్లా నుంచి నలుగురు పురుషులు నలుగురు స్త్రీలు కోయ నృత్యం చేశారు. పెద్ద పెద్ద డోళ్ళు ధరించి పురుషులు, శిఖలో నెమలి ఈకలు సింగారించుకోని స్త్రీలు చేసిన నాట్యం ఆనందాన్ని అంతరంగాల్లో పొంగి ప్రవహింపచేసింది.
నల్గొండ జిల్లా షాలిగౌరారం నుంచి వచ్చిన అంగలకుర్తి రామమూర్తి ‘రుంజ’ వాద్యం వాయిస్తూ గంభీరంగా యక్షగానం (విశ్వ బ్రాహ్మణ పురాణం) ఆలపించారు. రుంజమీద తాను 32 వాద్యాల శబ్దాలు పలికిస్తానంటూ కొన్ని రకాలు పలికించి చూపించాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి నుండి వచ్చిన దురిసేటి రామయ్య కడ్డీ-తంత్రి వాద్యాన్ని వాయిస్తూ సందరకాండ యక్షగానాన్ని గానం చేశాడు. నాగవల్లి రామయ్య వీరికి సహకార గానం చేస్తూ మృదంగంతో సహకరించాడు. కడ్డీ – తంత్రి వాద్యం లయవాద్యం గాను, శృతివాద్యం గాను కూడా ఉపయోగ పడడం గమనార్హం. మరోక విశేషం నారాయణపేట జిల్లా ‘దామరగిద్ద’ గ్రామం నుంచి పల్లె దాసరి కొండప్ప అనే 75 సంవత్సరాల వయసున్న కళాకారుడు వచ్చాడు. ఆయన బుర్రవీణ అనే తీగ వాద్యం మీద మీటుతూ తత్త్వాలు అద్భుతంగా గానం చేశాడు. ఆయన కంఠంలో ముసలితనం ఎక్కడా కనిపించలేదు. ఆయన భాష కూడా స్పష్టంగా అర్థవంతంగా పలుకుతుంది. మంచి శ్రుతిజ్ఞానం కలవాడు. ఈ కొండప్ప తరువాత ఈ బుర్రవీణ పలికించే కళాకారుడే లేడని ఈయనే చివరివాడని తెలిసినపుడు బాధనిపించింది.
ఈ కళాకారులంతా నాలుగు రోజులుండి, ప్రతిరోజూ తమ విద్య ప్రదర్శించి వేల మంది ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేశారు. వారి గానం ముగియగానే ప్రేక్షకులు బహూకరించిన వేలాది రూపాయలే దీనికి నిదర్శనం. సంగీతాన్ని విని ప్రేక్షకులు ఎంతగా పరవశించారో, వాద్య పరికరాల ప్రదర్శనని కూడా తిలకించి అంతగా ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. వీరంతా ఏదో ఆశించి వచ్చిన వ్యాపార కళాకారులు కాదు. తమ విద్య ప్రదర్శించడమే భాగ్యమని తలంచి వచ్చిన నిరుపేద కళాకారులు. మన దేశ సాంస్కృతిక మూలాలకు మిగిలిన వారసత్వ రూపాలు. ఆంధ్రదేశం నడిబొడ్డుగా నున్న గుంటూరు నగరంలో ఆదివాసీ వాద్య విన్యాసాలు పలకడం ఒక నూతన ఆలోచనకు దారి ఏర్పడింది. ‘‘భారతీయ సంగీత చరిత్ర ఆదివాసీ జానపద సంగీతాన్ని కలిపి లిఖించకపోతే అది సమగ్రమౌతుందా?’’ అనే ప్రశ్న అతిధుల ఆలోచనల్లోనే కాదు, ఎదురుగా నున్న ప్రేక్షకుల మెదళ్ళలో కూడా కదలాడింది. విశ్వజనీనమైన సంగీతం ఆదివాసీల నుంచే ఆవిర్భవించిందని గుర్తింప చేసింది. ఈ జానపద సంగీతం సంగీత చరిత్రలో తన హక్కును, తన భాగాన్ని గుర్తించేలా చేసింది.