మీ మదిలో విద్వేషమే మతం
అది గద్దెనెక్కి అరాచకీయం అయ్యింది!
దొంగలింపబడ్డ మా గదిలో దేవుడు
మీ కషాయి పాలక ఎన్నికల జెండా – ఎజెండా ఇప్పుడు!
మా బతుకు ఎప్పుడో
ప్రపంచం పెద్ద బజారు సరుకయ్యింది!
మా కష్టం కట్టుబానిస కన్నీరయ్యింది!
మీ ఆధిపత్య మౌనం
అది మానవతుల మానాలను కోరుతోంది!
ఇప్పుడు కాకపోతే ఎప్పుడు?!
మా ధిక్కారం గుండె నిబ్బరమే
రేపటి భవితను నిలిపే పిడుగుల పిడికిలి!!
235 ఏళ్ళనాటి ప్రపంచ మేడే చైతన్యస్ఫూర్తి – భారతదేశంలో వందేళ్ళ శ్రామిక పోరాట చైతన్య చరిత్ర – ఈ ముప్పాతికేళ్ళ భారత స్వాతంత్య్ర దేశంలో – గత 10 ఏళ్ళ కాలంలో ఏ దుస్థితికొచ్చిందో దేశ కార్మికవర్గం స్థితిగతులు చెబుతున్నాయి. 8 గం॥ల పనిదినం 15-16 గంటలకి దిగజారింది. పనిదినాల వెసులుబాటు ఆవిరై పోయింది. కార్మికవర్గ ప్రయోజనాలు మతతత్త్వ ఫాసిస్టు తరహా పోకడలకు అడుగంటిన పరిస్థితి.
ఈ గత పదేళ్ళ కాలంలో కంచంలో తిండి నేరమయ్యింది. కట్టుకున్న బట్ట కన్నెర్రయ్యింది. బడుగుల పుట్టుక పాపమయ్యింది. ఆడినమాట దేశద్రోహం అయిపోయింది. అడిగిన ప్రశ్న విద్రోహం అయ్యింది. ‘నిజం’ – దేశంలో ఉండడం కంటగింపు అయిపోయింది. ప్రపంచ ఆధిపత్యానికి – భారతదేశాన్ని సాగిలపడేట్టు చేసింది – మతతత్త్వ సంకుచితత్త్వం. సామాజికంగా, సాంస్కృతికంగా మతోన్మాదమే జీవనశైలిగా మారిపోయిన దుర్భరమైన పరిస్థితిని ఈ దేశంలో ప్రతి సామాన్యుడూ భరిస్తున్నదే.
ఈ చిమ్మ చీకట్లో 18వ లోక్‌సభ ఎన్నికలు; ఆంధ్రప్రదేశ్‌కి 16వ శాసనసభ ఎన్నికలు. ఎలాగైనా గెలవాలి అని మతోన్మాద పాలకపక్షం నేలబారు అదరగండాలు పెంచుకుంటూ పోతోంది. ధరలు అదుపుతప్పి మరింత దుర్భిక్షం ఏర్పడుతుంది. కల్తీకి హద్దు లేకుండా పోయి, ప్రజల జీవన, ఆరోగ్య స్థితిగతులు వికృతంగా మారతాయి. పాలకపక్షంగా ప్రతిపక్షాల ఖాతాలను కూడా నిలిపివేయడం, మీడియా స్వేచ్ఛను గుత్తగా కొనుగోలు చేసేయడం, ప్రశ్నించే నాయకుల్ని నిర్బంధించడం, సాహిత్యకారుల్ని, పత్రికా రచయితల్నీ, సామాజిక కార్యకర్తల్ని, అగంతక దాడుల్లో హతమార్చడం, ముస్లిం మైనారిటీ ప్రజానీకం మీద, దళితులపై హంతక, హత్యాచార మూకదాడులు చేయడం; ఆదివాసీ, మూలవాసీల పాదాల కింద నేలను – తవ్విపారేయడం; మహిళలపై, బాలికలపై హత్యాచారాలకు అదుపు లేకుండా పోవడం – అగ్రకుల దాష్టీకాలుగా – రాజకీయ పాచికలుగా మహిళల్ని పైశాచికంగా, లైంగికంగా, నగ్నంగా, నీచంగా, హింసించి చంపడం – ఇదీ పదేళ్ళ భారతదేశ ఛిద్రపటం!!
ఈ ఎన్నికల తర్వాత అసలు ఎన్నికలే రద్దు అవుతాయా అన్నవిధంగా భీతిని కల్పిస్తున్నది మతతత్త్వ పాలక గూండాయిజం.
భారత రాజ్యాన్ని కార్పొరేటు రాజ్యంగా, మనువాదాన్ని సాంస్కృతిక స్మృతిగా ప్రవేశపెట్టడానికి మతతత్త్వాన్ని అడ్డుపెట్టుకొని, పదవీ వ్యాపార జూదరులు ఉబలాటపడుతున్నారు. ప్రతిపక్షం అనేదే లేకుండా ఏకపక్ష పాలనను నడపడానికి ఉరకలేస్తున్నారు.
ఇక ఎన్నికల్లో అవినీతిని గమనిస్తే – హద్దూపద్దూ లేని పోకడలు జడలు విచ్చుకుంటున్నాయి. ఎన్నికల్లో నిలబడే అన్ని పాలకముఠాల అభ్యర్థులూ నేరచరితలుగానే తమ అర్హతను చాటుకుంటున్నారు. లక్షల కోట్ల రూపాయలకు ప్రజాధనంతో నిండిన బ్యాంకుల్ని ముంచి, ప్రజల్ని మోసగించి, ఆకాశహర్మ్యాలు కట్టుకోడానికి ఎన్నికల వైకుంఠపాళీలోకి దిగారు. అయితే, పావులు మాత్రం ప్రజలే. పందేలుగా ఒడ్డేది మాత్రం ప్రజల అవసరాలు, సమస్యలే! రౌడీలూ, గూండాలూ, హంతకులూ వీళ్ళూ – ఈ దేశ అధినాయకులు! ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే – మైనింగ్ మాఫియాగా జైలుశిక్ష అనుభవిస్తున్న ఒక కరడుగట్టిన నేరస్తుడు – తిరిగి ఈరోజు మతతత్త్వ పాలకపక్షానికి ఎన్నికల అభ్యర్థి. అవినీతిరహితమైన పాలకపక్షంగా జబ్బలు చరచుకొని వచ్చిన కషాయ జెండా ఈరోజు అవినీతి మురికి కూపంలో పీకలుదాకా కూరుకు పోయింది. అలా కూరుకుపోవడం – ఒక డాబూ – దర్పంగా చెలామణీ చేయిస్తున్నారు. ఆధునిక ప్రగతిశీల సామాజిక విలువల్నీ, నైతిక విలువల్నీ చెల్లని సంస్కృతిగా ముద్రవేసి – రాచరిక సంస్కృతికి పట్టం గట్టదల్చుకుంటున్నారు.
ఈ పదేళ్ళ పాలనలో కార్మికరంగం ప్రయోజనాలను కుప్పకూలేలా నిర్ణయాలు తీసుకుంది – ఈ మతతత్త్వ పాలకపక్షం. నూతన శ్రామిక నియమావళి – 2019తో ప్రవేశపెట్టిన లేబర్‌కోడ్ వల్ల 90%గా వున్న అసంఘటిత కార్మికవర్గం కట్టుబానిసలుగా ఈరోజు మిగిలారు. ఈ లేబర్‌కోడ్‌ని ప్రతిపక్షాలు గూడా మౌనంగా అంగీకరించాయి. ప్రజల్ని దోచుకు తినడంలో, కాల్చుకు తినడంలో పాలకపక్ష ముఠాలన్నీ ఒక తానులో ముక్కలే. పనిచేసే బాధ్యత తప్ప – గౌరవంగా బతికే హక్కు కనీసంగా కూడా ఇవ్వని లేబర్‌కోడ్ ఇది. దీంతో ఇప్పటివరకు – అమల్లో వున్న 44 కార్మిక చట్టాలు రద్దుచేసిన నియంతృత్వం నేటి పాలకులది.
మేడే స్ఫూర్తితో గత వంద సంవత్సరాల నుండి కార్మికులు సాధించుకున్న వేతన చట్టాలూ, కార్మికుల భద్రతా నియమావళి, భీమా చట్టాలూ, భవిష్యనిధి చట్టాలూ – చట్టుబండలైనాయి. ఉద్యోగుల నమోదు కార్యాలయం చట్టం, ప్రసూతి ప్రయోజన చట్టం, ఇలాంటివి ఆనవాలు లేకుండా చేస్తున్నారు.
అలాంటి నల్ల చట్టాల్లో చాలా కీలకమైనవి – మూడు వ్యవసాయక చట్టాలు. ఒక చట్టం – రైతు ఎక్కడైనా ఎంత ధరకైనా తమ పంటను అమ్ముకోవచ్చని చెబుతున్నారు. ఆచరణలో ఆ చట్టం రైతులకు కనీస మద్దతు ధరను లేకుండా చేస్తుంది. రైతును అనాధ చేసే చట్టం అది. ఇక రెండో చట్టం – పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలతో ఒప్పంద వ్యవసాయం చేసుకోవడానికి సంబంధించినది. దానివల్ల రైతుకు నచ్చిన పంట వేసుకునే హక్కు ఉండదు. కార్పొరేట్ కంపెనీ చెప్పిన పంటే వెయ్యాలి. నచ్చిన ధరకు, నచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం వుండదు. ఒప్పందం చేసుకున్న ధరకే – అమ్మితీరాలి – పంట చేతికొచ్చిన కాలానికి పెరిగిన ధర మరి రాదు. ఈ ఒప్పంద వ్యవసాయం కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ఉపయోగపడుతుంది. రైతు దిక్కులేనివాడు అవుతాడు. ఇక మూడవ చట్టం నిత్యావసర సవరణ చట్టం. ఈ చట్టం చెప్పేది ఒకటి. చేసేది మరొకటి. ఇది అమల్లోకి వస్తే ఇప్పుడు వున్న MRTP నియంత్రణ రద్దయి – ఆహార భద్రత పెనుప్రమాదంలో పడుతుంది. రైతు – పంట నిల్వచేసుకునే సామర్థ్యం కోల్పోతాడు. గిడ్డంగులన్నీ కార్పొరేట్ రంగంలోనే వుంటాయి. ప్రభుత్వ ఆహార గిడ్డంగుల్ని ఇప్పటికే మూసివేత ప్రారంభించారు. ధరపై రైతుకు అదుపు వుండదు కూడా.
ఈ నల్ల చట్టాలూ – నోటితో పొగుడుతాయి రైతుని. నొసటితో వెక్కిరించి – కార్పొరేట్ సాగుని ప్రవేశపెడతాయి.
అందుకే ఏడాదికి పైగా భారత రైతాంగం – మతతత్త్వ మొండి ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసింది. ఎండకి – చలికి – కోవిడ్‌కి 750 మంది రైతుల్ని బలిపెట్టుకుంది. దేశ వ్యవసాయం – కార్పొరేట్‌వర్గం పాలుకోకూడదని, దేశ ప్రజలు బెంగాల్ కరువులాంటి ఆకలి చావులకు గురికాకూడదని.
అటు కాశ్మీరీ – ఇటు మణిపూర్ నడుమ భారతదేశం అంతా ప్రజల రక్తమాంసాల నరమేధంగా మార్చింది 10 ఏళ్ళ మతతత్త్వ పాలన. అటువంటి కిరాతక కేంద్ర పాలక పక్షానికి – ఆంధ్ర రాష్ట్రంలో అధినాయకులు సాగిలపడుతున్నారు. ఒకరు గద్దెను నిలబెట్టుకోవాలని; ఇంకొకరు గద్దెను దక్కించుకోవాలని;
వీళ్ళెవరికీ – ప్రజలు, ప్రజల ప్రయోజనాలూ, ప్రజల భవిష్యత్తూ, ప్రజల స్వయం జీవనశక్తి సామర్థ్యాలూ అవసరంలేదు. బిచ్చం వేసినట్టు – ఎంగిలి మెతుకులు విదిల్చినట్టు – సంక్షేమం పేరుతో – నగదు బదిలీ పేరుతో చట్టబద్ధంగా – ఓట్లు కొనుగోలుకి పోటీపడుతున్నారు.
ఈ నేపథ్యంలో – ఈనాటి ఎన్నికలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఎప్పుడూ లేనంతగా మొత్తం దేశ జనాభాలో సుమారు 50 కోట్లమంది యువత ఓటుహక్కుని కలిగి వుంది. ఇక్కడే యువత విచక్షణతో ఆలోచిస్తే – దేశ భవిష్యత్తు మారిపోతుంది. భగత్‌సింగ్ వారసత్వాన్ని అందిపుచ్చుకోడానికి – నిరుద్యోగ జడత నుండి, నిష్క్రియాతత్త్వం నుండి, రికామీ తిరుగుళ్ళ నుండి, రకరకాల మద్యం, మాదకద్రవ్యాలూ, సెల్‌ఫోన్, సినిమాలూ – ఈ మత్తులన్నింటినీ విదుల్చుకుని నిలబడితేనే దేశ భవిత ఏమైనా కాస్త మిగులుతుంది.
నిజానికి ఈ ఎన్నికల సందర్భంగా మనం చేసుకోవాల్సిన కొన్ని మౌలిక ప్రశ్నలు మనం ఇప్పటికైనా వేసుకోకపోతే – అవి దేశం ముఖం మీద తరతరాల గాయాల శేష ప్రశ్నలుగానే మిగిలిపోతాయి.
జల్లెడతో నీళ్ళు పడుతున్న ‘‘ఎన్నికల కమీషన్’’ –
పదవీ వ్యాపార జూదరులైన మన దళారీ పాలకముఠా నాయకుల – ‘‘చట్టసభలు’’ –
ఇల్లు తగలబడుతుంటే – చుట్ట కాల్చుకునే బాపతు ‘‘పోలీసు వ్యవస్థ’’ –
తోలుబొమ్మగా మార్చబడిన ‘‘న్యాయవ్యవస్థ’’ –
డబ్బు చేతిలో కీలుబొమైపోయిన ‘‘మీడియా’’ –
సచ్చినోడికి దక్కిందే కట్నం – అన్నట్లు దొరికినంత నొల్లుకుంటున్న ‘‘పాలనా యంత్రాంగం’’ –
ఇవన్నీ ప్రజలకు జవాబుదారీ కాగల్గుతాయా?!
ఇప్పుడు దేశానికి మార్గదర్శకత్వం అందించేదెవరు?
ప్రజా ఉద్యమ చైతన్యాన్ని పెంచే శక్తుల్ని పెంచుకోవడం ఎలా? ప్రజా ఉద్యమ చైతన్యాన్ని ఎలా రాజెయ్యాలి?
ఈ కుహనా ప్రజాస్వామిక బూటకపు ఎన్నికలకు ప్రత్యామ్నాయం ఏమిటి? మతతత్త్వ రాజకీయాల అరాచకానికి జవాబుగా శ్రామికతత్త్వ రాజకీయాలను మేడే చైతన్యాన్ని ఎలా పదును పెట్టుకోవాలి?
ప్రజలందరం ఈ వెనుకపట్టు మతతత్త్వ పాలకముఠానీ, దాని అనుకూల పాలక ముఠాల్నీ చిత్తుగా ఓడిరచడమే ఇప్పటి ఎన్నికల తక్షణ కర్తవ్యం!!
జనాన్ని కదిలించడం ఎలా?
ప్రజలు తమంతట తాముగా ఈ దౌర్జన్యాలను వ్యతిరేకించడం ఎలా?
ఈ ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవడం ద్వారానే సరైన ప్రజాఉద్యమ చైతన్యం – మేడే స్ఫూర్తితో సరైన ప్రత్యామ్నాయం అవుతుంది!!