క్షీణ దోపిడీ వ్యవస్థపై సర్చ్‌లైట్‌ రావిశాస్త్రి సాహిత్యం

క్షీణ దోపిడీ వ్యవస్థపై సర్చ్‌లైట్‌ రావిశాస్త్రి సాహిత్యం

                ఆధునిక తెలుగు సాహిత్యానికి కొండంత గుర్తు రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన రాచకొండ విశ్వనాథశాస్త్రి. 2022 ఆయన శతజయంతి సంవత్సరం.  ఆ  మహారచయిత  స్మరణలో  ఆయన  సాహిత్యపు ప్రాసంగికతను గుర్తుచేస్తూ తీసుకువస్తున్న ‘ప్రజాసాహితి’ ప్రత్యేక సంచిక ఇది. ఆధునిక సాహిత్యంతో పరిచయం వున్నవాళ్ళందరూ ఆయన రచనలు చదివి వుంటారు. 1952 నుండి నాలుగు దశాబ్దాల పాటు ఆయన కథ, నవల, నాటకం ప్రక్రియల్లో గొప్ప సాహిత్యం సృజించాడు. ‘మూడు కథల బంగారం’, ‘ఋక్కులు’, ‘ఆరు చిత్రాలు’, ‘ఆరు సారా కథలు’,  ‘సారో కథలు’,  బాకీకధలు;  ‘కలకంఠి’  అనే కథాసంపుటాలు; ‘అల్పజీవి’, ‘రాజు-మహిషి’, ‘రత్తాలు-రాంబాబు’, ‘గోవులొస్తున్నాయి జాగ్రత్త’, ‘సొమ్మలు పోనాయండి’, ‘ఇల్లు’ అనే నవలలు; ‘నిజం’, ‘విషాదం’, ‘తిరస్కృతి’ నాటకాలు ఆయన రచించాడు.

                ‘‘ఏమీ తోచనప్పుడు కథలు రాస్తాను. కథలు రాస్తేగాని ఏమీ తోచదు’’ అని ఆయన చమత్కరించాడు. ఎంతో ఆలోచనతోనూ, అనుభవంతోను, నిబద్ధతతోను సాహిత్య సృజన చేశాడని మనకి తెలుసు. ‘సమాజాన్ని వేయి కళ్ళతో కనిపెట్టినవాడు’ రావిశాస్త్రి అని శ్రీశ్రీ ప్రశంసించాడు.

                ‘‘రచయిత అయిన ప్రతివాడూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందోనని ఆలోచించవలసిన అవసరముందని నేను భావిస్తాను. మంచికి హాని, చెడ్డకి సహాయం చెయ్యకూడదని నేను భావిస్తాను. ఇది తెలుసుకుందికి, తెలియజెప్పడానికీ నేనిదంతా రాసేను’’, అని ఆయన సూటిగా, స్పష్టంగా ప్రకటించాడు. పదవుల కోసం, సన్మానాల కోసం ఆయన వెంపర్లాడలేదు.

                పీడితులు, నిర్భాగ్యులు, నిస్సహాయులు, నేరగాళ్ళు, జూదగాళ్ళు, అల్పజీవులు రావిశాస్త్రి సాహిత్యంలో కొల్లలు కొల్లలుగా కనిపిస్తారు. లంపెన్‌ వర్గం గురించే ఆయన ఎక్కువగా చిత్రించాడని ఒక విమర్శ వినిపిస్తుంది. అయితే వాళ్ళెలా ఉత్పన్నమవుతారు? బ్రిటిష్‌ వలస పాలకుల నుండి అధికారం అందుకున్న మనదేశ దళారీ, దోపిడీవర్గాల నిర్వాకమే ఈ పరిస్థితిని కల్పించింది. భూస్వామ్యాన్ని కూలదోసి జాతీయ పారిశ్రామిక సేవారంగాలను రావిశాస్త్రి కాలం నాటికి గాని, నేటికి గాని అభివృద్ధి చేయకపోవడమే సకల రంగాల వెనుకబాటుతనానికి దేశ పరాధీనతకు నిరుద్యోగానికీ, అర్ధనిరుద్యోగానికీ మూలకారణం. అధోజగత్తు అనబడేది దాని ఫలితంగా ఉత్పన్నమయినదే. దాన్ని సాహిత్యంలో స్పృశించక తప్పదు. వెంకటచలం సృజించిన సాహిత్యంపై ఎందరో దుమ్మెత్తి పోస్తున్నప్పుడు ఆయన రాసిన విషయాలు ఎవరో ఒకరు తప్పక రాయాల్సినవే అని కొడవటిగంటి కుటుంబరావు ప్రకటించాడు. అధోజగత్తు లంపెన్‌ జీవుల గురించి రాయడం సాహిత్య సామాజిక కర్తవ్యాల్లో భాగమే. అద్దంలో మొహం బాగాలేదని అద్దాన్ని పగులగొట్టడం వల్ల ప్రయోజనముండదు. ఎంతటి గొప్ప రచయిత అయినా జాతి జీవిత సర్వస్వాన్ని చిత్రించలేడు. అది ఆ జాతి భాషా సాహిత్యం మొత్తం చేయగల పని. తెలుగు భాషా సాహిత్యం ఆ పని చేస్తూనే వుంది. ఇంకా చేయవలసింది ఎప్పుడూ మిగిలే వుంటుంది. ఎందుకంటే అది మారుతూనే వుంటుంది. నిజానికి అన్ని రంగాలు లంపెన్‌ స్వభావాన్ని  సంతరించుకున్నాయనడం అతిశయోక్తి కాదు. ఇదంతా మారాలి అనే వైపుగా రావిశాస్త్రి సాహిత్యం పాఠకుల్ని చైతన్యపరుస్తుంది. వాస్తవంగా ఆయన విభిన్న శ్రేణుల జీవితాన్ని సాహిత్యంలోకి తెచ్చాడు. ఎవర్ని గురించి రాసినా, దేన్ని గురించి రాసినా ఆయన ప్రజాపక్షపాతిగానే వున్నాడన్నది సత్యం. ఆయన కొన్ని నవలలకు ముగింపునివ్వలేదు అని భావిస్తున్నామంటే వాటి ఇతివృత్తాలలోని జీవన సమస్యలు అలాగే కొనసాగే సామాజిక పరిస్థితులున్నాయని బహుశ ఆయన భావించి వుంటాడు.

                తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట విరమణానంతర దశలో అభ్యుదయ సాహిత్యం నిర్మాణాత్మక ఉద్యమంగా నిస్తబ్ధతలో వున్న కాలంలో బాధితులు, శ్రమజీవుల పక్షాన రావిశాస్త్రి ఉత్తమోత్తమ సాహిత్యం సృజించాడు. అదే కాలంలో చిత్తజల్లు వరహాలరావు (సి.వి.) అద్వితీయ సాహిత్య సృజన చేశాడు. కె.వి.ఆర్‌., కాళీపట్నం రామారావు, ఇంకొందరు  సాహిత్యంలో అభ్యుదయం వెలుగును కాపాడుతూ రచించారు.

                రావిశాస్త్రిది కవితాత్మక వచనశైలి. అది అనుపమాన ఉపమానాత్మకమైన విశాఖ మాండలిక శైలి. అదే ఆయన బలమూ, బలహీనత కూడా అని అనుకొంటుంటాం. అది వస్తువు నడకను నెమ్మదింపచేస్తుంది. నిజమే. అయితే అది అతని శైలి. అంతే. పైగా అది నవలలకే పరిమితం. ఆయన కథల్లో ఒక వాక్యం తీసివేయడంగాని, చేర్చడంగాని కుదరదు. అందుకే ఆయన్ని ఆంధ్ర చెహోవ్‌ అంటాం.

                సామాజిక విప్లవ సందేశాన్నిచ్చే ‘‘పిపీలకం’’ వంటి కథ రావిశాస్త్రి మాత్రమే రాయగలిగినది. సారా కథ ‘‘మాయ’’లోని ముత్యాలమ్మ ఆయన చేసిన ఒక గొప్ప సామాజిక డిస్కవరి. ‘‘ఈ లోకంలో డబ్బు వ్యాపారం తప్ప మరేట్నేదు’’ అంటూ దొంగసారా కేసులో ఇరికించబడిన ముత్యాలమ్మ కుర్ర లాయర్‌ మూర్తికి చేసిన ఉద్బోధ మూర్తినేగాక మనల్నందరినీ విస్తుపరుస్తూ సామాజిక వ్యవస్థను బోనులో నిలబెట్టింది.

                ‘‘జరీ అంచు తెల్లచీర’’ కథలో దిగువ మధ్యతరగతి విశాలాక్షి వంటివారి అత్యల్పకాంక్షలు కూడ ఈడేరని దైన్యం మనల్ని వెన్నాడుతుంది. ‘‘వర్షం’’  కథలో  సాహసగుణానికుండే  విలువను చిన్న పరిశీలన ఇతివృత్తంగా వినూత్నంగా ఆవిష్కరించారు. ‘కాదేదీ కవితకనర్హమ’ని ఋక్కుల్లో శ్రీశ్రీ వక్కాణిస్తే అవన్నీ కథలకు కూడా అర్హమైనవేనని రావిశాస్త్రి నిరూపించారు. కారల్‌మార్క్స్‌ అదనపు విలువ సూత్రాన్ని సామాన్య పాఠకులకు కూడా సులువుగా అర్ధమయేటట్లు ‘‘బల్లచెక్క’’ వంటి గొప్ప కథలు రాసాడు.

                మొత్తం మూడు నాటకాలే రాసినా అన్నీ సామాజిక స్పృహ కలిగినవే రాశారు. ‘నిజం’ నాటకం 14 ఏళ్ళ అధికారమార్పిడి తర్వాత కూడా మన రాజ్యవ్యవస్థను సార్వభౌమరావులే శాసిస్తున్నారనీ, పోలీసు, న్యాయవ్యవస్థలలో ప్రజానుకూల మార్పులు జరగలేదనీ, అవి నిజాల్ని నిలువులోతు కప్పిపెడుతున్నాయనీ, అమాయకులనే శిక్షిస్తున్నాయనీ గొప్ప నాటకీయ చిత్రీకరణతో దృశ్యమానం చేశారు.  అది నేటికీ ప్రదర్శనాయోగ్యమే! మిగిలిన రెండూ మహిళల జీవిత విషాదాన్ని, వంచనాత్మక పురుషులపై స్త్రీ ధిక్కారాన్ని ప్రతిభావంతంగా చూపాయి. 1957లోనే ఆత్మవిశ్వాసపూరిత మహిళల్ని ‘తిరస్కృతి’ నాటకంలో ఎత్తిపట్టటం ఆయనలోని ప్రతిభావంతమైన ముందుచూపు.

                ‘‘నిజం’’ నాటకంలో సార్వభౌమరావు, ‘‘సొమ్మలు పోనాయండి’’ నవలలో పంచాయితీ ప్రెసిడెంట్‌, ‘‘గోవులొస్తున్నాయి జాగ్రత్త’’లో కిరీటిరావు పెదనాన్న వంటి దోపిడీ దౌర్జన్యాల క్షుద్ర శక్తులు భారత సమాజంలో లుకలుకలాడుతున్నారు. వారి దౌష్ట్యాలపై రావిశాస్త్రి సాహిత్య యుద్ధం ప్రకటించాడు. ‘‘సొమ్మలు పోనాయండి’’ నవల భూస్వామ్య అణచివేతను, వికృతీకరించబడి కొనసాగుతున్న వలస పాలననాటి అధికార యంత్రాంగం దుర్నీతిని గొప్పగా స్పష్టపరచింది. ఆ నవలలో దోపిడీ దౌష్ట్యాలకు గురైన ‘బోడిగాడు’ భారతదేశ అట్టడుగు రైతాంగ ప్రతినిధి.

                ఆయన సాహిత్యంలో న్యాయవ్యవస్థ, జైళ్లు, పోలీసు – ప్రభుత్వ కార్యాలయాలు, పైరవీ రాయుళ్ళు, సారా కాంట్రాక్టర్లు, భూస్వాములు, లంపెన్‌ రాజకీయులు ప్రజలను పట్టి పల్లారుస్తున్న వైనం మనకు సాక్షాత్కరిస్తుంది.

                ‘‘జీవన భయాన్నుంచి బయట పడాలంటే జీవితాన్ని గురించి మరింతగా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి’’ అని విజ్ఞానశాస్త్రంలో ధృవతార మేరీక్యూరీ చెప్పింది. మనం వ్యవస్థను మార్చాలంటే పాలక వర్గాల దోపిడీ చైతన్యాన్ని, పాలక ప్రజల శ్రమ జీవన చైతన్యాన్ని కూడా అర్ధం చేసుకొని రచయితలు రచించాలి. ‘‘గోవులొస్తున్నాయి జాగ్రత్త’’ నవలలో రావిశాస్త్రి, కిరీటిరావు పాత్ర ద్వారా స్వీయకథనంగా పాలకవర్గపు దోపిడీదారుల ప్రాపంచిక దృక్పథాన్ని వెల్లడిరచడం విశిష్ట సాహితీ సందర్భం. పతంజలి ఆ మార్గంలో తనదైన వ్యంగ్య వైభవాన్ని కొనసాగించాడు.

                నక్సల్బరి రైతాంగ సాయుధ తిరుగుబాటు, శ్రీకాకుళ పోరాటం వెలుగులో ఏర్పడిన విరసంలో చేరడంలో వ్యవస్థలో మౌలిక మార్పుకోసం రాచకొండ విశ్వనాథశాస్త్రి – ఆకాంక్షకు నిదర్శనం. ఇందిరాగాంధి ఎమర్జెన్సీ కాలంలో విరసానికి రాజీనామా చేసినా ఆయన నూతన ప్రజాతంత్ర విప్లవోద్యమ అభిమానిగా, సమర్ధకుడిగా వుండినాడన్నది ప్రధాన విషయం.

                పేదల వకీలుగా, పేదల, శ్రమజీవుల రచయితగా జీవితాన్ని అంకితం చేసిన మహారచయిత ఛాత్రి బాపుకు జనసాహితి, ‘ప్రజాసాహితి’ ప్రగాఢ స్మృత్యంజలి ఘటిస్తున్నాయి.

admin

leave a comment

Create Account



Log In Your Account