ఆస్తి దురాక్రమణను తేటతెల్లం చేసిన రావిశాస్త్రి ‘ఇల్లు’ నవల

ఆస్తి దురాక్రమణను తేటతెల్లం చేసిన రావిశాస్త్రి ‘ఇల్లు’ నవల

– ఐ.టి.ఆర్‌.వి. శివాజీరావు

                రావిశాస్త్రిగారు చివరగా రాసిన నవల ‘ఇల్లు’. ఈ నవలను 1992లో మొదలుపెట్టి 93లో పూర్తి చేశారాయన. ‘స్వాతి’ వారపత్రికలో సీరియల్‌గా వచ్చింది. నవల పుస్తకరూపం తీసుకోక ముందే ఆయన మరణించారు.

                నవల రచనాకాలం 1992-93, అయితే నవలలోని జరిగిన కథాకాలం 1969 (‘ఇల్లు’ నవలా ప్రవేశంలో రావిశాస్త్రిగారే ఈ విషయం ప్రస్తావించారు). ఈ రెండు కాలాలు రచయిత మీద రచయిత రాసిన కథ మీద జమిలిగా ప్రభావం చూపించకపోవు. ఈ రెండు కాలాలు కొంత విశిష్టత గలిగినవనే చెప్పవచ్చు. కథాకాలం 1969 శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం ముమ్మరంగా సాగుతున్న దశ. పైగా 1969 నాటికి ఉద్యమం ప్రజాపంథాను వదిలి చారుమజుందార్‌ వర్గశత్రు నిర్మూలనా పంథాలోకి మళ్లుతున్న సమయం కూడా.

                1992-93 కాలపు ప్రాముఖ్యత ఏమిటి?! పీవీ నరసింహారావు భారతదేశ ప్రధాన మంత్రిగా వున్నాడు. ఆప్పటికి దేశంలో నెలకొని వున్న ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని గట్టెక్కించాలంటే ఎల్పీజీ (లిబరలైజేషన్‌, ప్రైవేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌) విధానాలను దేశంలోకి ఆహ్వానించక తప్పదని WTO (డబ్లూటీఓ) ఒప్పందాల మీద సంతకాలు చేసి ఎన్నాళ్ళో కాలేదు. ఆ విధంగా ప్రపంచీకరణ గాలులు దేశంలో వీస్తున్న సమయం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన నుంచి ఇటువంటి నవల రావడానికి తగిన కాలమాన పరిస్థితులు ఆనాటి దేశ రాజకీయార్ధిక యవనికపై నెలకొని వున్నాయి.

                అయితే ప్రపంచీకరణ 1990ల తర్వాతే మొదలయిందని చెప్పడం అర్ధ సత్యమే అవుతుంది. తరిమెల నాగిరెడ్డి ‘రాసిన తాకట్టులో భారతదేశం’ పుస్తకంలో చెప్పినదాని ప్రకారం దీని మూలాలు వలస పాలన కాలంలోనే మొదలయ్యాయని మనకు అర్థం అవుతుంది. అయితే దాని ప్రతిఫలనాల తీవ్రత 1990ల తర్వాత తీవ్రరూపం ధరించి తదుపరి కాలంలో లక్షలాది మంది రైతులు, గ్రామీణ వృత్తులు చేసుకునే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం అయిన కాలం (అంతకుముందు కంటే కూడా) ఇదే!

                మన స్వాతంత్య్రంలోనే వున్న ఒక దళారీస్వభావం, మనుషుల్లో బ్రోకర్‌ స్వభావాన్ని ఎలా పెంచి పోషిస్తుందో, ఆ బ్రోకర్లు రాజ్యం అందించే అవకాశాలతో తెగ బలిసి పెద్దలుగా చెలామణీ అయి ఇంకా దోపిడీ పీడనలకు ఎలా తెగబడతారో, కష్టజీవుల్ని, అమాయక జనాల్ని ఎలా దోచుకుంటారో ‘ఇల్లు’ నవల సోదాహరణంగా చూపిస్తుంది.

                ఇక కథ విషయానికి వస్తే చిట్టెమ్మ ఉరఫ్‌ సుందరమ్మ అనబడే విధవరాలు నాలుగిళ్ళ లోగిలి అయిన తన సొంత ఇంట్లో ఒక పోర్షన్లో వుంటుంది. ఇక మిగిలిన భాగాలలో అనంతం అనే హాస్పిటల్‌ ఉద్యోగి తన భార్య ఇద్దరు పిల్లలు, ముసలి తండ్రితో అద్దెకు వుంటాడు. మరొక పోర్షన్లో చిట్టెమ్మ ఆడపడుచు కాంతమ్మ తన కొడుకు సూర్యప్రకాశంతో వుంటుంది. కాంతమ్మ పెద్ద కొడుకు ఉదయ భాస్కర్‌ నక్సలైట్లలో కలిసిపోతాడు.

                ఇంటి పన్ను పెరిగిందని చిట్టెమ్మ తన వార్డ్‌ కౌన్సిలర్‌ అయిన సోమయాజుల వద్దకు వెళుతుంది. చిట్టెమ్మ ఒంటరి స్త్రీ అనే విషయాన్ని గమనించి ఆమెను లోబరుచుకొని ఆమెకు ఆధారంగా వున్న ఇంటిని కాజెయ్యాలనుకుంటాడు సోమయాజులు. అందుకు ఈ పరిచయాన్ని వాడుకొని ఆమె ఇంటిలోకి ప్రవేశిస్తాడు.

                అలా ప్రవేశించిన సోమయాజులు ఆ ఇంటి ఆనుపానులు గమనించుకుంటాడు. తన ప్రణాళికను అమలు చేయడానికి తగిన వ్యూహ, ప్రతివ్యూహాలు రచించడం ప్రారంభిస్తాడు.

                మొదటగా అతని కళ్ళు అద్దెకుంటున్న అనంతం మీద పడతాయి. అతను సంవత్సరాల తరబడి నెలకు 60 రూపాయల అద్దె మాత్రమే చెల్లిస్తున్నాడని, అద్దె పెంచేందుకు అతని మీద దావా వెయ్యమని చిట్టెమ్మను ఒప్పించి అందుకు జరగాల్సిన తతంగం అంటే వకీలు దగ్గరకు వెళ్ళడం వంటివన్నీ తను నడిపిస్తాడు. ఆ క్రమంలో చదువురాని చిట్టెమ్మతో దావా వెయ్యడానికి అవసరం అయిన కాగితాల మీదా మరియు ఆవిడకి అవసరంలేని, సోమయాజులకి అత్యవసరమైన (ఆవిడని సర్వవిధాలా భ్రష్టురాలిని గావించేందుకు) పేపర్ల మీద అనగా ఇల్లు తనకు పురోణీ రాసినట్టుగా వున్న స్టాంప్‌ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటాడు.

                సోమయాజులని పూర్తిగా నమ్మేసిన అమాయకురాలైన చిట్టెమ్మ అతను పెట్టమన్నచోటల్లా సంతకాలు పెట్టేస్తుంది. తన ఆస్తినంతా స్వయంగా పువ్వుల్లో పెట్టి సోమయాజులు చేతిలో పెట్టేస్తుంది.

                ఈ లోగా అనంతం వైపు వాదిస్తున్న లాయర్‌ నాయుడుగారి ప్లీడర్‌ గుమస్తాని సోమయాజులు లంచమిచ్చి లొంగదీసుకుంటాడు. సోమయాజులు గడ్డి కరిచిన ఆ ప్లీడరు గుమస్తా, నాయుడుగారు వూరెళ్ళిన సమయంలో అనంతం తరుపున వాయిదా కోరకుండా చేస్తాడు. దానితో చిట్టెమ్మకి అనుకూలంగా కేసు డిక్రీ అయిపోతుంది. ఈ గొడవ చిట్టెమ్మ మేనల్లుడు అరుణ ప్రకాశం వచ్చాక సెటిల్‌ అవుతుంది. అదిగో అప్పుడు సోమయాజులు కంట్లో అరుణ ప్రకాశం పడతాడు.

                సోమయాజులకి రైవల్‌ అయిన గవర్రాజు, సోమయాజులకి పోటీగా మనోహరాన్ని ప్రవేశపెడతాడు. ఇంటిని బేరానికి పెడతారు. ఆ ఇంటి విలువ లక్ష రూపాయలకు దిగొద్దని ప్రైవేటుగా చిట్టెమ్మకి చెబుతాడు సోమయాజులు.

                ఈ విషయం తెలిసిన సోమయాజులు ఇటు చిట్టెమ్మకి అటు మనోహరానికీ ఆ ఆస్తికి సంబంధించిన లావాదేవీలు జరపరాదని లాయరు నోటీస్‌ పంపిస్తాడు.

                కోర్టు ద్వారా ఈ గొడవను సెటిల్‌ చేసుకొనే ఉద్దేశ్యం సోమయాజులుకు లేదు. చిట్టెమ్మ పెద్దమేనల్లుడు ఉదయ భాస్కరం నక్సలైటనే సమాచారం తన మిత్రుడైన డిఎస్పీ చిటికెల వెంకన్నకి సోమయాజులు ఇస్తాడు. అందుకు ప్రతిగా చిట్టెమ్మ ఇంటిని సోమయాజులు ద్వారా సెటిల్‌ చేసుకోవాలనుకుంటాడు. అంటే ఇప్పటి క్విడ్‌ ప్రో కో అన్నమాట.

                చిటికెల చిట్టిబాబు సోమయాజులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో ఉదయ భాస్కరం టీమ్‌ ముఖ్యమంత్రిని హత్య చేయటానికి వేసిన పథకాన్ని నిర్వీర్యం చేస్తాడు. ఆ క్రమంలో చిట్టెమ్మను ప్రశ్నించడం కోసం అనధికారిక కస్టడీలోకి చిట్టిబాబు తీసుకుంటాడు. ఆ సమయంలో చిట్టెమ్మ చిట్టిబాబును ‘‘అన్నా’’అని పిలవడంతో కొంత కరుగుతాడు. చిట్టిబాబు పురోణీలోని లొసుగును బయటపెట్టి సోమయాజులను డిఫెన్స్‌లో పడేస్తాడు. సోమయాజులు అంతటితో విరమించుకుంటాడు అయినా చిట్టిబాబు సోమయాజులుకి మూడవభాగం ఇప్పిస్తానంటాడు. ఆ ఆస్తిలో భాగం చిట్టిబాబుకి కూడా కావాలి మరి.

                ఆ విధంగా చిట్టెమ్మ ఇల్లు ముగ్గురి పేరునా రిజిస్ట్రేషన్‌ అవుతుంది. చిట్టెమ్మకి లక్ష రూపాయల చెక్‌ అందుతుంది. చిట్టెమ్మ తన యావదాస్తిని అమ్ముకొని అందులో తను కొంత వుంచుకొని మిగిలింది అరుణ ప్రకాశానికి ఇచ్చేసి తను కాశీ వెళ్ళిపోతుంది.

                అరుణ ప్రకాశాన్ని, జ్యోతిర్మయిని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేస్తారు. అరుణ ప్రకాశం తమకు ద్రోహం చేశాడనుకుంటారు. కానీ అసలు విషయం తెలుసుకొని వదిలిపెట్టేస్తారు. అతని అన్న ఉదయ భాస్కరం అరుణ  ప్రకాశాన్ని ఏ దారిన వెళ్ళాలో నిర్ణయించుకోమని అతని సహచరులతో ‘‘విప్లవం వర్ధిల్లాలి’’ అని నినాదాలు ఇచ్చుకుంటూ నిష్క్రమిస్తాడు. ఇది టూకీగా కథ!

* * * * *

                ‘ఇల్లు’ నవలలో 1969 కాలం నాటికీ ఇప్పుడు 2022 నాటికీ హస్తిమశకాంతర భేదం వుంది. రోమ్‌ దేశం నిర్మాణం వెనుక బానిసల రక్తం ఉందంటారు. ఆధునిక నగరాల నిర్మాణం క్రింద బానిసల రక్తం వుండదు కానీ  ఎంతోమంది చిట్టెమ్మల్లాంటివాళ్ళ నలిగిపోయిన జీవితగాథలు వుంటాయి.

                2022లో ‘‘నగరం (అది ఏ నగరమైనా) ఇంత అందంగా వుందేమిట్రా బాబూ!’’, అని మూర్ఛనలు పోయేవాళ్ళకి ఎన్ని జీవితాలు ఆ నగర పునాదుల కింద చితికిపోయాయో! రావిశాస్త్రిగారే ఒకచోట రాసినట్టు ‘‘వాళ్లంతా ఒకప్పుడు చంద్రకాంత పువ్వుల్లా రాలిపోయి వుంటారు, సబ్బు బుడగల్లా పేలిపోయి వుంటారు’’.

                అలా రాలితే వొచ్చిన సువాసనలే, అలా పేలితే విరిసిన మెరుపులే నేడు మనకి కనబడుతున్న నగర అందాలు.

                ఒకానొక సమయంలో రియల్‌ఎస్టేట్‌ బూమ్‌ నెమ్మదిగా అందుకుంటున్న తొలి నాళ్లలో, ఇంత బరితెగింపుగా మాఫియాలు తెగబడని రోజుల్లో అప్పుడప్పుడే మధ్యవర్తులు ఈ వ్యవస్థలో పురుడు పోసుకుంటున్న సమయంలో, రాజకీయ నాయకులు కూడా తమ రాజసాన్ని వదిలి, అధికారులు తమ అధికార దర్పాన్ని విడిచి మధ్యవర్తులుగా అవతారం ఎత్తుతున్న సమయంలో వాళ్ళ కంటికి బాగా ఆనిగ్గా కనబడింది ఎవరయ్యా అంటే ‘ఆస్తిగలిగిన ఒంటరి ఆడవాళ్ళు!’ అలాంటివాళ్లను నయానో భయానో లొంగదీసుకొని ఆ ఆస్తిని సొంతం చేసుకోవడం, అందుకు  పాలనాయంత్రాంగం, న్యాయవ్యవస్థ సహాయాన్ని కూడా పూరాగా పొందడం.

                దీనికి కొనసాగింపు రూపమే గిరిజన ప్రాంతాల్లో కొద్దిపాటి ఆస్తి భూమి రూపంలో గలిగిన ఒంటరి గిరిజన స్త్రీలను మంత్రగత్తెల పేరుతో సజీవదహనం చేసి వారి ఆస్తిని ఆయా గ్రామ పెత్తందారులు కలిపేసుకుంటున్న వార్తలు. ఇది ఇటీవలి పరిణామం. ఆస్తిపట్ల గిరిజన ప్రాంతాలలో మారిన దృక్కోణానికి నిదర్శనాలుగా ఈ సంఘటనలను చూడాలి.

                ఆ తర్వాత అది తన ఆక్టోపస్‌ టెంటకిల్స్‌ మరింతగా సాచి అందిన వాళ్లనల్లా అందుకొని నమిలి మింగేస్తుంది.

                ఇప్పుడున్న దోపిడీ సమాజం వ్యక్తిగత ఆస్తులను సంరక్షించే సమాజం. దోపిడీ ప్రయోజనాల కోసం ఎవరి వ్యక్తిగత ఆస్తులను సంరక్షిస్తారో, ఎవరి వ్యక్తిగత ఆస్తులను పెంపొందిస్తారో ‘ఇల్లు’ నవల చదివితే మనకు స్పష్టంగా బోధపడుతుంది.

                అందరూ సమానులే అని చెప్పే పాలనావ్యవస్థ, న్యాయవ్యవస్థ మనకు వున్నాయి. కానీ అందరికన్నా కొందరు ఎక్కువ సమానము, వారి ఆస్తి మాకు కాస్త ఎక్కువ ప్రాముఖ్యము అందుకోసం అనగా వారికి సేవలు చెయ్యడం కోసం మా కాలాన్ని, అధికారాన్ని సర్వవిధాలా వెచ్చిస్తాం అని అవే పాలనావ్యవస్థ, న్యాయవ్యవస్థలు నిరంతరం ఉద్ఘోషిస్తూ ఉంటాయి. అందుకోసం అవి మనోహరం వంటి వాడి ముందు మోకాలి దండా వేసి దండలు కట్టుకొని అతని ఆజ్ఞ కోసం ఎదురుచూస్తూ వుంటాయి.

                ఇంతకీ ఆ గోపికా మనోహరం బాగా చదువుకున్నవాడే! మంచి భావాలు కలిగినవాడే! అందుకే చిటికెల చిట్టిబాబు మనోహరం గురించి ఇలా అంటాడొకచోట

                ‘‘ఈ మనోహరంగాడు అప్పట్లో అందరి డబ్బూ అందరికీ పంచాలి అనేవాడు. ఇపుడు అందరి డబ్బూ కొందరమే  పంచుకుందాం రండంటాడు. అప్పటికీ ఇప్పటికీ ఒచ్చిన తేడా అంతే, అదే! ది మోస్ట్‌ డేంజరస్‌ బగ్గర్‌ ఆన్‌ ద ఫేస్‌ ఆఫ్‌ ది ఎర్త్‌!’’ అంటాడు.

                ‘‘చదవని వాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగున్‌’’ అని.

                కానీ గోపికా మనోహరం చదువుకున్నవాడు, ఎంతో కొంత అభ్యుదయ భావాలు వున్నవాడు. కానీ చివరికి దోపిడీదారుడుగా మారి చట్టంలోని, పాలనాంగంలోని లొసుగులను జాగ్రత్తగా ఉపయోగించుకొని తన దోపిడీని యధేచ్చగా సాగిస్తాడు.

                సోమయాజులు, మనోహరం, చిట్టిబాబుల మధ్య అసాధారణమైన బంధం వుంటుంది. అదేమిటంటే వారు ముగ్గురూ మూడు రంగాలకు ప్రతినిధులు. సోమయాజులు చోటా రాజకీయ నాయకుడిగా రాజకీయరంగ ప్రతినిధి, చిట్టిబాబు పాలనా యంత్రాంగంలో భాగమైన లా అండ్‌ ఆర్డర్‌కు ప్రతినిధి, ఇక మనోహరం వ్యాపారవర్గ ప్రతినిధి.

                ఈ ముగ్గురికీ పంపకంలో పోటీ వున్నప్పటికీ దోపిడీలో ఒకరికొకరు కుమ్మక్కు అవుతారు. ఈ ముగ్గుర్నీ మూడు వ్యవస్థలుగా చూస్తే నవల రచనాకాలం కన్నా ఇప్పటి ప్రపంచీకరణ కాలంలో వాటి మధ్య దోపిడీలో పోటీ, కుమ్మక్కు మరింత నగ్నంగా చూడొచ్చు.

                ఈ వ్యవస్థ యొక్క దోపిడీ స్వభావాన్ని అర్థం చేసుకున్న ఉదయ ప్రకాశం ‘‘ఇది దొంగల రాజ్యం’’ అని చెప్పి ప్రభుత్వం మీద పోరాడడానికి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. తన తమ్ముడిని,జ్యోతిర్మయిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్ళి అతని ముందు హాజరు పరిచినపుడు అరుణ ప్రకాశాన్ని పెటీ బూర్జువా అని పిలుస్తాడు. అంతేగాక పెటీ బూర్జువాలని విప్లవోద్యమానికి శత్రువులుగా పరిగణిస్తాడు. ఇది ఆనాటికి శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాట దశను, మారిన స్వభావాన్ని మనకి పట్టి ఇస్తుంది.

                అన్న తమ్ముడికి మరణశిక్ష విధించబోతాడు. కానీ అతని తప్పు లేదని తెలిశాక వెళ్ళిపోతూ సమాజం మార్పుకి తనమార్గం ఎంచుకోమని లేదా యథావిధిగా కొనసాగమని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ సందర్భంగా మనకి వాసిరెడ్డి సీతాదేవి రాసిన ‘మరీచిక’ నవల గుర్తు రాక మానదు. ఆ నవలలోని నాయకుడు అడవుల్లో పోలీసులతో పోరాటంలో గాయపడి మరణిస్తూ నాయికకు ప్రజామార్గంలోకి వెళ్ళమని పంపిస్తాడు.

                చిట్టెమ్మ నడుచుకుంటూ వెళుతూ మార్గమధ్యంలో వర్షం పడుతూ వుంటే ఒక పశువులశాల దగ్గర ఆగుతుంది.

                అక్కడ ఒక గోవుని నిమురుతూ, ‘‘నీకు ఇల్లు లేదమ్మా తల్లీ? అదృష్టవంతురాలివి! అవునా? కాదా?’’ అంటుంది. ఈ విధంగా చదువు అంతగా లేని చిట్టెమ్మ ఆస్తి వెనుక వున్న గతితార్కిక సంబంధాన్ని అర్దం చేసుకోగలిగింది. అర్దం చేసుకుంది గనుకనే తనకు తోచిన దారిలోకి నడిచింది.

                ఆస్తి అనే భూతం ఆనాటికి అనగా రావిశాస్త్రిగారు ఈ నవల రాసేనాటికి తన కన్నులు విప్పి కోరలు సాచి అమాయకులని పీడించిన దానికన్నా నేడు వేనవేల రెట్లు పీడిస్తూ వున్నది. అందుకే ఇల్లు నవల నేడు మరింత అవసరం.

admin

leave a comment

Create Account



Log In Your Account