ఆకలి

ఆకలి

రావిశాస్త్రి

         అన్నారావుని శనిలా వెంటాడుతున్నాడు ముష్టివాడు.

         ఆకల్లో అందం కనిపించదు. ఆకల్తో ఉన్నవాళ్లు బొత్తిగా బావుండరు చూడ్డానికి. వాళ్ళనసలు చూడరు చాలామంది. ఇక్కడ ‘‘ఆకలి’’ అంటే ఆకలేకాని మరొకటి కాదు. పుస్తకాలంటే ఆకలి, పరస్త్రీ అంటే ఆకలి, పరాయి సొమ్మంటే ఆకలి, ఆ తరహాది కాదు. ఆకలంటే అసలైన ఆకలి. అంటే ఏమిటో చాలామందికి తెలిసుండాలి.

         అతనసలు ఆదినుంచీ ఆకల్తో ఉన్నవాళ్ళా ఉన్నాడు. అంతకాలం అలా ఉంటే మనిషి రూపు మారిపోతుంది. అతను, చెదపుట్టలోంచి తీసిన వస్తువులా ఉన్నాడు. అయితే, అతన్లో మనిషి పోలిక ఇంకా అక్కడక్కడ లేకపోలేదు. వంట్లో ఎమికలు చాలా ఉన్నాయి. ఎన్నున్నాయో తెలుసుకోడానికి వీలయినన్ని ఉన్నాయి. ముక్కు కనిపించకపోయినా కన్నొకటి మాత్రం కనిపిస్తోంది. పటుత్వం లేకపోయినప్పటికీ, పుల్లలా ఉన్నప్పటికీ, ఏనుగంత ఎత్తున్నాడు. ఎమికల మీద సాగి సడలిన చర్మం కురుపులతో నిండింది, తెగింది, ఈగలతో చింకి పేలికలతో మూయబడింది, మూయబడకుండా ఉంది. మొత్తంమీద (మనిషా, ముష్టివాడా?) అతగాడు ఆకలీ రోగమూ ఈగలూ  తప్ప మరేమీ తెలియనివాళ్లా ఉన్నాడు. చూడ్డానికి చాలా బీభత్సంగా ఉన్నాడు. కాలీకాలని శవాలు అలానే ఉంటాయి.

         సాయంకాలం ఆరుగంటలకి అయిదేళ్ల కొడుకును వెంటబెట్టుకొని యింటికి వచ్చేస్తున్నాడు అన్నారావు. ఆదివారం కూడా అతనికి  తెరిపిలేదు. ఇంట్లో బోలెడుండిపోయింది ఆఫీసుపని. పదిహేనేళ్ళ ఆఫీసు జీవితం చూస్తే, అది నలుగురాడపిల్లలు, లేడు లేడనుకొని ఆశంతా వదులుకున్నాక ఆఖర్న ఓ కొడుకు. అన్నారావుని చూస్తే అతనికి ఆశలన్నీ ఉడిగిపోయినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. వచ్చిన చిక్కేమిటంటే ఆ సంగతి అతనికి మాత్రం ఇంకా తెలీదు. అందుచేతనే, చీటికీ మాటికీ చిరాకు పడిపోతూ ఉంటాడు.

         సిగరెట్టుపెట్టె కొనుక్కుందికి, అన్నారావు కిల్లీకొట్టుదగ్గరికి వెళ్తే, అతన్ని అక్కడ కూడా వెంటబడ్డాడు అతగాడు.

         ‘‘నాయనగారూ! మూడు దినాలనించీ కూడు మొహం చూళ్ళేదు. ధర్మం చెయ్యండి నాయనగారూ!’’ అంటూ అంతదూరంలో నిల్చున్నాడు. అతగాడు ముక్కుతో మాట్లాడటం లేదు. ముక్కులోంచి మాట్లాడుతున్నాడు. మనిషికంటే మాట ఎక్కువ భయంకరంగా ఉంది. అదేదో లిపిలేని భాషలా ఉంది. లోపల్నించి పాములు బుసలుకొట్టి పలుకుతూన్నట్టుగా ఉంది.

         ‘‘ధర్మం చెయ్యండి నాయనగారూ!’’

         ‘‘చెయ్యను’’ అని టూకీగా అన్నాడు అన్నారావు.

         ‘‘మూడ్రోజుల్నించీ తిండిలేదు నాయన గారూ! ఆకలవుతోంది, ఒక్కణా….’’

         ‘‘ఇవ్వను’’

         ‘‘మాడిపోతున్నాను నాయనా.’’

         ‘‘పోరా బాబూ!’’

         అన్నారావు అసహ్యించుకొని కోపగించాడు.

         కిల్లీ దుకాణంలో గడియారం ఆరయిందని అయిదు నిముషాలు ఆలస్యంగా చెప్తోంది. సూర్యుడు అస్తమించేస్తున్నాడర్రో అని పడమటి దిక్కు ఎర్రగా ఏడుస్తూ చెప్తోంది. ఎండ తగ్గినా, వేసవికాలం సుమా ఇది అని వేడి అందర్నీ కుమిల్చేస్తోంది. వీధిలో శరవేగంతో వెళ్ళిపోయే కార్లు ‘‘కారులు గలవాడె రాజు గదరా సుమతీ’’ అని  పొగలు కక్కి దుమ్మెత్తి చెప్తున్నాయి. ముష్టివాళ్లంతటా ‘‘రోగమో రోగమో, ఆకలో, ఆకలో’’ అని కేకలేసి చెప్తున్నారు. సినీమావాళ్లు ఆడబొమ్మల బొమ్మ గుండెలు చూపించి సినిమాకి రమ్మని ఊరించి చెప్తున్నారు. అన్నారావు కొడుకు ముష్టివాడివైపు చూస్తూ ‘‘రా నాన్నా ఇంటికి పోదాం’’ అని చెప్పలేక చూస్తున్నాడు.

         ‘‘ఒక్క కాణీ, నాయనగారూ!’’

         ‘‘నీకో దండంరా బాబూ! ఫో ఇక్కణ్నంచి.’’

         అన్నారావు కొడుక్కి ఈగల మనిషిని చూస్తే భయం వేసినట్టుంది. అయినా ఆ ముష్టివాణ్ణి చూడ్డం మాత్రం మాన్లేదు. అంతలో ఈగలతో ఆ మనిషి ‘‘చిన్న తండ్రీ! ఒక్క నయాపైస’’ అంటూ కుర్రాడివైపు ముందుకి కొంచెం జోగాడు.

          నల్లవాళ్ళని తెల్లవాడొకంతట వదలనట్టు, దారిద్య్రాన్ని ఈగలొదలవు.

          అన్నారావు కొడుకు అన్నారావుకి ముద్దు. పిల్లడిమీద ఈగపిల్లనయినా వాలనివ్వడతను. అటువంటిది, అన్ని ఈగలు అంత దగ్గరా వచ్చేసరికి అతనికి గాభరా వేసింది. కోపం ఎక్కువయింది.

         ‘‘పోరా వెధవా! పోతావా పోవా? పోకపోతే తంతాను. ఫో ముందిక్కణ్ణించి’’ అని వాణ్ని తిట్టి ‘‘అయినా నిన్ను అనేం లాభం. కాలం అలా ఉంది. ప్రభుత్వం అలా ఉంది. పరిపాలనలా ఉంది’’ అని కేకలు వేసుకుని, అప్పుడు దుకాణం వాడివేపు తిరిగాడు అన్నారావు.

         ‘‘ఓయ్‌,  ఏది నా బర్కిలీ పెట్టె? ఇక్కణ్నిలబడితే ముష్టివాల్లు భక్షించేస్తారు. తే, వేగరం తే! చిల్లరేదీ?  రూపాయిచ్చాను. మంచివాడివే! అవునవును, జ్ఞాపకాలుండవు. నాకు తెలుసు. కాలం అలానే ఉంది మరి’’ అంటూ సిగరెట్టు పెట్టె, చిల్లరా తీసుకొని డబ్బులు లెక్కపెట్టుకుంటూ నడిచాడు అన్నారావు.

         కిల్లీ కొట్టు దగ్గర ‘రుచికరమైన ఈ మార్కు సిగరెట్టునే వాడుడు. మిక్కిలి ఉల్లాసమునిచ్చును’ అని చెప్పే బోర్డొకటుంది. దానికి పదిగజాల దూరంలో మరో బోర్డుంది. ‘ఈ మార్కుగల అసలైన అమృతమునే సేవించుడు. ఆకలి కలిగించి బలము నిచ్చును’ అని నొక్కి వక్కాణిస్తోంది. అన్నారావూ అతని కొడుకూ ఓ బోర్డునుంచి ఓ బోర్డుదాకా నడిచారు. అప్పటికి చేతిలోని చిల్లరడబ్బుల చిల్లు చెల్లులు సరిచూసుకోడం పూర్తిచేసిన అన్నారావు, పిల్లడు బితుకూ బితుకూ వెనక్కి చూస్తూ నడవడం గమనించి, ‘‘ఏం రాజుబాబూ! ఆ వెధవకాని ఇంకా వస్తున్నాడేవిటి?’’ అంటూ వెనక్కి తిరిగాడు.

         వెనకనే ఉంది సగం కాలిన శవం.

         ‘‘నాయనగారూ! బాబూ! కన్నతండ్రీ! ఒక్కపైస.’’

         వాణ్ని చూడగానే, కొడుకుని దగ్గరగా తీసికొని ‘‘పోరా రాస్కెల్‌ ఫో! దమ్మిడీ ఇవ్వను ఫో’’ అని ముష్టివాణ్ని తిట్టి వాడిమీద కేకలు వేసి ‘‘ఇలాటి రాస్కెల్స్‌ని షూట్‌ చెయ్యాలి. చెయ్యకపోతే లాభంలేదు’’ అని కేకలువేస్తూ తొందరగా ముందుకి నడిచాడు అన్నారావు. ముష్టివాళ్ల మధ్య బతకడమే బ్రహ్మాండంగా ఉంది.

         రాజుబాబు మరొకసారి వెనక్కి తిరిగాడు. ఈగల మనిషిని ఆపాదమస్తకం మళ్ళీ ఓసారి చూశాడు. కుర్రవాడి కళ్ళూ అవతలమనిషి ఒంటికన్నూ క్షణంలో సగంపాటు కలిశాయి. చూపు కలియగానే అతగాడు చెయ్యి ముందుకి జాచి, ప్రార్థనాపూర్వకంగా కొంచెం బరువుగా ముందుకి వంగాడు. దాంతో ‘‘పదపద’’ అంటూ జనప్రవాహంలోకి ముందుకి తీసుకుపోయాడు రాజుబాబుని అన్నారావు. పిల్లవాడు మరోసారి వెనక్కి తిరిగాడు. ఈగలమనిషి అక్కడే అలాగే ప్రార్థనాపూర్వకంగా  నిల్చున్నట్టనిపించింది. మళ్ళీ చూస్తే, లేడు.

         అన్నారావు తన స్వంత గొడవల గురించి ఆలోచిస్తున్నాడు. చిరాకులు ఎక్కువవడంతో ఆలోచనలు కూడా ఎక్కువయ్యాయి. ప్రపంచంలో అతనికి మానవులకంటే మృగాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. దృష్టిదోషమా? కాదు, పరిస్థితే అసలలా ఉంది. ఎవరికి వాళ్ళు దోచుకోడం, ఎవరి వాళ్ళకి వాళ్ళు దోచిపెట్టడం, అవతల వాణ్ణి నిలువునా గోతులో తోసేయడం! ఇలా, లోకంలో అంతమందీ కూడా స్వార్థపరులు, సెల్ఫిష్‌ రాస్కెల్స్‌! ఆ ఇంగ్లీషు ముక్కల్ని గట్టిగా పైకే అన్నాడు అన్నారావు. తండ్రిమాట విని కొడుకు తలెత్తి చూసి ‘‘ఏమిటి నాన్నా?’’ అనడిగాడు.

         ‘‘ఏంలేదురా బాబూ! నడునడు’’ అన్నాడన్నారావు.  ఉద్యోగంలో ప్రమోషన్‌కి పాసవ్వవలసిన టెస్టులన్నీ   అన్నారావు నాలుగేళ్ళయి పాసయి కూర్చున్నాడు. కాని, అలా కూర్చొనే ఉన్నాడు. పైకి వెళ్ళలేదు. వెళ్ళడానికి అవకాశం దొరకలేదు. ‘సరి, సరి, మర్లాభం లేదు. మంచంమీంచి దించీవలసిందే అనుకొనే సమయంలో అనుకోకుండా మంచి ఛాన్సొచ్చింది. ఇంకా బతికే ఉన్నానంటూ అన్నారావు లేచి కూర్చున్నాడు. కాని, ఎక్కడో ఉన్న పెద్ద సెక్రటరీగారి కొకరికి ఇక్కడ ఆఫీసులో దూరపు బంధువున్నాడు. అతను చాలామందికి ముద్దులకొడుకు కూడాను. అతడు అంతలో తెరవెనక్కి వెళ్ళి మీటనొక్కడం, తీగెలు లాగడం, ఇటువంటి చేయకూడని పనులన్నీ అతి సునాయాసంగానూ, బహు చమత్కారంగానూ చేశాడు. ఆఫీసర్లు ఎత్తుకు ముద్దులాడి వాడికి ప్రమోషనిచ్చారు. సరిసరి పరిస్థితిలో అన్నారావు యథాప్రకారం కొట్టుమిట్టాడుతున్నాడు.

         ఒకరి కూట్లో రాయి వెయ్యడానికి అందరూ తయారే. మరొకరి అన్నపుగిన్నె తన్నుకుపోవడానికి అందరూ సిద్ధమే. పై వాణ్ణి తొక్కిపారేయడమే. వాడేడుస్తే ఏడవడం, లేకపోతే చావడం. వాళ్లవాడు కాబట్టి వాడికి ప్రమోషను! వాడూ మనిషే, తనూ మనిషే, ఏం? వాళ్ళాటి ఆకలికాదూ తనాకలి? కాని ఎవడాకలి ఎవడిక్కావాలీ రోజుల్లో!

         అన్నారావు మనసులాగే వీధంతా కంగాళీగా ఉంది. దుమ్ముగా దొమ్మిగా ముష్టిగా ఉంది. అసహ్యంగా ఉంది. కలకల్లాడుతున్న పెద్ద పెద్ద మేడలు కూడా అసహ్యంగా సిగ్గువిడిచి నిల్చున్న ఆడవాళ్ళలా ఉన్నాయి. అన్నారావు కంటికి ముష్టివాళ్లు విపరీతంగా అదేపనిగా కనిపిస్తున్నారు. ఓ కార్లోంచి ఎవరోకాని గోల్డుప్లేక్‌ సిగరెట్టు పెట్టె ఖాళీది పైకి విసిరేశారు. దానికోసం పదిమంది ముష్టి పిల్లలు, అదే మంచి బంగారంలా, దానిమీద వాలి దానికోసం తన్నుకు చస్తున్నారు. వాళ్ళని చూసి చీదరించుకొని నాలుగడుగులు తొందరగా ముందుకి వేశాడు అన్నారావు.

         అంతలో అన్నారావుని ఎవరో ఆపారు. ఎవరని చూస్తే, ఆపినది రాజుబాబు. ‘‘ఏరా బాబు?’’ అనడిగేడు అన్నారావు.

         రాజుబాబు కళ్లు ఆడకళ్లూ, మనసు బేల మనసూను. పిల్లడికి రెండో యేటిదాకా గిరజాలుండేవి. ఆడపిల్లలా అందంగా చక్కగా ఉండేవాడు. చూసినవాళ్లు ముద్దులాడకుండా విడిచిపెట్టేవారు కారు. వాళ్ళంతా కూడా కుర్రాడికి దిష్టిపెట్టేస్తారేమోననే అన్నారావు భయం. ఆఖరికి, తక్కువ తిండివల్లా, ఎక్కువ దోమలవల్లా (‘‘దిష్టమ్మా దిష్టి; దిష్టివల్ల’’) రాజుబాబు జబ్బు పడిపోయాడు. రెండేళ్లపాటు – టాబ్లెట్సు, కాప్సూల్సు, ఇంజెక్షన్లు, వైటమిన్సు, ప్రోటీన్సు, టానిక్సు, హాస్పిటల్సు, డాక్టర్సు – చాలా డబ్బు ఖర్చయింది అన్నారావుకి. ఖర్చయితేనేం? బాబు బుగ్గలు మళ్ళీ సొట్టలు పడుతున్నాయి.

         ‘‘ఏరా?’’ అనడిగాడన్నారావు.

         ‘‘ఆకలేస్తోంది’’ అన్నాడు రాజు.

         ‘‘ఇప్పుడాకలేమిట్రా?’’ అని ఆశ్చర్యపడ్డాడు అన్నారావు.

         ‘‘ఆకలేస్తోంది. ఇప్పుడే’’ అన్నాడు రాజు.

         కొడుక్కి ఆకలేసిందని ఆశ్చర్యపడ్డందుకు తనని తను నిందించుకున్నాడు తండ్రి. ఆకలి ఎప్పుడైనా వేస్తుంది. ఎవరికైనా – ఎక్కడైనా వేస్తుంది. నాలుగు రోడ్ల జంక్షన్‌ దగ్గర ఉడిపీ, లక్ష్మీ బ్రాహ్మణ భోజన కాఫీ ఫలహారశాల దగ్గరకొచ్చేసరికి రాజు బాబుకి ఆకలేసినట్టుంది.

         ‘‘దా, రా బాబూ! ఇడ్లీ తిందువుగాని రా!’’ అన్నాడు అన్నారావు.

         రాజుబాబు తండ్రి చేతిని విడిపించుకొని ఒకడుగు వెనక్కివేసి నిల్చున్నాడు. ‘‘మావాడి నోరు చక్కగా ‘గ’లా ఉంటుంది’’ అంటుంది వాళ్లమ్మ. బుగ్గలు పూరించి చిన్న విల్లులాటి నోరు ఇంకా చిన్నది చేసి,

         ‘‘నాకు ఇడ్లీ ఒద్దు’’ అన్నాడు రాజుబాబు.

         ‘‘మరేం కావాలి? దోసె తింటావా?’’

         ‘‘తిన్ను.’’

         ‘‘పోనీ, కోవాబిళ్ళ తిందువుగాని, రా.’’

         ‘‘నా క్కోవాబిళ్ళొద్దు.’’

         ‘‘మరేంకావాలి? చెప్పు!’’

         ‘‘ఆకలేస్తోంది. నాకు అణా ఇయ్యి’’ అనడిగాడు రాజుబాబు. ఆ అడిగినప్పుడు, ‘‘ఇస్తాడా ఇవ్వడా నాన్న?’’ అనే ఆవేదన కుర్రవాడి ముఖంలో జాయగా కనిపిస్తోంది.

         ‘‘అణా ఎందుకూ?’’ అని అడిగిన అన్నారావు, కొడుకు ముఖం చూసి, వెంటనే జేబులోంచి డబ్బులు తీసి,  ‘‘పోనీ,  ఇంద. ఇదుగో అణా! ఏం చేస్తావ్‌? అరటిపళ్ళు కొనుక్కొంటావా?’’ అంటూ అణాకాసు ఇచ్చాడు.

         అణా పుచ్చుకొని, రాజుబాబు అలా నిల్చుండిపోయాడు. అణాకాసుని ఎడంచేత్తో పట్టుకుని, కుడిచేతి వేళ్ళతో దాని రాస్తూ తుడుస్తూ నిల్చున్నాడు.  ఏం చెయ్యాలో తోచనట్టుగా ఉంది కుర్రవాడికి.

         ‘‘ఏరా బాబూ?  ఏం చేద్దాం?  పోనీ, పిప్పరమెంట్లు, కొనుక్కుంటావా?’’ అని అడిగాడు అన్నారావు.

         పెద్దవాళ్ళ మేడలు చూడ్డానికి ఆఖర్న మరొక్కసారి వెలిగాడు సూర్యుడు. రోడ్డుమీద రాజుబాబు నీడ పొడవుగా పడింది. ఆ నీడ మెల్లిగా ముందుకి నడిచింది. అన్నారావు కూడా నీడ వెనక నడిచి కొడుకుని కలుసుకున్నాడు.

         ‘‘ఏరా బాబూ? ఏం కావాలంటావ్‌?’’

         ‘‘నా కణా ఒద్దు. ఇంద, తీసుకో’’ అంటూ తండ్రివేపు చెయ్యి జాచాడు, ఆ తండ్రివేపు ముఖం తిప్పకుండా.

         అణా తీసుకొంటూ, ‘‘మరి, ఆకలేస్తోందన్నావు?’’ అన్నాడు అన్నారావు.

         రాజుబాబు మాట్లాడలేదు.

         ‘‘ఏఁవిఁరా బాబూ? నిజంగా ఆకలెయ్యడంలేదుట్రా?’’ అని ముద్దుగా అడిగాడు అన్నారావు.

         రాజుబాబు అయిదడుగులు ఊరుకొని, ఆ తర్వాత ‘‘మరి, నువ్వు, ఇందాకా ఎందు కివ్వలేదూ?’’ అన్నాడు.

         ‘‘ఇందాట్లా నువ్వడిగావా? ఎప్పుడడిగావురా?’’ అని కొంచెం ముద్దుగా ప్రశ్నించాడు అన్నారావు.

         ‘‘ముష్టబ్బి అడిగాడు కదూ!’’ అన్నాడు రాజు. దాగి వున్న ప్రశ్నకి వెంటనే సమాధానం ఇచ్చేశాడు అన్నారావు.

         ‘‘వాడు ముష్టివాడూ’’ అన్నాడు. ముష్టివాళ్ళకి అణాలివ్వకూడదని రూలున్నట్టు.

         ‘‘మరి వాడికాకలేస్తోందిట!?’’

         ‘‘వెయ్యనీ, ఏం చేస్తాం?’’

         ‘‘మరి, నాకిచ్చావు!’’

         ‘‘పద పద. అణా దాచుకుందువుగాని. ఇంటికెళ్లాక దాచమని అమ్మకిస్తాను’’ అంటూ సంభాషణ ఆపేయజూశాడు అన్నారావు.

         శ్రీరాములుగారికున్నంత మొండితనం ఉన్నట్టుంది రాజుబాబుకి. దాదాపు ఇంటివరకూ వెళ్ళేదాకా ఆకల్నీ అణానీ ముష్టివాణ్ని పట్టుకు విడువకుండా అలా ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు.

         అన్నారావుకాఖరికి విసుగేసింది. ‘‘నువ్వు నా కొడుకువిరా బాబూ! అందుకూ! అందుకిచ్చాను. మరింక మాటాడక నడు!’’ అని ఫైనల్‌గా అన్నాడు. అతని చీదరింపు చూసి మరి మాటాడక ఊరుకున్నాడు రాజుబాబు.

         ఇంటికి వెళ్ళగానే అన్నారావు భార్య,

         ‘‘రెండురూపాయలుంటే ఇద్దరూ!’’ అని అడిగింది.

         ‘‘చిల్లర కాయితాల్లేవు’’ అని విసుక్కున్నాడు అన్నారావు.

         ‘‘పోనీ, వో అయిదుంటే అదే యివ్వండి’’ అందతని భార్య.

         అయిదు రూపాయల కొత్తనోటు జేబులోంచి తీసి దాన్ని మరో కొత్త నోటు అంటుకోలేదని వేళ్లతో రాసి రూఢిచేసుకుని భార్య చేతికిచ్చాడతను.

         రాత్రి ఏడున్నర గంటలకి తమ్ముడూ అక్కలూ భోజనాలు చేసేక, ఆడపిల్లలు నలుగురూ డాబామీదికి చాపలూ, దుప్పట్లూ, తలగడలూ పట్టుకు వెళ్ళిపోయారు. రాజుబాబు మాత్రం ఏబిసిడిలు దిద్దుకుంటూ కూర్చున్నాడు. గదిలో బల్లదగ్గర. వాలుకుర్చీలో పక్కనే వున్న అన్నారావు ఆఫీసుకట్టల్లో మునిగిపోయున్నాడు.

         ఎనిమిది గంటలు కొట్టేసరికి అన్నారావుకి కడుపులో దేవినట్టయింది. గుండెల్లో చిరుమంట లేసింది. కళ్లముందున్న అకౌంటు కాయితాలు చూపుకి దూరమయ్యాయి. కాయితాలని పట్టుకున్న చేతులు వజవజ  వణికాయి. కాయితాలు కిందని పడేసి, గప్పున కుర్చీలోంచి లేచాడన్నారావు. భార్య, వారపత్రిక చదువుతోంది.

         ‘‘ఆకలేస్తోందే పూర్ణా! అన్నం వడ్డించు వేగిరం! వేగిర వేగిర!’’ అంటూ తొందరపెట్టాడు, అన్నారావు.

         ‘‘మీదే ఆలస్యం, పదండి’’ అంటూ పూర్ణమ్మ, పత్రిక పడేసి, లేచి వంటింటివేపు నడిచింది. వంటింట్లోకి, ఆమెని  దాటి ఆమెకంటే ముందు వెళ్లాడు అన్నారావు. వాళ్ళనలా చూస్తూ కూర్చున్నాడు రాజుబాబు.

         భోజనం చేశాక, అన్నారావు మళ్ళీ కాయితాల్లో కలిసిపోయాడు. తల్లీ, పిల్లలూ డాబా మీద పడుకున్నారు. అక్కడ రాజుబాబు, ‘‘అమ్మా! నాన్న నీకు కొడుకా?’’ అని తల్లిని అడగడం, ‘‘అవేం మాటల్రా నాయనా! కళ్ళు మూసుకు పడుకో’’ అని పూర్ణమ్మ కొడుకుని ముద్దుగా మందలించడం అన్నారావుకి తెలియలేదు. రాత్రి పదిగంటలకి అతను డాబామీదికి వెళ్ళేసరికి అతని భార్యాపిల్లలూ ఆ వెన్నెల్లో వరుసగా ‘క్యూ’లోలా పడుకునున్నారు.

         అన్నారావుండే మురికి యిల్లు చాలా ఇరుకుల్లో ఉంది. ఆ యింటికి అటుపక్కా యిటుపక్కా రెండు మురికి సందులు పాముల్లా వంకలు తిరిగున్నాయి. దగ్గర్లో ఉన్న ఇళ్లన్నీ పాడుపడి పోతూన్నవి, కూలిపోతూన్నవీను. డాబా ఎక్కి చుట్టూచూస్తే దూరంలో కొత్త మేడలూ, దగ్గర్లో పాత పెరళ్ళలోని పొడవాటి కొబ్బరిచెట్లూ, వేపచెట్లవి నల్లని కొమ్మలూ, ఇటికలే మిగిలిన గోడలూ, ఊచలే లేని కిటికీలు కనిపిస్తాయి.

         అన్నారావు, డాబామీద పిట్టగోడని ఆనుకొని, సిగరెట్టు కాలుస్తూ, నిల్చొని పిల్లల వైపొకసారి చూశాడు. రాజుబాబు నిద్రలో కొంచెం కదిలి ఏవో కలవరించాడు. అణా అన్నాడా? ఆకలన్నాడా? ఏదో అనడం మాత్రం అన్నాడు.  దగ్గరగా వెళ్ళి చూసొచ్చాడు అన్నారావు. వెన్నెల జాలులో కుర్రవాడి లేతముఖం జాలిగా ఉంది. అన్నారావుకి భయం వేసింది. ముష్టివాణ్ని చూసి పిల్లడు జడుసుకొన్నట్టున్నాడు.

         ఏమో! రోజులిలాగే ఉంటే అందరం ముష్టి వెధవలమైపోయేట్టున్నాం!

         అన్నారావుకి భయంతోపాటు ఏదో అసంతృప్తి కూడా కలిగింది. పిల్లడి ప్రశ్నలన్నీ అతనికి గుర్తుకొచ్చాయి. తన  ప్రమోషన్‌ విషయమై అర్జీ పెట్టుకొంటే అధికారులు జవాబివ్వకపోవడం, రాజుబాబు వేసిన ప్రశ్నలకి తను సరైన  జవాబివ్వలేకపోవడం,  అన్నీ అతణ్ని ఆలోచనలో ముంచాయి. సిగరెట్టు విసిరేసి పిట్టగోడని రెండు చేతులూ ఆన్చుకొని అతను నిల్చోడం మాత్రం నిశ్చలంగా నిల్చొనున్నాడు.

         ఆ పాత కొంపల్లో ఎక్కడో కాని ఓ చిన్న పిల్లడితో, పిల్లడో ‘‘వ్వా! ఉవ్వా!’’ అనే ఏడుపు అదొక పక్షికేకలా వినిపిస్తోంది. ఆకలికా? అనుకున్నాడన్నారావు. తల్లో ఎవరోపాడే జోలపాట ముక్కముక్కలుగా తెగిపోయి దీనంగా  అస్పష్టంగా కొంచెం కొంచెంగా చెవిని పడుతోంది. ఓ ఫర్లాంగు దూరంలో, ఓ పాడుబడ్డ పాత మేడమీది కిటికీ, కురుపు వేసిన కంటిలా, ఎర్రగా కనిపిస్తోంది. గదిలోపల హరికేన్‌ లాంతరు వెలుగులో, ఆరిపోయిన మనిషెవడో పడుకోలేక కాబోలు పచార్లు చేస్తున్నాడు. గుడ్డి వెలుక్కి అడ్డుగా అతను పచారు చెయ్యడంతో, ఆ కన్నులాటి కిటికీ రెప్ప వేసుకొని తెరుస్తున్నట్టుగా ఉంది. పక్కన సందులో ‘‘వెన్నెలా! కన్నతల్లీ! పేదవాడి దీపమా!’’ అనుకొంటూ ముసలాడెవరో టక్కూ, టక్కూ వెళ్ళాడు. అతని కర్రకాళ్ళు చప్పుడు దూరమయింది,  చిన్నదయింది,  చివరికి వినిపించకుండా పోయింది. అంతలో రెండోపక్క సందులో దడదడ చప్పుడైంది. చెత్తడబ్బాలోని కాయితాలకోసమూ, ఎంగిలాకుల కోసమూ అక్కడ  నాలుగావులు పులుల్లా పోట్లాడుకుంటున్నాయి. వాట్లో రెండావులు దెబ్బలాళ్లేక తొందరగా పారిపోయి, అక్కణ్నించి చెత్తడబ్బా వైపు ఆశగా చూస్తూ వెర్రిముండల్లా నిల్చున్నాయి. సందుల్లోంచి గాలంతా, కుళ్లు కాలవల మురికి వాసనతో మత్తెక్కిపోయి మతిచెడిపోయి సొమ్మసిల్లిపోయి మెదలకుండా పడుంది.

         వర్షం కరిగి సన్నని తుంపరై, చల్లని ఆవిరైనట్టుగా వెన్నెల మాత్రం అంతటా జాలికి జారిపడుతోంది. పాతమేడలు, మొండిగోడలు, వేపకొమ్మలు, కొబ్బరాకులు, సందులోని రాళ్ళు, కాలవల్లోని మురికినీళ్లు, అన్నింటినీ ఆ వెన్నెల తాకుతోంది. రానక్కర్లేదని రావద్దురావద్దని అడ్డుపెట్టుకొంటే తప్ప ఆ వెన్నెల వెళ్లని చోటంటూ లేదు.  అక్కరలేదని చెప్పి దాగుంటేనూ, దాచేస్తేనూ తప్ప ఆ వెన్నెల జాలు పడని ప్రాణిలేదు. పదార్థం లేదు.

         తలెత్తి చంద్రుణ్నోసారి చూసిన అన్నారావు. ‘‘తండ్రీ! చంద్రశేఖరా! సర్వేశ్వరా!’’ అనుకున్నాడు. ఇలా అనుకున్నాడు, అలా అదిరిపడ్డాడు. ఆ రాత్రి సమయంలో ఏ తెరవని గుమ్మం దగ్గరో ఎక్కడో నిల్చొని ఏ ముష్టివాడో ఎవరో వేసిన, ‘‘అమ్మా! అన్నపూర్ణేశ్వరీ!’’  అనే పెనుకేక అతని చెవిని బద్దలు చేసింది. ఆ పిలుపులోని బలం,  ఆ పిలుపులోని నైరాశ్యం అతణ్ణి భయకంపితుణ్ని చేశాయి. ఊరుదాటి ఊళ్ళన్నీ దాటి పాలకుల్నీ, పాఠకుల్నీ అందర్నీ దాటి అడవులు, కొండలెడారులన్నింటినీ దాటి ఆవిడ ఎక్కడుంటే అక్కడికి దూరమైనా వెళ్ళి ఆ తల్లి చెవిని దూసుకుపోవాలా కేక. అదంతటి కేక!

         భయంతో ఏవేవో ఆలోచిస్తూ పడుకున్నాడు అన్నారావు.

         ఆ రాత్రి రెండు జాముల వేళప్పుడు రాజుబాబు నిద్రలేచి, పూర్ణమ్మని ‘‘అమ్మా! అమ్మా! ఆకలేస్తోందే!’’ అన్నాడు. ఆవిడ కళ్ళు నులుపుకొని చటుక్కున లేచి కూర్చుని ‘‘కిందకెళ్లి పాలు – పాల్లేవు – కాస్త మజ్జిగ తెస్తానుండరా నాయనా!’’ అంది.

         రాజుబాబు ఒక్క క్షణం ఊరుకొని, ‘‘నాకొద్దు నాకొద్దు!’’ అంటూ మళ్ళీ పడుకున్నాడు.

తొలిప్రచురణ : ‘భారతి’ ఆగస్టు 1961

పుస్తకరూపం : ఆరుచిత్రాలు

సంకలనం : నవకథామాల 1962 రచనాసాగరం – 2007

admin

leave a comment

Create AccountLog In Your Account