వేతనాలతో సరిపుచ్చుకునే ‘‘వేతన శర్మ’’ కథ

వేతనాలతో సరిపుచ్చుకునే ‘‘వేతన శర్మ’’ కథ

ఓ.వీ.వీ.యస్‌. రామకృష్ణ

                రాచకొండ విశ్వనాధశాస్త్రిగారు రాసిన మంచి కథల్లో ‘‘వేతనశర్మ’’ కథ కూడా ఒకటి. ఈ కథని ఆయన 1971లో రాశారు. ఈ కథను మొదట ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలోనూ, తర్వాత ‘బాకీ కథలు’ సంకలనంలోనూ, ‘ఉపాధ్యాయ 2004’, సంకలనంలోనూ ప్రచురించారు.

                పాలకయంత్రపు రథాన్ని సజావుగా నడిపించే కర్తవ్యం, ఏ దేశంలోనైనా ఉద్యోగవర్గానిదే. ఐయ్యేయెస్సులు మొదలుకొని, పంచాయితీ ఆఫీసు ప్యూన్ల వరకు…. ఇంకా చెప్పాలంటే నేటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామపంచాయితీ వలంటీర్ల వరకు ఈ కర్తవ్యాన్ని పాలకస్వాములకు అనుకూలంగా ఎలా నిర్వహిస్తూ ఉంటారో మనకందరకూ తెలిసినదే. ప్రజాస్వామ్యపు గోముఖం ధరించి, లోపల కోరలు సాచి సదా సిద్ధంగా ఉండే పులి లాంటి మన పాలకవర్గపు తోకలాగ ఉద్యోగవర్గం ఇమిడిపోయి ఉంటున్నది. ఈ తోక ఏక కాలంలో అటు ప్రభువుల ఆలోచనలకు అనుగుణంగానూ, ఇటు అమాయక ప్రజలకు బెదిరింపులుగానూ ‘‘ఎప్పటికెయ్యది ప్రస్తుత’’ మన్నట్లు ఊగుతూ ఉంటుంది. ఒకవేళ తోకే గనక పులికి ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడితే….. తోక ఎలాగూ గెలవలేదు గానీ, పులి ఎలా లొంగదీస్తుంది? రాజీ  బేరాలెలా కుదురుతాయి?!…. తోకని ఎప్పుడూ తోకగానే ఎలా ఉంచాలి?!. మొదలైన నిస్పృహతత్త్వపు ప్రశ్నల నుండి,.. ఛీ.. ఛీ.. అసలు పాలకులు పులులేంటి? ఉద్యోగులు తోకలేంటి?!.. ఏమిటీ ఛండాలపు పోలిక…. ప్రజలే పాలకులైన ఈ ప్రజాస్వామ్యంలో పాలకుల పీడన ఏమిటి?!.. ఉద్యోగులనేవాళ్ళు సకల సంపదల సృష్టికర్తలైన ప్రజలవైపు ఉండాలా.. పీడించే ఈ పాలకుల వైపు ఉండాలా…. లాంటి అనేకానేక ప్రశ్నలు రావిశాస్త్రిగారి ‘‘వేతనశర్మ’’ కథ చదువుతున్నప్పుడు మనకు కలుగుతాయి.

                కథలోకి వెళితే, మగథ దేశాన్ని సుందరసేన మహారాజు ‘‘పాలకవర్గ జనరంజకంగా’’ పాలించేవాడు.  ప్రారంభంలో,….  ప్రజలను పాలిస్తున్నందుకుగానూ వారు ఉత్పత్తి చేసే సంపదలో పదవ వంతే పన్నుగా స్వీకరించేవాడు. క్రమేపీ మహారాజుకూ, రాజకుటుంబీకులకూ, బంధుమిత్రులకూ లాభాపేక్ష బాగా పెరిగిన మీదట ప్రజల మీద పన్నుల భారం భరించలేనంతగా పెరగడమూ, ప్రజల నడ్డి వంగడమూ జరిగింది. కాగా రాజ్యంలో అటు రాజుకీ, ఇటు ప్రజలకీ మధ్య చదువుకొని పన్నుల వసూళ్ళు, జమాఖర్చుల లెక్కలు సరిచూసి మిగుళ్ళు రాజుకు సక్రమంగా చేరవేసే కరణాలు కూడా ఉన్నారు. వారి నాయకుడు వేతనశర్మ.

                నడ్డి వంగిపోయిన ప్రజారాశులు ఇక ఎంతమాత్రమూ పన్నుల పీడన భరించలేని స్థితిలో మార్కండేయుడనే ఋషిసత్తముడు ప్రజలే రాజులు కావడం తప్ప ఈ పీడనకు మరో మార్గంలేదని గ్రహించేడు. గ్రహించి ఊరుకోకుండా మీ రాజ్యం మీరేలండంటూ ప్రజలకు సత్యబోధ చేసేడు. బోధ ఫలించిన ఫలితంగా ప్రభువర్గం మీద సామాన్యజనం తిరగబడ్డారు. ఈ తిరుగుబాటుకు సుందరసేన మహారాజు ముందు కొంచెం తల్లడిల్లినా, వెంటనే తెప్పరిల్లి మార్కండేయ మహర్షి మీద నీచమైన కుట్రలు అమలుజరిపి అడ్డు తొలగించుకున్నాడు. తదుపరి తిరుగుబాటుదార్లూ, రాజ్యవ్యతిరేకులు, రాచభటులకు వ్యతిరేకులైన అందరినీ వెంటాడి వేటాడతారు. ప్రజలతో కలసి రాజుపై తిరుగుబాటు చేసిన కరణాల మీద కూడా వేట ప్రారంభమౌతుంది. చదువుకున్న వాళ్ళకి బుద్ధి చెపితే, మిగిలినవాళ్ళకి మరింత బాగా బుద్దొస్తుందని రాజు నమ్మి, కరణాలను మరింత ఎక్కువగా హింసించి చంపసాగాడు.

                ఈ భీతావహ పరిస్థితిలో వేతనశర్మ చురుకుగా ఆలోచిస్తాడు. అసలు తిరుగుబాటుకు కారణమేమిటి?!. రాజ్యవర్గపు దోపిడి – మరైతే ఈ రాజ్యవర్గపు దోపిడీ వలన మన కరణాలకేమిటి నష్టం?…. ఏమీలేదు. కేవలం జీతాలు తక్కువైనంత మాత్రాన మామూలు మనుషుల్లాగ తిరుగుబాట్లు చేసి ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం కరణాలకు ఉందా?!…. అని ప్రశ్నించుకోగా, లేదనే అతనికి సమాధానం తోచింది. దరిమిలా కరణకులతిలకుల సమావేశం ఏర్పాటుచేసి, ఇదే విషయాన్ని బోధించి, వారందరినీ ఒప్పిస్తాడు. వారంతా కలిసి వేతనశర్మనే తమ ప్రతినిధిగా రాజు వద్దకు పంపగా,…. మాకు విప్లవాలు అవుసరంలేదు. జీతాలు మాకు పెంచండి – మిమ్మల్ని దించే కార్యక్రమాలు మేము చేపట్టం…. అని విధేయంగా పలికి సానుకూల ఒప్పందాలు చేసుకోగలుగతాడు. ఇదీ కథ.

                తిరుగుబాట్లు చెలరేగుతూ విప్లవాల బాటలో నడుస్తున్న చరిత్ర పొడుగునా వేతనశర్మలను రాజ్యం సృష్టిస్తూనే వుంది. ఉద్యమాలకు వెన్నుపోట్లూ పొడిపిస్తూనే ఉన్నది. అందుకే ప్రజల నుండి ఉద్యోగ వర్గాన్ని వేరుచేసి ప్రభువుల అడుగులకు మడుగులొత్తుతూ ప్రభుతకు అనుచరులుగా ఉద్యోగవర్గాన్ని మలిచారు. సామాజిక, ఆర్ధిక దోపిడీ పీడనలను ప్రజలతో పాటు గురౌతూనే రాజ్యం యొక్క బంటులుగా, రాజ్యాన్ని కాపాడే అధికారులుగా, కుహనా అధిపతులుగా ప్రజల నుండి వేరుచేయబడ్డారు. వ్యక్తిగత స్థాయిల్లో ప్రజాందోళనలు, ఉద్యమాలపట్ల సంఫీుభావమే తప్ప,…. వర్గంగానే కదిలి ప్రజారాశులకు అండగా వెన్నంటి ఉండే పరిస్థితి తక్కువగా కనబడుతుంది. 32 మంది సామాన్య ప్రజలు ప్రాణత్యాగం చేసిన ఫలితంగా పొందిన విశాఖ ఉక్కు పరిశ్రమ వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి  అవకాశాలను కల్పించింది. దాని ఉత్పాదకతతో దేశ ఆర్ధికంలో తన వంతు పాత్ర నిర్వహించింది. అటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్నే గత పాలకులు ప్రయివేటీకరణ మొదలుపెట్టారు. దానిని కొనసాగిస్తూ నేటి పాలకులు ఏకంగా ఉక్కు కర్మాగారాన్నే అమ్మివేసి చేతులు దులుపుకుంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 500 రోజులుగా జరుగుతున్న ఉద్యమంలో ప్రజల నుండి ప్రభుత్వాల నుండి రావల్సినంత తోడ్పాటు రావటంలేదు. పాలకవర్గ పార్టీలు ఎన్ని ఉన్నా అవి అన్నీ అధికారం చేజిక్కించుకోవటంలో ఐక్యతగా ఉన్నాయి తప్ప ప్రజలపట్ల, ప్రజలకు చెందిన ఉత్పత్తి వనరుల పట్ల ఏ విధమైన బాధ్యత వహించడంలేదని అర్ధమవుతుంది. ప్రజలను కదలించలేకపోతున్నాయి. పే రివిజన్‌ కమీషన్‌ (పిఆర్‌సి) అమలుచేయకపోవడం, డి.ఏ.ల (కరువుభత్యాలు) ఎగవేత తదితర సమస్యలపై ఇటీవల లక్షలాదిమంది ఉద్యోగ ఉపాధ్యాయులు విజయవాడలో కదం తొక్కినపుడు, సాధారణ ప్రజలూ సానుకూలంగా స్పందిస్తూ మంచినీరు, మజ్జిగలు అందించారు. విజయవాడ బిఆర్‌టిఎస్‌ రోడ్డుకిరువైపులా పదుల సంఖ్యలో గృహస్థులు ఉద్యమకారులను తమ యిండ్లలోనికి పిలిచి సేదతీర్చుకోనిచ్చారు.

                 గ్రామగ్రామాన సర్కారీ పాఠశాలల ఎత్తివేత, ఉపాధ్యాయ పోస్టుల ఎత్తివేత, ఉద్యోగ నియామకాల నిలిపివేత తదితర చర్యలతో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పాలకుల ప్రజావ్యతిరేక విధానాలు ప్రజలకు చేరటంలేదు. అలాగే కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయులలో సైతం తాము కూర్చొన్న కొమ్మలు ఒక్కొక్కటిగా నరికివేయబడుతున్నా పరిస్థితి తీవ్రతను అర్ధంకానివ్వకుండా రకరకాల సంక్షేమ పథకాల ప్రలోభాలకు లోను చేస్తున్నారు. కథలో చెప్పినట్టు…, ‘‘ఎక్కువ జీతాల కోసం సమ్మెలే తప్ప, సమసమాజం కోసం విప్లవాలు వొద్దంటారు ప్రభువులు. ఔనంటారు ప్రభుత్వోద్యోగులు’’ అనే వేతనశర్మ తత్త్వం దశాబ్దాల తరబడి ఘనీభవించిపోయిన పరిస్థితి ఫలితమిది. వేతనశర్మ లందించే ప్రయోజనాలను లొట్టలు వేసుకుంటూ రుచి చూస్తున్న పాలకులు తమకు కావలసిన వేతనశర్మలను తామే తయారుచేసుకుంటూ, వంచన కళలో ఆరితేరుతున్నారు. ఇటీవలి పిఆర్‌సి ఉద్యమం సందర్భంగా లక్షలాదిమంది ఉద్యోగ ఉపాధ్యాయుల ఆశల మీద నీళ్ళు కుమ్మరించడంలో జెఏసి నాయకులు నిర్వహించిన పాత్ర అందరకూ తెలిసినదే. ప్రజలపై అమలౌతున్న శ్రమదోపిడీని అంతం చేయాలంటే ప్రజల రాజ్యం ప్రజలే ఏలుకోవాలన్న మార్కండేయ మహర్షి చెప్పిన విప్లవ సూత్రాన్ని ప్రజలకు చేరవేయవలసిన కర్తవ్యానికి బద్ధులై ఉండకుండా, దోపిడీ పాలకవర్గపు తోకగా  యిమిడిపోయే  వేతనశర్మల  అవకాశవాదాన్ని  బానిసత్వపు శిలాజంగా…. ఎత్తిచూపిన కథ ‘వేతనశర్మ’ కథ.

                వేతన శర్మల విషయంలో రాచకొండవారి కథనం అద్భుతంగా ఉంది. మార్కండేయ మహర్షి విషయంలో మాత్రం పాఠకుడికి కొన్ని ప్రశ్నలు మిగులుతాయి. రాజవర్గపు కత్తులకు, వేతనశర్మల వెన్నుపోట్లకు గురై గాయపడిన విప్లవం అలసట తీర్చుకుని మరునాడెప్పుడో చిచ్చుగా మారడానికి అడవులలో తలదాచుకుందన్నారు. మీ రాజ్యం మీరేలండని, విప్లవ బాధ్యత ప్రజలే నిర్వర్తించాలని మార్కండేయ మహర్షే చెప్పినప్పుడు…. అది సేదతీరాలన్నా, పుంజుకొని చిచ్చుగా మారాలి అన్నా ప్రజల మధ్యే కదా తలదాచుకోవాలి….రాజ్యంలో తప్ప అడవులలో రాజు అధికారం ఉండదా?!.. వేట సాగదా?!.. ప్రజల సమష్టి శక్తి కాకుండా వేరే ఏ ఇతర శక్తి ఐనా ప్రజలు లేని అడవులలోంచి పుంజుకొని వచ్చి విప్లవ చిచ్చును రగిలిస్తుందా?!.. విప్లవ గమనంలో అడుగడుగునా అడ్డుతగిలే వేతనశర్మల వెన్నుపోటుతత్వాన్ని అద్భుతంగా పట్టి చూపించిన కథలో ఈ ఒక్క గందరగోళమూ లేకుంటే ఎంతో బాగుణ్ను.

admin

Related Posts

leave a comment

Create Account



Log In Your Account