లైఫ్ ఆఫ్ జై

లైఫ్ ఆఫ్ జై

– డా. కే.వి. రమణరావు

          కారును సైడురోడ్లోకి తిప్పి పార్కింగ్‌ కోసం వెతుకుతున్నాడు జైరాజ్‌. జేబులో ఫోను రెండుసార్లు మోగి ఆగిపోయింది. ఇళ్ల యజమానులు వీధినే పార్కింగ్‌ లాట్‌గా మార్చుకొని రోడ్డుకు రెండువైపులా వాళ్ల కార్లు పెట్టుకున్నారు. చివరకు ఒక ఇంటిముందు గేటుకడ్డంరాని ఖాళీ కనపడింది. ‘ఇంటివోనరు చూసాడంటే తిట్లు తప్పవు, డ్రైవర్లంటే అందరికీ అలుసే. మాలాంటివాళ్లను గౌరవంగాజూసే రోజెప్పుడన్నా వస్తుందా’ అనుకుంటూ అక్కడ కారుపెట్టి గబగబా నడిచి అతని ఇల్లున్న సన్నటి సందులోకి తిరిగాడు.

          ఇంటి తలుపుకు తాళం వేసి వుంది. ఉస్సూరమంటూ మెట్లమీద కూర్చున్నాడు.

          ఫోనులో సందేశం వచ్చింది, తీసి చూసాడు. చంద్రకళ నుంచి రెండు మిస్డ్‌ కాల్స్‌, ఒక సందేశం. ఆమె ఫోను చేస్తే తను తీయడంలేదని నిష్టూరం చేస్తూ పెట్టిన సందేశం. తీస్తే కోపంగా మాట్లాడుతుంది. ‘ఎటుపోతోందో తెలియని తమ ప్రేమ విషయం చెప్పి ‘‘మొగోళ్లకు ఆడోళ్ల బాదలు అర్తమైతాయని అనుకోడం నాదే పొరపాటు. నాకోసం వొక్కసారి తిరప్తి రావచ్చుగదా జై’’ అంటుంది. ‘తనకు పెళ్లిసంబంధాలు చూస్తున్నారని అతను తనని పెళ్లిచేసుకోవడం ఆలస్యంజేస్తే తను దక్కనని’ హెచ్చరిస్తుంది.

          చంద్రకళ అతనిమీద అరచినా ఆమె గొంతు వినడం అతనికి సాంత్వనగా ఉంటుంది. ఆమె అతనికి దూరబ్బంధువు, మొదట్లో అతని తల్లికోసం తరచుగా ఇంటికొచ్చేది. జైరాజ్‌ నిర్లిప్తంగా వున్నా అతని వ్యక్తిత్వం నచ్చి క్రమంగా అతనిపట్ల ప్రేమను పెంచుకుంది. అతని బీదస్థితిని చూసి కూడా ఆమె ప్రేమించడం అతనికెప్పుడూ వింతే. ‘హెచ్చు తగ్గులను లెక్కచెయ్యనిది ప్రేమ వొకటేనేమో. స్థితిగతులకు సంబంధంలేకుండా మనుషులను ప్రేమించేవాళ్లు కరువైపోతున్నారు’ అనుకునేవాడు. చంద్రకళంటే అతనికీ యిష్టమే. ఐతే ఇది సినిమా కాదు, జీవితమనీ తెలుసు. అతని కళ్లకు ఆమె అందంగానేకాదు అందనంత ఎత్తులో కూడా కనబడుతుంది.

          చంద్రకళది మధ్యతరగతి స్థాయి, ముగ్గరుపిల్లల్లో మూడోది. ఆమె తండ్రిది తిరుపతిలో శానిటరి పరికరాల వ్యాపారం, గట్టిమనిషి. విషయం తెలిసి కూతుర్ని మందలించాడు. ‘జై చాలా మంచివాడని, కష్టపడతాడని, బాధ్యతగావుంటాడని’ చంద్రకళ చెప్పిచూసింది. అతను ఒప్పుకోలేదు. ‘జైకి వ్యాపారంచేసే తెలివితేటలు లేవు, మన సమాజంలో కష్టపడే మంచివాళ్లకు గుర్తింపు వుండదు. మనం మన స్థాయి నుంచి పైకి వెళ్లడానికే ప్రయత్నించాలి’ అని  అతను కూతురికి హితబోధ చేసాడు. ఆమె మనసు మార్చుకోకపోవడం గమనించి ఆమెను కట్టడి చేసి పెళ్లిసంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు.

          ‘బతుకుతెరువుకోసం ఈ హైదరాబాదు సిటీకి వలస వచ్చాడు. తన నిలకడలేని డ్రైవరు ఉద్యోగపు బొటాబొటి సంపాదనతో నలుగురు బతకాలి, ఇద్దరు చెళ్లెళ్లు చదువుకోవాలి. చేసిన అప్పులు తీర్చాలి. తీసుకున్న అప్పు ఎగ్గొట్టడానికి తనేమీ బడావ్యాపారి కాదు. వడ్డీ చెల్లించడం ఆలస్యమైతేనే పాట్లు తప్పడంలేదు. ఈ పరిస్థితులలో పెళ్లనే ఆలోచనే భయానకంగా వుంది’ అనుకున్నాడు.

          మరో మెస్సేజి వచ్చింది. కారు వోనరు చిదంబరంగారి భార్య అంటే ‘అమ్మగారు’ పంపిన పూజాస్టోరు నుంచి తేవాల్సిన సామాన్ల లిస్టు. దాన్ని స్టోరతనికి పంపిస్తూండగా ఇంటిముందు పక్కింటి గణేశ మోటారుసైకిలు ఆగింది. వెనకసీట్లోంచి జైరాజ్‌ తల్లి మల్లమ్మ, ఆమె ఒళ్లోకూర్చున్న చిన్నచెల్లి దీప దిగారు.

          ‘‘యెంతసేపైంది వొచ్చి జై?’’ అనడిగింది ఆమె తాళం తీస్తూ. జైరాజ్‌ జవాబివ్వలేదు.

          మోటారుసైకిలు స్టాండేసి వచ్చాడు గణేశ. ‘‘దీపాకు వొళ్లు కాలిపోతావిణ్ణిందినా, డాక్టరు యింజక్షనిచ్చిండాడు.    సాయంత్రానికి తగ్గిపోతిందన్నాడు’’ అన్నాడు.

          జైరాజ్‌ అయిష్టంగా నవ్వి ‘‘థాంక్స్‌ రా’’ అని లేచి ఇంట్లోకెళ్లాడు.

          ‘‘సాయంత్రమొస్తాత్తా, యీలోగా అవుసరముంటే చెప్పు’’ మల్లమ్మతో చెప్పి వెళ్లిపోయాడు గణేశ.

          గణేశ నాన్న మునిస్వామిదీ తిరుపతే కాబట్టి తోడుగా వుంటారని వాళ్లింటిపక్కనే రెండు గదుల ఇల్లు అద్దెకి తీసుకున్నాడు జైరాజ్‌.

          ‘‘యీ గణేశగాణ్ణెందుకు పిల్చుకోని పొయినావు? మణితో ఆటో దెప్పించుకోచ్చు గదా?’’ అడిగాడు జైరాజ్‌ లోపలికొచ్చాక కొంచెం కోపంగా.

          ‘‘యిప్పుడు మణి యింటర్మీట్టుగదరా, యేదో పరీక్షుందని పొద్దున్నే యెలబారి పోయింది. దీనికేమో వొళ్లు సలసలా కాగతిణ్ణింది. ఆటో దొరకాలన్నా మెయింరోడ్డుకు బోవాల. నువ్వేమో యెంతసేపిటికీ రాకపోతివి. నీ డ్రైవరుద్యోగంలో యెప్పుడొస్తావో యెప్పుడు పోతావో తెలిస్తేగదా’’ అంది మల్లమ్మ.

          ‘‘యీడి సంగత్తెలుసుగదా మణికోసం మనింటిచుట్టూ తిరగతావున్నాడు. పనీపాటాలేని యెదవ’’ అని జేబులోంచి కొన్ని వందరూపాయల నోట్లు తీసి మల్లమ్మకిచ్చాడు జైరాజ్‌.

          ‘‘జీతమొచ్చిందా?’’ అనడిగింది మల్లమ్మ, నోట్లు తీసుకుంటూ.

          ‘‘వొగటోతేదీకే జీతమిస్తే మా సారు చిదంబరం సారెందుకైతాడు. పూజాసామానులకు మా మేడం డబ్బిచ్చిందిలే. ఆ షాపతన్ని యెప్పుడన్నా అర్జంటంటే మార్కెటుకు కార్లో దింపుతావుంటా, యేమనుకోడు. జీతమొచ్చినా కిస్తానని చెప్తాలే’’

          ‘‘జాగర్త నాయనా, పెద్దోళ్లతో యవ్వారం, చెడ్దపేరు తెచ్చుకోవద్దు. మీ నాయనే ఆ ఫ్యాక్టరీ వుద్యోగంలో సచ్చిపోకుండా వుణ్ణింటే నీకీ పాట్లు వొచ్చిండేవా’’

          ‘‘అట్లాంటి ఫ్యాక్టరిలో పన్జేసినందుకే నాయన సచ్చిపోయింది. సరే, టైమైతాంది, నేను బోవాల’’ అని మగతగా పడుకోనున్న దీప దగ్గరికెళ్లి మంచంపట్టెమీద కూర్చున్నాడు. దీప నీరసంగా నవ్వింది. చెల్లెలి తలనిమిరి ‘‘డాక్టరు మందిచ్చినాడుగదా తగ్గిపోతిందిలే’’ అని లేచాడు.

          ‘‘రొణ్ణిముషాలుండరా రొట్టెతిని పోదువు గాని’’ అంది మల్లమ్మ.

          ‘‘యిప్పుటికే ఆల్సెమైంది, మేడమ్‌ పూజ టైముకు సామాను అందిచ్చకపోతే ఆమే వొక కాళికాదేవైపోతింది’’ అంటూ బయటికి నడిచాడు జైరాజ్‌.

          మల్లమ్మ కొడుకు వెనకాలే వచ్చి ‘‘జై…, మాణిక్యం ఫోన్జేసినాడు. నీకు జేస్తే నువ్వు ఫోనెత్తలేదంట. రొణ్ణెల్లనించీ  వొడ్డీగూడా కట్టడంలేదని కోపంగా మాట్లాడినాడు’’ అంది చిన్నగా.

          ‘‘నీకూ చేసినాడా? చిదంబరంసారు రూపాయొడ్డీకి అప్పిస్తానని నేనుద్యోగంలో చేరినప్పుడు చెప్పినాడు. యీపొద్దు మళ్లా అడగతా. ఆయనిస్తే మాణిక్యం బాకీలో ముక్కాలుబాగం తీర్చెయ్యొచ్చు’’ అని వీధిలోకొచ్చాడు జైరాజ్‌.

          పూజాసామగ్రి తీసుకుని ఎంత తొందరగా వెళ్లినా ఆలస్యమై చిదంబరం భార్య అతని మీద కేకలేసింది. పూజకు వేళ మించిపోతూందని అంతటితో వదిలింది.

          జైరాజ్‌ కారు తుడుచుకునేలోపలే చిదంబరం రెడీఅయి పోర్టికోలోకి వచ్చి మెట్లమీద అసహనంగా నిలబడ్డాడు, గబగబ కారు స్టార్ట్‌ చేసి వెళ్లి అతన్నెక్కించుకున్నాడు.

          ‘‘యీరోజు మనం సైట్లెంబడి చాలా తిరిగేదుంది, నువ్వు రోజంతా కారు దగ్గిరే వుండాల’’ అన్నాడతను కారెక్కగానే.

          పొద్దున పది దాటింది. ట్రాఫిక్‌ విపరీతంగా ఉండడంతో కారు నిదానంగా వెళ్తూంది.

          ‘‘సార్‌ మాణిక్యం మాయింటిగ్గూడా ఫోన్లు చేస్తావున్నాడు. మీరిస్తాన్న అమౌంటు’’ అని చిదంబరానికి గుర్తుచేసాడు జైరాజ్‌. చిదంబరం అతనిమాట వినిపించనట్టు ఫోన్లో ఏదో చూసుకోవడం మొదలుపెట్టాడు. జైరాజ్‌ మళ్లీ చెప్తూ ఆ నెల జీతం గురించి కూడా చెప్పాడు.

          ‘‘అవన్నీ రాత్రి మాట్లాడదాం, డ్రైవింగ్‌ చేసేప్పుడు మాట్టాడొద్దన్నానా? నడిపేప్పుడు కారు వోనర్ల విలువైన ప్రాణాలు మీ చేతుల్లో వుంటాయని చెప్పినాగదా!’’ అరిచాడు చిదంబరం.

          సికింద్రాబాదు ఆఫీసు దగ్గర అతన్ని దింపాక ‘‘గంటలో సైటుకెళ్లాలి, నువ్వు టిఫిన్‌ చేసివుండు’’ అని చెప్పి వెళ్లాడు చిదంబరం.

          కారు పార్క్‌ చేసి బేకరీ వైపు నడుస్తూ ఫోన్‌ చూసుకున్నాడు జైరాజ్‌. రెండు మిస్డ్‌ కాల్స్‌ ఉన్నాయి. మొదటిది మళ్లీ చంద్రకళ నుంచి. ‘ఆమె ఫోన్‌ చేసినప్పుడు ఎక్కువభాగం తను డ్రైవింగ్‌లోనే ఉంటాడు. వాళ్ల నాయన ఇంట్లో లేనప్పుడో లేదా ఆమె బయటికొచ్చి చేసినప్పుడో మాట్లాడాల్సిందేతప్ప మిగతా టైంలో తను చేసేదానికి లేదు. ఆయన తెలుసుకుంటాడని భయపడి వద్దంటుంది. తనకు ఫోన్లు చెయ్యద్దంటే వినదు’ అనుకున్నాడు.

          చంద్రకళ మాట్లాడినప్పుడు బావున్నా ఆ తరువాత అతని గుండె బరువెక్కుతుంది. ఆమె బాధలు వినడం తప్ప ఏదీ చెప్పలేని అసహాయ స్థితి. ఆమె ఇతని పరిస్థితిని అర్థం చేసుకున్నా పట్టించుకోదు. ఏదోవిధంగా పెళ్లైపోతే తరువాత అన్నీ అవే సర్దుకుంటాయని ఆమె నమ్మకం. ఆమె తండ్రి గురించి బాగా తెలిసిన అతనికి అది ఆమె అమాయకత్వమని విశ్వాసం.

          రెండోది మాణిక్యం నుంచి. ‘అతనికి ఫోన్‌ చెయ్యడమంటే పులి గుహలోకి మనమే యెదురెళ్లినట్టు. మాట్లడకపోతే అమ్మకు రోజూ ఫోన్జేసి బాధపెడతాడు, ఈవూరొచ్చినప్పుడు యింటికొచ్చి కూతురు వయసులో వున్న పెద్ద చెల్లెలు మణితో ఎకసెక్కాలాడతాడు. డబ్బు బాకీ వుంటే అన్నిటికీ లోకువైపోతారా? మాణిక్యం సరే, డబ్బు విషయంలో మంచివాళ్లు కూడా ఎందుకంత గట్టిగా మారిపోతారో తనకెప్పుడైనా బోధపడుతుందా?’ అనుకుంటూ మాణిక్యానికి ఫోన్‌ చేసి ‘‘సారీ అనా, డ్రైవింగ్లో వుండి ఫోన్‌ తీలా’’ అన్నాడు జైరాజ్‌. ఆ తరువాత ఐదు నిముషాలు అతని తిట్లను, బెదిరింపులను ఓపిగ్గా భరించి ‘‘మా సారు రేపు మన్నాట్లో దుడ్లిస్తానని నమ్మకంగా చెప్పినాడనా’’ అని మరోసారి హామీ యిచ్చాడు.

          మాణిక్యం మాటలకు అతనికి గొంతులోకి తన్నుకొచ్చిన బాధను కష్టంగా దిగమింగాడు. ‘జింకలున్నచోట  తోడేళ్లు పుట్టుకురావడం ప్రకృతిలో సహజమని తన సైన్సు మాస్టారు చెప్పేవాడు. ఐతే ఇది అడవి కాదుగదా’ అనుకున్నాడు జైరాజ్‌.

          ‘‘నైట్‌ డ్యూటి చేసినవా, కళ్లెర్రబడినయ్‌’’ జైరాజ్‌కు బ్రెడామ్లెట్‌ వేస్తూ అడిగాడు బేకరి యజమాని నరేందర్‌. అక్కడి డ్రైవర్లు, ఇతర వర్కర్లలాగే జైరాజ్‌ ఆ బేకరీలోనే తింటూంటాడు.

          ‘‘యిప్పుడే మాణిక్యం ఫోన్లో తిట్టరాని తిట్లు తిట్టినాడునా’’

          ‘‘అసలు నువ్వావూబిలో యెట్లపడినవ్‌ జై’’

          ‘‘అదంతా పెద్ద కథనా’’ అని బ్రెడామ్లెట్‌ తింటూ చెప్పాడు జైరాజ్‌ ‘‘మా నాయన రేణిగుంటకవతల ఫ్యాక్టరీలో పనిచేస్తా ఆక్సిడెంట్లో చనిపోయినాడని చెప్పినాగదా. ఫ్యాక్టరీవాళ్లు ఆయన్దే తప్పనితేల్చి కొంతదుడ్దు పరిహారంగా మా మొహానకొట్నారు. నేను డిగ్రీ మూడోసంవత్సరంలో వుంటినా వాళ్లమాటలు యీళ్లమాటలు విని చదువు సాలిస్తిని. అప్పుటికే డ్రైవింగ్‌ వచ్చిణ్ణింది. పరిహారందుడ్దు పెట్టి కొత్తకారు కొన్నా. తక్కువైంది మాణిక్యం దగ్గిర అప్పు తీస్కున్నా. తిరప్తికి కొండమీదికి తిప్పేది మొదులుపెట్టినా. బెంగుళూరు, చెన్నై బేరాలు గూడా తగల్తావుణ్ణాయి. మొదుట్లో బాగనే జరగతావుణ్ణిందినా. సగం అప్పుగూడా తీర్చేసినా’’ అని, ఇంకోకస్టమరు రావడంతో చెప్పడం ఆపి తినడం పూర్తిచేసాడు జైరాజ్‌.

          ‘‘మళ్లేమాయె’’ అన్నాడు నరేందర్‌ కస్టమరు వెళ్లిపోయాక.

          ‘‘యేమైతిందీ డ్రైవర్లందరికీ అదే శాపంగదనా. వొకతూరి చెన్నైలో ప్యాసెంజర్లను దింపి వొక్కణ్ణే వస్తావుంటి.  పెరియపాలెం దాట్నాక మలుపుదగ్గిర లారీవాడు ర్యాష్‌గా వొచ్చి గుద్దేసినాడు, కారు తుక్కైంది. అదృష్టం బాగుండి నాకు చెయ్యొకటే యిరిగింది, రెణ్ణెల్లు ఆస్పత్రిపాలైనా. ఆ లారీ వోనర్ది పెద్ద కంపెనీ, కోటీస్పరుడు. పైగా వాళ్లస్టేట్లో జరిగింది. నాదే తప్పని తేల్చినారు. నా మీద కేసుపెట్టకుండా దయజూపినామన్నారు. వొచ్చిన యిన్సూరెన్సు దుడ్లు ఆస్పత్రి కర్చులకే సరిపోలేదు. టైముకు తీర్చలేదు గాబట్టి, అగ్రిమెంటులో వుందన్జెప్పి మాణిక్యం కొత్తలెక్కలేసి బాకీ తిరప్తి కొండంత జేసినాడు. యింగ డ్రైవరుగా ఆడకుదరక యీ సిటీకొచ్చినాము. ముందైతే నలుగురు బతకాలగదన్నా’’

          అక్కడే మరో కారుకు డ్రైవరుగా పనిచేస్తున్న రాములు వచ్చాడు. నరేందర్‌ ఇద్దరికీ టీ ఇచ్చాడు.

          ‘‘పోనీ ఏదన్నా క్యాబ్‌ కంపెనీలో జేరకపోయినవా జై’’ అన్నాడు నరేందర్‌.

          ‘‘అది స్వంత బండ్లుండేవాళ్లకు పనికొస్తుందిగాని మాలాంటోళ్లక్కాదు నరేందర్‌ బయ్యా. అద్దెకు కొత్తబండ్లెంతమందికి దొరుకుతాయి? పాతవి నడిపితే సిటిట్రాఫిక్‌ దెబ్బకు నరాలు తెగిపోవడంతప్ప నెలాఖర్న పెద్దగా మిగిలిదేమీ వుండదు’’ అన్నాడు రాములు.

          ‘‘ఆ కథా అయ్యిందినా. అసలు మేమీ హైద్రాబాదొచ్చిందే క్యాబుల్లో పనిచేస్తే యెంతో కొంత మిగిల్తిందని. ఆర్నెల్లకే అర్థమైంది పాతబాడుక్కార్లతో పనిగాదని. నేనొక్కణ్ణే రాకుండా పనిమాలి మా ఫ్యామిలిని గుడా తెచ్చినా. చిదంబరంసారు వుద్యోగమేగాకుండా అడ్వాంసుగా అప్పు గుడా యిస్తానంటే ఆయన్దగ్గిరజేరి అవస్తలు పడతావున్నా’’ అన్నాడు జైరాజ్‌.

          నరేందర్‌ వేరే కస్టమర్లొస్తే అటెళ్లాడు. ‘‘యేమంటున్నాడు మీ సారు?’’  అడిగాడు రాములు

          ‘‘డ్రైవరు కారు నడిపితే చిదంబరంసారు యెనకసీట్లోనించి డ్రైవరును నడుపుతాడు రాములన్నా. కారెక్కినకాణ్ణించి దిగిందాకా ‘స్పీడుగా బోనీయ్‌…. రెడ్‌ లైటు పడేలోపల సిగ్నల్‌ దాటేయ్‌… ఆ బైకువాడొస్తున్నాడు చూసుకో…. ఆ తెల్లకారు నెంబరెంత చూడు….’ యిట్లా అరస్తానేవుంటాడనా. సరింగా సిగ్నల్‌ దాటేముందు యింగోపక్క తిరగమని చెప్తాడు. యెక్కడెంతసేపుంటాడో చెప్పడు. రాత్రిం బగుళ్లు కార్లోనే వుంటావున్నా. యింటికి బోయిరావాలన్నా, కడాకు టీ తాగి రావాలన్నా టెంషనే’’ తనగోడు చెప్పుకున్నాడు జైరాజ్‌.

          ‘‘వోనర్లంతా అట్లుండరుగాని మీ చిదంబరం సారు మాత్రం గొప్పోడు. ఆయన్దగ్గర డ్రైవరుగా ఆర్నెల్లకు మించి వున్నోడిని నిన్నే చూస్తావున్నా జై. నీకంటే ముందుండిన బాలునాయక్‌ రోజూ యేడ్చేవాడు’’ అన్నాడు రాములు.

          ‘‘ఆయన అప్పుగా దుడ్లిస్తే ఆయన బాకీ తీరిందాకా ఆయనదెగ్గిర పంజేస్తా రాములన్నా. అవసరాలున్నోణికి వూరంతా అడివే. ముందు మాణిక్యం బాకీ తీరితే చాలు’’ అని జైరాజ్‌ పక్కనున్న నేరేడుచెట్టుకిందకెళ్లి ఇంటికి ఫోన్‌ చేసి దీప జ్వరం కొంచెం తగ్గిందని తెలుసుకున్నాడు. తిరిగొచ్చేసరికి నరేందర్‌ రాములుతో చెప్తున్నాడు.

          ‘‘మనవూళ్లు పాడై కడుపు చేత్తో పట్టుకొని సిటీలకొస్తున్నం. కాని సిటి బరువంత మనమీదే పడుతున్నదన్నట్టు నలిగిపోతున్నం. రోజూ యింటికి పనికి మైళ్లకొద్దీ బస్సుల్ల దిరిగాలె. అటు తళ్తళా మెరిసే బిల్డింగులు  యిటేమో మనకు బాత్రూంబోవాలన్నా కనాకష్టం. ఆడపిల్లల పరిస్తితి చెప్పేపన్లేదు. సిటీలైఫు బేజారైతదిగాని వెనక్కుబోయే పరిస్థితిలేదు’’ అన్నాడు నరేందర్‌ దిగులుగా నేరేడుచెట్టు వైపుచూస్తూ.

          నేరేడుచెట్టు నరేందర్‌ బేకరీ పక్కన రెండు బిల్డింగుల మధ్య పాతిక అడుగుల వెడల్పు ఖాళీ స్థలంలో ఉంటుంది. అదెప్పటిదో ముసలిచెట్టు. దానికింద ఐదడుగుల ఎత్తున్న పాతబడిన చిన్న గుడి ఉంది. గుడి వెనకవైపు చెట్టునీడలో ఆ  చుట్టుపక్కల  పనిచేసేవాళ్లు క్యారేజిల్లో తెచ్చుకున్న తిండి తింటారు, ఆ చెట్టు కిందికి పోయి ఫోన్లలో మాట్లాడుతుంటారు.

          ‘‘అదేంగుడినా? లోపల పులిమింద కూచ్చున్న దేవుడి బొమ్ముంటింది’’ నరేందర్ని అడిగాడు జైరాజ్‌.

          ‘‘యెవరికెరిక? ముందిదంతా పెద్ద తోటంట. గుడి యెప్పుడు కట్టిన్రో తెలీదు. రోజూ యెవరో పొద్దున్నే వొచ్చి పూజ చేసిపోతరంతే’’

          ‘‘పులిస్వారీ అంటే మాటలుగాదనా. కొండమనుషుల దేవుడైవుంటాడు. మావూరి కోనదగ్గిర యిట్లాటిదే వుంది, ఆ పులిబొమ్మను చూస్తే మనం అదురుకోవాల్సిందే’’

          ‘‘పులిమీదున్నతను యెవరైతేనేంది, ఆ గుడైనా వుంది గాబట్టి ఆ చెట్టు, ఆ స్థలం మిగిలున్నయి. మనవాళ్లంతా పోయి ఆ చెట్టు కింద ఫోన్లల్ల కష్టాలు మాట్లాడేది విని ఆ దేవుడు, పులి యెప్పుడో పారిపోయుంటరు. యీ మాటెవర్తోనన్న అనేవ్‌ జై. అక్కడ దేవుడు లేడని ప్రచారమై పదిరోజుల్లో చెట్టు, గుడి తీసేసి అక్కడ బిల్డింగు కట్టేస్తరు’’ అన్నాడు నరేందర్‌ నవ్వుతూ.

          జైరాజ్‌కి మిస్డ్‌ కాల్‌ వచ్చింది. కాల్‌ చూసుకుని ‘‘చిన్నమేడం, మా సారు కూతురు’’ అంటూ పక్కకెళ్లి ఆమెకు ఫోను చేసాడు. రెండు నిముషాలు మాట్లాడాక తిరిగొచ్చి ‘‘వస్తానా. జూబ్లీహిల్ల్స్ లో సారింటికిబోయి చిన్నమేడం నెక్కించుకోని దిల్షుక్‌నగర్లో వాళ్ల ఫ్రెండింట్లో దింపి మళ్లా మా సారు కోసం యిక్కడికి రావాల’’ అని కారు దగ్గరికి పరిగెత్తాడు జైరాజ్‌.

          చిదరంబరం భార్య మరో పని కూడా చెప్పడంతో జైరాజ్‌ రావలసిన సమయం కంటే అరగంట ఆలస్యంగా వచ్చాడు. పార్కింగు దగ్గర చిదంబరం అప్పటికే పచార్లు చేస్తున్నాడు.

          సిటీ బయట బిల్డింగు సైట్ల వైపు వెళ్తూ మధ్యాహ్నభోజనానికి చిదంబరం శివార్లలోని తన వ్యాపార భాగస్వామి విల్లా దగ్గర ఆగాడు. అక్కడ హోటళ్లు లేకపోవడంవల్ల జైరాజ్‌ కార్లో పెట్టుకున్న బిస్కట్లు, జాంపండు తిన్నాడు.

          చెట్టుకింద వెయిటింగ్లో ఉండగా చంద్రకళ దగ్గర్నుంచి ఫోనొచ్చింది. వెంటనే తీసాడు.

          ‘‘రెండ్రోజుల్నించి చేస్తావున్నా, రాజుగారికి ఫోన్తీసేదానికే తీరికలేదు’’ అంది కోపంగా.

          ‘‘నాకంత కళలేదని తెలిసినా ‘షరామామూలే’ అన్నట్టు అంటానేవుంటావు’’ అన్నాడు.

          చంద్రకళ ఆపకుండా ఐదునిముషాలు మాట్లాడింది. ‘తనకు ఒక పెళ్లి సంబంధం ఖరారైందని, జైరాజ్‌ వెంటనే తిరుపతొచ్చి తనను తీసుకెళ్లి ఏ గుళ్లోనో రహస్యంగా పెళ్లిచేసుకోవా’లని గట్టిగా చెప్పింది. ‘ఎప్పుడొస్తా’వని ఏడ్చింది. జైరాజ్‌ రాకపోతే ‘ఎవరికీ చెప్పకుండా తనే హైద్రాబాదు వచ్చేస్తా’నని బెదిరించింది.

          ‘తొందరపడి ఏమీ చెయ్యొద్దనీ, తను నాలుగు రోజుల్లో తిరుపతి వచ్చి అన్నీ వివరంగా మాట్లాడతా’నని ధైర్యం చెప్పాడు జైరాజ్‌. చిదంబరం రావడంతో ఫోన్‌ పెట్టేసాడు.

          డ్రైవ్‌ చేస్తూ అలోచనల్లోపడ్డాడు జైరాజ్‌. అతనికి చాలా దిగులేసింది. ‘ఆమె కోరినట్టు తనసలు ఆమెను పెళ్లిచేసుకోగలడా? చిదంబరమో మరొకరో డబ్బుసర్దినా, ఒక ఊబిలోంచి మరొక ఊబిలోకి వెళ్లడమే. ఇప్పుడు పెళ్లి  చేసుకోవడమంటే చంద్రకళనుగూడా ఊబిలోకి లాగడమే. ఆమె నాకు కళ కాదు కల’ అనుకున్నాడు.

          ‘రెండు మూడు రోజుల్లో తిరుపతికి వెళ్లి తనని మరచిపొమ్మని ఆమెకు ఎలాగైనా నచ్చజెప్పాలి. కష్టమైనా సరే ఇంక ఆమెను తల్చుకోకుండా ఉండాలి’ అని నిర్ణయించుకున్నాడు.

          సైట్లు చూసుకొని, అక్కడక్కడా తిరిగి రాత్రి తొమ్మిదికి చిదంబరం ఒక కొత్తమనిషితో స్టార్‌ హోటల్లో డిన్నర్‌ చేసాడు. కారును పదిగంటలకు ఒక మల్టిప్లెక్స్‌ దగ్గర ఆపించాడు.

          ‘‘యిది ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ అని ఆ మధ్య వచ్చిన సినిమా. బెనిఫిట్‌ షో అన్జెప్పి మూడు టికెట్లు తగలగట్టారు. నా  ఫ్రెండుతో మాట్లాడేదుంటే సిన్మాలోకూర్చొని మాట్లాడుకుందాం యిక్కడికే రమ్మన్నాను. కారు పార్కింగులో పెట్టి నువ్వూ సినిమాలో కూర్చో, వూరికే బైటేంజేస్తావ్‌’’ అని జైరాజ్‌కి టికెట్టు ఇచ్చి లోపలికెళ్లిపోయాడు చిదంబరం.

          జైరాజ్‌ ఇంటికి ఫోన్‌ చేస్తే దీపకు మళ్లీ జ్వరం వచ్చిందని, మణి ఇంటికొచ్చేసరికి సాయంత్రమైందని వాళ్లమ్మ చెప్పింది. దగ్గర్లో వున్న బడ్డీ దగ్గర సమోసాలు తిని, టీ తాగి తమ స్క్రీన్‌ చూసుకుని లోపలికెళ్లాడు.

          సినిమా అయ్యాక ఇంటికి వస్తున్నప్పుడు ‘‘సినిమా బావుంది జై, నీకు అర్థమైందా?’’ అని అడిగాడు చిదంబరం.

          ‘‘అర్థమైంది సార్‌’’ అన్నాడు జైరాజ్‌.

          ‘‘సినిమాలో ఆ ‘పై’ అనే కుర్రాడు పాపం ఆ చిన్న పడవలో అన్ని రోజులు భయంకరమైన పెద్దపులిని పక్కనబెట్టుకుని ప్రాణాలరచేత్తో పట్టుకుని వెళ్లడం యెంతకష్టం! టెన్షన్‌తో వాడు క్షణక్షణం నరకం అనుభవించి వుంటాడు?’’ అన్నాడు చిదంబరం.

          ‘‘పెద్దపులిదేముంది. నాతో పోలిస్తే ఆ ‘పై’ అనేవోడిది యేం పెద్ద టెంషన్‌ సార్‌. వాణ్ణొచ్చి మీ దగ్గిర డ్రైవరు పని వొక్కరోజు చెయ్యమనండి తెలుస్తుంది’’ అన్నాడు జై నిస్పృహగా, రద్దీలేని రాత్రిరోడ్డు మీద వేగంగా కారుపోనిస్తూ.

          ‘‘అంతేనంటావా’’ అని చిదంబరం పెద్దగా నవ్వేసి మంచి మూడ్లోకెళ్లి దారి పొడుగునా సరదాగా మాట్లాడాడు. ఇంటిదగ్గర కారు దిగగానే జైరాజ్‌కు ఇవ్వాల్సిన జీతం, ఇస్తానన్న అప్పులో సగం ఫోనుద్వారా బదిలీచేసి వడ్డీరేటుని, తిరిగివ్వాల్సిన తేదీలను చెప్పాడు. ఆ సమయంలో అతని మాటలు సరదాగా లేవు. ఐనా మాణిక్యం బాకీ చాలావరకు తీరుతుందని జైరాజ్‌కి సంతోషమే కలిగింది.

          ఆ మరుసటిరోజు చిదంబరాన్ని తీసుకుని కార్లో బెంగుళూరెళ్లాల్సొచ్చింది జైరాజ్‌. మూడురోజు సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో చంద్రకళ చాలాసార్లు ఫోన్‌ చేసిందిగాని డ్రైవింగ్‌లో అతనికి మాట్లాడ్డానికి కుదరలేదు.

          బెంగుళూరులో బయల్దేరేముందే తన దగ్గరున్న డబ్బులో చాలావరకు మాణిక్యానికి పంపించి దాదాపు ఖాళీ జేబుల్తో ఇంటికి వచ్చాడు. కాస్త రిలీఫ్‌గా వున్నా నలుగురికి ఈ నెల గడవాలంటే మళ్లీ ఎవరిదగ్గరైనా చేబదులు తీసుకోక తప్పదు. ఇప్పుడున్న సమాజంలో తనలాంటివాళ్లు ఎంత కష్టపడినా అడుగడుగునా బాధల్లేకుండా ఎందుకు బతకలేకపోతున్నారో అతనికి అంతుపట్టలేదు. తన బరువుకే కూలిపోయే వంతెన మీద తను నడుస్తున్న అనుభూతి కలిగి భయమేసింది.

          రాత్రంతా కారు నడిపిన ఎర్రని కళ్లతో తెల్లవారుతూండగా ఇల్లు చేరాడు. జైరాజ్‌ వీధి తలుపు తట్టగానే తెరుచుకుంది.

          తలుపుకవతల చంద్రకళ! కట్టుబట్టలతో రాత్రికిరాత్రి బయలుదేరి తిరుపతి నుంచి వచ్చేసినట్టుగా చెదరిన తల, నలిగిన బట్టలు, అర్థంకాని చిరునవ్వు.

          ఆమె వెనకాలే మెరుస్తున్న కళ్లతో అమాయకంగా నవ్వుతూ నిలబడిన జైరాజ్‌ చెళ్లెళ్లు.

admin

leave a comment

Create Account



Log In Your Account