ఇక్కడ బతకడమంటే – చావుకి తెగించటమే!!

ఇక్కడ బతకడమంటే – చావుకి తెగించటమే!!

ఇంతవరకు బతకడాన్ని నేరం చేసిన మూడు పాతికల స్వాహాతంత్య్రంలో మోడీ పాలనకొచ్చేసరికి ఊపిరిపీల్చడమూ, నోరువిప్పి మాట్లాడడమూ కూడా ‘రాజ ద్రోహం’ అయిపోయింది. ‘చావడాన్ని’ కారు చవక చేశారు. మరణాన్ని నిత్యకృత్యం చేస్తున్నారు. దీంతో నానాటికీ దేశ పాలక విధానాలు తీసికట్టై జన జీవనం అల్లకల్లోలమైపోతున్న సంక్షోభం దాపురించింది. సెక్షన్‌ 124ఎ నిబంధనలకు సంబంధించి చాలా సందర్భాల్లో కోర్టులు ఎన్నిసార్లు అభిశంసించినా ముఖ్యంగా మోడీ ప్రభుత్వం మంకుపట్టుతో ‘రాజద్రోహం’ పేరుతో భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తోంది. ఈ నేపథ్యంలో దేశకాలమాన పరిస్థితుల్ని విహంగవీక్షణంగా పరిశీలిస్తే ప్రజాజీవనం అల్లకల్లోలమైన నేటి సమయంలో మనం ఉన్నది స్వతంత్ర దేశంలోనేనా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పాలకులు తమనితాము ‘దేశభక్తులు’గా ప్రకటించుకున్నారు. దేశ ప్రజలందరినీ ప్రభుత్వాల్ని కూలదోసే ‘కుట్రదారులు’గా ప్రకటిస్తున్నారు.

                కరోనా రెండవ కాటుకు భయపడుతూ కటకటపడుతూ, నత్తనడక నడుస్తూన్న జనజీవనంపై అదనంగా  పెట్రోలూ – డీజిలూ పోసి, నిత్యావసరాల ధరలను కొలిమిలా మండిస్తున్నారు. ఈ ఏడాది కాలంలోనే ఏవి ఆగినా, వ్యవసాయ ఉత్పత్తి పడిపోకుండా రైతాంగం కృషి చేశారు. అయినా, నిత్యావసరాల ధరలు 40-50 శాతం  పెరిగిపోయాయి. ప్రస్తుతం అమలులో వున్న దేశ చమురు విధానం చూస్తే, ఒక లీటరు పెట్రోలు ధర మీద 63% పన్నుల భారమే వుంది. అందులో రాష్ట్రాల వాటా 23 శాతం కాగా, కేంద్రం వాటా 40 శాతం. టి.ఎ.పి.ఐ. (తుర్కుమినుస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్తాన్‌, ఇండియా) పైపు లైను ద్వారా మన దేశానికి ముడిచమురు చవకగా అందిస్తామని ఇరాన్‌ సిద్ధపడినా మన దళారీ పాలకులు అమెరికన్‌ సామ్రాజ్యవాదపు హుంకరింపులకు జడిసి ససేమిరా మీ వద్ద తీసుకోమని అంటున్నారు. దీంతో రవాణారంగం ధరల మీద ధరలు పెంచుకుంటూ పోతుంది. అశేష ప్రజానీకం వినియోగించే ప్రతి వస్తువు మీదా ధరలు బాదుడు పెరుగుతోంది. దీనికి తోడు కొత్తగా పెంచబోతున్న ఆస్తిపన్ను, చెత్తపన్ను, నీటిపన్ను ఇతరేతర పన్నులు వీటితోపాటు జి.ఎస్‌.టి ప్రజల్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. వీటికి తోడు కరోనా రెండు అలలతో కుదేలైపోయిన భారత ప్రజారోగ్య వ్యవస్థ వీటితోపాటు, కార్పొరేట్‌రంగానికి అప్పచెప్పటం ఆందోళన కల్గిస్తోంది. ఇన్నాళ్ళూ దేశంలో మతాల మధ్య, కులాల మధ్య, పెంచి పోషించిన వైరుధ్యాల చిచ్చు కొనసాగుతుండగా ఇవాళ భిన్న వైద్య విధానాల మధ్య కూడా చిచ్చు రగిలించారు. పాలకులు ప్రజల్లో అభద్రతను అనైక్యతలను రెచ్చగొట్టి తమ పదవీ వ్యాపార స్వప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారు. ప్రజల హాహాకారాల మధ్యనే ఎన్నికల జాతరలు జరుపుతున్నారు. జనం మరణయాతనల మధ్యనే గుత్త పెట్టుబడిదారులకు ప్రజాధనాన్ని గోరుముద్దలుగా తినిపిస్తున్నారు. ప్రజల సమస్యలతో  సంబంధం లేకుండా మేం చెయ్యాలనుకున్నది చేసి తీరుతాం అంటూ ధనాఢ్య వర్గాల మోచేతి నీళ్ళు తాగే పాలకవర్గాల బెదిరింపులు రెట్టింపయ్యాయి. నాల్గు లక్షలమంది కరోనా మృతుల కుటుంబాలకు నాల్గు లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వలేమని భారత ప్రభుత్వం చేతులెత్తేసింది. కానీ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ద్వారా భారత ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాల కాలంలో 1,23,000 కోట్ల రూపాయల పారిశ్రామికవేత్తల బకాయిలను రెండో ఆలోచనే లేకుండా రద్దు చేసింది. దేశంలో రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులే, కానీ కొందరు ఎక్కువ సమానులు. ఆఖరికి కోవిడ్‌ బారిన  పడిన దేశ ప్రజల శవాలతో గంగానది వల్లకాడుగా భోరుమని రోదిస్తుంటే ఆ గుండెకోతను కవితగా రాసిన గుజరాతీ కవయిత్రి పరుల్‌ ఖక్కర్‌పై అశ్లీలమైన బెదిరింపుల కొరడాలు ఝళిపిస్తున్నారు. గౌరవప్రదమైన బతుకు ఎలాగూ ఈ దేశ ప్రజలకి లేదు, కనీసం మర్యాదకరమైన అంతిమ ఘడియలు కూడా సాధ్యం కాని పరిస్థితులను పాలకులు సృష్టించారు.

                ఇక దేశంలో సాగుతున్న వాక్సినేషన్‌ పద్ధతిని గమనించిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వాక్సిన్‌ రేటు విషయంలో తేడాల్ని ప్రశ్నిస్తూ (ఏప్రిల్‌ 27) ఒకసారి; కోవిడ్‌ మరణాలను చూస్తే కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు చనిపోవడమే కావాలని వుందిలా కనిపిస్తోందనీ (ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్‌ 28) మరోసారి; ఆక్సిజన్‌ సరఫరా విషయంలో తాము ఇచ్చేవరకూ చావకుండా వుండమని, ఎదురుచూడమని చెప్తారా అంటూ (ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్‌ 21) వెంటవెంటనే నిలదీస్తూనే – 14 నెలలు ఆక్సిజన్‌, వాక్సిన్‌ ఉత్పత్తి ఎందుకు చేయలేదనీ (ఏప్రిల్‌ 28) భారత న్యాయవ్యవస్థ వరుసగా మోడీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూనే వుంది. ‘లాన్సెట్‌’ అనే వైద్య పత్రిక ప్రకారం దేశ ప్రజారోగ్యవ్యవస్థ ఎలా వుందన్నది 199 దేశాలలో సర్వే చేయగా మనదేశం 145వ స్థానంలో వున్నది. కానీ ఇక్కడ సత్తా చాటుకోవాలని వచ్చిన ఒక మేధావి – పరిపాలనలో న్యాయస్థానాల జోక్యం సరైందికాదని, పాలకవర్గాలకు వత్తాసుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు.

                చిన్నదైన కెన్యా దేశం ఈ కరోనా కాలంలోనే భారతదేశానికి 12 టన్నుల కాఫీపొడి సాయం చేసింది. కానీ దేశంలో వందమంది ప్రపంచ కుబేరులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లున్నారు. ఈ ఏడేళ్ళ కాలంలో ఆసియా కుబేరుల్లో ఆదానీ రెండో స్థానానికి చేరుకున్నాడు.  ఇదే ఏడేళ్ళలో దేశంలో పేదరికం 27 శాతంకి పెరిగిపోయింది. ఈ పరిణామాల్ని పరిశీలించే ప్రపంచ బ్యాంకు ‘వరల్డ్‌ ఎకానమిక్‌ ఔట్‌లెట్‌’ సర్వే ప్రకారం 2025 నాటికి భారత్‌ పేదరికంలో అతి చిన్న దేశమైన బంగ్లాదేశ్‌కంటే దిగజారిపోనుందని తీర్మానించింది.

                ఇలాంటి దిగజారుడు స్థితిలో భారతదేశం కరోనా మూడవ పడగ నీడలోకి ప్రయాణం చేస్తోంది. దేశ ఆర్థిక స్థితి ఇలా కునారిల్లుతున్నప్పుడు సుదూర భవిష్యత్‌లోనైనా తరువాతి తరాలు ఈ భారత సమాజాన్ని తన స్వంత కాళ్ళమీద నిలబడేలా చేస్తాయేమో అనే ఆశాకిరణమేదీ కనబడటంలేదు. ఎందుకంటే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఇక్కడి తరగతి గది కూడా వ్యాపార సంస్కృతికి బలైపోతోంది. ఈ విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం దొందుకు దొందూ అన్నట్టు వ్యవహరిస్తున్నాయి.

                జాతీయ విద్యావిధానం 2020 ద్వారా రేపటి తరాలను సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థల, దేశీయ గుత్త పెట్టుబడిదారుల మార్కెట్‌ ఎకానమీ విధానాలకు బలిపెడుతున్నారు. సందట్లో సడేమియాలా ప్రశ్నించే గొంతుల్ని  చిదిమేయడానికి బిజెపి వర్గాలు మతతత్త్వ అరాచకీయాల సొంత అజెండాతో అశాస్త్రీయ భావాలను పాఠ్యాంశాల ద్వారా నేర్పే ప్రక్రియల్ని బలోపేతం చేస్తున్నారు. ఇది చాలక, రోజువారీ జీవన విధానంలో కార్యకారణ సంబంధాలపట్ల కనీస అవగాహన పెంచుకోడానికి వీలులేని మూఢనమ్మకాలనూ, అశాస్త్రీయ ఆలోచనల్నీ పనిగట్టుకొని ప్రజల్లో రెచ్చగొడుతున్నారు. విద్యారంగం భూమికని తలకిందులు చేసేందుకే కాషాయీకరణను ముందుకు తెస్తున్నారు. అందుకు మోడీ నాయకత్వం కాకపోతే – మరో యోగీ నాయకత్వం ముందుకు వస్తుంది. నిజానికి సామాజిక విలువలు గల సంఘటితశక్తిగా వ్యక్తిని చూడగలగడం ద్వారానే ఈ భారతదేశం పెను సంక్షోభం నుండి ఒడ్డెక్కగలదు. కానీ వ్యక్తి కేంద్రక అభివృద్ధికి – ఈ సొంత ఆస్తి వ్యవస్థ కట్టుబడి వుంది.

                ఈ జీవన విధ్వంసం నుండి దేశ ప్రజలను చైతన్యపరచి సంఘటితపరిచే సాంస్కృతికోద్యమ పోరాటం జరగాలంటే దేశంలో ఏం జరుగుతోందో, ఎందుకు జరుగుతోందో, ఎవరివల్ల ఎలా జరుగుతోందో, నిరంతరంగా, విసుగూ విరామం లేకుండా, బిగ్గరగా ప్రజలకు అవగాహన అయ్యేలా చెబుతూ వుండడమే ప్రజానుకూల శక్తుల నిరంతర కార్యాచరణగా వుండాలి. నూతన ప్రజాతంత్ర సాహితీ సాంస్కృతిక విప్లవానికి ప్రజల్ని సమాయత్తం చేయడానికి ప్రజాపక్షం వహించే మేధావులూ, రచయితలూ, కళాకారులూ, విద్యార్థీ యువతరం, ఈ స్పష్టమైన ప్రజాకార్యాచరణకి పూనిక వహించాలి.

admin

leave a comment

Create Account



Log In Your Account