స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ గాంధేయ హేతువాది, యలమంచిలి వెంకటప్పయ్య కృష్ణాజిల్లా కనుమూరులో జన్మించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని రాజమండ్రి జైలులో (1920) బాబా పృధ్వీసింగ్ వద్ద హిందీ నేర్చుకున్నారు. ఆ తర్వాత నెల్లూరు, కాశీ, అలహాబాద్, బీహార్‌లో జాతీయోద్యమంలో భాగంగా హిందీ అధ్యయనం చేశారు. 1920, 1930, 1932, 1942లలో జైలు శిక్షలనుభవించారు. హిందీ బోధన ఒక కార్యక్రమంగా తీసుకొని కృష్ణాజిల్లా పెనుమచ్చ, చినకళ్ళేపల్లి, గుంటూరుజిల్లా మైనేనివారిపాలెం, తూర్పుపాలెం, బెల్లంవారి పాలెం మొదలగు గ్రామాలలో హిందీ నేర్పారు. 1947 నుండి 1967 వరకు తెనాలిలోని ఐతానగరంలో ఆదర్శ బాలికాపాఠశాల (హాస్టల్‌తో) నడిపి ఎందరో మహిళలతో హిందీ, బెనారస్ మెట్రిక్ చదివించారు. 1968 నుండి 1997 వరకు విజయవాడలో కూతురు వద్ద వుండి, 53 హేతువాద గ్రంథాలు, హిందీ వ్యాకరణ గ్రంథాలు వ్రాసి ప్రచురించారు. తన 99 ఏళ్ళ జీవితంలో 86 ఏళ్ళపాటు క్రియాశీలంగా జీవించిన వీరి కోరిక ప్రకారం, మరణించిన తర్వాత వీరి కన్నులను, శరీరాన్ని వైద్య కళాశాలకు అప్పగించారు.
వెంకటప్పయ్యగారి రెండవ వర్ధంతి 1-3-1999నాడు తెనాలిలో వారి పేరిట సంస్మరణ వేదిక ఏర్పడింది. ఆయన శిష్యులూ, మిత్రులూ, అభిమానులూ, బంధువులు, హేతువాదులు కలిసి 30 వేల రూపాయల ధర్మనిధిని ఈ వేదిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సంవత్సరాలలో మరో 40 వేల రూపాయలు ఈ ధర్మనిధికి జమ అయ్యాయి. ప్రతి ఏడాదీ జరిపే కార్యక్రమాలకు ఈ మూలనిధి నుండి వచ్చే వడ్డీని వేదిక ఖర్చు పెట్టింది.
గత నాలుగు సంవత్సరాలుగా, వేదిక కార్యక్రమాల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో, హేతువాదులు వారి పుస్తకాలు కావాలని కోరడంతో, వారు రాసిన ముఖ్యమైన 11 పుస్తకాలను డిజిటల్ రూపంలోకి వేదిక నిర్వాహకులు మార్చారు. వీటిని kingie.com అనే webలో ఉచితంగా ఇచ్చే పుస్తకాల జాబితాల్లో వుంచారు. yalamanchili venkatappaiah books అనే పేరుతో అంతర్జాలంలో వీటిని తెరచి, కావలసినవారు ప్రింటు తీసుకోవచ్చు. ఆ పుస్తకాల వివరాలు : 1. కులమేది? 2. వేదాలంటే ఇవేనా? 3. బీద బ్రతుకు (స్వీయ చరిత్ర) 4. దేవుళ్ళు ఎవరికొరకు? 5. మతాలు ఎవరికొరకు? 6. పుష్కరాలు ఎవరికోసం? 7. వేమన ఏమన్నాడు? 8. తులసీ రామాయణం అంటే ఇదేనా? 9. ప్రపంచం పుట్టు పూర్వోత్తరాలు 10. వైదిక ఆర్యుల ప్రాచీన సంస్కృతి 11. యలమంచిలి వెంకటప్పయ్య సాహిత్య పరిచయం.
ఈ ఏడాది వేదిక నిర్వహణాబాధ్యులు సమావేశమై వేదిక పేరుతో బ్యాంకులో వున్న మూలనిధి 60,000 (అరవై వేల రూపాయలు)లను జనసాహితి గత 45 సంవత్సరాలుగా నడుపుతున్న సాహిత్య, సాంస్కృతికోద్యమ మాసపత్రిక ‘ప్రజాసాహితి’ మూలనిధికి విరాళంగా ఇచ్చి వేదికను రద్దుచేయాలని తీర్మానించారు. ఆ డబ్బును ‘ప్రజాసాహితి’కి అందచేశారు.
1999 నుండి వేదికలో సభ్యులుగా చేరి, వేదిక కార్యక్రమాలకు తమ అండదండలందించినవారికీ, ప్రత్యేకంగా వెంకటప్పయ్యగారి కుమారుడు ప్రస్తుతం వేదిక కన్వీనర్ మురళీధర్ గారికి ‘ప్రజాసాహితి’ కృతజ్ఞతలను తెలియచేస్తోంది.