కష్టాల కొలిమి – త్యాగాల శిఖరం సర్వదేవభట్ల రామనాథం జీవితం :
పరిశోధకుడు : ఆర్. శివలింగం, రచన : డా॥ కె. ముత్యం.
1/8 డెమ్మీలో 312 పుటలు. వెల : రూ.200/- ప్రథమ ముద్రణ : 9-3-2021. ప్రచురణ : రాయల సుభాష్‌చంద్రబోస్ మెమోరియల్ ట్రస్ట్. ప్రతులకు : గుర్రం అచ్చయ్య, ట్రస్ట్ చైర్మన్ ఆర్.ఎం.టి. భవన్, ఎం.వి.పాలెం (పోస్టు, గ్రామం) ఖమ్మం రూరల్ (మండలం), ఖమ్మం జిల్లా మరియు నవోదయ బుక్‌హౌస్, హైదరాబాదు. ఫోన్ : 7799558813.
కలియుగ కృష్ణార్జునులు, ఇతర కథలు : కథల సంపుటి
రచయిత : పులిగడ్డ విశ్వనాథరావు.
1/8 డెమ్మీలో 162 పుటలు. వెల : రూ. 80/- ప్రథమముద్రణ : ఆగస్టు 2009. ప్రచురణ : పాలపిట్ట బుక్స్, హైదరాబాద్. ప్రతులకు : పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాద్ – 500036. మరియు అన్ని ప్రముఖ పుస్తకాల షాపులలో.
ఆంధ్రీకవనం – శ్రీశ్రీ అనువాద కవిత్వం :
శ్రీశ్రీ సాహిత్యనిధి రూపొందించిన శ్రీశ్రీపై నూరు పుస్తకాల హోరు ప్రణాళికలో నూరవ పుస్తకం ఇది. ఈ నూరు పుస్తకాలలో శ్రీశ్రీ రచనలతోపాటు, శ్రీశ్రీపై ఇతర సాహితీవేత్తలు రాసిన రచనలు కూడా వున్నాయి. జనవరి 2021లో విడుదలైన ఈ నూరవ పుస్తకం శ్రీశ్రీ అభిమానులకు ఒక విశిష్టమైన కానుక.
పాశ్చాత్య సాహిత్యమూ, ఒక కాలంనాటి బెంగాలీ, హిందీ సాహిత్యమూ తెలుగు పాఠకులకు అనువాద రూపంలో పరిచయమయ్యాయి. కొందరు ప్రఖ్యాత తెలుగు రచయితలు, కవులు ఇంగ్లీషు మూలం తెలియచేయకుండా వాటిని తమ రచనలుగా ప్రచురించుకున్నవారున్నారు. శ్రీశ్రీ అలాగాకుండా మూల రచయితల పేర్లు చెప్పి అనువాదాలను, అనుసరణలను చేశారు. వివిధ భాషల్లోని కవితల ఆంగ్లానువాదాల ఆధారంగా ఆయన తెలుగులోకి వాటిని అనువదించారు. ఫ్రెంచి కవుల కవితలను ఫ్రెంచి భాష నుంచే నేరుగా అనువదించినట్లు తెలుస్తోంది.
ఈ పుస్తకంలో వివిధ భాషలకు చెందిన 61 మంది కవుల 90 కవితల అనువాదాలు, 228 పుటల్లో విస్తరించాయి. తానే తన భాషలో సృజనాత్మక కవిగా వున్నా, ఇతర భాషల్లోని కవుల కవితలకు ఆకర్షితుడై వాటిని అనువదించి తెలుగు పాఠకులకు అందించిన కవితా పిపాసి శ్రీశ్రీ. కవులు తమ కవితలు తప్ప ఇతరులవి చదవరు అనే సూత్రం శ్రీశ్రీకి నప్పదు. ఆయన అటు ప్రాచీన సాహిత్యాన్నీ, ఇటు ఆధునిక సాహిత్యాన్నీ లోతుగా అధ్యయనం చేసిన ఉత్తమ పాఠకుడు. తనకు బాగా నచ్చిన కవి రాసిన కవిత్వాన్ని చదవడమే గాక, దానిని తెలుగు పాఠకులకు అనువాదమో, అనుసరణో చేసి అందించాడు. వాటన్నిటినీ ఒకేచోట చదువుకోగల అవకాశం కల్పించాడు వీటి కూర్పరి అయిన శ్రీశ్రీ సాహిత్యనిధి కన్వీనర్ సింగంపల్లి అశోక్‌కుమార్.
అంతేకాదు, స్వయంగా కవి ఐన అశోక్‌కుమార్ ఈ 61 మంది కవుల్లో 51 మంది కవుల గురించి తనదైన విలక్షణ శైలిలో నాలుగు పాదాల లఘు కవితల్లో పరిచయం చేశారు. ఆయా కవుల విశిష్టతను క్లుప్తంగా విశదీకరించారు. వారి జనన, మరణాలను నమోదు చేశారు.
ఒక కవి రాసిన ప్రతి కవితా రసస్ఫోరకంగా వుంటుందని చెప్పలేము. అలాగే శ్రీశ్రీ చేసిన అనువాదాలన్నీ చక్కగా వున్నాయని చెప్పలేము. కొన్నిటిని చూస్తే ఇంత పేలవంగా చేశారేమిటనిపిస్తుంది. ఉదాహరణకు – 1936-1967 మధ్య జీవించిన గ్వాటేమాలా దేశ కవి ఓటోరినీ కాస్టిల్లో రాసిన Un political Intellectuals శ్రీశ్రీ చేసిన అనువాదం (పుట 215) కన్నా వెల్చేరు నారాయణరావు ‘నారా’ పేరుతో చేసిన ‘రాజకీయాతీతులైన మేధావులు’, ఆకర్షణీయంగా వుంది. అలాగే 1907-1963 మధ్య జీవించిన బ్రిటీష్ కవి లూయీ మేక్‌నీస్ ‘prayer before birth’కు శ్రీశ్రీయే చెప్పుకున్నట్లు ముక్కస్య ముక్కానువాదం కనుక బాగా లేదు.
ఈ 61 మంది కవుల్లో షేక్‌స్పియర్ (పుట 14), చార్లెస్ బాడ్లేర్ (పుట 36), స్టీఫెన్ ఫిలిప్ (పుట 56), జార్జి విలియం రస్సెల్ (ఎ.ఇ.) (పుట 60), డేవిస్ (పుట 64)లు రచనలకు శ్రీశ్రీ పద్యాల రూపంలో అనువదించారు.
ఈ అనువాదాలకు అశోక్‌కుమార్ తనదైన శైలిలో ఆంధ్రీకరణ, కవనం రెండూ కలిసివచ్చేట్లు ‘ఆంధ్రీకవనం’ అనే పదాన్ని సృష్టించి ఈ పుస్తకానికి శీర్షికగా పెట్టడం శ్రీశ్రీ వరవడిలో సాగిన ప్రయోగమే!
ఆంధ్రీకవనం (శ్రీశ్రీ అనువాద కవిత్వం) : 1/8 డెమ్మీ, 240 పుటలు. వెల : రూ. 200/- మొదటిముద్రణ : జనవరి 2021. ప్రతులకు : శ్రీశ్రీ సాహిత్యనిధి, 305 ప్రగతి టవర్స్, వీరయ్య వీధి, మారుతీనగర్, విజయవాడ – 520004. ఫోన్ : 92462 77378. srisrisahityanidhi@yahoo.com
తేనెటీగ కాదది విషపు తేలు :
మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో రాసిన అసభ్యకరమైన అశ్లీలమైన ‘తేనెటీగ’ నవలపైనా, దాని ఆధారంగా తీసిన సినిమాపైనా మూడేళ్ళపాటు (1989-91) విమర్శకులు, ప్రజాసంఘాలు, పాఠక – ప్రేక్షకులు ముప్పేటగా సాగించిన ప్రతిఘటన పోరాట చరిత్ర, విలువైన విమర్శా వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. 1/8 డెమ్మీలో 12+180 పుటల ఈ పుస్తకం వెల : రూ. 120/- ప్రథమముద్రణ : 2021 ఫిబ్రవరి 26. ప్రచురణ, ప్రతులకు : ఈదర గోపీచంద్, 11-7-17, నవోదయనగర్, నరసరావుపేట – 522601. ఫోన్ : 94403 45496. edaragopichand@gmail.com