చైతన్యవాహిని

చైతన్యవాహిని

            29-03-2021న తెనాలిలో జి. మోహనరావు (స్పార్టకస్‌) సంతాపసభలో ‘ప్రజాసాహితి’ ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ మోహనరావు పోలీసు శాఖలో పనిచేస్తూ సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించడం, ఆయనపై రంగనాయకమ్మ రచనల ప్రభావం, ‘ఖాకీ బతుకులు’ నవల రాసిన తర్వాత పోలీసు శాఖ ఆయనపై చేబట్టిన వేధింపు చర్యలు మొదలైనవి వివరించారు. చెరబండరాజు రాసిన ‘పోలీసు పాట’ ద్వారా పోలీసులూ ప్రజల్లో భాగమని చెప్పారన్నారు. మోహనరావు మిత్రులు అడ్వకేట్‌ జి.యస్‌. నాగేశ్వరరావు, జనసాహితి సభ్యుడు రచయిత చందు నాగేశ్వరరావు, నండూరి నారాయణరావు, మోహనరావు సహచరి మేరీ, కొడుకు ప్రేమచంద్‌, కూతురు ప్రత్యూష మొదలైనవారు పాల్గొని మోహనరావుకు నివాళి తెలియచేశారు. ‘ఖాకీ బతుకులు’ పుస్తకం మరో ముద్రణకు సహకారం అందించమని కోరారు.

01-04-2021న గుంటూరులో అన్నమయ్య కళావేదికలో అశ్లీలతా ప్రతిఘటనా సంఘంవారు ప్రచురించిన ‘తేనెటీగ కాదది విషపు తేలు’ పుస్తకాన్ని గుంటూరు మున్సిపల్‌ కమీషనర్‌ చల్లా అనూరాధ ఆవిష్కరించారు. పెనుగొండ లక్ష్మీనారాయణ (అరసం) స్వాగతం పలికారు. నల్లూరి రుక్మిణి (విరసం) అధ్యక్షత వహించి గుంటూరులో అశ్లీలతా ప్రతిఘటనా వేదిక నిర్వహించిన కార్యక్రమాలు వివరించారు. ‘ప్రజాసాహితి’ ప్రధాన సంపాదకుడు ‘తేనెటీగ’ నవలపై వచ్చిన విమర్శలను, మల్లాది అసంబద్ధ వాదనలను, వేదిక చేసిన పోరాట వివరాలను తెలియచేశారు. ఈదర గోపీచంద్‌, ‘కామోత్సవ్‌’ నవల పైనా, గ్రంథాలయాల్లో చోటు చేసుకున్న అశ్లీల నవలలపైనా, కోటప్పకొండ తిరునాళ్ళలో అశ్లీల రికార్డు డాన్సులపైనా చేసిన ఉద్యమాలను వివరించారు. ‘కామోత్సవ్‌’ నవలపై సాగిన వాద వివాదాలు, కోర్టు తీర్పులతో మరోపుస్తకం ప్రచురించబోతున్నట్లు ప్రకటించారు.

admin

leave a comment

Create Account



Log In Your Account