ఆంతర్యం

ఆంతర్యం

– బొలుసాని జయప్రభ

                ‘‘ఆనంద బాబు! నీదేకులం అని ఎన్నిమార్లు అడిగినా ఎప్పుడూ సమాధానం చెప్పరు ఎందుకు బాబూ?’’ అని అడిగాడు రంగయ్య.

          ‘‘చెప్పాను కదా రంగయ్యా ! నీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు’’ సమాధానంగా ఆనంద బాబు.

          ‘‘అదేం సమాధానం బాబూ? మనిషి భూమి మీద పడ్డాక ఏదో కులానికి చెందకుండా ఎలా ఉంటాడు? పోనీ పేరును బట్టి పోల్చుకుందామా అంటే అదీ వీలు కాకుండా ఉంది. రెడ్డి, చౌదరి, రాజు, మూర్తి, చారీ ఇలా పేర్లలోనే కులాన్ని చొప్పించుకుంటున్న ఈ రోజుల్లో, కుల సంఘాలు, కుల సభలు, కుల పార్టీలు లేనిదే మనిషి మనుగడ సాగని ఈ రోజుల్లో  ఏ కులమని అడిగితే ‘‘నా దగ్గర సమాధానం లేదని చెప్పటమేమిటి? ఆనంద బాబూ.’’

          ‘‘ఎంతో గొప్ప విషయాలు తెలిసిన మీరు, గొప్ప, గొప్ప పుస్తకాలు రాసిన మీరు, ఏ విషయం పైనైనా కూలంకషంగా, నిష్కర్షగా, నిజాయితీగా, అభిప్రాయం చెప్పే మీరు మీ కులం గురించి మీకు తెలియకపోవడం ఏమిటి బాబు గారు? నాకంతా అయోమయంగా ఉంది’’ అంటూ తల గోక్కున్నాడు.

          ఆనంద బాబు రంగయ్యని చూసి చిన్నగా నవ్వాడు.

…..     …..     …..

          ఫోన్‌ రింగ్‌ అయింది. రంగయ్య ఫోన్‌ ఎత్తి ‘‘హలో! ఎవరండి?’’.

          ‘‘నేను ‘అమృతమయి’ సెక్రటరీని మాట్లాడుతున్నానండి. ఆనందబాబు గారు వున్నారా? అని అడిగారు.

          ‘‘ఒక నిముషం. వారిని పిలుస్తాను ఉండండి’’, అంటూ ఆనందబాబుకి ఫోన్‌ ఇచ్చాడు.

          ‘‘హలో! మీ పుస్తకాన్ని మా సంస్థ అవార్డు కోసం ఎంపిక చేసిందండి’’.

          ‘‘సారీ! నేను ఎవరికీ అవార్డు కోసం పంపలేదండి, మీరు పొరపాటున నాకు చేశారు, నెంబరు మళ్లీ ఒకసారి సరిచూసుకోండి’’ అని పెట్టేసాడు.

          ఫోన్‌ మళ్లీ రింగ్‌ అయింది. ఈ సారి ఫలాన పుస్తకం, ఫలాన సంవత్సరంలో ప్రచురించబడింది, మొదలైన వివరాలు అన్నీ ఖచ్చితంగా చెప్పే పాటికి నమ్మక తప్పలేదు. ‘‘ఎవరో అభిమాని పంపించి ఉంటారండి. మమ్మల్ని  మన్నించి అవార్డును స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము’’.

          ‘‘ఓ అలాగా! ‘‘చాలా సంతోషమండి, అవార్డు వివరాలు చెప్తారా?’’.

          ‘‘రాష్ట్రం మొత్తం మీద మూడు వందల రచనలు వచ్చాయండి. అందులో నుండి మీ రచనను ఎంపిక చేశామండి’’.

          అవార్డులకు దూరంగా ఉండే ఆనందబాబు తన రచనను ఒక అభిమాని అవార్డు కోసం పంపించాడంటే సంతోషం వేసింది.

          అవార్డు ప్రదానోత్సవానికి రావలసిందిగా ఆహ్వానం వచ్చింది. ఫలానా తేదీ, సమయం, స్థలం అన్నీ వివరంగా మళ్లీ ఫోన్‌ చేసి కూడా చెప్పారు. మంచి సంస్కారం గల సంస్థ అని మనసులో అభినందించకుండా ఉండలేకపోయాడు ఆనంద బాబు.

          సమావేశ మందిరానికి వెళ్ళాడు. సందడి సందడిగా ఉంది హాలంతా. ఇంతలో ‘ఆనంద బాబుగారంటే  మీరేనా?.  అంటూ ఆనంద బాబు ప్రక్కన వచ్చి కూర్చున్నారు ఒకరు.

          ‘‘అవునండీ నేనే’’ మీ పరిచయం? అన్నట్లు ప్రశ్నార్ధకంగా చూసాడు.

          ‘‘మీ అభిమాని నండి, మీ పుస్తకం అవార్డు కోసం పంపింది నేనేనండి..’’

          ఆనంద బాబు సంతోషంతో తబ్బిబ్బు అయ్యాడు.

          ‘‘నా పుస్తకంలో మీకు నచ్చిన కవితాంశాల గురించి చెప్పండి. నా పుస్తకం ఎక్కడ చూసారు? ఎప్పుడు చూసారు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు ఆనంద బాబు.

          బ్లాంక్‌ ఫేస్‌తో తికమక చూపులు చూసాడు. ‘‘ఫరవాలేదు నచ్చని విషయాన్నీ కరాఖండిగా చెప్పండి. నేనేమీ అనుకోను’’.

          ‘‘ఆ విషయాలు తరువాత చర్చిద్దాం. ముందు మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి’’ అన్నాడు పరమ లౌక్యంగా చూస్తూ!

          బ్లాంక్‌ ఫేస్‌ ఇప్పుడు ఆనందబాబుకి ట్రాన్స్ఫర్‌ అయింది.

          ‘‘ఏ కులం, ఏ ప్రాంతం వగైరా….?’’

          ఇంతలో నా అభిమానిని ఎవరో పిలిచారు, అటువైపు వెళ్ళాడు.

          ఆరు గంటలకు సభ మొదలవుతుందనగా అవార్డు అందుకునేవారు రావడం ప్రారంభమైంది.

          కదిలే నగల అంగడి లాగా ధగ ధగా మెరిసిపోయే ఆభరణాలను ధరించి, మేకప్‌ ఎక్కడ చెదిరిపోతుందోనని  విసనకర్రతో విసురుకుంటూ, పరివారం, మందీ మార్బలం వెంట రాగా ఒక రచయిత్రి ప్రవేశించింది.

          ముక్కు మీదకు జారిన సులోచనాలతో, తెల్లని పైజామా, లాల్చీ ధరించి పది సంవత్సరాలుగా ఆ సంస్థ నుండి వరుసగా అవార్డులు అందుకుంటున్నానని చెబుతూ తన గురించి ముద్రించిన సమాచారాన్ని తెలిపే కరపత్రాలను తానే పంచుతూ కులుకుతున్నాడు Mr.కులుక్‌.

          పట్టు చీరల రెపరెపలతో ఆ సభలకు అలవాటైన పేరంటాళ్లుగా అవార్డులు అందుకోవటానికి అతిధులు వచ్చినట్లుగా ఒక గుంపుగా ఆడవాళ్లు వచ్చారు.

          రంగయ్య ఉంటే బాగుణ్ణు. రంగయ్య ప్రక్కన కూర్చుని మాట్లాడుతున్నట్టే అనిపించింది.

          ‘‘ఇంతకీ విషయమేంటి రంగయ్య?’’

          ‘‘ఆ! మీకేదీ పట్టదు. ఎప్పుడో గానీ గది వదిలి బయటకు వెళ్ళరు, మీ పుస్తకాలే మీ ప్రపంచం. బయటి ప్రపంచం చూడండి, చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయండీ సంఘటనలు.

          ‘‘మొన్నటికి మొన్న ఆ కనకారావుగారి సన్మానసభలో వారిని ఆకాశానికెత్తేశారండి. పుస్తకం అద్భుతంగా రాసారని, మహా మేధావి అని ఇంకా ఆయనను మించిన కవులే లేరని, ఏవేవో అద్భుత ప్రయోగాలు చేశారని, ఒకటే పొగడ్తలు. మెడ నిండా పూదండలు. ‘ప్రపంచం కవుల’ జాబితాలో చేర్చారట ఆయన్ని.’’

          ‘‘ఆహా! సంతోషం.’’

          ‘‘అందరూ వచ్చారండి, వీధి, వీధంతా అక్కడే ఉందండి. నేనూ వెళ్ళాను కదా! మీరూ ఆ వేదిక మీద ఉంటే బాగుణ్ణు, ఎంత శ్రమించారు. ఆ పుస్తకంలో మీరు దిద్దని పాదం లేదు కదా! ప్రతీ వరుసలో భాషా దోషాలు, పద్యాలలో  ఛందస్సులో దోషాలు, పద ప్రయోగంలో లోపాలు సరిచూడమని అడిగారు కదండీ! మీరేమో ఇవే కాదు, విషయ విశ్లేషణలోనూ లోపాలున్నాయని, ఇది ఇలా ఉండకూడదు,  ఇదిలా ఉండవచ్చు అని పుస్తకం అంతా తిరగ రాసినంత పనైంది రంగయ్య! అని అన్నారు.’’

          ‘‘అలా తప్పులు సరిదిద్దిన వారిని ‘పరిష్కర్త’ అని అంటారు.’’

          ‘‘మరి మీ నుండి అంత సహాయం పొందినవారు, మీ గురించి ఒక్క మంచి మాటైనా మాట్లాడలేదు.

          చూడబోతే ‘‘పద్యం రాసిన వాడి కంటే, పందిర్లు వేసిన వాడికి పురస్కారాలు ఎక్కువ అని అనిపిస్తుంది’’ ఆ సభకు సహకారం అందించినవారిలో చీపురు పట్టి ఊడ్చిన వెంకటక్ష్మికి కూడా పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పి మెమొంటో ఇచ్చారు.

          ‘‘అవునా రంగయ్యా! అయితే ఇప్పుడేంటి? కనకారావుగారు అడిగిన ప్రతీ విషయాన్ని అంత స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్న రంగయ్యని చూస్తుంటే ముచ్చటేసింది’’.

          ‘‘నువ్వు కూడా ఏమైనా రాశావా ఏంటి? దిద్ది పెట్టమంటావా ఏమిటి?’’ అన్నాడు నవ్వుతూ.

          ‘‘ఆ కనకారావు గారు రాసిన పుస్తకం తిరిగి రాసినంత పనైంది. ఆయనకు పుస్తకం రాయగా లేనిది నీకు ఆ పని చేసిపెట్టనా ఏమిటి? నువ్వు నాకు శ్రేయోభిలాషివి, నువ్వు నా పనులు చేసినందుకు కృతజ్ఞతగా నేను నీకు కొంత సహాయమైనా చేయగలిగే అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా నీ పుస్తకం ప్రచురించి ఇవ్వమన్నా ఇస్తాను’’ అన్నాడు ఆనంద బాబు.

          ‘‘ఊరుకోండి బాబు! ఈ మాత్రం అర్ధం చేసుకోగలుగుతున్నానంటే అది మీ చలవే కదా! మీ సహచర్యంలో ఉండబట్టే కదా నా భాషా మారిపోయింది, జీవిత తత్త్వం బోధ పడింది. నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దారు. పుస్తకం రాయాలంటే మీ అంత తెలివి తేటలు లేవు కానిండీ ‘‘నరకాసురవధ’’ గురించి పుస్తకం రాసిన ఆ కనకారావుగారి కంటే నాకు కొంచెం ఎక్కువే తెలుసనుకుంటాను మీ దయ వల్ల.’’

          ‘‘ఇంతకీ విషయమేంటి రంగయా!?’’

          ‘‘ఆఖరికి మన వీధి చివరన ఉన్న గుడి పూజారి గారిని కూడా సన్మానించారండి.. కనకారావు గారు రాసిన ‘నరకాసుర వధ’ పద్య కావ్యాన్ని నాటకంగా మలుచుకుని ప్రదర్శించిన శర్మ గారిని, యూనిట్‌ అందరినీ కూడా సన్మానిస్తూ చివరాఖరున గుడి దగ్గర కొబ్బరికాయల కొట్టు ‘శాస్త్రి’ గారిని ‘‘సూపర్‌ డైరెక్టర్‌’’గా పరిచయం చేసి (దర్శక పర్యవేక్షణ చేసేవాడు) దర్శకుడికి పెద్ద మెమొంటో, పర్యవేక్షణ చేసినవారికి చిన్న సైజు మెమొంటోనూ.

          ‘‘నాకు తెలియక అడుగుతున్నాను ‘ఆనంద బాబు! ‘పర్యవేక్షకుడు’ గొప్పా? ‘పర్యవేక్షణ చేయబడ్డవాడు ‘గొప్పా? ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? నాకు అర్ధం కాలేదు మరి. వారికెందుకు పెద్ద ముక్కో, వీరికెందుకు చిన్న ముక్కో? అన్నింటికంటే అర్ధంకాని విషయం ‘కనకారావు’గారిని ప్రపంచ కవుల జాబితాలో చేర్చారు. ఎందుకని?’’

          ఇంతలో ఇందాకటి అభిమాని మళ్ళీ వచ్చాడు. ఉలిక్కిపడిన ఆనందబాబు ఈ లోకంలోకి వచ్చి చిన్నగా నవ్వుకున్నాడు.

          ‘‘మీ వివరాలు చెప్పండి, రాసుకుంటాను.’’ అని పెన్ను పేపర్‌ రెడీగా పట్టుకున్నాడు.

          ‘‘అవన్నీ అవసరం లేదండి, పుస్తకం పేరు, మీరు ఎందుకు అవార్డుకు ఎంపిక చేసారో ఆ విశేషాలు చెప్పండి చాలు. ఆఖరున రచయిత పేరు చెప్పండి.’’

          దిక్కులు చూస్తూ, బిక్క మొహం వేసాడు. ‘‘పోనీ ఏ సామాజిక వర్గానికి చెందినవారో అదైనా చెప్పండి. ఎక్కడినుండి వచ్చారో అందరికి తెలియాలి కదా!’’

          ప్రక్కన ఎవరో కూర్చున్నట్లుగా అనిపించి ప్రక్కకు తిరిగి చూస్తే రంగయ్య.

          రంగయ్యని మధ్యవర్తిగా చేసుకుని, పక్కకు పిలిచి ‘‘ఈ సంస్థకు ఏమైనా సహాయం చేస్తాడేమో అడుగు మీ అయ్యగారిని’’

          ‘‘నా నుండి సహాయం ఆశించడం ఏమిటి?

          ‘‘చిత్ర విచిత్రంగా ఉన్నాయండి ఈ ప్రపంచపు పోకడలు’’ అని అన్న రంగయ్య మాటలకు అర్ధం ఇప్పుడు తెలుస్తోంది.

          ఇలాంటి సంస్థలకు ‘‘కవి వాక్కుల కంటే వారిచ్చే చెక్కులే ప్రధానమనుకుంటా!’’

          ఏమి జరుగుతుందో చూద్దామని వారడిగిన ఎమౌంట్‌కి చెక్‌ రాసి పంపించాడు రంగయ్య ద్వారా. చెక్‌ అందిన వెంటనే తన పేరు వినిపించింది స్టేజి మీద నుండి.

          ఇంతలో సభ మొదలైంది. అందరికి అవార్డు ప్రధానం చేస్తూ వారి రచనలలోని గొప్పతనం గురించి రెండు వాక్యాలు చెపుతూ అవార్డు ఇస్తున్నారు.

          కామన్‌ ఫాక్టర్‌గా ‘‘ఉన్నత కులానికి చెందినప్పటికీ ఎంతో విశాల హృదయం కనపరిచారని, సమసమాజ స్థాపన కోసం పాటు పడటమే తమ లక్ష్యంగా కవిత్వం రచించారని అందుకే అవార్డు కోసం ఎంపిక చేశామని చెప్పారు.

          తన పేరు ప్రకటించగానే స్టేజి పైకి వెళ్లి చిరునవ్వుతో అందరి వైపు చూసాడు.

          ‘‘అధ్యక్షుల వారికి, ముఖ్య అతిధులకు నా నమస్కారాలు! అతిధుల వైపు చూస్తూ ఒక ఆంగ్ల రచయిత అన్నాడు ‘‘what does it matter where a man is from? Is it fair to judge a man by his post – office address? Let a man be a man and don’t handicap him with the label of any section’’.

          ‘‘కులం గడప దాటకుండా సమసమాజ స్థాపన సాధ్యమా?’’ కవి పరిచయం ఆయన రాసిన కవిత్వంతో జరగాలి, కవి వ్యక్తిగత సమాచారంతో కాదు.

          ‘‘ఇందాక ఒక కవి సమసమాజ నిర్మాణంలో భాగంగా ‘‘వర్షం చినుకుని సమాజ పరం చేస్తానన్నాడు’’. ప్రాకృతికాంశాలు సహజంగానే అందరివీ. వాటిని ప్రత్యేకంగా ఎవరూ సమాజపరం చేయనవసరం లేదు. ‘సూడో వాల్యూస్’ ప్రచారం చేయకండి భావితరాలకు. ఈనాటి యువత ఆశావాదంతో ముందుకు వెళుతున్నారు.

          ‘‘ప్రపంచంలో ఎక్కడా మనిషి అస్తిత్వాన్ని గుర్తించడంలో, ప్రతిభని గుర్తించడంలో కులం, ప్రాంతం, ప్రమేయం ఉండటం లేదు. ‘‘విశ్వ మానవునిగా ఎదగాలని’’ అంటాను నేను.

          ‘‘గుణం లేనివాడు కులం గొడుగు పట్టుకుంటాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగులోకి చేరతాడు, పస లేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడు, జనులంతా ఒక కుటుంబం, జగమంతా ఒక నిలయం’’ అన్నాడు ఓ మహానుభావుడు.

          ‘‘నేను ఈ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నాను.

          ‘‘అందరు చైతన్యవంతులు కావాలి.

          ‘‘సాహిత్యానికి సామాజిక చైతన్య రూపం కావాలి.’’

admin

leave a comment

Create Account



Log In Your Account