ఊపిరి అందని నిస్సహాయ పరిస్థితుల్లో భారత ప్రజానీకం మరణం అంచున వేలాడుతోంది. ప్రజల చితిమంటల కాగడాని ఎత్తిపట్టి దానినే అభివృద్ధి వెలుగుగా భారత పాలకవర్గం చాటుకుంటోంది. దయనీయ కరమైన పరిస్థితులను, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే దుస్థితిని ప్రజలకి కల్పించిన నేరం మాత్రం పాలకులదే. గత సంవత్సర కాలంగా కరోనా వల్ల జరిగిన కల్లోలం తర్వాత సెకెండ్ వేవ్ వల్ల కలిగే విలయం గురించి శాస్త్రవేత్తల, డాక్టర్ల, ప్రజాతంత్రవాదుల హెచ్చరికలను పట్టించు కోకుండా పాలకులు పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలను కాపాడుతూ ప్రజారోగ్య వ్యవస్థనూ, ప్రజల ప్రాణాలను గాలిలో దీపం చేశారు. వందేళ్ళనాడు ప్లేగు, కలరా మొదలగువాటికి బలైనట్లే సైన్సు ఎంతో అభివృద్ధిచెందిన ఈ కాలంలోనూ ప్రజల ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నాం. అభివృద్ధిచెందిన శాస్త్ర జ్ఞానాన్ని ధనాఢ్యవర్గాల ప్రయోజనాలకి ఉపయోగిస్తున్న పాలకవర్గాలు – నూకలున్నవాడే బ్రతికే చందంగా ప్రజల్ని మూఢత్వంలోకి, నిస్సహాయతలోకి నెట్టేస్తున్నాయి. వ్యవస్థ విఫలమయిందా, వ్యవస్థను విఫలం చేస్తున్నారా అన్నది ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకొని పరుగులెడుతున్న దృశ్యం వల్ల అర్ధం అవుతూనే వుంది. ఘనత వహించిన మన ‘దేశభక్త’ పాలకులు కరోనా నెపంతో అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేశారు. కరోనా జాగ్రత్తలు పాటించని ప్రజల వల్లే ఇదంతా జరుగుతున్నట్లుగా చిత్రిస్తున్నారు. ఎక్కడా వైద్యం అందని పరిస్థితులను కల్పించి ఆందోళనాపూరిత వాతావరణాన్ని సృష్టించారు. ఆందోళనలతోనే ఎక్కువమంది చనిపోతున్నట్లుగా ప్రచారమూ చేశారు.
కుటుంబాలు కుటుంబాలే కరోనా బారినపడి చనిపోతున్నాయి. మన ప్రధానమంత్రి పెద్దనోట్ల రద్దుతో ప్రారంభించిన ‘క్యూ’లు (చాంతాడంత లైనులు) అన్నింటా కొనసాగుతున్నాయి. టెస్టుల కోసం క్యూ, వైద్యం కోసం క్యూ, వ్యాక్సిన్ కోసం క్యూ, శవదహనానికీ క్యూ…. పాలకులు పన్నిన పలు విధానాల వలలో చిక్కిన ప్రజానీకం – వారి దయా దాక్షిణ్యాలకై, వారి ఆదేశాలను అమలు చేసే మరమనుషులుగా తయారు చేశారు. ఇది నేటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ అవస్థ. ఎంత విషాదకరమైన పరిస్థితులలో నేడున్నాం! పోషకాహార లోపంతో, కలుష వాతావరణంలో ఎక్కువ పనిగంటలతో విశ్రాంతి లేకుండా నిరంతరం ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్న ప్రజలు కరోనా బారిన పడటం సహజమే. కరోనా లక్షణాలేమో అంటేనే ఆదరించేవారూ లేరు. వారిని పరీక్షించటానికి టెస్టింగ్ కిట్లూ లేవు. రిపోర్టు వచ్చినా వైద్యం అందించే సదుపాయాలూ, అవకాశాలూ లేవు. హాస్పిటల్స్ లేవు. బెడ్‌లు లేవు. మందులు లేవు. ఆక్సిజన్ సిలిండర్లూ లేవు. ఇక వెంటిలేటర్లు సంగతి సరేసరి. వేలమందికి ఒకరుగా వున్న ప్రభుత్వ డాక్టర్లు తమ శాయశక్తులా కృషిచేస్తూనే వున్నారు. వాళ్ళు కరోనా బారినపడితే ఆ ఖాళీని భర్తీ చేసేవారు లేరు. ప్రైవేటు హాస్పిటల్స్ దందాకి అడ్డూ అదుపూ లేదు. ఎవరికి ఎవరమూ ఏమీ కాలేని పరిస్థితులు. తల్లీ – తండ్రీ, అక్క – చెల్లి, అన్న – తమ్ముడు, భార్యా – భర్త ఏ బంధాలైనా చనిపోయినవారి కడచూపుకు నోచుకోవటం గగనమౌతుంది. డబ్బులూ, హోదా, సాంఘిక బలం – ఇవి ఏవీ కరోనా మరణాల్ని నిలువరించలేకపోతున్నాయి. మరణించినవారి అంతిమయాత్రలకే కాదు – కుటుంబాలకు తోడుగా, అండగా నిబడలేకపోతున్నాం. వెలివేత…. ఒంటరిగా, ఒక్కొక్కరంగా సంఘ జీవితాన్నుండి ‘వెలివాడ’లకు నెట్టబడుతున్న ఈ జీవన సంస్కృతి విధ్వంసానికి మన పరిపాలనా విధానాలే బాధ్యత వహించాల్సి వుంటుంది.
సామ్రాజ్యవాద అగ్ర రాజ్యానికి మోకరిల్లుతూ మోదీషాలు ట్రంప్‌కు స్వాగతం పలుకుతూ మన దేశంలోకి మొదటి వేవ్ కరోనాను ఆహ్వానించారు. కరోనా నెపంతో ప్రజలకు కావాల్సిన సదుపాయాలేవీ ముందుగా కల్పించకుండా అప్పటికప్పుడు లాక్‌డౌన్‌ను ప్రకటించి అశేష శ్రామిక ప్రజానీకాన్ని కష్టాలపాలు చేశారు. వలస కార్మికుల పాదముద్రల రక్తపు తడిని ఈ దేశపు రోడ్లన్నీ చవిచూశాయి. ఢిల్లీలో ముస్లింల సమావేశానికి అనుమతినిచ్చి – వారి వల్లే కరోనా వ్యాపించిందని ప్రజల్ని మతాల పేరుతో విభజించారు. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాన్ని అణచివేశారు. గో కరోనా గో అంటూ చప్పట్లు కొట్టించి, కొవ్వొత్తులు వెలిగించి, ఇంటి దీపాలను ఆర్పేశారు. ‘ఆత్మ నిర్భర భారత్’ అంటూ అన్ని రంగాలనూ ప్రైవేటీకరించటానికి, గుత్త పెట్టుబడిదారులకు అప్పనంగా దోచి పెట్టటానికి పూనుకున్నారు. నిత్యావసర వస్తువులతో సహా అన్నింటి ధరలను రెట్టింపు చేశారు. ఉపాధి లేక, కుటుంబ పోషణ వత్తిడితో సతమతమవుతున్న ప్రజానీకానికి, మద్యంషాపులు బార్లా తెరిచారు. బాధితులనే నిందితులుగా చిత్రించారు. ప్రజల శ్రమను దోచుకోవటంతోపాటు వారి శ్రమ సంస్కృతినీ, కుటుంబ వ్యవస్థనూ, వ్యక్తిత్వాలనూ విచ్ఛిన్నం చేస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ చాల ఉధృతంగా ఉంటుందని ప్రపంచం అంతా హెచ్చరించినా పోయేది ప్రజల ప్రాణాలేగా అన్నంత నిర్లక్ష్యంగా ఎన్నికల ర్యాలీలు, సభలు నిర్వహించారు. మాస్క్‌లు లేకుండా ఒకరినొకరు తోసుకుంటూ వున్న పెద్ద పెద్ద గుంపుల సభలను స్వయంగా ప్రధానమంత్రే నిర్వహించటాన్ని ప్రపంచమంతా తప్పు పట్టింది. రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగానూ, నల్ల చట్టాలను ఆమోదించబోమన్న దృఢనిశ్చయంతో సాగుతున్న రైతాంగ ఉద్యమాన్ని, ఆంధ్రుల హక్కు – విశాఖ ఉక్కు అని కార్మికులు చేస్తున్న ఆందోళనను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడగా వ్యవహరిస్తున్న మోదీషాలు కోట్ల డబ్బులు ఖర్చుపెట్టి లక్షలమందితో కుంభమేళాలు నిర్వహించారు. క్రికెట్ మ్యాచ్‌ల కోసం స్టేడియంలు నింపేశారు. సినిమా థియేటర్లు, పబ్‌లు, మద్యంషాపుల చుట్టూ ప్రజల్ని పోగేశారు. పాలకులే ప్రయత్నపూర్వకంగా కరోనాని విచ్చలవిడిగా వ్యాపింపచేశారు. మన ఆరోగ్య అవసరాలను పట్టించు కోకుండా మన దగ్గరున్న ఆక్సిజన్‌ను, వ్యాక్సిన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసి – మన దేశంలోని ప్రజారోగ్య వ్యవస్థను కుప్పకూల్చారు. ఊపిరందక కళ్ళముందే కుటుంబ సభ్యులు, స్నేహితులతో సహా ఎందరో మరణిస్తున్న పరిస్థితుల్లో మనల్ని మనమే ఇళ్ళకు బంధించుకునే స్థితిలోకి నెట్టారు.
ఆక్స్ ఫాం నివేదిక ప్రకారం మార్చి 2020 నుండి జనవరి 2021 వరకూ వందకు పైగా శత సహస్ర కోటీశ్వరులు తమ సంపదను 13 లక్షల కోట్ల రూపాయలు పెంచుకున్నారు. స్వయానా పాలకులే 69 వేల కోట్ల రూపాయలకు పైగా బడా పెట్టుబడిదారుల అప్పులను రద్దు చేశారు. ఈ పాలకులు ఎవరి పక్షమో, ఈ పరిపాలన ఎవరికోసమో తేటతెల్లమవుతుంది. దున్నేవానికే భూమి దక్కాలని భూస్వామ్య వ్యవస్థతో పోరాడుతూ ‘బయటపడ్డ పేగులను పై పంచెతో అదిమిపట్టి’ రణరంగంలోకి దూకిన పోరాట వారసత్వం మనది. ‘మృత్యువుతోనే పాట పాడుతాం! విప్లవమా నీకు లాల్ సలాం!’ అని ఆలపిస్తూ ఉద్యమించిన త్యాగపూరిత వీర వారసత్వం మనది. ‘పదండిరా! పదండిరా! భూమి, భుక్తి, విముక్తి కోసం అందరమొకటై పోరుదాంరా’ అనే పిలుపునిచ్చిన తెగువ మనది. నేడు కరోనా పేరుతో పాలకులు అనుసరిస్తున్న నేరస్థ దోపిడీ పాలనా విధానాలకు బలైపోతున్న మనమందరం ఇంకానా, ఇకపై సాగదంటూ కదులుదాం. సాహిత్య, సాంస్కృతికరంగ సైనికులమై ప్రజలకు అండదండగా నిబడదాం. ఈ దోపిడీపూరిత పాలనావిధానాలపై మన కలాలను ఎక్కుపెడదాం!