కామ్రేడ్ మధు రాసిన ‘ప్రజాసాహితీ, సాంస్కృతికోద్యమం – కమ్యునిస్టులు’ డాక్యుమెంట్ ముగింపు భాగం

కామ్రేడ్ మధు రాసిన ‘ప్రజాసాహితీ, సాంస్కృతికోద్యమం – కమ్యునిస్టులు’ డాక్యుమెంట్ ముగింపు భాగం

          వ్యక్తిగత ఆస్తులు పుట్టిన కాలం నుండీ ఈనాటివరకు మానవులు నడిచివచ్చిన కాలాన్ని వర్గపోరాటాల చరిత్రగా కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్‌ – ఏంగెల్స్‌ పేర్కొన్నందువల్ల సమాజంలో వర్గ సంఘర్షణ జరగటంలేదు. వర్గపోరాటం వ్యక్తుల యిష్టాయిష్టాలతో నిమిత్తం లేని వర్గ సమాజపు సత్యం. అది సామాజిక చలనానికి చోదకశక్తి.

          సమాజాన్ని వాస్తవికంగా శాస్త్రీయంగా అర్ధం చేసుకున్నందువల్ల వర్గసంఘర్షణ – సామాజిక పరిణామాలు – విప్లవాలు – మానవ చైతన్య రూపాలయిన సాహిత్యం – కళలు సామాజిక విప్లవంలో అవి నిర్వహించగలిగిన విశిష్ట పాత్ర మనకు స్పష్టంగా అర్దమవుతున్నాయి. ఈ జీవన చలన రహస్యాలను ఆకళింపు చేసుకోగలిగిన సామాజిక శాస్త్రమే మార్క్సిజం. దీని ప్రకారం మానవ సమాజ పరిణామం ఆదిమ కమ్యూనిజం – బానిస సమాజం – భూస్వామ్య సమాజం – పెట్టుబడిదారీ సమాజం – సోషలిస్టు సమాజం – తదనంతరం వర్గరహితమైన కమ్యూనిస్టు సమాజంగా సాగింది, సాగుతూంది. ప్రపంచమంతా వివిధ దేశాలుగా విభజింపబడి తమవైన ప్రత్యేకతలతో, విశిష్టతలతో కూడి వున్నాయి. వైవిధ్యపూరితమైన సాంస్కృతిక వారసత్వాలను కలిగి వున్నాయి. భారతీయ భూస్వామ్య వ్యవస్థను తన సహజ పరిణామ క్రమంలో పెట్టుబడిదారీ విధానంలోకి విప్లవాత్మక పరిణామం చెందనీయకుండా బ్రిటీషు సామ్రాజ్యవాదం, తదనంతర సామ్రాజ్యవాద శక్తులు ఆటంకంగా అడ్డుగా నిలిచాయి. తమకు దళారీలైన భారత బడాబూర్జువావర్గాన్ని  సృష్టించి పెంపొందించాయి, సామ్రాజ్యవాద దురాక్రమణకు గురైన చాలా వెనుకబడిన దేశాలలో వలెనే మనది అర్ధవలస – అర్ధఫ్యూడల్‌ వ్యవస్థ రూపాన్ని సంతరించుకుంది. కాలం చెల్లిన ఫ్యూడల్‌ విలువలతో క్షీణ సామ్రాజ్యవాద సంస్కృతి జతకూడినందువల్ల, ప్రజాస్వామిక చిహ్నంగా చెప్పుకునే పార్లమెంటరీ వ్యవస్థలతో సహా సమస్త రంగాలలో వెలువడే భయంకర కాలుష్యాన్నే, మనం ఈనాడు అనుభవిస్తున్నాము. మన సామాజిక వ్యవస్థకున్న అర్ధవలస – అర్ధఫ్యూడల్‌ లక్షణాలు, ప్రత్యేకతల వల్లే పూర్తి బూర్జువా విప్లవమూ, పూర్తి సోషలిస్టు విప్లవమూ కాని నూతన ప్రజాస్వామిక విప్లవ దశలో మనం వున్నాం. అంటే కార్మికవర్గ నాయకత్వాన కార్మిక – కర్షక ఐక్యత పునాదిగా, దున్నేవానికే భూమి నినాదంతో సాగే వ్యవసాయక విప్లవం యిరుసుగా, ప్రజావిప్లవ పంథా మార్గాన ఇది సాగుతుంది. ఈ దశలో సామ్రాజ్యవాదులూ వారి దళారీలైన బడా బూర్జువావర్గమూ భూస్వామ్య వర్గమూ విప్లవానికి శత్రువర్గాలుగా, ఆధిపత్యం నుండి నెట్టివేయవలసిన వర్గాలుగా వుంటాయి. కార్మిక వర్గమూ, రైతాంగమేకాక పెటీబూర్జువా – జాతీయ బూర్జువావర్గాలు కూడా విప్లవానికి అనుకూలంగానూ, విప్లవాత్మక పాత్ర నిర్వహించే స్వభావంతోనూ వుంటాయి. సామ్రాజ్యవాద యుగపు ఈనాటి నూతన ప్రజాస్వామిక విప్లవ దశలో మనదేశపు వర్గ సంఘర్షణల నిలబడే విరుద్ధ పక్షాలు యివీ.

ప్రజాపక్షం : కార్మికులు, రైతాంగం, పెటీబూర్జువా, జాతీయ బూర్జువా వర్గాలు.

శత్రుపక్షం : సామ్రాజ్యవాదులు – దళారీ బడా బూర్జువా వర్గమూ – భూస్వామ్యవర్గం.

          ఈ వ్యవస్థ యొక్క ఉపరితలాంశాలయిన రాజ్యమూ, మతమూ, విద్య – వ్యవస్థను కాపాడే భౌతిక, సాంస్కృతిక సాధనాలు.

          పితృస్వామ్యమూ, కులవ్యవస్థా, మతతత్త్వం – ఇవన్నీ అర్థవలస అర్థఫ్యూడల్‌ వ్యవస్థ యొక్క దేశీయ సాంఘిక, రాజకీయ రూపాలు. ఇవి కూడా దోపిడీ వ్యవస్థను కాపాడే సాధనాలే. వ్యవస్థను కాపాడటంలో సంస్కృతి యొక్క పాత్ర,  అందులో సాహిత్యం – కళలకున్న శక్తీ మనకు తెలిసిందే. సామాజిక విప్లవంలో సాహిత్యమూ కళలూ తమవైన విశిష్టతలతో ప్రముఖ పాత్ర నిర్వహించగలుగుతాయి. జీవితాన్ని అతి సన్నిహితంగా, నిశితంగా, వాస్తవికతాదృక్పథంతో పరిశీలించి గ్రహించే ప్రయత్నంలోనే అత్యంత విశిష్ట విలువలున్న సాహితీ సృజన జరుగుతుంది. ప్రజాసంస్కృతి కోసం నిలబడాలంటే ప్రజల జీవితాన్నీ, పోరాటాన్నీ ఆకళింపు చేసుకోవాలి. ప్రజల నుండి ప్రజలకు అన్న సూత్రాన్ని పాటించాలి. ప్రజలు భౌతిక వస్తు సంపదలకే కాదు, భాషా – సాహిత్యం – కళ సంస్కృతులకు కూడా సృష్టికర్తలే. ప్రజాజీవితపు గని నుండి స్వీకరించిన ముడిసరుకును, వాటి స్వభావానికనుగుణమైన రూపాలుగా మలిచి తిరిగి ప్రజలకు అందించటం ప్రజారచయితల కళాకారుల కర్తవ్యం. అలా కాకుండా ముడిసరుకుని తమ వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలకో, వ్యాపారానికో వినియోగించుకోవటం, అంతేకాక తామే ఆ సంపదల సృష్టికర్తలమని అహంభావించటం ప్రజాదృక్పథం కాదు.

          ప్రజాఉద్యమ వాస్తవికతకు అవసరాలకు అనుగుణంగా ప్రజల జీవన సమరంలో ప్రజల పక్షాన నిలబడే రచయితలూ, కళాకారులూ సంఘటితపడి నిర్మాణాత్మకంగా ప్రజాఉద్యమపు ఆటుపోట్లను తట్టుకుంటూ కృషి సాగించటం, నిబద్ధ రచయితలుగా రూపొందటం ఒక నిరంతరాయ ప్రక్రియ. ఈ ప్రక్రియలో రాటుదేలటానికి సంసిద్ధులు కావటం ప్రజాసాంస్కృతికోద్యమానికి చైతన్యవంతంగా, చిత్తశుద్ధితో అంకితం కావటం రచయితల సామాజిక బాధ్యత.

          సాహిత్య – కళారంగాలలో మార్క్సిస్టులు రూపాన్ని పట్టించుకోరనే విమర్శ వొకటుంది. ఇది అబద్ధం. ఎందుకంటే రూపంలేని వస్తువే లేదు కనుక. వస్తు సారానికి, రూపానికి విడదీయలేని గతితార్కిక సంబంధం వుంది. ఈ విషయంలో జీవితానుభవం చాలా సూటిగా నిరాడంబరంగా వుంటుంది. నకిలీ బంగారానికీ అసలు బంగారానికీ, నకిలీ విత్తనాలకు అసలు విత్తనాలకూ రూపం ఒకటిగానే వుంటుంది. కానీ సారంలోనే తేడా అంతా. ఈ సారమే ప్రాథమికమైనది. ప్రజలకు కావలసినదీ.

          సారానికి వన్నె తెచ్చేదీ, సారం యొక్క శక్తిని అర్థవంతంగా ప్రదర్శించేదీ, వ్యక్తీకరించేదే రూపం. అంటే సారం మౌలికమైనది. రూపం దానికి సహకరించేదీనన్నమాట.

          సాహిత్య – కళారంగాలలో జీవిత సారానికి తగిన రూపాన్ని ఎంచుకోవటం, రూప వైవిధ్యాల బహుముఖ ప్రక్రియలలో నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవటం రచయితల, కళాకారుల ముఖ్య విధి. ఒక శిల్పాన్ని చెక్కటానికి ఎంత ఏకాగ్రత, శిక్షణ, నైపుణ్యం, అంకితభావం కావాలో అవన్నీ ప్రజాకళాకారులకు అవసరమే. అయితే ‘‘కన్ను పోయేంత కాటుక పెట్టుకోకూడదన్నదే’’ జీవితానుభవం నేర్పేది. అంటే సారాన్ని రూపం మింగెయ్యటమో, బలహీనపరచటమో, నిర్లక్ష్యపరచటమో చేయకూడదన్నమాట.

          తన కుండలకు అవసరమైన మంచి మట్టిని తెచ్చుకున్న తర్వాత ఆ మట్టిని కుండగా రూపొందించటమే కుమ్మరికి ప్రధానమవుతుంది. అదేవిధంగా వస్తువుని నిర్థారించుకున్న తర్వాత కళాకారుడికి రూపం ప్రధానమవుతుంది.

          కళానైపుణ్యాలను మెరుగు పరచుకోవటానికి, వస్తురూప సమన్వయం సాధించటానికి అంతర్జాతీయ – జాతీయ కళావేత్త సిద్ధాంత – ఆచరణల అనుభవాల నుండి ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి వుంది.

          సాహిత్య – కళావిమర్శనాపద్ధతులను ఇంకా ఎంతో మెరుగు పరచుకోవాల్సి వుంది. సాహిత్య – సామాజిక జీవన ప్రతిఫలనాల విశ్లేషణ, ప్రజాజీవితానుభవాల నుండీ, ఉద్యమ అవసరాలూ, చారిత్రక పరిమితుల నుండీ, బాహ్యవాస్తవికత నుండీ సాగాలి తప్ప విమర్శకుల స్వీయ రాగ, ద్వేషాలూ, భావోద్వేగాలూ, అంతిమ తీర్పులు ప్రదర్శితం కాకూడదు. సమాజాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవటానికీ, రచయితా – పాఠకుడూ తమ అవగాహనాస్థాయిని పెంచుకోవటానికీ, కళాత్మక విలువ మెలకువలు గ్రహించటానికీ విమర్శ తోడ్పడాలి.

          ఉచ్చారణాయాసలూ, మాండలిక పదాలూ, అభివ్యక్తి రీతులలో వైవిధ్యం భాషాసంపదలే కాని హెచ్చుతగ్గుల  అహంభావానికీ, ఆత్మన్యూనతను కలిగించటానికీ వినియోగించటం ప్రజాస్వామిక దృక్పథం కాదు. ఇంకా తెలుగువారు ఒక జాతిగా అభివృద్ధి చెందే క్రమంలోనే వున్నారు. తెలుగుజాతి భాష సర్వతోముఖాభివృద్ధికి, ప్రాంతీయ అసమానతలు తొలగటానికి నేటి అర్థవలస – అర్థఫ్యూడల్‌ వ్యవస్థా దాని రాజకీయ, సంస్కృతులే ప్రధానమైన అడ్డంకిగా వున్నాయి.

          సాహిత్య కళారంగాలతోపాటు వివిధరంగాల సామాజిక శాస్త్రాల పరిశోధనలూ, సైద్ధాంతిక కృషి యొక్క తాత్త్వికసారమంతా మానవీయ చైతన్యాన్ని మరొక అడుగు ముందుకు వేయించేవే. వీటిని ప్రజాసాహితీ సాంస్కృతికోద్యమకారులు పుణికి పుచ్చుకోవాలి.

          సంస్కృతీ నిర్మాణానికి శ్రమజీవులు – శాస్త్రవేత్తలూ – కళాకారులు మూలస్థంభాలని గోర్కీ చెప్పాడు. ప్రకృతితో సంఘర్షణ ద్వారానే మానవ సమాజం ఆహార వస్తూత్పత్తులను సృష్టించుకుంది. సామాజిక సంఘర్షణ – వర్గపోరాటం ద్వారానే ప్రజల విప్లవాత్మక పోరాటాల ద్వారానే సమాజ ప్రగతినీ, నూతన సంస్కృతులనూ మానవులు సాధించారు, నిర్మించుకున్నారు. మేధో శ్రమజీవులైన రచయితలు కూడా కళాకారులే. తమ తమ నైపుణ్యాలతో సామాజిక సంఘర్షణలో చైతన్యవంతంగా, క్రియాశీలంగా, నిబద్ధతతో ప్రజాసాంస్కృతికోద్యమ నిర్మాణానికి సంఘటితంగా పూనుకోవాలనీ, పాల్గొనాలనీ, సహకరించాలనీ కమ్యూనిస్టులు వారి నుండి ఆశిస్తున్నారు.

          ప్రజాస్వామిక యుగచైతన్యమంటే నిరంతరాయంగా, విస్తృతంగా పీడితప్రజలను వర్గపోరాటంలో పాల్గొనేట్టు చేయటం. అంతేగాని వారి తోక పట్టుకుపోవటం కాదు. అలాగే నేలవిడిచి సాము చేయటమూ కాదు.

          ప్రజాసాహిత్యం, ప్రజాకళలు, ప్రజాసంస్కృతి వర్థిల్లాలి.

          భూస్వామ్య సామ్రాజ్యవాద సంస్కృతులు నశించాలి.

          శ్రమజీవుల, పీడిత ప్రజల ఐక్యత వర్థిల్లాలి.

          నూతన ప్రజాస్వామిక విప్లవం వర్థిల్లాలి.

admin

leave a comment

Create AccountLog In Your Account