ఒక పాత్రపై ముప్పై పాత్రల జీవన గానాల కచేరీ ఈ ‘మనోధర్మపరాగం’

ఒక పాత్రపై ముప్పై పాత్రల జీవన గానాల కచేరీ ఈ ‘మనోధర్మపరాగం’

దీనికి మొదటినుంచీ చివరివరకూ శ్రుతి పలికే తంబురా రచయిత నరేంద్ర

డా. చంద్రారెడ్డి

          ‘‘నా జీవితంలో ఒక తీరని కోరికో లేక ఒక లోటో వున్నంత వరకూ నేను జీవించి ఉండటానికి ఒక కారణమంటూ ఉంటుంది. ఏ కోరికా లేక పూర్తిగా సంతృప్తి చెందటమంటె అది మరణంతో సమానం’’ అంటాడు బెర్నార్డ్‌ షా. జీవితంలో అతిప్రధానమైనది జీవితమే. అదే సరిపోతుందా అంటే సరిపోదంటుంది చిత్తూరు కుముదవల్లి నాగలక్ష్మి. ఆమెకు కావాల్సింది తను కోరుకున్న, తనుకావాలనుకున్న జీవితం. సంగీతంలేని జీవితం ఆమెకు జీవితమేకాదు. విశ్వనాధన్‌తో పెళ్ళి తరువాత తననితాను బ్రాహ్మణీకరించుకోవడం దానికోసం. కొన్నింటిని త్యాగం చేయడం, కొన్నింటితో రాజీ పడడం, తల్లిద్వారా సంక్రమించిన దేవదాసీ ముద్రను చెరిపివేసుకోవడం, అదీ ఆమె ఎంచుకున్న మార్గం. కానీ సమాజం వెలుగునుగాక ఆ వెనుకనున్న చీకటిని వేలెత్తి చూపుతుంది. నాగలక్ష్మి పూర్తిగా వెలుగులోకి రావడానికి  దశాబ్దాల కాలం పడుతుంది. అయితేనేం మనోధర్మ సంగీతాన్ని సాధిస్తుంది. ఈ సాధనతో ముడిపడిన ఆ నాటి చారిత్రక, సామాజిక, రాజకీయ, సినీరంగాలకూ, వాటిలోని ప్రధాన వ్యక్తులకూ, మార్పులకూ, చేర్పులకూ తన కాల్పనికతను  జోడించి సజీవంగా ఆవిష్కరించాడు ఈ నవలా రచయిత. ఇది ఒక యుగాన్నే తవ్వి తీయడం లాంటిది. మనిషి సాధారణంగా సాఫల్యాలను పట్టించుకుని వైఫల్యాలను వదిలేస్తాడు. పల్లకీని పట్టించుకున్నంతగా దాన్ని మోసే బోయీలనూ, తాజ్‌మహల్‌ను పట్టించుకున్నంతగా దానికి రాళ్ళెత్తిన కూలీలనూ పట్టించుకోడు. కానీ ఈ నవలలో సామాజికంగా అణగారిన ఆర్తులకు గొంతునిస్తాడు రచయిత.

          ‘చిత్తూరు స్కంద కుముదవల్లి నుండి నాగలక్ష్మీ నటరాజన్‌ వరకూ’ కథను వంద సంవత్సరాలకి పైగా నడిపే ముప్పై పాత్రలు ఈ నవలలో ఉన్నాయి. ఇది చరిత్రలో విస్మరించబడిన దేవదాసీ వ్యవస్థ అనే ఒక సామాజిక చీకటి కోణాన్ని సజీవంగా మనముందుంచడానికి వాళ్ళదైన కాలంలోకి, వాళ్ళదైన సమాజంలోకి మనల్ని తీసుకెళతాయి. ఇవి వాళ్ళ మాండలీకంలో వాళ్ళ నేపథ్యంలో వాళ్ళ భాషలోనే మాట్లాడతాయి. గమనించాల్సిందేమిటంటే, ఈ పాత్రలన్నీ స్త్రీలవే. పజ్జెనిమదిమంది దేవదాసీలు, పదకొండుమంది బ్రాహ్మణ స్త్రీలు, ఒక శూద్ర మహిళ. పైగా వీళ్ళలో అసలు కథానాయకి చిత్తూరు కుముదవల్లి నాగలక్ష్మి లేదు. కానీ వీరందరి జీవనయానాలతోపాటు, వారి కేంద్ర బిందువుగా నాగలక్ష్మి మాత్రమే ఉంటుంది. వీరు నదీపాయలైతే, వీరందరినీ అనుసంధానం చేస్తూ ప్రధానపాయగా ఉంటుంది. వీరందరూ చెప్పినదానితోనే నాగలక్ష్మి తత్త్వాన్నీ, మనస్తత్త్వాన్నీ, ప్రాధాన్యతల్నీ, అనుభవాల్నీ, వ్యక్తిత్త్వాన్నీ పాఠకుడు తెలుసుకుంటాడు.

          ఈ అందరి కలయిక కారణంగానే చరిత్ర, కల్పన ఒకతాటిపైకి వచ్చి ‘మనోధర్మ పరాగాన్ని’ ఒక భిన్నమైన కాల్పనిక చారిత్రక నవలగా చేస్తాయి. ఇన్ని పాత్రలు తమతమ దృక్కోణాల నుంచీ ప్రధానపాత్రను చూచి మాట్లాడినపుడు, ఆ పాత్రనూ, ఆ నాటి పరిస్థితులనూ మరింత సమగ్రంగా అర్థం చేసుకోవడానికి పాఠకుడికి వీలవుతుంది. ముప్పైసార్లూ కథకుడి జోక్యంతోనే ఈ ముప్ఫై పాత్రలు రంగంమీదికి వస్తాయి. ఈ ప్రయోగం నూతనమైనదే అయినా కథాగమనంలో ఎక్కడా తొట్రుపాటు గానీ, పాత్రల జోడింపులో అపక్రమము గానీ కనిపించదు.

          ‘మనోధర్మ పరాగం’ పాఠకుణ్ణి గబగబా ముందుకు వెళ్ళనివ్వదు, ఒక్కోసారి ఒక పాత్ర గతం గురించో, మనోగతం గురించో, ఒక పాత్ర ద్వారా మరొక పాత్రను తెలుసుకోవడానికో, ఒక సంఘటనను సరిగా అర్థంచేసుకోవడానికో పాఠకుణ్ణి జుట్టు పట్టుకుని వెనక్కి లాక్కొస్తుంది. నవలలో ముడిబడిన ఆధ్యాత్మిక, తాత్త్విక, సాంఘిక విషయాల గురించిన తర్కం, జీవిత సమస్యలపై చేసిన నిర్వచనాలు నవల గాఢతను పెంచాయి. ఇవి కాలానికీ – స్థలానికీ అతీతమైనవి.

          ‘‘సమాజాల మధ్య ఉన్న ద్వేషాలకీ, వ్యక్తులు ప్రేమించలేకపోవడానికీ ఏదో సంబంధం ఉండి ఉండాలని నా నమ్మకమని’’ బుచ్చిబాబు అంటాడు. దీన్నే అంబత్తూరు వైరముక్తాంబ ఆర్ముగాంబ ద్వారా ‘‘విద్యావతి నాలా దేవదాసీ కాదు గదా! అందువల్ల ఆమెకు ప్రేమించడానికి కావాల్సిన ప్రాథమిక అర్హత ఉందని మీరూ ఒప్పుకుంటారు. ఎందుకంటే బానిసల వర్గంలో నుంచీ వచ్చిన వాళ్ళకు ప్రేమించడం తెలిసే అవకాశం లేదు’’ అని రచయిత చెప్పిస్తాడు. పేరుకు పోషకుడే అయిన సోమశేఖర అయ్యంగార్‌ మీద తనకున్నది ప్రేమ అని కూడా తెలియని మరకతాంబ అమాయకత్వం కదిలించి పారేస్తుంది. ఆయన తన కుటుంబసమస్యల కారణంగా ఆమెకు దూరమైతే, ఆ దిగులుతో చిక్కి శల్యమై ఆమె మరణిస్తుంది. వివాహం కోసం నాగలక్ష్మి భర్తను అంగీకరిస్తుంది. నాగలక్ష్మి కోసం విశ్వనాధన్‌ వివాహాన్ని అంగీకరిస్తాడు. ఇలా పెళ్ళి విషయములో ఎవరి ఆశలు – ఆశయాలు వాళ్ళకున్నా, పెళ్ళి తరువాత వాళ్ళిద్దరూ ఒకరికొకరు కట్టుబడే ఉంటారు. మణివణ్ణన్‌ అభిరామ సుందరి ద్వారా కంచి పరమాచార్య ఒక పాదాన్ని కులం బురదలోనే ఉంచుకున్నాడని తెలిసినప్పుడు ఆలోచనాపరులు విస్మయులవుతారు. ‘‘అత్తను మొదటిసారి తీసుకెళ్ళినప్పుడు పరమాచార్య ఆవిడ బ్రాహ్మణ స్త్రీ కాదని దూరం నుంచే పంపేశారట.’’ అంటుందావిడ.

          ప్రవాహ దిశలో ఈదుకుపోవడం సులభమే కానీ ఆ ప్రవాహానికి ఎదురీదడంలోనే మనిషికుండే సర్వశక్తులూ గోచరమౌతాయి. నలుగురు నడచినదారిలో నడవడం సులభమే, కానీ కొత్తదారి ఏర్పరచుకుంటూ నడవడం  హిమాలయాన్ని అధిరోహించడం లాంటిది. ఎలాగైనా బ్రతకొచ్చులే అనుకుంటే, పెద్ద ఇబ్బందులేమీ ఉండకపోవచ్చేమోగానీ, ఇలాగే బ్రతకాలి అనుకుంటే మాత్రం రకరకాల సంకటాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సి.కె. నాగలక్ష్మి ఎంచుకున్నది ఈ రెండో మార్గాన్ని. ఆ మార్గాన సాగడానికి కొన్ని విషయాలలో రాజీపడినా, ప్రధాన  విషయాలైన ‘సంగీతం మరియు బ్రాహ్మణీకాల’ నుండీ వైదొలగలేదు.  ఆ రెండింటికోసం తల్లికీ, సోదరునికీ, సోదరికీ దూరమౌతుంది.

          కథ ముందుకు జరిగేకొద్దీ నాగలక్ష్మి మనోధర్మం సంగీతానికి దగ్గరవుతుంది, కానీ సంగీతానికి మజిలీలే కానీ గమ్యం లేదని తెలుసుకుంటుంది… ‘‘మార్గం చూపడం వరకే గురువు చేసేపని. ఆ తర్వాత యెంతదూరం వెళ్తావన్నది నీ సాధనపై ఆధారపడి ఉంటుంది’’ అంటుంది సంగీత విద్వాంసురాలు జ్ఞానేశ్వరీదేవి. నాగలక్ష్మి ప్రాధాన్యతాక్రమం కూడా మారాల్సినంతగా మారుతుంది. ఈ మార్పు లేకపోతే తాను కావాలనుకున్నదానిని అందుకోలేకపోయి ఉండేదేమో! తల్లికే ఎదురుతిరిగి, పోషకుడి సంకెళ్ళ నుండీ తప్పించుకుని, విశ్వనాధన్‌కు భార్య అవుతుంది, అదీ అతని భార్య చనిపోయిన వెంటనే. ఆ తరువాత విశ్వనాధన్‌ మాట ఆమెకు వేదమౌతుంది, ఆయన ఉనికే ఆమె కచేరీలకు ప్రేరణ అవుతుంది, ఆయన కాలధర్మం చెందిన తరువాత ఆమె తన కచేరీలకు శాశ్వతంగా దూరమౌతుంది. తన భర్త నుండి తన సంగీతాన్ని వేరుచేయలేననే ఆమె నమ్మకం.

          ఒక్కోపాత్ర పరిచయానికి ముందూ, తరువాతా, ఒక్కోసారి మధ్యలో, పాత్రల ద్వారా రచయిత తాత్విక, సాంఘిక, సామాజిక, మానసిక, ఆధ్యాత్మిక, శృంగార, చారిత్రక, జీవన చింతన, సత్యశోధన, శాశ్వత – అశాశ్వతాలకు సంబంధించిన వ్యాఖ్యానాలను, కొత్త ఆలోచనలు రేకెత్తించే విషయాలను పాఠకుడి ముందుంచుతాడు. కొన్నిసార్లు ఐచ్చికాలనిచ్చి ఎంపిక పాఠకుడికి ఇచ్చేస్తాడు. ఇంకొన్నిసార్లు ప్రశ్నలు సంధించి ఆలోచించుకోమంటాడు. ఉదాహరణకు…., ‘‘భర్త పోషించడా? పోషకుడు భరించడా? ఆలుమగల మధ్య ఎవరెంత బాధ్యతాయుతంగా వుండాలనేది వాళ్ళ బంధానికి పెట్టిన పేరుమీద ఆధారపడి ఉంటుందా? మరి మానవజీవనానికి తల్లివేరులాంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయతల అస్థిత్వానికి చోటెక్కడ?‘…’ సంగీతం మజిలీ అయితే, ఆ తరువాత మజిలీలుండవా? గమ్యముండదా?’ ‘….’ జరిగిన ఏ విషయాన్నయినా సవ్యంగానూ, అపసవ్యంగానూ చూడవచ్చు. నాకెందుకో అపసవ్యమైనదే వాస్తవమనిపిస్తుందెప్పుడూ! తప్పు నా దృష్టిలోనా? లేకపోతే సృష్టిలోనా?’’ ఇంకోచోట, మతము మరణమనే బీజము నుంచీ మొలకెత్తిందని సూక్ష్మీకరిస్తాడు రచయిత. ‘దృష్టి, సృష్టి’ రెండూ చాలా మామూలు పదాలుగా కనిపించినా,  ఆలోచించేకొద్దీ అవి రెండూ క్లిష్టంగా తయారవుతాయి.

          చిత్తూరు స్కంద కుముదవల్లి నుండీ నాగలక్ష్మి నటరాజన్‌ వరకూ ఎన్ని పాత్రలు, ఎన్ని ఊళ్ళు, ఎన్ని అనుభవాలు, ఎన్ని ఉత్థాన పతనాలు, ఎన్ని స్వార్థాలు, ఎన్ని త్యాగాలు, ఎన్ని రాగాలు, ఎన్ని తారలు…. వీటన్నిటినీ కలిపే ఆ ‘మనోధర్మపరాగం’ రచయిత తన జ్ఞానాన్నీ, వివేకాన్నీ, ప్రాపంచిక అనుభవాల్నీ తనదైన శైలిలో ఉపయోగించి, ఆ పాత్రలో తాను పరకాయ ప్రవేశం చేసి జీవించి ఉంటే తప్ప ఈ ‘మనోధర్మపరాగం’ ఈ స్థాయిలో ఉండేది కాదు.

          ‘‘పేరుకు ప్రజలది రాజ్యం – పెత్తందార్లదే భోజ్యం’’ అని ఆరుద్ర అన్నట్లు, పాపం వీళ్ళు పేరుకు మాత్రమే దేవదాసీలు, నిత్యసుమంగళులు. నిజానికి వీళ్ళు సాటిమనషులైన ఉన్నత ధనికవర్గ పురుషులకు లైంగిక వాంఛలు తీర్చే దాసీలు. ఈ విభిన్నమైన పాత్రలు తమ సామాజిక, కుటుంబ నేపథ్యంతో పాటు తమ సాధక బాధకాలను కూడా తెలుపు కుంటాయి. ఈ నవలకు చారిత్రక నేపథ్యమున్నప్పటికీ ఇందులో రాజులూ, రాణులూ, జమీందారులూ, రాజ్యాలూ, యుద్ధాలూ, జయాలూ, అపజయాలూ, అంగరంగ వైభోగాలూ ఉండవు. ప్రధానంగా ఉన్నది తరతరాల దేవదాసీలు, వాళ్ళపోషకులు, వాళ్ళకు సంబంధించినవాళ్ళు, సినిమాలనే పాకుడురాళ్ళూ. ఆ పాకుడురాళ్ళని పరమపద సోపానాలని భ్రమసి, మనషుల్ని గొప్పగా అంచనావేసి మోసపోయిన కథానాయికలు.

          చిత్తూరు సరళకుమారి పాత్రను చదివినప్పుడు మహానటి సావిత్రి గుర్తుకు వస్తుంది. అసలు ఆ పాత్రను ప్రత్యేక ఇష్టంతో నవలలో రచయిత చేర్చాడేమోననిపిస్తుంది. ఆమెను సి.కె. నాగలక్ష్మి తన భర్తతో పాటు కలిసిందా లేదా అనేది రచయిత చెప్పకుండా, కలిసిందో లేదో తేల్చుకోమని పాఠకులకే వదిలేస్తాడు. సరళకుమారి భర్తను ఎంపిక చేసుకునే విషయంలో చేసిన పొరపాటు వల్ల తనతోపాటు తన పిల్లల జీవితాలనూ ఊబిలోకి దించేసింది. ఆమె ఆఖరు మాటలు… ‘‘నా పిల్లలూ… నేనూ… నే… నూ…’’ పాఠకుడి మనసును దుఃఖానికి గురిచేస్తాయి. ఆవిధమైనటువంటి స్పందన పాత్రతో పాఠకుడు మమేకమైతేనే జరుగుతుంది. అటువంటి బాధే సి.కె. నాగలక్ష్మి, చనిపోయిన తన తల్లిని చూచి విలపించినప్పుడు కూడా కలుగుతుంది. కుముదవల్లి కూతుర్లకోసం ఎన్ని ప్రార్థనలు చేసిందీ, ఎంత తపించిందీ, ఆ కూతుర్ల సుఖంకోసం ఎంత తాపత్రయపడిందీ అన్నీ ఒక్కసారి కళ్ళముందు కదలాడి, ఇంతేనా ఎవరికైనా చివరకు మిగిలేది? అనిపిస్తుంది.

          అంతర్గత ఉద్రేకానికీ బాహ్య వాతావరణానికీ సమతౌల్యం కుదిరినప్పుడే రసానుభూతి జనిస్తుందని అంటారు. రచయిత వాడిన ఉపమాన, ఉపమేయాలు, వర్ణనలూ పాఠకుడిని వాక్యాల మధ్యలోకి లాక్కుని పాత్రనూ పాఠకుడిని ఒక్కటి చేస్తాయి. ‘‘మనోధర్మ సంగీతం అనేది శరీరానికి పూసే మనస్సు అనే పువ్వుకుండే పరాగం మాత్రమే. అది ఏ ఇద్దరిలోనూ ఒకలా ఉండదు’’ అని సరళీకరిస్తాడు రచయిత. మనం జేసుదాసునీ, పండిట్‌ భీంసేన్‌ జోషినీ, చంబై వైధ్యనాధ భాగవతార్‌ని కొంచెం మనసుబెట్టి వింటే ఇది సత్యమని తెలిసిపోతుంది.

          ‘‘చరిత్రతో ఇటుకలు తయారుచేసి, ఇతివృత్తానికనుగుణంగా ఇష్టమొచ్చిన రీతిలో వాటిని తీసుకుని, కల్పన అనే సిమెంటుతో గోడలూ, పైకప్పు కట్టి, పైన జీవన చలన సూత్రాలనే రంగు పూసి నిర్మించిన కల్పనా చారిత్రక భవనమీ నవల’’ అంటాడు రచయిత. ఈ ప్రయత్నమేమీ వెన్నలో వెంట్రుక తీసినంత సులభంకాదు. ఇటుకలు వంచితే వంగవు, ఒత్తిడిచేస్తే విరిగిపోతాయి, అంటే ఆకృతులకోసం రచయిత సిమెంటు మీదనే ఆధారపడాలి. అలాగని వట్టి సిమెంటుతోనే సరిపెట్టడానికి కుదరదు. రంగులు కూడా పకడ్బందీగా ఎన్నుకుని వేయాలి లేకుంటే అవి అంటుకోవు. ఇటుకలనూ, సిమెంటునూ, రంగులనూ జాగ్రత్తగా వాడి చక్కని భవనాన్ని నిర్మించాడు రచయిత. ఇది ఒకసారి చదివి ప్రక్కనపడేసే నవల కాదు. సమయం దొరికినప్పుడల్లా ఏ పాత్రను చదివినా, ఇంతకుముందు మనకు కనిపించని కొత్త విషయాలు కొన్ని మనకు కనిపిస్తూనే వుంటాయి. జీవితపు సంక్లిష్టతల్ని ఒడిసి పట్టుకున్నప్పుడే అది సాధ్యమౌతుంది. వొక ప్రత్యేక సంస్కృతినీ కాలాన్నీ చిత్రించిన ఈ నవల అందుకే సార్వ కాలికమూ, సార్వజనీనమూ అయింది. ఈ నవలకు బహుమతినిచ్చిన ఆటా వాళ్ళకు అభినందనలు.

‘మనోధర్మ పరాగం’ – నవల

ఆటా బహుమతి (2020)

రచన : మధురాంతకం నరేంద్ర.

1/8 డెమ్మీలో 442 పుటలు. వెల : రూ. 375/- ప్రతులకు : అన్వీక్షికి, అజ్రాహౌస్‌, 54/సి/డి, ఎం.ఎన్‌.ఏ. కాలనీ, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌. ఫోన్‌ : 97059 72222

admin

leave a comment

Create Account



Log In Your Account