చైతన్యవాహిని

చైతన్యవాహిని

అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8 సందర్భంగా సభ

          అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8 సందర్భంగా ‘‘మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు కారణమవుతున్న సామాజిక మూలాలను ప్రతిఘటిద్దాం’’ అని స్త్రీ విముక్తి సంఘటన ఇచ్చిన పిలుపు నందుకొని స్త్రీ విముక్తి సంఘటన, జనసాహితి సంస్థల ఆధ్వర్యంలో 8.3.2020న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం సెల్లార్‌ హాల్లో సభ జరిగింది. ఈ సభకు స్త్రీ విముక్తి సంఘటన జంటనగరాల శాఖ కన్వీనర్‌ వి. సృజన అధ్యక్షత వహించారు. శ్రామిక మహిళలు సాగించిన అనేక పోరాటాల నుంచి రూపుదిద్దుకున్న మార్చి 8 ప్రాధాన్యతను వివరించారు.

          సభలో కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ తోట జ్యోతిరాణి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి,  సాధికారత గురించి దశాబ్దాల తరబడి పాలకులు మాట్లాడుతున్నప్పటికీ మహిళల జీవితాలు రోజు రోజుకీ  దుర్భరమౌతూనే ఉన్నాయని, ఆడపిల్లల రక్షణ, భద్రతే ప్రశ్నార్థకంగా మారాయన్నారు. ఆడపిల్లలపై, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, హింస ఎంత తీవ్రస్థాయికి చేరుకున్నాయో అనేక ఘటనల ద్వారా వివరించారు. స్త్రీలపై హింస పెరగడానికి పాలనా వ్యవస్థ వైఫల్యాలు అడుగడుగునా ఎలా కారణమవుతున్నాయో వివరించారు. తమ లాభాల కోసం కార్పొరేట్‌ శక్తులు మద్యం, మత్తు పదార్థాలు, సినిమాలు, టీవీ కార్యక్రమాల ద్వారా, ఇంటర్నెట్‌ల ద్వారా వ్యాప్తి చేస్తున్న సాంస్కృతిక కాలుష్యం, యువత మెదళ్లపై దాడి చేస్తున్న పోర్న్‌ సైట్లు మహిళలపై హింసాత్మక దాడులు పెరగడానికి ప్రధాన కారణంగా ఉన్నాయన్నారు. కానీ పాలకులు, అధికార యంత్రాంగం మాత్రం వీటి గురించి ఒక్కమాట కూడా మాట్లాడకుండా నేరము – శిక్ష చుట్టూ పరిష్కారాలు చూపిస్తూ ప్రజల ఆలోచనల్ని పక్కదారి పట్టిస్తున్నాయని అన్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న వలసలు, నిరుద్యోగం, ఆకలి, ఆకలి చావులు, నేరాలు మహిళల్ని లైంగిక సరకుగా మారుస్తున్నాయన్నారు. అసంఘటిత రంగంలో లక్షలాది మంది శ్రామిక మహిళలు పనిచేస్తూ లైంగిక దోపిడీకి ఎలా గురవుతూ ఉన్నారో చెప్పారు. చిల్లర వర్తకంలో కార్పొరేట్‌ సంస్థలు ప్రవేశించి మహిళలకి తాము చేసుకునే చిన్న చిన్న పనులు కూడా లేకుండా చేస్తున్నాయన్నారు. గుత్త పెట్టుబడిదారీ శక్తులకి, సామ్రాజ్యవాద కంపెనీలకి అనుకూలంగా పాలకులు అనుసరిస్తున్న విధానాలు మహిళల జీవితాల్ని దుర్భరం చేస్తున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణ పేరిట, వన్యప్రాణుల సంరక్షణ పేరిట ఆధిపత్య దేశాల అనుకూల విధానాల్ని అనుసరిస్తున్న పాలకులు ఆదివాసీలను అడవుల నుండి వెళ్లగొట్టాలని చూస్తున్నారన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో కాలుష్య నివారణ కోసం వెనుకబడిన దేశాలు కార్బన్‌ ఫారెస్ట్ లను పెంచాలని చెబుతూ, అక్కడ నివసించే ప్రజల్ని వెళ్లగొట్టాలని చూస్తున్నారని, అభివృద్ధి పేరుతో జరగబోయే ఈ విధ్వంస చర్యల వల్ల మహిళల జీవితాలపై హింస మరింత పెరుగుతుందన్నారు. అసమానతల్ని తీవ్రతరం చేస్తున్న వ్యవస్థలని మార్చుకోకపోతే స్త్రీలపై హింస తగ్గదని, హక్కుల్ని పరిరక్షించుకోవడం సాధ్యంకాదని, మానవీయ సమాజాన్ని రూపొందించుకోవాలంటే పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

          ప్రముఖ రచయిత్రి డా॥ బి. విజయ భారతి మాట్లాడుతూ స్త్రీలపై అణచివేతకు కారణమయిన పూర్వం నుంచి వస్తున్న అనేక ఆచారాలు మారాల్సిన అవసరం ఉందన్నారు. అనేక రంగాల్లో స్త్రీలు భాగస్వాములవుతున్నప్పటికీ ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. వీరేశలింగం పంతులుగారు, ఇంకా అనేకమంది సంఘసంస్కర్తలు స్త్రీ విద్య కోసం, మూఢనమ్మకాల్ని నిర్మూలించడం కోసం కృషి సాగించారని, ఆ దిశగా ఇంకా కృషి జరగాలని అన్నారు. శ్రామిక మహిళకు విముక్తి కలిగించే పోరాటాలు కావాలని, అందుకోసం కమ్యూనిస్టు భావజాలంతో పాటు అంబేద్కర్‌ భావజాలాన్ని కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

          ప్రముఖ రచయిత్రి శీలా సుభద్రాదేవి మాట్లాడుతూ స్త్రీలపై హింస పెరగడానికి సినిమాలు, టీవీల్లో వస్తున్న కార్యక్రమాలు, సీరియళ్లు ప్రధాన కారణంగా ఉన్నాయని, సెన్సార్‌ బోర్డులు ఎందుకు వీటిని అదుపు చేయడంలేదని ప్రశ్నించారు. ఆచారాలు, సంప్రదాయాల పేరిట మూఢత్వాన్ని పెంచే రకరకాల ఫంక్షన్లు కూడా ఎమోషనల్‌గా స్త్రీలను వివక్షాపూరితంగా తయారు చేస్తున్నాయన్నారు.

          జనసాహితి జంటనగరాలశాఖ కార్యదర్శి డాక్టర్‌ భట్టు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మహిళలు అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కుల్ని కూడా ప్రభుత్వాలు సరిగా అమలుచేయడంలేదని అన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, సాంస్కృతిక విధానాలు మహిళల జీవితాల్ని హింసాపూరితం చేస్తున్నాయన్నారు.

          స్త్రీ సంఘటన పత్రిక ఎడిటర్‌ ఎం. లక్ష్మి మాట్లాడుతూ మహిళలు పోరాటాల ద్వారా మాత్రమే హక్కుల్ని సాధించుకున్నారని, నేటికీ మహిళలు తమ జీవితాల్ని విధ్వంసం చేస్తున్న పాలకుల విధానాలకు, దోపిడీకి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో తమ నిరసనల్ని, పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని అన్నారు. ఆచారాలు, సంప్రదాయాల పేరిట సమాజంలో మూఢత్వాన్ని పెంచి పోషించడంలో గల పాలకుల, ఆధిపత్య శక్తుల దోపిడీ ప్రయోజనాల్ని అర్థం చేసుకోవాలన్నారు. స్త్రీలపై హింసని తీవ్రతరం చేస్తున్న వ్యవస్థీకృత మూలాల్ని అర్థం చేసుకొని, స్త్రీలు స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో జీవించగలిగే నూతన ప్రజాస్వామిక సమాజం కోసం ఉద్యమించాలన్నారు.

8 మార్చి 2020న చోడవరంలో

స్త్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో శ్రామిక మహిళా పోరాటదినం సందర్భంగా సభ జరిగింది. ఈ సభకు స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన శ్రీమతి ఓ.వి.వి.ఎస్‌. కుమారిగారు అధ్యక్షత వహించగా, జనసాహితి, విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ ఐ.టి.ఆర్‌.వి. శివాజీరావుగారు ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రామిక మహిళా దినోత్సవ స్ఫూర్తిని మహిళలకు అందకుండా పెట్టుబడిదారీవ్యవస్థ ఒక ఎంజాయ్‌మెంట్‌ చేసే రోజుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఫ్యాక్టరీలలో పనిచేసే మహిళా కార్మికులకు ఫ్యాషన్‌షోలు, ర్యాంప్‌వాక్‌లు, ఆటలు మరియు పాటల పోటీలు నిర్వహించడం ద్వారా శ్రామిక మహిళలకు నిజమైన చైతన్యాన్ని, స్పూర్తిని అందకుండా చేస్తున్నారన్నారు. ఆర్థిక సంక్షోభం తీవ్రతరం అవుతున్న ఈ సందర్భంలో దాని ప్రభావం అణగారిన వర్గాలపై మరీ ముఖ్యంగా ఆ  కుటుంబాలలోని మహిళలపై మరింత తీవ్రంగా పడుతుందని తద్వారా మహిళలు మరింతగా అణచివేతకు గురవుతారని అన్నారు. కార్పొరేట్‌వర్గాలు పేదవర్గాల నుంచి మరింతగా శ్రమను పిండుకోవాలి అనే ఉద్దేశ్యంతో కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఈ కారణంగా శ్రామిక మహిళలు తీవ్రమైన శ్రమదోపిడికి గురవుతున్నారనీ, మహిళలు మరింతగా ఐక్య పోరాటాలు చేయవలసిన సందర్భాన్ని ఈ కాలం డిమాండ్‌ చేస్తున్నదని, ఆ దిశగా మహిళలు చైతన్యవంతం కావాలని అన్నారు.

చౌదరి సత్యనారాయణ కాలనీ, శ్రీకాకుళం :

          స్త్రీ విముక్తి సంఘటన, శ్రీకాకుళంజిల్లాశాఖ ఆధ్వర్యంలో శ్రామిక మహిళా పోరాట దీక్షాదినం మార్చి 8న సభను నిర్వహించింది. పాలిటెక్నిక్‌ కాలేజీ నుండి లక్ష్మీటాకీస్‌ వరకు ఊరేగింపుగా వచ్చి లక్ష్మీటాకీస్‌ నుండి 7 రోడ్ల కూడలికి కాగడాల ప్రదర్శన నడిపించారు. 7 రోడ్ల కూడలిలో కాగడాలతో మానవహారంగా ఏర్పడి మహిళలపై దాడులకు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర నాయకురాలు కా॥ టి. అరుణ మాట్లాడుతూ – ఎన్ని చట్టాలు వచ్చినా అవన్నీ నోటితో పొగిడి, నొసలుతో వెక్కిరించే చందమనీ, సాంస్కృతిక కాలుష్యాన్ని వెదజల్లుతున్న వివిధ సామాజిక మాధ్యమాలను అదుపు చేయకుండా, మద్యనిషేధాన్ని అమలుచేయకుండా మహిళల స్థితిగతులు మెరుగుపడవని అన్నారు. స్త్రీ విముక్తి సంఘటన సభ్యురాలు తవిటమ్మ మాట్లాడుతూ ఇంటి నుండి బయటకు వచ్చిన మహిళ ఏ వయస్సువారైనా తిరిగి ఇంటికి క్షేమంగా చేరే సాంస్కృతిక వాతావరణం మనకి లేదని అన్నారు. ప్రజాసాహితి సంపాదకుడు – పి.ఎస్‌.నాగరాజు మాట్లాడుతూ – ఇటీవల మహిళలపై లైంగికదాడులూ, కుటుంబ రాజ్యహింస పెచ్చుమీరిపోతున్నాయన్నారు. పితృస్వామిక భూస్వామ్య సంస్కృతికీ, విచ్చలవిడి సామ్రాజ్యవాద సంస్కృతికీ వ్యతిరేకంగా పీడిత, శ్రామిక మహిళంతా నూతన ప్రజాతంత్ర పోరాట సంస్కృతిని బలపరచాల్సిన  కూడలిలో వున్నామని అన్నారు. ప్రజాకళాకారులు, జనంపాటలతో చైతన్యపూరిత వాతావరణాన్ని తీసుకొచ్చారు. మహిళా చైతన్యం వెల్లివిరిసే నినాదాలు మిన్నుముట్టాయి.

విజయవాడ :

మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దీక్షాదినం సందర్భంగా మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు కారణమవుతున్న సామాజిక మూలాలను ప్రతిఘటిద్దాం! అంటూ విజయవాడ శిఖామణి సెంటర్‌లో వున్న చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో స్త్రీ విముక్తి సంఘటన కృష్ణాజిల్లా శాఖ సభను నిర్వహించింది. ఈ సభకు జిల్లా అధ్యక్షురాలు వి. రాధిక అధ్యక్షత వహించారు. స్త్రీ.వి.సం. రాష్ట్ర అధ్యక్షురాలు సి. విజయ మాట్లాడుతూ మహిళలపై నిరంతరాయంగా సాగుతున్న హింస, అత్యాచారాలు, హత్యలు పరంపరలో స్వప్నిక – ప్రణీతలపై యాసిడ్‌ దాడి, అయేషా మీరా, నిర్భయ, దిశ ఘటనలు మొదటవీ, చివరవీ కావన్నారు. సమాజంలో హింసను ప్రేరేపించే స్త్రీలను సెక్స్‌ సింబల్‌గా చూసే దోపిడీ విషసంస్కృతి వ్యవస్థీకృతమై ఉన్నదనీ, సరైన చైతన్యంతో అర్ధం చేసుకుంటూ సంఘటితంగా ఉద్యమించా లన్నారు. ఓపిడిఆర్‌ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్త్రీల రక్షణ కోసం వున్న చట్టాల గురించి వివరించారు. వివిధ సంఘటనల సందర్భంగా అనేక చట్టాలను చేశారు కానీ నిర్భయ, పోక్రో, ఇటీవల దిశ చట్టం వరకూ ఎన్ని చట్టాలు చేసినా స్త్రీలపై హింస, అత్యాచారాలు ఆగటంలేదని, చట్టాలు మాత్రమే సరిపోవనీ, స్త్రీలలో సంఘటిత చైతన్యం కావాలన్నారు. జనసాహితి అధ్యక్షులు దివికుమార్‌ మాట్లాడుతూ సమాజంలో వ్యవస్థీకృతమై వున్న పితృస్వామిక భావజాలం స్త్రీలకు అడుగడుగునా హింసకు గురిచేస్తుందన్నారు. మత్తుపదార్థాలు, మద్యం, పోర్ను సైట్స్‌, సినిమా, టీవీల ద్వారా వ్యాప్తిచేస్తున్న హీన విలువలు స్త్రీలపై హింసాత్మక దాడులకు కారణంగా వున్నాయన్నారు. విషసంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం వుందన్నారు. మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దీక్షాదినంగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో గుర్తుచేస్తూ, ఆ స్ఫూర్తితో మరింత చైతన్యవంతమైన ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం వుందన్నారు. స్త్రీ.వి.సం. ఎస్‌.లక్ష్మి వేదిక మీదకు ఉపన్యాసకులను ఆహ్వానించారు.

admin

leave a comment

Create Account



Log In Your Account