క్షతగాత్ర శిబిరాల్లో

క్షతగాత్ర శిబిరాల్లో

– ఏటూరి నాగేంద్రరావు

          వీళ్ళందరూ

          ఏ దేశపు నేరస్తులూ కారు..

          ఓటు హక్కున్న నేల నుండి

          విసిరేయబడి ఆకలిని నియంత్రించుకుంటూ

          పేగులు కుట్టేసుకొని

          యాడేడో తిరిగి తిరిగి

          రంగు మారిన ముఖాలు.

          ఈ మట్టిలో పుట్టి

          ఈ మట్టినే తింటున్న

          ప్రగతి కారులు.

          ఆశల్ని తాకట్టు పెట్టుకుంటున్న

          స్తబ్ధ ప్రపంచాలు.

          చెలియలి కట్టను తెంపుకొని పరుగిడుతున్న

          ఆవేదన పాటగాళ్లు.

          దుఃఖ గాథల

          గ్రంధాల్లో చోటును సాధించుకున్న

          అపురూప వజ్రపు తునకలు!

          నగరాలు మేల్కొంటున్న

          కబుర్లేవి చెవుల్లోకి ఎక్కించుకోని బడుగు జీవులు.

          చూపంతా ఊరి పైనే!

          ఐనా ఎదురుచూపులు తప్ప ఓదార్చే వాళ్ళు లేరు.

          నిత్య నడకంతా

          నగ్నపాదాల ఆకలితోనే.

          నీడలా కనబడి అదృశ్యమవుతున్న పథకాల

          భ్రాంతిని మింగుతూ ఆకలి తీర్చుకుంటున్న వాళ్ళు…

          కాలపు వధ్య శిలపై వ్రేలాడుతూ

          పోగులు పోగులుగా చీలి పోతున్న వాళ్ళు.

          పాకుడు పట్టిన మెట్లమీదే కూలబడిపోతున్న వాళ్ళు.

          మీడియా కెమెరాల ముందు దృశ్యాలు దృశ్యాలుగా వెలిగిపోతూ

          కవుల అక్షరాల్లో కవిత్వమై జీవం పోసుకుంటున్న వాళ్ళు.

          క్షతగాత్రపు శిబిరాల్లో చల్లాచెదురైన వాళ్ళు..

          ఈ దేశపు వక్షస్థలం మీద

          ఎప్పటికీ మాయని గాయాలైన వాళ్ళు…

          నిజంగా వీళ్లు ఓడిపోయారా..!

          కూలబడి పోయారా..!

          దేశమా..!

          నీ చర్మపు పొరల్లో

          పగుళ్లోచ్చిన జాతి కాళ్ళ జన్మ రహస్యం దాగుంది.

          ఒక్కసారి చరిత్ర పుటలు తిరగేయవూ!

admin

leave a comment

Create Account



Log In Your Account