– సూర్యప్రకాశ్
కంపుగొట్టే మురికి వాడల దారుల నుండి..
పెచ్చు లూడుతున్న ఫ్లై ఓవర్ల నీడల నుండి..
మొదలయ్యిందొక ప్రస్థానం.
బోర విరుచుకొని నిలుచున్న కార్పొరేటు కోటల శిఖరాల ముంగిట
శిరసు వంచి మోకరిల్లిన మహానగరాల మురికి వాడల నుండి..
డొక్కలు మాడి బక్క చిక్కిన బడుగుల పడకల ఫుట్పాతుల నుండి..
కాళ్ళీడ్చుకుంటూ మొదలయ్యింది
నేటి మహా ప్రస్థానం.
పాపాలను కడిగేసుకునే పుణ్య పురుషుల
తీర్ధయాత్ర కాదు..
ప్రజలను దోచుకునే దోపిడీ దారుల
దండయాత్ర అసలే కాదు..
ఆర్చుకుపోతున్న పేగుల్లో ఆకలి మంటను ఆవిరి పడుతూ..
నిరాశల నిశీధుల గుండెల్లో ఆశల రుధిరం వడకడుతూ..
వేల మైళ్ళ తీరాలకు అడుగు దూరాల అంగలతో
అడుగడుగూ జత కలుపుతూ..
సాగుతున్న శ్రమజీవుల యాగం.
కరోనా కాటుకి బలైపోతున్న కష్ట జీవుల బతుకు పోరాటం..
మా మరో మహా ప్రస్థానం.
నెత్తిన మూటలతో
భుజాన కావడితో
చంకలో బిడ్డలతో
నిండిన గర్భంతో
భగ భగ మండే భానుడి కిందా
సల సల కాగే తారుల మీదా..
కాలుతున్న పాదాల ఊడి వస్తున్న చర్మాల నుండి
కారే రక్తపు చుక్కలతో..
కుంటుతూ.. కూలుతూ..
ముక్కుతూ.. మూల్గుతూ..
బతుకు బరువును మోసుకొస్తున్న బహు దూరపు బాటసారి
చెమట చుక్కలతో చిత్రిస్తున్న
వలస జీవితాల విశ్వరూపం.
దేశం నలు వైపులా పులుముకున్న
నిర్భాగ్యుల నిజ జీవిత ముఖ చిత్రం.
జ్ఞాపకాల దొంతరలలో కష్టాలను మూట కడుతూ..
ఎండిపోతున్న కుత్తుకలను కన్నీళ్ళతో తడుపుకుంటూ..
పగిలిపోతున్న పాదాలలో ఇంకిపోతున్న నెత్తుటితో
వలస జీవి రాస్తున్న అంతులేని చరితం..
మా మరో మహా ప్రస్థానం.
చలువ కళ్ళద్దాల చరిత్రకారుల కలాల కందని అన్నార్తుల ఆక్రందనం..
ఈ మరో మహా ప్రస్థానం.
కార్మిక, కర్షక, శ్రామిక శక్తుల
శిధిలమైన రెక్కల పునాదుల మీద..
ఆకాశానికి నిచ్చెన లేసే
సభ్య సమాజపు మహరాజుల్లారా..
రెక్కలు విరిగిన వలస పక్షుల
ఆకలి కేకలు వినబడలేదా..?
రాయితీలు, రుణమాఫీలని
లక్షల కోట్లా పాకేజీలెవరికి?
పేదవాడికి పొట్ట నింపని
కష్ట జీవికి దారి చూపని
ప్రగతి రధ చక్రాల పరుగులెక్కడికి?
పాలరాతి మేడల్లోనా
పండుకున్నా పాలకులారా..!
మీ మత్తులు వదిలే వరకు.
మీ బుద్దులు మారే వరకు
ఆగదు ఈ ప్రస్థానం.
మా గమ్యం చేరే వరకు
మహోదయం వచ్చే వరకు
ఆగదు ఆగదు
మా ఈ మరో మహా ప్రస్థానం.