– అశోక్ కుంబము
(“మానవాళి శోభ కోసం మొత్తం దోపిడీ వ్యవస్థను కాల్చేయాల్సిందే!”)
నీ కడుపులో ఉన్న
తొమ్మిది నెలలేనమ్మా
జీవితంలో నేను పొందిన
స్వేచ్ఛా కాలం
ఏ క్షణాన
భూమి మీద పడ్డానో
నా నల్ల రంగే నాకు శాపమయ్యింది
ఊహించని మృత్యుకూపాన్ని
నా చుట్టూ తొవ్వింది
నేను ఎదురుపడితే
నాలో ఒక దొంగనో
మత్తు మందు బానిసనో
పనిచేతకాని సోమరినో
నేరానికి కేరాఫ్ అడ్రస్సునో
చూశారే తప్ప
మనిషిగా ఎవ్వడూ పోల్చుకోలేదమ్మా
ఎవరైనా పలకరిస్తే
‘‘యస్, సర్’’
‘‘యస్, మాడం’’
అని బదులివ్వాలని మర్యాద నేర్పావే
ప్రతి ఆదివారం చర్చికి తీసికెళ్ళి
‘‘నీది ప్రభువు రక్తం బిడ్డా
మనుషులందరిని ప్రేమించు’’ అన్నావే
నేను విశ్వమానవుడిని కావాలని కలలు కన్నావే
కాని నేను విషవలయంలో చిక్కుకున్నానని
ఎందుకమ్మా చెప్పనే లేదు
ఇది స్వేచ్ఛా దేశమని
ఎదుగుదలకు ఆకాశమే హద్దని
నా మీద ప్రేమతో ఎన్ని అబద్దాలు చెప్పావమ్మా
మనవి ఆక్రమిత జీవితాలనే
పరాయీకరణ బతుకులనే
వాస్తవాన్ని ఎందుకమ్మా దాచిపెట్టావు
గడపదాటితే చాలు
ఏ గండం ముంచుకొస్తుందో అనే భయం
అవమానం
అనుమానం
అణిచివేత
ఇవే కదా మన ఆస్తి పాస్తులు
తరతరాల వారసత్వంగా
అభాగ్యులమయ్యాము
బతికే హక్కడిగితే దేశ ద్రోహులమయ్యాము
అమ్మా నీమీద ఒట్టేసి చెబుతున్న
నేను ఏ తప్పూ చేయలేదు
కరోనా కాలంలో కొలువు లేదు
ఆకలి తీరే దారి లేదు
అయినా నీనేమీ దొమ్మీలు, దొంగతనం చేయలేదు
అది చెల్లుబాటు కాని నోటని నాకు తెలియదు
దానిపై పోలీసుల బారినపడ్డాను
అంతే
ప్రపంచ వనరులను, మానవ శ్రమను
దోచుకున్నట్లుగా ఒక్కసారిగా
తెల్ల కావరం నా మీద పడింది
నా చేతులకు సంకెళ్ళు వేశారు
మన జాతిజాతంతా నా కళ్ళ ముందు మెదిలింది
నన్ను భూమి మీద పడేసి అదిమిపట్టారు
భూమిభూమంతా నీ రూపమే కనిపించింది
వాడు నా గొంతు మీద మోకాళ్ళు పెట్టి తొక్కుతుంటే
‘‘అమ్మా, అమ్మా’’ అని ఏడ్చాను
కాని వాడు మనిషి కాదమ్మా
ఇంకా ఇంకా గట్టిగా తొక్కాడు
నా గొంతు నలిగిపోవడం నాకు తెలుస్తూనే వుంది
ముక్కులోంచి కారుతున్న రక్తం నా కళ్ళముందే పారుతుంది
‘‘అమ్మా నాకు ఊపిరాడుతలేదు
అమ్మా నాకు ఊపిరాడుతలేదు’’ అని బిగ్గరగా ఏడ్చాను
ప్రాణం పోతుందని అర్థమయ్యింది
‘‘నీ కాళ్ళు మొక్కుత సారు,
నేను చస్తున్న, నన్ను వదిలిపెట్టు’’ అని వేడుకున్న
‘‘పర్వాలేదు, విశ్రాంతి తీసుకో’’ అంటూ విషపు నవ్వు నవ్వాడు
వాడు మృగం కదమ్మా
నా గొంతు ఎండిపోయి
‘‘అమ్మా నీళ్ళివ్వమని’’ బోరుమన్నాను
నాకు తెలుసు నువ్వు రాలేవని
అయినా చెరబట్టిన భూమిని చీల్చుకోని వస్తావనే ఆశ
నాకు ఊపిరి పోసినదానివి
ఆ ఊపిరి ఆగిపోతుంటే నువ్వు తప్ప
ఈ లోకంలో ఇంకెవ్వరు గుర్తొస్తరమ్మా
నీవెక్కడున్నా నీ కన్నపేగు కదిలేవుంటుంది
నా కోసం పరుగెత్తుకొచ్చే వుంటావు
‘‘జార్జ్, నా బేబీ’’ అని రోదించే వుంటావు
కాని నాకు వినపడలేదమ్మా
కాదు కాదు
వినడానికి నేను లేనమ్మా
అప్పటికే వాడు నా ఊపిరి మీద
విజయం ప్రకటించాడు
చివరిగా ఒక్క మాటమ్మ
ఇంకా మిగిలేవున్న మనుషులందరికి
నా మాటగా చెప్పు
ఇప్పుడు చర్చ చేయాల్సింది
కాలుతున్న కార్లు, భవనాల మీద కాదు
వాటిదేముంది దోపిడీ కొనసాగుతూనే ఉంటది
కొత్తవి పుట్టుకొస్తూనే వుంటవి
ఇప్పుడు చర్చ చేయాల్సింది
రగులుతున్న నీ కడుపు మంట మీద
తీర్చలేని నీ గర్భ శోకం మీద
తిరిగిరాని నా జీవితం మీద
తండ్రిలేని, ఏ అండలేని నా బిడ్డ భవిష్యత్తు మీద
నా బిడ్డకు నేను హామీ పడిన బతుకు మీద
నన్ను ఇంకెప్పుడూ ఆలింగనం చేసుకోలేని
నా అన్నతమ్ములు, అక్కచెల్లేళ్ళ మీద
నిత్యం అణచబడుతున్న
నాలాంటి నల్ల శరీరాల మీద
‘‘దోచుకుంటే కాల్చేస్తాం’’ అంటుండ్రు కదా
నిజమేనమ్మ కాల్చేయాల్సిందే!
మానవాళి శోభ కోసం
మొత్తం దోపిడీ వ్యవస్థను
కాల్చేయాల్సిందే!
(అమెరికాలోని మిన్నియాపొలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ అనే 46 ఏండ్ల నల్లజాతి యువకుని మే 25, 2020న తెల్ల పోలీసులు గొంతుమీద కాలు పెట్టి తొక్కి చంపిన సంఘటనకు నిరసనగా)