నిరీక్షణం

నిరీక్షణం

– వై. నేతాంజనేయ ప్రసాద్

          పులిచంపిన లేడికి సానుభూతిగా

          సింహం అహింసావ్రతం చేస్తుంది

          అన్యాయం అంటూ ఆక్రోశిస్తుంది –

          నిన్నటిదాకా సింహం విదిల్చిన

          ఎంగిలి మాంసం పంచుకుతిన్న

          అవకాశవాద గుంటనక్కలనేకం

          వింత గొంతుకతో వంతపాడుతూ

          పస్తులుండలేక పాట్లుపడుతున్నాయి –

          దోచుకునే దొంగసొత్తు దక్కడంలేదని

          సమన్యాయం అంటూ ఘోషిస్తున్నాయి –

          నిన్నటిదాకా సింహం నీడన చేరి

          నిస్సిగ్గుగా నీరాజనాలందించిన

          వలస జంతువులనేకులంతా

          వలపు వలచి పులిని తలచి

          నేడు కొండజపం చేస్తున్నాయి

          గతం నాస్తి వర్తమానం వాస్తవమంటూ

          వేటి పాత్ర అవి మేటిగా పోషిస్తున్నాయి –

          రాజకీయ ఋత్విక్కుల సారధ్యంలో

          అభివృద్ధి క్రతువు రంజుగా సాగుతోంది

          సంక్షేమ హోమంలో సమిధలై కాలుతూ

          సంక్షోభ సెగలో – సంక్షామ పొగలతో

          వన్య జీవులన్నిటికి కనులెర్రబారితే….?

          భ్రమల తిమిరం తెరలు తొలగి

          భ్రమర సమూహం సమరనాదం చేయునా?

          దివ్యకాంతుల భానుడొచ్చీ

          నవ్యకోకిల భవ్యగానం చేయునా

          వన్యజీవులు సంతసించగా

          వనమునంతా శాంతి శోభిల్లునా?

admin

leave a comment

Create AccountLog In Your Account