తల్లీ కన్నీరు పెడుతుందో….

తల్లీ కన్నీరు పెడుతుందో….

– పాలేరు

          తల్లీ కన్నీరు పెడుతుందో – కనిపించని కుట్రల

          భూ తల్లీ బావురుమన్నాదో – ఈ కరోన కాటుకు                           ॥ తల్లీ ॥

          చైనాలోనా కరోన వచ్చెను

          ఊహానంతా ఉడికిపోయెను

          మనుషులందరూ పిట్టలులాగా

          ఊపిరి అందక కూలిపోయినరు

          కరోన ఎట్లా వచ్చిచేరినాదో – ఈ చైనాలోకి

          ప్రపంచికరణతో ఎల్లలు దాటిందో – ఆ కరోనభూతం

          ‘‘అయ్యో….. ఓ….. ఓ…… ఓ…..’’                                             ॥ తల్లీ ॥

          బస్సులు రైళ్ళు ఆగిపోయినవి

          మార్కెట్లన్నీ కూలిపోయినవి

          తుమ్మితె దగ్గితె వ్యాపిస్తుందని

          లాక్డౌనంటూ మూసేసారు

          ఈ అంటురోగమే విస్తరించినాదో – ఆ చైనా నుంచి

          అరె ప్రపంచమంతా చుట్టు ముట్టినాదో – ఆ కోరన భూతం                ॥ తల్లీ ॥

          కరోన కాటుకు ప్రపంచమంతట

          స్టాకుమార్కెట్టు కుప్పకూలెరా

          మధ్యతరగతి లక్షల కోట్లను

          ఎలుగుబంటులూ జుర్రుకు తాగెర

          కరోన వైరసు వరముఆయె గదరా – ఈ దోపిడిగాండ్లకు

          ఈ కరోన వైరసు శాపమాయె గదరా – ఈ పుడమీతల్లికి                   ॥ తల్లీ ॥

          లాక్‌డౌనుతో పనులు లేకమరి

          వలసలు పోయిన కూలిలందరూ

          రోజుల తరబడి పస్తులతోటి

          పిల్ల పాపలతో సొంతగూటికి

          కాలినడకన బయలుదేరినారో – నా పల్లెల్లోకి

          బువ్వలేకమరి డొక్కలెండె గదరా – నా కూలి తల్లికి

          పొట్ట కూటికి ఎల్లలు దాటరూ – నా దేశం నుంచి

          వలస జీవుల వెతలు తీరునెపుడో – నా దేశంలోన                        ॥ తల్లీ ॥

          అంటురోగముకు మందులు లేవని

          తెలిసిందొక్కటె లాక్‌డౌనంటూ

          పరిశ్రమలన్నీ మార్కెట్లన్నీ

          రోజుల తరబడి మూసేసారు

          కార్మికులందరు వీధుల పాలాయే – నా దేశంలోన

          అరె! ఉద్దీపనలతో బొజ్జలు నింపారా – ఈ యజమానులకు               ॥ తల్లీ ॥

          అంబానీలూ ఆదానీలూ వేదాంత య సెల్లు గ్రూపులు

          యస్సు బ్యాంకునే మింగేశారు

          చోక్సీమాల్యా డీసిల్లాంటి కార్పొరేటు గజదొంగలెందరో

          వేలకోట్లు ఎగ్గొట్టిన సొమ్మును – మోడీషాలే రద్దుచేసిరి

          సిఎఎలను వ్యతిరేకిస్తూ పోరుచేసెగదరా – నా దేశంలోన

          అరె అణచివేయుటకు కుట్రజేసినారో – ఈ మోడీషాలు                     ॥ తల్లీ ॥

          ఆ పత్కాలు చుట్టుముట్టెను

          మందులు ఇంకా రాకపోయెను

          శాస్త్రవేత్తలను ప్రోత్సహించక

          విద్యావైద్యం సరుకును జేసిరి

          ప్రజారోగ్యమూ గంగలపాలాయే – నా దేశంలోన

          శాస్త్రవేత్తలు ఎల్లలు దాటారా – నా దేశం నుంచీ                             ॥ తల్లీ ॥

          అమెరిక చైనా ట్రీడు వారుతో

          ప్రపంచ పోటీ పెరిగిపోయెను

          ఆర్ధిక మాంద్యం హద్దులు దాటెను

          సంక్షోభాలూ చుట్టుముట్టెను

          మార్కెటు యుద్ధం వద్దనుకున్నారా – సామ్రాజ్యవాదులు

          ఈ మహమ్మారికి పురుడు పోసినారా – సామ్రాజ్యవాదులు               ॥ తల్లీ ॥

          ప్రపంచ మార్కెటు కొల్లగొట్టను

          బహుళజాతులు చేతులు కలిపిరి

          పరిశ్రమలన్నీ ఆక్రమించెను

          పాడిపంటలను కబ్జా చేసెను

          పాలకులంతా లొంగిపోయె గదరా – సామ్రాజ్యవాదులకు

          మరి వర్గపోరుకు సిద్ధం కావాలీ – నాదేశంలోన

          ఈ మహమ్మారులను తరిమి కొట్టుదాము – ఈ పుడమీ నుంచీ     ॥ ఈ మహమ్మారులను ॥

admin

leave a comment

Create Account



Log In Your Account