లాక్ డౌన్ @ యమపురి

లాక్ డౌన్ @ యమపురి

– మనస్విని

          “ఉహువా…. ఉహువా నారాయణ!

          ఉహువాహువా…. నారాయణ! నారాయణ!

          ఏమిటబ్బా అన్ని ద్వారాలూ మూసి వున్నాయి? అరెరె వైకుంఠపుర ద్వారానికీ, బ్రహ్మలోక, కైలాసపురాల ద్వారాలకీ నో ఎంట్రీ బోర్డు లున్నాయేమిటి చెప్మా! నిత్యం విందు వినోదాలూ, అప్సరసల నృత్యాలూ, గంధర్వగానాలలో సందడిగా ఉండాల్సిన ఇంద్రసభ నిశ్శబ్దంగా తలుపులు మూసుకొని ఉందేమిటి?

          ఉహువా.. ఉహువా…. నారాయణ! నారాయణ!

          ఈ వెధవ దగ్గొకటి. భూలోకయాత్ర పుణ్యమాని పట్టుకొని వదలడంలేదు. తీరా ఇక్కడికొస్తినా…. ఇక్కడేమో అన్ని ద్వారాలూ మూసి ఉంటివి! ఇపుడేమిటి దారి!

          ఆఁ….  అల్లంతదూరాన ఎవరో ఉన్నట్టున్నారే….. అరెరె యమభటులల్లె ఉన్నారే? యమకింకరులకు ఇక్కడేం పనబ్బా? పోనీలే వాళ్ళయినా కనిపించారు. అసలు సంగతేమిటో వాళ్ళనయినా అడిగి తెలుసుకొందాం!

          ఉహువా…. ఉహువా…. నారాయణ! నారాయణ!

          నారాయణ!  నారాయణ!  ఉహువా….’’ అని దగ్గుకొంటూ భూమిని సందర్శించి అపుడే తిరిగివచ్చిన నారదుడు యమభటులు కన్పించిన దిశగా వెళ్ళసాగాడు. ఇంతలో నారదుడ్ని గుర్తించిన యమభటుడొకడు తన పక్కవాడితో….

          ‘‘ఒరే! ఆ వస్తున్నది నారదులవారల్లే ఉంది! ఈ సమయానికి ఈయనెక్కడనుండి దాపురించాడురా బాబూ! ఒక దగ్గర ఉండడు కదా మహానుభావుడు! పైగా ఆ దగ్గొకటి! సర్లే ఏంచేస్తాం? ముందు నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఈయన్నొక ఐసోలేషన్‌ వార్డులో ఉంచడానికి వీలుగా ఏర్పాట్లు చేసి ఉంచు. మళ్ళీ తేడా వస్తే పాపులకు వేయాల్సిన శిక్షలు మనకు వేసినా వేస్తారు యముండగారు!’’ అన్నాడు.

          ఇంతలో సంగతేమిటో కనుక్కొందాం అని నారదుడు నోరు తెరిచి అరవబోయేంతలో నారదుడి ముఖానికి ఒక ఎన్‌ 95 మాస్కూ, చేతిలో ఇంత డెటాల్‌ శానిటైజరూ పోసాడు యమభటుడు. మేడిన్‌ దేవలోకం అనడం మూలానో ఏమోగానీ ఎంత గింజుకొన్నా నారదుడికి మాస్కులోంచి మాట బయటికి  రాలేదు.  శానిటైజరు రుద్దగానే ‘మాయాబజార్‌’ సినిమాలోని లక్ష్మణ కుమారుడికి మల్లే చేతులు రెండూ అతుక్కుపోయాయి. బహుశా సంకెళ్ళేసామని చెప్పకుండానే బంధించే స్పెషల్‌ ఎఫెక్ట్‌ అయి ఉంటుంది. ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోగానే భూలోకంలోని అంబులెన్సులాంటి వాహనంలోకెక్కించి యమలోకంలో ఒక గదిలో దించేశారు.

          భూలోకాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కరోనా దేవలోకాన్ని కూడా భయపెడుతున్నది అని అర్ధమవుతుండగానే అయినా దేవతలకు మరణభయమా? అన్న సందేహం తలెత్తినది నారదుడి మదిలో…. అంతలోనే సమస్త జీవరాశినీ సృష్టించిన బ్రహ్మ, తన ఆజ్ఞలేనిదే చీమనయినా కుట్టనివ్వని లయకారుడు శివుడూ, దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణ గావించి సమస్తలోకాల్నీ రక్షించే శ్రీ మహావిష్ణువూ ఉండగా దేవతలకేల భయం? బహుశా ఈ జాగ్రత్తలన్నియూ భూలోకము నుండి వచ్చిన మానవమాత్రుల కొరకై ఉంటివి. అని నారదుడు సమాధాన పడడానికి ప్రయత్నించాడు.

          అదే సమయానికి ఐసోలేషన్‌ వార్డుల్లోని వారిని చూడడానికి యమధర్మరాజు తనతోపాటు కొందరు ఎంబిబిఎస్‌, ఎంఎస్‌, గోల్డ్ మెడలిస్ట్‌ భటులతో రౌండ్స్ కి బయలుదేరాడు. సాధారణంగా తలకి మోయలేనంత కిరీటం, భుజకీర్తులూ, పావుకోళ్ళూ, పట్టువస్త్రాలతోపాటు చేతిలో గదో, విల్లంబో, కరవాలమో ఉంటుంది దేవతలంటే…. కానీ ప్రస్తుతం కరోనా కాలంలో ముఖానికి పట్టు మాస్కూ, మెడలో బంగారు శానిటైజర్‌ హారం, ‘కరోనా’ కవచధారులై దర్శనమిచ్చారు. మాస్కులోని ముఖాన్ని గుర్తుపట్టలేకపోయినా సూట్‌ మీద ముద్రించిన చిత్రపటాన్ని పోల్చుకొన్న నారదుడు ఇందాక మాస్కు వేసుకోగానే మూసుకొనిపోయిన గొంతు పెగుల్చుకుంటూ ‘‘ప్రభూ ఏమిటీ విచిత్రం?!’’ అని అన్నాడు యముడితో….

          మాస్కులో ఉన్న నారదుడ్ని గుర్తుపట్టలేక యముడు ‘‘ఎవడురా ఈ అసంధర్భ ప్రలాపి?’’ అని యస్వీరంగారావు స్టైల్లో అడిగాడు.

          ‘‘నారాయణ! నారాయణ!! నేను దేవా నారదుడ్ని. భూలోకయాత్ర ముగించుకొని ఇవ్వాళే తిరిగి వచ్చాను’’

          ‘‘ఆఁ నారదుడివా? భూలోకాన్నించి వస్తున్నావా? అక్కడికెందుకెళ్ళావ్‌? ఎపుడు వెళ్ళావ్‌? కోపంగా అడిగాడు యముడు.

          ‘‘ప్రభూ! భూలోకమునందు జనులు కరోనా వ్యాధిగ్రస్తులై పిట్టల్లా రాలిపోతున్నారంటే  సంగతేమిటో  తెలుసుకొందామని వెళ్ళాను. చీనాలోని వూహాన్‌ నగరముతో ప్రారంభించి ఆ మహమ్మారి ఏ ఏ రాజ్యాలను కబళిస్తుందో ఆయా రాజ్యాలను సందర్శించుకొంటూ చివరిగా భారతదేశాన్ని కూడా సందర్శించి ఇవ్వాళే వచ్చాను’’ భయపడుతూ జవాబిచ్చాడు నారదుడు.

          ‘‘హుఁ! చేశావులే పెద్ద ఘనకార్యం! ఎవరక్కడ? వెంటనే నారదునికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష గావించి రక్తనమూనాలు సేకరించుము!’’ అంటూ ఆజ్ఞాపించాడు యముడు.

          ‘‘చిత్తం ప్రభూ!’’ అంటూ శిరసావహించాడొక ఎంబిబిఎస్‌, ఎంఎస్‌, గోల్డ్‌ మెడలిస్ట్‌ భటుడు. థర్మల్‌ స్క్రీనింగ్‌లో నెగెటివ్‌ రావడంతో ‘‘హమ్మయ్య!’’ అని ఊపిరి పీల్చుకొని శాంతించిన యముడు….

          ‘‘చూడు నారదా! నెలరోజుల క్రితం దేవలోకవాసులందరికీ భూలోకయాత్ర నిషేధించడం జరిగింది. 3 వారాలనుండే లాక్‌డౌన్‌ అమలులో ఉంది. అంచేత నీవు జాగ్రత్తగానుండుము’’ అని యముడనగా కరోనా మహమ్మారి దేవతల్ని కూడా భయపెడుతున్నదా? అన్న ఇందాకటి సందేహం మళ్ళీ మేల్కొన్నది నారదుడిలో….

          ‘‘కానీ ఇదంతా ఎందుకు ప్రభూ? నాకేమీ అర్థం కావడంలేదు’’ అన్నాడు నారదుడు.

          ఎందుకేమిటి ఎందుకు? కరోనా మహమ్మారి మనల్ని కబళించకుండా ముందు జాగ్రత్త! అధిక ప్రసంగం ఆపి బుద్ధిగానుండుము. మా భటులు కరోనా గైడ్‌ను కాసేపట్లో అందించగలరు. దానిని అనుసరిస్తూ అటు పేషెంటువీ, ఇటు పేషెంటు జీరోవీ కాకుండా నుండుము! అర్థమయ్యిందా? అంటూ యముడు ఆవేశపడుతుండగా….

          ‘‘ఆఁ…. ఏవిటీ? కంటికి కనుపించని సూక్షజీవి అయిన కరోనా అంటే దేవతలకి భయమా? సమస్త జీవజాలానికీ అధినాధులైన దేవతలకి, దీనులైన ప్రజల్ని రక్షించాల్సిన దేవతలకి మరణభయమా? నమ్మలేకపోతున్నాను ప్రభూ!’’ అన్నాడు నారదుడు.

          ‘‘ఏమిటి నారదా? భూలోకమునందలి శ్వేతరాజ్య అధ్యక్షుడు ట్రంపులా మాట్లాడుతున్నావే? అచటి నుండి ఈ యహంకారమునేనా, లేక కరోనాను కూడా కొంత మూటగట్టుకొని వచ్చితివా?’’ అంటూ నారదుని మాటలకి ఆగ్రహించిన యముడు కళ్ళెర్రజేశాడు.

          వెంటనే నాలిక్కరుచుకొని…. ‘‘లేదు ప్రభూ! నా ఉద్దేశ్యం అది కాదు. అసలు మనకీ కరోనా భయమెలా పట్టుకొందో సెలవియ్యండి!’’ అని ప్రాధేయపడ్డాడు నారదుడు!

          ‘‘అదేనయ్యా నారదా! అంతకుముందు చీనాలోనూ, ఇతర దేశాల్లోనూ జనులెంతగా మరణిస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకనగా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ మతానుసారం ఏ ‘‘ఈడెన్‌ గార్డెన్స్‌’’కో అల్లా వద్దకో పోతారు కానీ మన దగ్గరికి రారులే అని ధీమాగా ఉన్నాం. పైగా భూలోకమునందలి మన కలెక్షన్‌ ఏజెంట్లు (స్వామీజీలు, బాబాలు) ‘‘గోమూత్రం, పేడ ఉండగా మనకండగా, కరోనా అంటే భయమెందుకు దండగ’’ అని ప్రచారం మొదలుపెడితే నిజమే అనుకున్నాం. పుష్కరాలు, కుంభమేళాలపేరిట లక్షలాదిమంది జనం ఒకేచోట గుమిగూడినా రాని జబ్బులు ఇపుడెందుకు వస్తాయిలే అని వాట్సాపు యూనివర్శిటీవారు ధైర్యం చెప్పగా రిలాక్సయిపోయాం! కానీ నెల క్రితం భారతదేశం నుండి కరోనా రోగి చనిపోయి ఇక్కడికి రావడంతోనే మొదలయ్యింది అసలు కథంతా….’’ నిట్టూర్చాడు యముడు.

          ‘‘త్రిమూర్తులూ ఇంద్రాది దేవతలూ ఉండగా భయమెందుకు ప్రభూ?’’ పాతపాటే పాడాడు నారదుడు.

          ‘‘అదుగో మళ్ళీ! హఁ! అయినా నీకు అర్థంకాదులే…. ఒకప్పుడు తాను చిత్రహింసలపాల్జేసిన దేశాలేదేతే భంగపడ్డా బుద్ధిరాక, ఇప్పుడు ఆ దేశాలే మందులూ, వైద్యసహాయమూ పొందుతున్నా నెత్తికెక్కిన కళ్ళు దిగక ప్రపంచదేశాల్ని బెదిరిస్తున్న ట్రంపులా తయారయ్యావు! అందుకే ఇందాకటి నుండీ దేవతలుకు భయమా? దే….వతలకి భయమా? అని తెగ మిడిసిపడుతున్నావు.’’ అన్నాడు యముడు.

          లేదు ప్రభూ! క్షమించండి! తర్వాతేం జరిగింది? అడిగాడు నారదుడు.

          ‘‘ఏముంది? వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి త్రిమూర్తులను ఉపాయం అడిగాం. కరోనా పేరు వినగానే బ్రహ్మగారు 4 రెళ్ళు 8 కళ్ళూ మూసుకొని సమాధి అవస్థలోకి పోయారు. మిగిలిన ఇద్దరేమో రాక్షసులైతే జయించేసాం గానీ క్రిమిరాక్షసిని ఏం చేయగలం అంటూ చేతులెత్తేశారు. దాంతో ఏంచేయాలో తెలియక లాక్‌డౌన్‌ ప్రకటించేశాం. అప్పటికే కొందరిలో దగ్గూ, జలుబూ మొదలయి, దేవనర్తకి రంభకూ జ్వరమూ, జలుబూను.. అందుచేత అలా చేయాల్సి వచ్చింది.’’ ఓపిగ్గానే వివరించాడు యముడు.

          ‘‘కానీ ప్రభూ మరణాన్ని జయించే అమృతం ఉండనే ఉందికదా? అందరికీ ఇంకోసారి పంచేయలేకపోయారా?’’ సందేహించాడు నారదుడు.

          ‘‘ఆఁ! ఆమాత్రం మాకు తెలీదుటయ్యా?! ఇలాంటి సమయంలో అయితే దేవతలకూ, దానవులకూ సమానంగా ‘‘మోహినీ’’ వంటి కుట్రలేం చేయకుండా పంచాల్సి వస్తుందన్నది ఒక బాధ అయితే అసలే క్షీరసాగర మదనమప్పుడు పుట్టింది కదా? ఇంకా ఫ్రెషుగానే ఉందో, పులిసిపోయిందో? ఎవరికి తెలుసు? తెలిసినవారంతా తలుపులేసుకొని కూర్చున్నారయ్యే!’’ తల బాదుకున్నాడు యముడు.

          ‘‘మరి ప్రభూ! హరి హరులిద్దరూ ముఖం చాటేశారంటే పోనీలేగానీ, సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా ఈ ఆపత్కాలంలో మనకు మార్గనిర్దేశం చేయడానికి బయటికి రాలేదా?’’ అనుమానంగా అడిగాడు నారదుడు.

          ‘‘ఆఁ! వస్తాడొస్తాడు. ఎందుకు రాడూ? వారానికోసారి నాలుగు ముఖాలకీ 4 మాస్కులేసుకొచ్చి రాత్రి 9 గంటల నుండీ పదినిమిషాలు దీపాలన్నీ ఆర్పేసి కొవ్వొత్తి వెలిగించి చప్పట్లు కొట్టండనో, సాయంత్రం 5 గంటలకు గంటలు కొట్టండనో చెపుతూ ఉంటాడు మహానుభావుడు’’ వెటకారంగా అన్నాడు యముడు.

          ‘‘దేనికి ప్రభూ?’’ కుతూహలంగా అడిగాడు నారదుడు.

          దేనికా? తెలీదుటయ్యా ఆమాత్రం? మళ్ళీ భూలోకయాత్ర చేశావు పెద్ద?! రాత్రి 9 గంటలకి దీపాలన్నీ ఆర్పేస్తే కరోనా వైరస్‌కి కళ్ళు కన్పించక గోడలకు గుద్దుకొని చచ్చిపోతుందనుకొన్నాడు! అందుకని మా అందరిచేతా చేయిస్తున్నాడు. యముని గొంతులోని వెటకారాన్ని గుర్తించని ఒక ఎంబిబిఎస్‌, ఎంఎస్‌, గోల్డ్‌ మెడలిస్ట్‌ వెంటనే ఉత్సాహంగా.

          ‘‘అంతేకాదు నారదుడుగారూ! చప్పట్లు కొడితే శబ్దతరంగాల నుండి శక్తి ఉత్పత్తి అయి అది న్యూట్రాన్లుగానూ, ఫోటాన్లుగానూ, ఇంకేదోగానూ మారి వైరస్‌ని చంపేస్తుంది’’ అని పొద్దున్న వాట్సాపు యూనివర్శిటీలో చదివిన పాఠాన్ని అప్పజెపుతూ యముని కనుసైగలకు ఆగిపోయాడు.

          ‘‘ఆఁ.. హాఁ… అదా సంగతీ!’’ అంటూ దేవతల శాస్త్రపరిజ్ఞానానికి నోరు వెళ్ళబెట్టిన నారదుడు ‘‘ప్రభూ! మరి భూలోకంలోకి శ్వేతరాజ్యాధ్యక్షుడు చీనావారే ఈ వైరస్‌ని కనిపెట్టి ప్రపంచం మీదికి ఒదిలారంటూ పళ్ళునూరుతున్నారే? అదంతా నిజమేనంటారా?’’ అని తన రాజకీయ సందేహాన్ని వెలిబుచ్చాడు నారదుడు.

          ‘‘ఏడిశారు! చేయాల్సిందంతా చేయడం! తేడా వస్తే పక్కవాళ్ళపై తోసేయడం అలవాటేకదా ఈ రాజులకు?’’ భవిష్యత్‌ తరాలకు ప్రకృతిని అందకుండా చేయడానికి మీకెంత ధైర్యం?’’ అని పదిహేనేళ్ళ పసిపాపతో అడిగించుకొన్నా బుద్ధిరాలేదు వెధవలకి! అన్నాడు యముడు.

          ‘‘అంటే ఏమిటంటారు ప్రభూ? ఈ వైరస్‌ జన్మించడంలో చీనాదేశంవారి ప్రమేయం ఏమీ లేదంటారా?’’ అడిగాడు నారదుడు.

          ‘‘దేశాలు దేశాలంటావేం నారదా? ఎంత దోచుకున్నా తీరని వ్యాపార దాహంతో వెనకాముందూ చూసుకోకుండా తమ గోతులు తామే తవ్వుకొనే బహుళజాతి కంపెనీకూడిగం చేసే రాజ్యాంగాలే కదా అవన్నీ!  ఆ కంపెనీలు తమ దురాశ కోసం ప్రకృతిలోని సహజ పరిస్థితుల్ని అసహజంగా మార్చేస్తున్నాయి. కేవలం తమ వ్యాపారానికి అనుకూలంగా మొక్కల్ని, జంతువుల్ని జన్యుమార్పిడులకు గురిచేస్తూ ప్రకృతి సహజత్వాన్ని చంపేస్తున్నారు. అటువంటి జన్యుమార్పిడికి గురైన ఆహారాన్ని తినడం వలనే మనుషులూ ఇటువంటి విచిత్ర వైరస్‌ల బారిన పడుతున్నారు. ఈ విషయాలన్నీ మాట్లాడకుండా దేశాలమీదకి సమస్యని నెట్టేయడం కేవలం శవాలమీద రూపాయలు ఏరుకొన్నట్లుగా ఇటువంటి సమయంలోనూ విద్వేషాల్ని రెచ్చగొట్టడమే.’’ అన్నాడు యముడు.

          ‘‘మరి ప్రభూ తక్షణ కర్తవ్యమేమిటి ఇపుడు?’’ అడిగాడు నారదుడు.

         ‘‘ఏముంది నారదా?! ఈ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి! అపుడు వాళ్ళే మార్చుకొంటారు. అంతదాకా మనకీ మాస్కులూ, శానిటైజర్లు తప్పవు మరి!’’ చెప్పాడు యముడు!

admin

leave a comment

Create AccountLog In Your Account