నికారుగ్వా వామపక్ష కవి, రాజకీయవేత్త, కేథలిక్ మతాచార్యుడు ఎర్నెస్టో కార్డినల్ మరణం

నికారుగ్వా వామపక్ష కవి, రాజకీయవేత్త, కేథలిక్ మతాచార్యుడు ఎర్నెస్టో కార్డినల్ మరణం

          తన జీవితాంతం క్రూర పరిపాలకులకు, నియంతలకు వ్యతిరేకంగా ప్రతిఘటనా పోరాటాలలో క్రియాశీలంగా పాల్గొన్న, నికారుగ్వా దేశానికి చెందిన వామపక్ష కవి ఎర్నెస్టో కార్డినల్‌ 2020 మార్చి 1వ తేదీన తన 95వ ఏట మరణించారు. ఆయన 1925 జనవరి 20న ఒక ఉన్నత వర్గ కుటుంబంలో గ్రనడా పట్టణంలో పుట్టారు.

          నికారుగ్వా సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో కార్డినల్‌ ఒక ప్రతిఘటనా వ్యక్తిగా కొనసాగారు. రాజకీయంగానూ, కవిత్వపరంగానూ నేటి లాటిన్‌ అమెరికాకు చెందిన ఒక అత్యంత ప్రముఖ కవిగా పేర్గాంచారు. ఆయన ఇండియాలో పర్యటించిన సందర్భంగా ‘హంగ్రీ జనరేషన్‌’ (ఆకలితరం) అనే హిందీ కవుల బృందం ప్రభావితం అయింది. ఆయన రాసిన చాలా కవితలను ఇంగ్లీషు నుంచి హిందీలోకి వారు అనువదించారు. హిందీ సాహిత్య పత్రికలలో వాటిని ప్రచురించారు. ప్రభాతి నౌతియాల్‌ వంటివారు జె.ఎన్‌.యులో స్పానిష్‌ భాష నేర్చుకుని, ఆయన కవితలను స్పానిష్‌ నుంచి నేరుగా హిందీలోకి అనువదించారు.

          కార్డినల్‌ రోమన్‌ కేథలిక్‌ తెగకు చెందిన క్రిస్టియన్‌ మతాచార్యుడు. ప్రతిపక్షంవారిని చిత్రహింసలకు, హత్యలకు గురిచేస్తూ అధికారం చలాయిస్తూన్న సొమోజా వంశీకుల నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తూ సాగిన సాండినిస్టా విప్లవ పోరాటంలో క్రియాశీలంగా ఆయన పాల్గొన్నాడు. ఆయన మార్క్సిస్టు. దేశ విముక్తికై కృషిచేసిన మత శాస్త్రవేత్త (Liberation Theologist). మత వారసత్వాన్ని ప్రజాపోరాటాలలో ఎలా ఉపయోగించుకోవాలో క్రియాశీలంగా చూపించిన కవి కార్డినల్‌. మత కీర్తనల (Psalms) సాహిత్య బాణీలో విప్లవ కవితలను, గేయాలను ఆయన రచించారు.

          ఎర్నెస్టో కార్డినల్‌ మనగ్వాలోనూ, 1942 నుండి 1946 వరకు మెక్సికోలోనూ, 1947-49లో న్యూయార్కులోనూ సాహిత్య విద్యార్థిగా వున్నారు. జులై 1950లో నికరాగ్వేకు తిరిగివచ్చి, సొమోజాగార్సియా పాలనకు వ్యతిరేకంగా 1954 ఏప్రిల్‌లో జరిగిన విప్లవంలో పాల్గొన్నారు. ఆ ఆకస్మిక తిరుగుబాటు విఫలమైంది. ఆయనతోపాటు పనిచేసిన అనేకులు ఆ పోరాటంలో మరణించారు. తర్వాత కాలంలో ఆయన మెక్సికోలో మతశాస్త్రం చదివారు. 1965లో గ్రెనడాలో ఆయన కేథలిక్‌ మతాచార్యునిగా (Priest) నియమింపబడ్డాడు. సోలెంటినేమ్‌ ద్వీపానికి వెళ్ళి అక్కడ ఒక క్రిస్టియన్‌ పీఠాన్ని స్థాపించాడు. దానిలో సభ్యులు ఎక్కువమంది పేద రైతులే. ఆ తర్వాత అక్కడొక చిత్రకారుల శిల్పుల కాలనీలు ఏర్పాటు చేయడంలో కృషి చేశాడు.

          ఈ ద్వీపంలోని అత్యధికులు గెరిల్లా యుద్ధ తంత్రాన్ని పాటించిన విప్లవంలో పాల్గొన్నవారే! 1977లో ఈ ద్వీపంపై సొమోజా సైన్యం దాడిచేసి, అక్కడ వున్న విప్లవ స్థావరాలను ధ్వంసం చేసింది. దీనితో కార్డినల్‌ అక్కడి నుండి కోస్టారికాకు పారిపోయారు.

          సాండినిస్టా ప్రభుత్వం 19 జులై 1979లో……………. సాంస్కృతిక శాఖామంత్రిగా పనిచేశారు. మతాధికారిగా రాజకీయాల్లో పాల్గొనడం నిషిద్ధమంటూ, నికారుగ్వాకు 1983లో వచ్చిన పోప్‌ జాన్‌పాల్‌ II కార్డినల్‌ను రాజీనామా చేయమని ఆదేశించాడు. దానిని పాటించని కార్డినల్‌ను 1984 ఫిబ్రవరి 4న సస్పెండ్‌ చేశాడు. 1987లో సాంస్కృతిక శాఖను ఆర్ధిక కారణాల వలన రద్దు చేసేంతవరకు ఆ శాఖ మంత్రిగా ఆయన కొనసాగారు. ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను 2019 ఫిబ్రవరి 18న పోప్‌ ఫ్రాన్సిస్‌ రద్దు చేశాడు.

          సొమోజా ప్రభుత్వాన్ని కూల్చివేసిన సాండినిస్టా జాతీయ విముక్తి ఫ్రంట్‌ నుండి 1994లో కార్డినల్‌ వైదొలగాడు. ఈ ఫ్రంట్‌ నాయకుడు డేనియల్‌ ఓర్టెగా ఒంటెత్తు పోకడలకు నిరసన తెలియజేశాడు. ఓర్టెగా ప్రభుత్వం విప్లవ ప్రభుత్వం కాదనీ, అది ప్రజలను దోచుకుంటున్న నియంతృత్వమని ప్రకటించాడు. కుహనా విప్లవం కంటే ఒక అధికారిక పెట్టుబడిదారీ విధానమే మేలని 2006 ఎన్నికలపుడు ప్రకటించాడు. 2011లో అమెరికా పర్యటనలో ఆయన మార్క్సిస్టు కనుక కేథలిక్‌ పాఠశాలలను సందర్శించడాన్ని అక్కడివారు నిరసించారు.

          ఈనాటి పరిపాలకుడు ఓర్టెగాను విమర్శించినందుకు, ఓర్టెగా సమర్ధకులు కొందరు కార్డినల్‌ అంతిమక్రియలు కార్యక్రమంలో గొడవలు చేశారు.

ఎర్నెస్టో కార్డినల్‌ కవితలు రెండు

మన కవితలు

          మన కవితలు ఎన్నటికీ

          ప్రచురణకు నోచుకోవు

          వ్రాతప్రతులూ, ఫొటోస్టాట్‌లుగా

          ఒకరి నుండి మరొకరికి

          చేరుతుంటాయి.

          ఏ నియంతకు వ్యతిరేకంగా రాసామో

          ఆ నియంత పేరే మంచిపోటీగా

          ఆ కవితలు మాత్రం చదువుతూనే వుంటారు –

ఖాళీ సీసాలు

          నా రోజులు

          ఖాళీ బీరు సీసాల్లాంటివి

          సిగరెట్టు పీకల్లాంటివి

          టీవీల్లో కనబడి మరుక్షణం మాయమయ్యే

          చిత్రాల్లాగా కొనసాగింది నా జీవితం

          రోడ్లపై పరుగెడుతున్న కార్లలాగా

          ఆడపిల్లల నవ్వుల్లాగా

          రేడియోలో సంగీతంలాగా….

          ఆ కారు మోడల్స్‌ ఎంత అశాశ్వతమో

          అందమూ అంతే అశాశ్వతం

          రేడియోలో వినబడే హిట్‌సాంగ్స్ నూ

          మరచిపోతాం –

          ఖాళీ సీసాలు, సిగరెట్టు పీకలు తప్ప

          వెలిసిపోయిన ఫొటోల్లోని చిరునవ్వులు

          చింపేసిన కూపన్లు

          పొద్దున్నే బార్ల నుండి వూడ్చేసే దుమ్ము తప్ప

          ఆ రోజుల జ్ఞాపకాలేవీ లేవు.

ఆంగ్లం నుండి అనువాదం : కొత్తపల్లి రవిబాబు

admin

leave a comment

Create Account



Log In Your Account