– రవి నన్నపనేని
కిరీట క్రిమి కంటే
అత్యంత భయంకరమైంది యుద్ధ క్రిమి
మనిషి లోపల విస్తరించే మహమ్మారో
మనిషిని మానసికంగా
శారీరకంగా హింసించే మరో అమానవుడో
నేలమీద
దుఃఖం లేని స్థలాన్ని చూడగలమా ?
పీడితులూ పీడకులూ లేని కాలాన్ని
ఊహించగలమా ?
ఎల్లలు లేని ప్రపంచ పటం గీయగలమా?
మనిషి పుట్టుక – జీవితం
వేయి రేకుల పుష్పవికాసం కావాలి కదా!
మనిషిని ధ్వంసించే
విష జీవుల కంటే
వింత విచిత్ర రోగాల కంటే
అత్యాశతో
ఆయుధ బలంతో
మరో మనిషిని వేటాడే క్రూరుడే
క్రిమి కంటే అత్యంత దుష్టుడు
యుద్ధ క్రిమి వ్యాధిగ్రస్తుడే
అసలైన కిరీట క్షుద్రుడు….
భూ భారకుడు ……
పరాన్న జీవి కంటే అత్యంత ప్రమాదకారి
ప్రకృతి విధ్వంసకుడు ….
చెట్టు నాశనం పిట్ట నాశనం
జంతు జాతి నాశనం
ఊరూ ఉనికీ అంతా దుంప నాశనం….
ఏ శవానికీ ఏ రాజ్యం బాధ్యత వహిస్తుంది ?
గాలీ నీరు నేల కలుషితానికీ
ఏ సింహాసనం జవాబు చెబుతుంది ?
ఏ మంత్రం ఏ క్రిమిని చంపుతుంది ?
నిండు నూరేళ్ళు జీవించాల్సిన దేహాలు
ప్రశాంతంగా నిష్క్రమించాల్సిన దేహాలు
ఇక్కడ ఇన్నేళ్ళు ఇన్ని తీసుకున్నందుకు
తనదైనది
ఇవ్వాల్సినది ఇంకేదో ఉందనీ
స్వప్నించిన దేహాలు
ఆ అనుభవాల శరీరాలు
అనాథ శవాలైపోవడం
లేలేత ఉదయాలు
ఇవాళ ఇలా ….ఇంత అర్థాంతరంగా
అస్తమించి పోవడం…..దేశమేదైతేనేం?
ఒకానొక సూక్ష్మజీవికి సమస్త లోకం
సలాం కొట్టి
చావు ముందు తలొంచి మిగిలిపోవడం
మృత్యువుకి లొంగి పోవడం
భయంతో వంగిపోవడం… కుంగిపోవడం…
విషాద శోకం – విషపు పరిహాసం….
యుద్ధ క్రిమి చేతిలో
పళ్ళు నూరుతున్న
మారణాయుధానికి గాయం చేయడం తెలుసు
బుద్ధి జీవి తలకాయలో
రూపొందుతున్న
సూదిమందుకి గాయం మాన్పడం తెలుసు
నెత్తుటి పొత్తైన నడకలో
లిఖించబడుతున్న చరిత్రకి
మనిషి విలువ తెలుసు……
యుద్ద క్రిమి విజయం కంటే
కిరీట క్రిమిని విధ్వంసించే అన్వేషణే
పుడమి మీద
అత్యంత ప్రేమ పూర్వకమైనది
సదా అది స్వేచ్ఛాయుతమైనది
నిజమైన మేధో శ్రమ అది…
విష క్రిమిని యుద్ద క్రిమిని
జయించే
మానవుడే మహోన్నత జీవి….
అతడు
భూగోళం చుట్టూ అల్లుకున్న
రెండు చేతుల పూలతీగ
ఆమె
వెన్నెల శాంతి చంద్రిక –