– శివాజీరావు
‘‘హు’’, అని నిట్టూర్చారు అలౌకికానందేంద్ర స్వాములవారు తన 60 ఏళ్ల ఆధ్యాత్మిక జ్ఞానం నింపుకున్న పొడుగాటి గడ్డాన్ని సవరించుకుంటూ.
పరుపులకు, దిండ్లకు పట్టు గలేబాలు తొడుగుతున్న శిష్యులు ఆ నిట్టూర్పుకి క్షణం ఆగి గురువుగారి వైపు చూశారు. స్టేజి ఎదురుగా స్వామివారి జ్ఞాన బోధ విని తరిద్దామని వచ్చి షామియానాల కింద కూర్చున్న అశేష జన వాహినిలోని ముందు వరుసల జనాలు స్వామి వారి నిట్టూర్పు, వారి అనుంగు శిష్యుల తత్తరపాటు గమనించి తమ పిచ్చా పాటి ఆపి ఈ లీలా విశేషాన్ని గమనించసాగారు. ఈ చిన్ని సన్నివేశం స్వామివారి జీవిత చరిత్రాలంకృతం అవుతుందేమోనని కన్నులు విప్పార్చుకుని వీక్షిస్తున్నారు.
అయితే కాషాయాంబర ధారులైన ఆ శిష్యగణం స్వామివారి చిత్తం గమనించి ఒక్కసారి తమ చేతులు జోడించి ప్రమాణించి మరోసారి స్వామివారి ఆసనం ఆయత్తం చేయడంలో మునిగిపోయారు. భక్తులు యావన్మంది ఏదో గండం గడిచిందని వారు కూడా నిట్టూర్పులు విడిచారు. అంత మంది ఊర్పులకు అక్కడ వేసిన షామియానాలు లబలబ లాడాయి. స్వామివారికి పట్టు తల్పం సిద్ధం చేశాక శిష్య బృందం వారిని చేతులు జోడించి ఆసనం మీదకి ఆహ్వానించారు. అలౌకికానందేంద్ర స్వాములవారు కించిత్ అయిష్టంగానే ఒక శిష్యుని చెయ్యి అందుకుని ఆసనం అలంకరించారు. అది కూడా శేషతల్పంపై తలకింద చేయి పెట్టుకొని అర్ధ పవళింపులో ఉన్న మహావిష్ణువు మాదిరిగా కనిపించారు. భక్తులకు కిరీటం, నగలు తీసేసి కాషాయ వస్త్రాలలో మహా విష్ణువు సాక్షాత్కరించినట్టయి అప్రయత్నంగానే తమ చేతులు ముకుళించారు. శ్రీ శ్రీ శ్రీ అలౌకికానందేంద్ర స్వాములవారు తమ హస్తాన్ని ఎత్తి భక్తులను దీవించారు.
మరికొంతమంది భక్తులు స్వామివారి ముందు మైక్ అరేంజ్మెంట్‌లు చేశారు. స్వామివారు అప్పుడు కూడా ‘హు’ అని నిట్టూర్చారు.
ఈలోగా ఆ ప్రాంతంలో భక్తకోటిని సమీకరించిన వ్యాపారస్తులు మరియు స్వామి వారి శిష్యులు అయిన సేట్ చమన్ లాల్‌గారు సభను ఉద్దేశించి మాట్లాడారు. ఆ మాటలలో స్వామిగారి వైశిష్ట్యం గురించి, మహిమాన్వితమైన వారి వాక్కుల గురించి అదేవిధంగా సాక్షాత్ శ్రీ మహావిష్ణువు తన అవతారంగా స్వామివారి రూపంలో ఈ భూమ్మీద ఎలా ప్రభవించిందీ సోదాహరణ సైతంగా వివరించారు. స్వామివారికి తమకూ గల అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. కానైతే తాము ప్రతి సంవత్సరం ఇన్కమ్ టాక్స్ ఎలా ఎగ్గొడుతున్నదీ అందుకు స్వామివారు ఎలా సహాయపడుతుంది ఇత్యాది విషయాలు తమ మాటలలో దొర్లకుండా బహు జాగురూకత కలిగి ఉన్నారు. అదేవిధంగా తాము సంపాదించిన కోట్లాది రూపాయల నల్లధనం హవాలా మార్గాలలో విదేశాలు చేరేందుకు స్వామివారు ఎంతగా ఉపయోగ పడుతున్నారో అస్సలు మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే బాక్సైట్ తవ్వకాలను నిషేధించిన ప్రభుత్వం చేతనే లేటరైట్ తవ్వకానికి అనుమతులు ఇప్పించి ఆ ముసుగులో బాక్సైట్ తవ్వుకొని అమ్ముకొనే వీలు కలిగించినందులకు గాను స్వామివారికి 10 కోట్లు సమర్పించుకొన్న విషయం చెప్పను గాక చెప్పలేదు.
సేట్ చెమన్ లాల్‌గారు తమ ప్రసంగాన్ని ముగించి స్టేజి ముందుకి వెళ్ళబోతున్న సమయంలో ఆయన్ని స్వామీజీగారు పిలిచారు. చమన్‌లాల్‌గారు స్వామివారి ముందు మోకాటి తండా వేసుక్కూర్చున్నారు. స్వామి వారు తమ కుడి చేతిని గాలిలోకి మూడుసార్లు తిప్పి పచ్చ పొదిగి ఉన్న ఒక బంగారు ఉంగరాన్ని తీసి చమన్‌లాల్ చేతిలో పెట్టారు. చమన్‌లాల్ వంగి వంగి దండాలు పెడుతూ అలాగే వెనక్కి వెళ్ళిపోయాడు. భక్తుల చప్పట్లతో ప్రాంగణం మారుమ్రోగిపోయింది.
స్వామీజీ తమ దివ్య వాక్కులు ఇవ్వడం ఆరంభించారు.
‘‘నేను ఒక్క రెండు సార్లు నిట్టూర్పులు విడిచాను, మీలో ఎంతమంది గమనించారు’’, అని ఒక్కసారి జనం అంతటిని కలయ జూచారు స్వామీజీ. కొన్ని వందల చేతులు లేచాయి. తృప్తిగా తలాడించి ‘‘నేనెందుకు నిట్టూర్చాను మీకు తెలుసా’’, అని ప్రశ్నించారు స్వామీజీ.
స్వామివారి లీలా విశేషం తమవంటి మూఢులకు అర్థమవుతుందా అనే భావనలో భక్తులంతా స్వామీజీ వంక చూశారు.
స్వామీజీ చిద్విలాసంగా నవ్వి అంతలోనే భ్రకుటి ముడిపెట్టి ‘‘కటిక నేలపై పరుండే మావంటి సర్వసంగ పరిత్యాగులకు ఈ పట్టుపరుపుల సౌఖ్యాలు అవసరమా?’’
భక్తులంతా ‘‘లేదు’’ ‘‘లేదు’’, అని అరిచారు. ‘‘మరి నాకు ఇష్టంలేని పనులు ఎందుకు చేస్తున్నారు’’, అంటూ తన చూపులను స్టేజి నలుమూలలా ప్రసరించారు.
‘‘క్షమించండి స్వామీ. అదంతా మా కోసం’’.
‘‘అవునవును’’.
‘‘మా కోసం’’.
‘‘మా కోసం’’.
‘‘మీ కోసమే’’,
‘‘నిజంగా నా భక్తులైన మిమ్మల్ని ఆనంద పరచడానికే నేను అంగీకరించాను. భగవాన్ కృష్ణ భగవానుడు కూడా తన భక్తులను అలరించడం కోసం తాను ఇష్టం లేని పనులను ఎలా చేసాడో ఒక చిన్న లీలా విశేషం చెబుతాను వినండి’’.
‘‘ఒక ఊర్లో ఒక ముసలామె ఉండేదట. ఆమె తను ఏ పని చేసినా ‘కృష్ణార్పణం’ అని అంటూ ఉండేదట. ఆవిడ కృష్ణ భగవానునికి ప్రీతి పాత్రమైన భక్తురాలు. ఒకరోజు తన పశువుకి కుడితి వేసి అలవాటు ప్రకారం ‘కృష్ణార్పణం’ అని అన్నదట. దానితో కృష్ణుడు ఆ కుడితిని స్వీకరించి భారమైన పొట్టతో ఆపసోపాలు పడ్డాడట. ఇప్పుడు మీరు వేసిన పట్టు పరుపులు కూడా నాకు అటువంటి ఇబ్బందినే కలిగిస్తున్నాయి. కానీ నా భక్తులైన మిమ్మల్ని ఆనందపరచడానికి మాత్రమే ఈ ఆసనాన్ని నేను అలంకరిస్తున్నాను’’.
‘‘జయహో! శ్రీ శ్రీ శ్రీ అలౌకికానందేంద్ర స్వామువారికీ జయహో’’.
స్వామివారు జనాల వైపు చూసి చిద్విలాసంగా నవ్వేరు.
పక్కనున్న టర్కీ టవల్‌తో ముఖం తుడుచుకుంటూ మళ్లీ మొదలుపెట్టారు.
‘‘ఈ మైక్‌ని మా ముందు పెట్టారు నా వాక్కులు మీ అందరికీ వినబడాలని, కానీ మీ అందరి ఆత్మలను నా ఆత్మతో అనుసంధానం చేసి మౌన సంభాషణ చేయగల మాకు ఈ మైకుల అవసరం ఉందా?’’.
భక్తులంతా ఏకమొత్తంగా చేతులు జోడించి మూకుమ్మడిగా
‘‘లేదు’’
‘‘లేదు’’ అని అరిచారు.
స్వామివారు తన ప్రధాన శిష్యుని వైపు నర్మగర్భంగా చూడడం చాలామంది గమనించనే లేదు. స్వామివారి మనోగతాన్ని అర్థం చేసుకున్న శిష్యుడు మైక్ అందుకొని
‘‘గురువుగారూ! మీరు కటిక నేల మీద పరుండి గాలిని మాత్రమే భోంచేసే సర్వసంగ పరిత్యాగులు, మీరు 33 కోట్ల దేవతల ప్రతిరూపాలను మీ ఒక్కరిలోనే నింపుకున్న సాక్షాత్ ఈశ్వర స్వరూపులు, మా ఆత్మలను స్వాధీనం చేసుకుని తరంగ పూర్వకంగా మాట్లాడగలరు, మిమ్మల్ని అగ్ని కాల్చదు మంచు వణికించవు. రోగాలు రొస్టులు అంటని దైవ స్వరూపులు.. కానీ మేము మీ లీలా విశేషాలను అర్థం చేసుకోలేని పాపులం… రాయి, రప్పల మాత్రులమైన మేము మీ దివ్య సందేశాలను… మీ నిర్గుణ తత్వాన్ని అర్థం చేసుకునే శక్తి లేకనే మిమ్మల్ని ఇలా మూర్తి మాత్రంగా, మీ వాణిని శబ్ద రూపంగా కోరుకుంటున్నాము స్వామీ…. మమ్మల్ని అనుగ్రహించండి.. అగ్నిచే కాలని, ఆయుధంచే గాయపడని, భూమిచే నొప్పింపబడని మీ దేహానికి ఐహిక సుఖము అందించాలని అనుకుంటున్న లౌకిక బేహారులమైన మాకు అణువంత జ్ఞానబోధ చేసి తమ దారిలో నడిపించండి. శ్రీ శ్రీ శ్రీ అలౌకికానందేంద్ర స్వాములవారికి జై బోలో. భక్తులారా! ఒక విషయం. మీరు ఎంతో అభిమానంతో స్వామివారికి మరియు మాకు ఢిల్లీ విమానం టికెట్లు కొని ఇచ్చారు. స్వామి వారికి అది కూడా అవసరం లేదు. ఎందుకంటే వారు తమ తపశ్శక్తితో ఆలోచన మాత్రంగానే ఎక్కడికైనా వెళ్లిపోగలరు కానీ శిష్యులమైన మా కోసం విమానంలో ప్రయాణించడానికి అంగీకరించారు. వారు ఏమి చేసినా భక్తుల కోసమే. వారు భక్తుల కొంగు బంగారం. మన మొరాలించే ప్రత్యక్ష వేలుపు.
ఐదు నిమిషాల వరకు భక్తుల జయజయ ధ్వానాలతో ఆ సభ మారుమ్రోగింది.
‘‘స్వామివారి కోసం ఢిల్లీలో ప్రధానమంత్రిగారు వేచి చూస్తున్నారు. రేపు స్వామివారు బసచేసే ప్రాంతానికి ప్రధానమంత్రిగారూ, ఇతర మంత్రులు అధికార గణం అంతా వచ్చి వారి ఆశీర్వాదాలు పొందనున్నారు. మహా భక్తులు సేట్ చమన్ లాల్‌గారి కోరిక మేరకు మీ అందరికీ ఆశీర్వచనములు అందజేయవలెనని ఇక్కడ ఆగారు’’. అని ప్రధాన శిష్యుడు కూర్చున్నాడు. అక్కడ మరోసారి ఆకాశం దద్దరిల్లింది.
స్వామివారి దివ్య సందేశం మరలా మొదలయ్యింది’’ భక్తులారా! గీతలో శ్రీకృష్ణ భగవానులు ఏమి చెప్పారు?! మనం నిమిత్తమాత్రులం. చేసెడి వాడు ఆయనే.. చేయించి వాడు ఆయనే.. అందువలన మన ఈతి బాధలు తొలగాలంటే.. ఈ తుచ్చ జీవితం నశించి మరుజన్మ లేకుండా ఉండాలంటే దేవదేవుని ప్రసన్నం చేసుకోవాలి.. ఈ ఐహిక సుఖాలు అన్నీ ఆ అలౌకిక సుఖాలతో పోలిస్తే గడ్డిపోచ కన్నా హీనమైనవి..
ఇంతలో సభలో ఏదో కలకలం రేగింది. భక్తులంతా గందరగోళంగా అటూ ఇటూ పరిగెత్తుతూ ఉన్నారు. తన ప్రసంగానికి అంతరాయం కలగడానికి కారణం ఏమిటా అని పరికించి చూశారు స్వామివారు. ఎవరో ఒకతను ముఖానికి మాస్కు తొడుక్కుని, పిచ్చిగా తనవైపు పరుగెత్తి వస్తున్నాడు. అతని వెనక తెల్ల యూనిఫార్మ్ లు ధరించిన హాస్పిటల్ సిబ్బంది పరిగెత్తుకు రావడం కనిపించింది. భక్తులంతా అతడికి దూరంగా పారిపోతున్నారు.
ఆ భక్తుడు’’ స్వామీ! నన్ను మీరే కాపాడాలి’’ అంటూ రెండు చేతులు చాచి స్వామివారి వైపు పరిగెత్తుకు వస్తున్నాడు.
స్వామివారు ఒక భక్తుడ్ని పిలిచి ఆ గడబిడ ఏమిటి అని అడిగారు.
‘‘స్వామి! అతడు కరోనా వైరస్ సోకిన పేషెంట్ అట. మెడికల్ స్టాప్ క్వారంటైన్‌కి తీసుకుపోతుంటే తప్పించుకొని మీ దగ్గరకి వస్తున్నాడు. మీ చెయ్యి తగిలితే తన రోగం తగ్గి ప్రాణం నిలబడుతుంది అన్న ఆశ. మీ పిలుపుతో చచ్చినవాడు కూడా లేచి కూర్చుంటాడని చెప్పుకుంటారు. అతను కూడా అదే ఆశతో మీ దగ్గరికి వస్తున్నాడు.
స్వామివారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఏం చేయాలో పాలు పోవటం లేదు. అతగాడిని చూస్తే మరికాసేపట్లో వచ్చి తన మీద పడి పోయేటట్టు ఉన్నాడు. అతన్ని ఆపగల శక్తివంతులెవరూ ఆ టెంట్ల కింద ఉన్నట్టు కనిపించడంలేదు. భక్తులంతా ప్రాణ భయంతో చెల్లాచెదురుగా పరిగెత్తుతూ ఉన్నారు. ఆ మెడికల్ స్టాప్ మాత్రమే ధైర్యంగా అతని వెనకాల పరిగెడుతున్నారు కానీ అతను వారికి చిక్కేలా లేడు. ఉన్న భక్తి కొద్దీ ఉన్న శక్తినంతా వినియోగించి పరిగెత్తు వస్తున్నాడు.
స్వామివారికి వైకుంఠప్రాప్తి ఎంతో దూరం లేదు అనిపించింది. తన వల్ల ఎంతో లాభం పొందిన సేట్ చెమన్‌లాల్ వైపు చూశారు స్వామీజీ. కానీ చమన్‌లాల్ తన భారీ కాయాన్ని ఊపుకుంటూ కుర్చీలకి అడ్డంపడి పారిపోతున్నాడు.
‘‘కృతఘ్నుడు’’, అని పళ్ళు పటపట కొరికారు స్వామీవారు. అందరికీ తనే దిక్కని చెప్పిన స్వామివారికి తన దిక్కు ఏమిటో బోధపడటం లేదు. తన కళ్ళతో సందేశం పంపుదామని ప్రధాన శిష్యుల వైపు చూశారు. కానీ ప్రధాన శిష్యులు వారు గోచీ బిగించి అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయారు. ఇక లాభంలేదని అర్థమైంది స్వామివారికి. ఇలాంటి క్లిష్ట సమయంలో తనకు ప్రధానమంత్రికి మధ్య రాయబారం నడపాలి అన్న తమ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒళ్లు తెలియని కోపం వచ్చింది స్వామివారికి.
‘‘ఈ తద్దినం నా నెత్తిన పెట్టాడు’’, అని తిట్టుకున్నారు.
‘‘స్వామీ! రక్షమాం…. రక్షమాం…. ఈ మహమ్మారి నుంచి మీరే కాపాడాలి.’’ భక్తుడు బాగా దగ్గర అయిపోయాడు.
స్వామివారు పంచె ఎగ్గట్టి తటాలున ఆడిటోరియం వెనకనున్న రూమ్‌లోకి పారిపోయి తలుపులు బిడాయించుకున్నారు.
కరోనా భక్తుడిని మెడికల్ సిబ్బంది బలవంతంగా పట్టుకుపోయారు. ఒక అరగంట పోయాక పారిపోయిన భక్తులు పోగా మిగిలిన భక్తులు స్వామివారు తమ దైవ వాక్కులను ప్రవచిస్తారని ఎదురుచూస్తున్నారు. స్వామి వారిని కాపాడే బాధ్యత సేట్ చెమన్‌లాల్ తీసుకున్నాడు.
‘‘దురదృష్టవశాత్తూ ఆ భక్తుడు ఈరోజు అనగా శుక్రవారం స్వామివారిని శరణు వాడడానికి వచ్చాడు. మరొక రోజు అయితే స్వామివారు అతన్ని చేతితో తాకి ఆ రోగం ఇట్టే నయం చేసేవారు. కానీ స్వామివారు ఈరోజు లంకణంలో ఉన్నారు. అంటే ఉపవాసం అన్నమాట. ప్రతి శుక్రవారం వారు ఉపవాసం ఉంటారు అలా ఉన్న రోజు ఎవర్నీ తాకరు. ఒకవేళ తాకితే ఆనాటి వ్రతఫలం పోతుంది. అందువల్లనే ఆయన రూమ్‌లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది’’.
‘‘స్వామివారు ఎప్పట్లో బయటికి వస్తారు’’, అడిగారెవరో.
‘‘స్వామివారు వెనుక ద్వారం గుండా విమానాశ్రయం చేరుకున్నారు. వారు లోక కళ్యాణార్థం తమ ఢిల్లీ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుని తమ రాష్ట్రానికి తిరిగి వెళ్ళిపోతున్నారు’’.
‘‘ఉడాయించినట్టున్నారు’’, వెనుకనుంచి.
‘‘కళ్ళు పోతాయి. కరోనా వంటి మాయల మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న ఈ సమయంలో ఢిల్లీ వెళ్లేకన్నా వారి ఆశ్రమానికి తిరిగి వెళ్లి దాని పీచమణడానికి యజ్ఞం చేయ తలపెట్టారు. ఆ యజ్ఞగుండంలో ఉద్భవించిన ధాతువులు ఆ కరోనా వైరస్‌ని చంపేస్తాయట’’.
‘‘శ్రీ శ్రీ శ్రీ అలౌకికానందేంద్ర స్వాముల వారికీ’’ ‘‘జై’’
‘‘శ్రీ శ్రీ శ్రీ అలౌకికానందేంద్ర స్వాముల వారికి’’ ‘‘జై’’.
మరోసారి నినాదాలు మిన్ను ముట్టినవి.