– సయ్యద్ రసూల్
మండే గుండెల అగ్ని కీలలు
ఉవ్వెత్తున
ఎలా ఎగిసిపడుతున్నాయో
చూసావా ట్రంపూ ..!!?
జనాగ్రహం
జ్వాలా ముఖిలా విస్ఫోటనం చెందితే
దిక్కులు ఎలా ఎరుపెక్కుతాయో
గ్రహించావా ట్రంపూ ..!!?
ఓరిమి నశించిన జనవాహిని
ఉప్పెనలా చుట్టుముడితే
ఊపిరి ఎలా ఆగిపోతుందో
ఉహించావా ట్రంపూ …!!?
కసితో బిగుసుకున్న పిడికిళ్లు
అసహనంతో పైకి లేస్తే
దిగంతాలు ఎలా దద్దరిల్లుతాయో
అర్థమైందా ట్రంపూ ..?!?
నాడు ..
చేతులు కలిపిన చీమలు
ఒక్కటైన గడ్డిపోచలు
నీ అన్న ..
చరిత్రపుటలలో
ఓ దుర్గంధపు అధ్యాయం ..
జాత్యహంకార రాచపుండు ..
హిట్లర్ గుండె గదులలో
మృత్యు ఘంటికలు మోగించిన
చరిత్ర పాఠాలు
నువ్వు చదవలేదా …??
నువ్వే గాదు ..
నీ అడుగుల్లో అడుగులు వేసే
వాడెవడైనా ..
కుందేళ్లు కొదమ సింగాలై గర్జించినప్పుడు
అంతఃపురాలు వదిలి
కలుగుల్లోకి
ఎలుకల్లా దూరవలసిందే ..!!
క్షణ క్షణం మృత్యువును కలగంటూ
చస్తూ బతకాల్సిందే …
బతుకుతూ చావాల్సిందే ..!!