రాజు, రాక్షసి, ఒక రెట్ట వేసిన చిలుక

రాజు, రాక్షసి, ఒక రెట్ట వేసిన చిలుక

– ఓవీవీయస్

          దేశ రాజధానిలో అది ఒక పూలతోట. మామూలు తోటకాదు. ఎంతో చక్కనైన తోట. సాక్షాత్తూ దేశాన్నేలే చప్పన్నాంగుళి స్వామివారు విహరించే…., ఇంకా చెప్పాలంటే సమావేశాలు వగైరాలు నిర్వహించే చోటది. ఎటుచూసినా పచ్చికబయళ్ళు. ఎన్నో విశాలమైన చెట్లు. ఎన్నెన్నో రంగురంగుల పూల మొక్కలు. పచ్చికే మెత్తనిదనుకుంటే…, అంతకన్న సుతిమెత్తనైన తివాచీలు యోగాసనాలు వేసేందుకు, అంతేనా…. ఎలా కావలిస్తే అలా వంగి మరీ ఆసనాలు వేసేందుకు మెత్తని పెద్ద బాహుబలి బంతులు. చప్పనాంగుళీ స్వామివారి కనుసైగకే తక్షణం స్పందించి, వారి హావభావసహిత మనోహర మృదువాక్కులను చిత్రించి, దేశ ప్రజలకు నయనానందకరంగా, శ్రవణానందకరంగా బెదిరించి మరీ నివేదించుటకై సిద్ధం చేసిన వాహన, విహంగ (డ్రోన్‌) కెమేరాలు. ఆరోజు కూడా ఎప్పటిలాగే చప్పన్నాంగుళి స్వామివారికి సుఖాసనం ఒక రావిచెట్టు నీడలో ఏర్పాటు చేయబడింది. ఆ చెట్టుపైన రెండు రామచిలుకలున్నాయి. ఆనాటి వాతావరణం కోలాహలంగా, ఉత్సాహ భరితంగా ఉండడంతో చిలుకలు కుతూహలం కొద్దీ ఎటూ పోకుండా చెట్టుకింద జరిగే తంతును గమనిస్తున్నాయి.

          రాజాధిరాజు….. రాజమార్తాండ తేజ….. అపరిమిత మతసహనశీల.. శ్వేతసౌధాధీశ ప్రియబాంధవ.. మహామృత్యుంజయ మంత్రోపాశక శక్తిశాలీ…. అరివీర భయంకర పౌరగణక ధీశాలీ…. బహుపరాక్‌…. బహుపరాక్‌…. అంటూ భట్రాజులు స్తుతిపలుకులు పలుకుచుండగా సమావేశ స్థలికి ఏతెంచారు చప్పనాంగుళి స్వామివారు. అనగా రాజావారు.

          ఇటీవల శ్వేతసౌధాధీశులవారి ఈ దేశ పర్యటన విజయవంతమైన సందర్భంగా ఏర్పాటు చేయబడిన సమీక్ష మరియు సత్కార సమావేశమని నిర్వాహకులకు మాత్రమే తెలిసిన విషయం. శ్వేతసౌధాధీశుల వారంటే మన చప్పన్నాంగుళీస్వామివారికి ఎనలేని గౌరవం. మీదు మిక్కిలి భయభక్తులు రంగరించిన స్నేహము. వారి స్నేహం మృగరాజు మూషికముల స్నేహం వంటిదని పరదేశ రాజులు అపహాస్యము చేయుదురు. కానీ మన ప్రభువులవారు లెక్ఖచేయరు.

          శ్వేతసౌధాధీశులు ఇచ్చట నడయాడిన ప్రదేశములెల్ల సుఖశాంతులు, ధనవిలాసాలు పొంగరించునట్లు తీర్చిదిద్దాలని ముందుగానే ఆదేశాలున్నాయి. ఆ ఆదేశాలకు లోబడి పేద జనాలను తరిమేసి, కూలి జనావాసాలు కనబడకుండా తక్షణ కుడ్య నిర్మాణాలు చేపట్టి, శ్వేతసౌధాధీశులకు ఆహ్లాదాన్ని కలిగించిన ప్రభు విధేయులు సత్కరించబడ్డారు.

          చప్పన్నాంగుళీస్వామివారు కూడా యధాశక్తి దేశీయ పరిశ్రమలకు వీడ్కోలు పల్కి, శ్వేతసౌధాధీశులకు వినయ విధేయతలతో కూడిన అనేక ఒప్పందములను సమర్పించి మనస్సులు రంజింపజేశారు. ఆకలి, నిరుద్యోగము, కరువుకాటకముల వంటి ప్రజలను పీడించే అనేకానేక సమస్యలు పరిష్కరించవలసిన విధి, బాధ్యతా ప్రభువులదే అయినా…. అలా చేయకుండా…. శ్వేతసౌధాధీశులవారికి నచ్చని దేశాలన్నీ మన శతృవులుగా, మన రాజావారి నిర్ణయాలను, విధానాలను వ్యతిరేకించే గొంతులవారిని దేశద్రోహులుగా ఎంచి, యుద్ధం మబ్బులు కమ్మించి ఉంచడం…. ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడం ఏలినవారికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే మన చప్పన్నాంగుళీ స్వామివారు సర్వసమస్త తంత్రానాం – యుద్ధం ప్రధానం అని సింహాసనం మీద కూడా చెక్కించారు.

          ఇంకా…. శ్వేతసౌధపు రాణివారినీ, యువరాణివారిని ఆనందింపజేసిన ప్రభువిధేయులనూ సత్కరించాలనీ,…. తదుపరి రాబోతున్న శ్వేతసౌధాదేశం వారి ఎన్నికలలో యీ శ్వేతసౌధాదీశుడినే మరల గెలిపించాలనీ,…. అలా గెలిపించేందుకు తాను చేయాల్సిన పర్యటనలూ, ఉపన్యాసాలూ విజయవంతమై.. ఈ శ్వేతసౌధాదీశుడు మర గెలిచి తనపై కనపరిచే దయను, వాత్సల్యాన్నీ తలుచుకుంటూ చప్పరిస్తూ ఉండగా…. వేగుల వార్త…. అంటూ ఎవరో ఆటంకపరచారు. స్వామివారు విసుగు ముఖాన్ని గంభీర ముద్రలోకి సాధ్యమైనంత మార్చి త్వరగా చెప్పమన్నారు.

          కంటికి కనరాని క్రిమి రాక్షసి ప్రభూ…. ఏదో కోవిడ్‌ 19 అట. దేశదేశాలనూ కబళిస్తున్నదట. ఇప్పటికే మన పొరుగుదేశాన్ని ఒక చూపు చూసి వదిలేసింది…. అతని మాటలు పూర్తికాకముందే ఆ సమావేశంలో వారంతా చప్పన్నాంగుళీయస్వామివారితో సహా ఫక్కున నవ్వేశారు. క్రిమి రాక్షసైతే ఏంటి?…. దానమ్మ మొగుడైతే ఏంటి?!…. లంఖిణిలూ, శంఖిణుల చరిత్రలు మనకు తెలియవా?!.. మనం ప్రపంచానికే గురువులం. మహా మృత్యుంజయ మంత్రం చదివామా…. ఎంతటి క్రిమిరాక్షసైనా పటాపంచలు కావలసిందే. అన్నారు స్వామివారు చిద్విలాసంగా.

          లేదు ప్రభూ…. ఇంతవరకూ ఏ దేశంవారూ మందు కనిపెట్టలేకపోయారట…. అన్నాడతను బేలగా….

          ఎవరూ కనిపెట్టకపోతే మనం కనిపెడతాం…. ఐనా కొత్తగా కనిపెట్టడమేంటి…. అంటూ చప్పన్నాంగుళీయస్వామివారు మాట పూర్తిచేయకముందే….

          రాజావారి ముందే ఎక్కువ మాట్లాడుతున్నావ్‌…. నీకు గోమూత్ర మహత్యం తెలియదట్రా…. హుంకరించేడొక దేశ(స్వామి)భక్తుడు.

          గోమయాన్ని ఒళ్ళంతా పూసుకుంటే…. సకల చరాచర ప్రపంచంలో ఏ దుష్టశక్తీ దరిచేరదని తెలియదూ…. మరింతగా హుంకరించేడు మరో భక్తుడు.

          కోవిడ్‌ సంగతి దేవుడెరుగు…. ముందు ఈ భయంకర ప్రభుభక్తి ఎంతటి భీతావహమైనది కదా! అంటూ బిక్కచచ్చి…. ఎవరే చిన్న మాట అన్నా తల ఊపడం మొదలుపెట్టాడా అమాయకుడు.

          దైవదత్తమై…. అమృతతుల్యమైన ఇంతటి ఔషధ ఘన వారసత్వ సంపద గో మల మూత్రాల రూపంలో మన వద్దనే ఉండగా…. అంటూ చెప్పసందేహించాడొక ఔత్సాహిక భక్తుడు.

          అతని వైపోసారి ఓరకంట చూసి పర్వాలేదు చెప్పు…. అన్నట్టు కొంచెం ముందుకు వంగారు చప్పన్నాంగుళీయస్వామి.

          పారాసిటమాల్‌ మాత్ర వేసుకోమని ఒకడు,…. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలని ఒకడు…. మన సామంతులు ఏవేవో చెబుతున్నారు ప్రభూ….

          ఔనౌను వింటున్నాం…. మెల్లగా అంటూ తల పంకించారు స్వామి.

          ఇంతలో…. శ్వేతసౌధాధీశులు ప్రభూ…. అంటూ ప్రభువులకు చరవాణిని అందించారు.

          అంతవరకు సుఖాశీనుడైయున్న ప్రభువు ఠక్కున లేచి నించున్నారు. పరివారమంతా పరివేష్ఠించి ఉన్నారనే సంగతే మరచి, చరవాణిని తన ఆసనంపైన ఉంచి ఎదురుగా అమాంతం సాష్టాంగపడ్డారు ప్రభువులవారు.

          సెలవీయండి స్ఫూర్తిదాతా…. అన్నారిటునుండి

          ………………………………………………

          అయ్యో! అగ్రజా! నిన్ననే ఆ ఔషధం ఎగుమతులు నిషేధించానే….

          ………………………………………………

          వొద్దు అగ్రజా.. మాపై కినుక వహించవద్దు. మీరడిగిన ఔషధం తప్పక పంపిస్తాం….

          ………………………………………………

          మా ప్రజలా…. వారి వారి పాప పుణ్య ఖర్మలను అనుభవించక తప్పదు కదా!….

          విధిలిఖితాన్ని వారు మార్చలేరుగా అగ్రజా!!….

          చరవాణిని అపివేసి తిరిగి సుఖాసీనులైన వెంటనే చప్పన్నాంగుళ స్వామిరాజావారు తమ ఆజ్ఞల జాబితాను ప్రకటించేరు.

          *       అగ్రజుల (శ్వేతసౌధాధీశుని) ఆదేశాలమేరకు వారికి కావలసిన ఔషధాన్ని తక్షణమే పంపాలి.

          *       ఎవరి గృహాలలో వారే స్వీయ గృహ నిర్బంధంలో ఉండి తీరాలి. (గృహములు లేనివారో…. నంటూ ఎవ్వరైనా వితర్కమునకు పాల్పడిన దేశద్రోహులగుదురు)

          *       రాత్రివేళల విద్యుద్దీపములనార్పివేసి, చమురు లేక కొవ్వు దీపాలు వెలిగించి చప్పట్లు చరుస్తూ క్రిమిరాక్షసితో యుద్ధం చేయాలి.

          పై ఆదేశములలో, ప్రజలెవరైనా 2వ, 3వ ఆదేశములను పాటించకపోయినా, ఇతరేతరాలు ఆలోచించినా, చర్చించినా, విమర్శించినా తక్షణ ప్రాతిపదికపై దేశద్రోహులుగా నిర్ధారించబడెదరు. సమావేశాన్ని పూర్తిచేసి బయలుదేరుతున్న వీరిని చూసి చిలుకలు ఇలా అనుకొన్నాయి.

          ఛీ…. ఛీ…. ఏమిటీ ఘోరం…. అజ్ఞానమా…. అహంకారమా…. రాజ్యానికి రాబోతున్న ఉపద్రవమేమిటి?…. ఎలా ఎదుర్కోవాలి? ప్రజలను, వైద్యులను ఎలా రక్షించుకోవాలి?!…. రెక్కాడితేగాని డొక్కాడని ప్రజలనెలా కాపాడాలి?!…. ఇవేమీ కనీసం ఆలోచించలేదే…. అంటూ కీచుకీచుమంటూ ఎగిరిపోయాయి.

          కానీ ఆ చిలుకలలో ఒక కొంటె చిలుక వెళుతూ వెళుతూ వెనుకకు వచ్చి చప్పన్నాంగుళిస్వామివారు ధరించిన ఖరీదైన పైజమపై లటుక్కున రెట్టవేసేసి ఎగిరిపోయింది. చప్పన్నాంగుళిస్వామి రాజావారిని పరివేష్ఠించియున్న సకల పరివారమూ…., దేశద్రోహి చిలుకను పట్టండి…. అంటూ వెంటబడ్డారు.

admin

leave a comment

Create AccountLog In Your Account