నరమేధాలూ – నియోగాలు – మహాభారతం పరిశీలన

నరమేధాలూ – నియోగాలు – మహాభారతం పరిశీలన

– బి. విజయభారతి

(మహాభారతం – ఆదిపర్వం పరిశీలించి విజయభారతిగారు రాసిన ‘నరమేధాలూ – నియోగాలూ’ పుస్తకానికి ముందుమాట ఇది.      – సం॥)

          ‘మహాభారతాన్ని’ భారతదేశ సంస్కృతికి ప్రతీకగా పరిగణిస్తుంటారు. ఇందులోని అంశాలు, ఒకప్పటి సామాజిక రాజకీయ సంఘటనల ఆధారంగా గ్రంథస్తమైన కథనాలే. అవి ఇప్పటికీ సమాజాన్ని శాసిస్తున్నాయి.

          ‘మహాభారతం’ దాయాదుల పోరాటగాథగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో రెండు వ్యవస్థలకు చెందిన హక్కుల పోరాటాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా కనిపించేది దుర్యోధనాదులకూ పాండు పుత్రులకూ మధ్య జరిగిన రాజ్యాధికార వివాదం. పరోక్షంగా కనబడేది దేవాసుర వర్గాల పోరాటం. వీటిని ఆర్య ఆర్యేతర ఘర్షణలుగానూ – స్థానికుల ప్రతిఘటన పోరాటాలుగానూ చెప్పుకోవచ్చును. కురు రాజులు దేవగణాలకు సహకరించిన సందర్భాలూ, స్థానిక వర్గాలలోని నాగ, దైత్య, గంధర్వ, రాక్షస సమూహాలతో తలపడి వారిని అంతం చేసిన సంఘటనలూ భారతంలో ఉన్నాయి. నరమేధాలనూ నియోగాలనూ వర్గ, వర్ణ ఘర్షణలనూ ధార్మిక, తాత్విక చర్చలతో శ్రవణపేయంగా భారతం వినిపిస్తున్నది. ద్విజ, ద్విజేతర అంతరాలనూ, బ్రాహ్మణ, క్షత్రియ వివాదాలనూ – వాటిని ప్రతిబింబించే మనస్తత్వాలనూ భారతపాత్రలలో చూడవచ్చును. పురోహితవ్యవస్థను సమర్థిస్తూ వర్ణధర్మ చట్రాలను బిగించటం ‘మహాభారత’ రచన లక్ష్యం.

          ‘మహాభారతం’  చెప్పిన ధర్మోపదేశాలను గతితార్కిక దృష్టితో విశ్లేషించుకుని మూల్యాంకనం చేసుకోవటం నేటి సామాజిక అవసరం.

          పరశురాముని కాపు శమంతపంచకం నుండి జనమేజయుడు చేసిన సర్పయాగం వరకూ జరిగిన కొన్ని నరమేధాలను భారతం నమోదు చేసింది. రాచరికవ్యవస్థలో శాంతచిత్తులుగా చెప్పబడే మునుల ప్రేరణతో నరమేధాలు జరిగాయి. ఆధిపత్యవర్గాలకు అధికారాన్ని కట్టబెట్టటానికీ కొన్ని నరమేధాలు జరిగాయి. మునులే సంకల్పించిన రాక్షసమేధమూ, మునులు ప్రేరేపించిన సర్పయాగమూ సామూహిక హత్యలే. అర్జునుడు నివాతకవచులనూ, కాలకేయాదులనూ చంపటం కూడా ఒక జాతి మీద జరిగిన హత్యాకాండకు నిదర్శనం. ఈ మేధాలలో బలి అయిన రాక్షసులూ గంధర్వులూ నాగులూ యక్షులూ అసురవర్గాలూ మానవులే. వారిని వారి గణచిహ్నాలతో ప్రతీకాత్మకంగా పేర్కొనటం కావ్యశిల్పం. అప్పటి ఆ నరమేధాలు ఇప్పటి ప్రజాస్వామ్యంలోనూ కొనసాగుతున్నాయి. మంచి గతమున కొంచెమే – అని తెలిశాక గతంలోని చెడు సంస్కృతిని సరిదిద్దుకోవలసిన అవసరం ఉన్నది.

          ‘మహాభారతం’లో కనిపించే చాలా వివాహాలు స్వయంవరాలుగా చెప్పబడినప్పటికీ అవి బలవంతపు వివాహాలే. పురుషాధిక్యాన్ని పితృస్వామ్యవ్యవస్థనూ సూచించేవే. భారతంలో వర్ణాంతర వివాహాలు కూడా కనిపిస్తాయి. వాటి విషయంలో అప్పటి సమాజం ఉదారదృష్టితో ఉన్నదని గమనించాక అప్పటి  సంస్కృతిలోని కొన్ని విషయాలను గుణాత్మకమైనవిగా నేటి సమాజం అంగీకరించవలసే వస్తుంది.

          ఒక మహారాజు ఒక బెస్తనాయకుని (దాశరాజు) కూతురిని కోరి వివాహం చేసుకుంటానని వస్తే ఆ దాశరాజు తన కూతురికి పుట్టే కొడుకుకే రాజ్యవారసత్వం ఇవ్వాలని షరతు పెట్టగలిగాడంటే అప్పటి సామాజిక నిర్మితి ఎలా ఉండేదో ఊహించవచ్చు. ఆ బెస్త కన్య (సత్యవతి) కురువంశం వర్ధిల్లటానికి ఏ విధంగా దిశానిర్దేశం చేసిందో మహాభారతం చెబుతున్నది. ఆర్య ఆర్యేతర సంస్కృతుల సమ్మేళనాల ఫలితంగా భారతజాతి ఏర్పడటాన్నీ ఇది సూచిస్తుంది.

          భారతంలోని స్త్రీ పాత్రలు సహనానికి కార్యదక్షతకు ప్రతీకలు. అంబ అత్మాభిమానమూ, సత్యవతి రాజనీతి వైదుష్యమూ, ప్రశస్తమైన చిత్రీకరణలు. శర్మిష్ఠ తన జాతిశ్రేయస్సుకు తనను తాను తగ్గించుకున్న ఉదాత్త చరిత. దేవయాని కులాహంకారానికి ప్రతీక. కథాకాలంనాటికి లేని కులవివక్ష భారత రచనాకాలం నాటికి బహుముఖంగా వ్యాపించి ఉన్నందున కథలో అడుగడుగునా చర్చలు చేర్చారు.

          గుణశీలాలను పుట్టుకకూ జాతికీ ముడిపెట్టటం అనంతర కాలపు సామాజిక పరిణామం. ప్రతి పాత్రకూ పూర్వ వృత్తాంతాలు – పూర్వజన్మల కథలూ తయారు చేసి సమాజగమనాన్ని నియంత్రించారు. కీచకుని వృత్తాంతం ఇందుకు ఉదాహరణ. కులాంతర సంతానానికి చెడ్డ గుణాలు వస్తాయని చెప్పటం అక్కడి లక్ష్యం. ఇలాంటి కథలు భారత రచన రెండో దశలో చేరి ఉండవచ్చును. శుకమహర్షి పరీక్షిత్తుకు వినిపించిన కథలూ,  జనమేజయునికి వైశంపాయనుడు వినిపించిన కథలూ ఆయాకాలపు ఆలోచనల ప్రభావాలతో విస్తరించాయి.

          భారత కథ వింటున్న జనమేజయుడు కథ వినిపిస్తున్న వైశంపాయనుడిని ‘‘అయ్యా కీచకుడు ఏ వంశంవాడు ఎవడు – అని అడిగితే ఆయన ఆ వివరాలు ఇలా చెప్పాడట. బ్రాహ్మణికి క్షత్రియుని వల్ల పుట్టినవాడిని సూతుడు అంటారు. సూతులు అద్విజులు. క్షత్రియులకంటె కొంచెం తక్కువ. వైశ్యుని కంటె కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటారు. రాజసంబంధాలకు అర్హులయిన సూతులు కొందరున్నారు. అలాంటి వంశంలో సూత విషయానికి (రాజ్యానికి) చెందిన రాజూ – రాజకన్యకు పుట్టినవాడూ అయిన కీచకుడు ఒకడున్నాడు అని చెప్పాడు (సూత విషయాలూ ప్రత్యేకంగా అప్పట్లో ఉన్నాయి). ఆ కీచకునికి మాళవి అనే భార్య వల్ల నూట ఆరుగురు కీచకులు పుట్టారట – మాళవి చెల్లెలి కూతురు సుధేష్ణ విరాటరాజు భార్య.

          ఇక్కడ బ్రాహ్మణికి క్షత్రియునికి పుట్టినవారు సూతులన్నారు. చాలా సందర్భాలలో అలా కాలేదు. క్షత్రియునికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవారు క్షత్రియులయ్యారు. క్షత్రియుడైన యయాతికీ బ్రాహ్మణస్త్రీ అయిన దేవయానికీ పుట్టినవారు రాజులై రాజ్యాలు పాలించారు. ఆదిత్యుని కూతరు తపతికీ కురువంశపు సంవరణనికీ పుట్టినవారూ క్షత్రియు లయ్యారు. శ్రుతశ్రవసునికి నాగస్త్రీ వల్ల కలిగిన కుమారుడు ముని అయ్యాడు. వారికి తండ్రి కులం వచ్చింది.

          అది జాంబవ పురాణం ప్రకారం, సత్యలోకం నుంచి వచ్చిన శ్యామలాదేవి అనే బ్రాహ్మణ స్త్రీ క్షుర మహామునికి భార్య అయింది. వారికి మతంగ మహాముని పుట్టాడు. అతడు బ్రహ్మను ప్రార్థించి కర్దమ ప్రజాపతి అయ్యాడు. అనులోమస్థాయి నుంచి ప్రజాపతుల స్థాయి పొందటం ఒకప్పుడు ఉండేది. కొన్ని వర్గాల స్త్రీలను ముఖ్యంగా అగ్రవర్ణాల స్త్రీలను కట్టడి చేయటానికి అనంతర కాలపు ధర్మశాస్త్రాలు కొన్ని నియమాలు ఏర్పరచాయన్నమాట. ఇలా నియమాలు పెట్టడం ద్వారా బ్రాహ్మణ మేధావులు తమ స్త్రీలను తామే అవమానించుకున్నారని డా. అంబేద్కర్‌ విచారం వ్యక్తం చేశారు.

          అనులోమ విలోమ వివాహాల గురించి మను ధర్మశాస్త్రం చెప్పినవన్నీ అనంతరకాలపు నిషేధాలు.

          చతుర్వర్ణాల విభజనను పాటించే ఆర్యులు మొదట త్రైవర్ణికులు. నాలుగో వర్ణం తర్వాత ఏర్పడింది. దేవాసురులలో అసురులు చతుర్వర్ణాల పరిధిలో లేరు. అసురులూ ఆదివాసీలూ పంచమవర్ణాల వారూ వర్ణవ్యవస్థకు వెలుపలివారే. దేవాసుర – ఆర్య ఆర్యేతర సంబంధాలను భారతం చెప్పిన విధంగా చూస్తే మొదట్లో ఇది చలనశీలతగల సమాజం అని అర్థమవుతుంది. ఆ చలనశీలతను అడ్డుకునే ప్రయత్నాలు అనంతర కాలంలో జరిగాయి. (వైశంపాయనుని సమాధానాలలో వాటిని గమనించవచ్చు).

          ఇండియాలో మూలవాసులు అసురులు. ఇక్కడి నీటి వనరులు – భూనిక్షేపాలు – అటవీసంపద వారిదే. వాటిని కాపాడుకునేందుకే వారు ఆర్యులతో పోరాడారు. ఇప్పటికీ పోరాడుతున్నారు. కురు వంశపు రాజు చిత్రాంగదుడు అదే పేరు గల గంధర్వరాజుతో మూడు సంవత్సరాలు యుద్ధం చేసి యుద్ధంలో మరణించాడు. స్థానికులైన గంధర్వులు కురు రాజుల దురాక్రమణను అడ్డుకున్న సంఘటన అది. తమ  జలాశయంలోకి దిగినందుకే అంగార పర్ణుడు అర్జునునితో యుద్ధానికి దిగాడు. తమ సరోవరం దగ్గర క్రీడాగృహం నిర్మించబోతున్న దుర్యోధనుడిని గంధర్వులు కట్టిపడేశారు. యక్షుని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే ధర్మరాజు అతని కొలనులోని నీళ్ళు తాగగలిగాడు.

          చరిత్రలోకి వెళ్తే ఇండియా అలెగ్జాండరు దండయాత్రను మొదట ఎదుర్కొన్నది గిరిజనులూ – ఆదివాసీలూను. ఆధునిక యుగంలో ఈస్టిండియా కంపెనీ పాలననూ, బ్రిటిష్‌ పాలననూ మొదట ప్రశ్నించినది స్థానికులే. గోలుకొండ ఏజన్సీ ప్రజలు – ఛోటా నాగపుర్‌ కోలీయులు (1837), బెంగాల్‌ సంతాల్‌ తెగలు (1855), రంప గిరిజనులు, బీహార్‌లో చంపారన్‌ నీలిమందు రైతులూ తమ తమ వనరుల రక్షణ కోసమే పోరాటాలు చేశారు.

          ఆధునిక యుగంలో ఆత్మగౌరవ పోరాటాలలో పాల్గొన్నవారు అధిక సంఖ్యాకులు స్థానికులే. రాంజీగోండ్‌ (1860), బిర్సాముండా (1899), కొమరం భీం ల పోరాటాలు ఈ కోవలోనివే. పురాణాలు చెప్పిన అసురుల పోరాటాలను ఈ కోణంలోనే చూడాలి.

          ‘‘జయ’’ ఇతిహాసం చెప్పిన వ్యాసుని ప్రకారం భిన్న గణాల మధ్య వివాహ సంబంధాలున్నాయి. స్పర్థలూ సాగుతూనే వచ్చాయి. కురువంశపురాజైన ప్రతీవుని భార్య సునంద, శిబి కూతురు. శిబి దానవ చక్రవర్తి. రాక్షస కన్య హిడింబను భీముడు పెళ్ళి చేసుకోవటం – అర్జునుడు నాగ కన్యలను పెళ్ళి చేసుకోవటం – బాణాసురుని కూతురు ఉషను యాదవ వీరుడు అనిరుద్ధుడు వివాహం చేసుకోవటం – ఇలాంటి గణాంతర, జాత్యంతర వివాహాలు భారతకథలో కనిపిస్తున్నాయి.

          అసురుల వైదుష్యాన్నీ, తత్వజ్ఞానాన్నీ భారతకథలు ప్రస్తావించాయి. మహాపద్మనందుడు (పద్మనాభుడు) అనే నాగుడు ఒక బ్రాహ్మణునికి తత్త్వాన్ని – జీవాత్మ – పరమాత్మల కలయికను  బోధపరచటం శాంతిపర్వంలో ఉన్నది. వ్యాసుని శిష్యుల ద్వారా ‘జయ’ ఇతిహాసం ప్రచారమవుతూ ఉన్న దశలో కుల భావన సమాజాన్ని కలవర పరచటం, విదేశీ జాతులు ఇండియాలో ప్రవేశించి స్థానికులతో సంబంధాలు ఏర్పరచుకోవటం వంటివి జరిగాయి. జైన బౌద్ధ ధర్మాల ప్రభావమూ స్థానిక రాజ్యాలపై పడింది. ఆ క్రమంలో ఒక అవసరంగా కుల చట్రాలను బిగించటం అంతర్వివాహాలను బలపరిచే విధంగా శాస్త్రాలు తయారు చేయటం జరిగింది. ఆ విధంగా వర్ణధర్మాలూ, బ్రాహ్మణుల ఆధిక్యతను చెప్పే కథలూ ప్రధాన ఇతిహాసంలో చేరాయి. పాత్రలు శీల స్వభావ చిత్రణలలోనూ మార్పులు చోటు చేసుకొని ఉండవచ్చును. అసుర జాతులను నేర స్వభావులుగా చూపటమూ, శ్రమణ కుల ధర్మమైన భిక్షావృత్తిని గౌరవ ప్రదమైనదిగా యాయావరవృత్తిగా ఒక వర్గానికి ఆపాదించటమూ జరిగింది. ఇలాంటి మార్పులు – చేర్పులు వైశంపాయునుడు చెప్పిన భారత కథలో గమనించవచ్చును.

          ప్రస్తుతం లభిస్తున్న ‘మహాభారతం’లో ఒకప్పటి విశాలదృష్టి మరుగుపడిపోగా సంకుచితమైన వర్ణధర్మాలు, స్త్రీ ధర్మాలు వ్రత నిష్ఠలూ చేరి సమాజ పురోగతిని అడ్డుకుంటూ ఉన్నాయి. ఆ విశ్వాసాలు శూద్రులలోను, స్త్రీలలోనూ బలంగా పాతుకుపోయాయి. వారికి వాస్తవాలు తెలియవలసి ఉంది. అందుకే ఈ రచన.

          ఈనాడు హిందూమతం గురించి, హిందూత్వం గురించి సమాజంలో – దేశంలో ఎన్నెన్నో విభిన్నమైన ఆలోచనలు ప్రచారంలో ఉన్నాయి. హిందూత్వాన్ని అర్థం చేసుకోవటం కొంత కష్టం – కొంత ఇష్టం అన్నట్టుగా ఉంటుంది. 1949లో హిందూకోడ్‌ బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు హిందువులంటే ఎవరు ? హిందూత్వం అంటే ఏమిటి అనే ప్రశ్న వచ్చింది. అప్పటి సభ్యులలో చాలామందికి హిందూత్వంపట్ల స్పష్టత ఉన్నది. అయినా ఆ బిల్లును వారు అడ్డుకున్నారు.

          ‘‘క్రైస్తవం, జోరాష్ట్రియం, ఇస్లాం మాదిరిగా హిందూత్వం ఒక మతం కాదు’’ అని ఒక సభ్యుడు అన్నప్పుడు ‘‘మరి మతమంటే ఏమిటి’’ అని మరొక సభ్యుడు ప్రశ్నించాడు. అప్పుడు హెచ్‌.వి పటాస్కర్‌ ఇలా సమాధానం చెప్పారు.

          ‘‘క్రైస్తవం అంటే క్రీస్తును నమ్మి బైబిలును ఆచరించే వారి మతం. జోరాస్టర్‌ను అనుసరించేవారిది జోరాష్ట్రియం. ఇస్లాంను నమ్మి మహమ్మద్‌ను ఆరాధించి ఖురాన్‌ను అనుసరించే వారు ముస్లిములు. మరి హిందుత్వం అంటే ఏమిటి? హిందుత్వం అంటే కేవలం వేదాలను నమ్మటం కాదు. రాముడు, కృష్ణుడు, శివుడు ఇంకా రకరకాల రూపాలలో ఉన్న అనేక దేవుళ్ళనూ, ప్రకృతిని ఆరాధించేవారూ, దేవుడి పట్ల నమ్మకం లేనివారూ – దేవుడు ఒక్కడే అని ఒప్పుకోనివారూ ఇలా రకరకాల అభిప్రాయాలు కలిగిన వారు ఈ సమాజంలో హిందువులుగా ఉన్నారు. ‘‘హిందువులు ఆరాధించే దేవుళ్ళు వేర్వేరు. ఆరాధించే తీరు కూడా ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా ఉంటుంది. హిందూత్వమంటే శతాబ్దాలుగా వస్తున్న అనేక రకాల సంస్కృతులనూ మత విశ్వాసాలను తనలోఇముడ్చుకుంటూ పరిణతి చెందిన సమాజం. రకారకాల జీవన విధానాల ప్రవాహాన్ని తనలో కలుపుకున్న అభివృద్ధి’’ అన్నారు పటాస్కర్‌.

          శాస్త్ర నియమాల పేరుతో పూర్వజన్మ కర్మల మిషతో నియంత్రించబడుతున్న వర్గాల నుంచి వచ్చాను గనక ఆయా విషయాలు నాకు అర్థమైనంతవరకు చెప్పటం నా బాధ్యత. ఆ విషయంలో నాన్నగారు బోయి భీమన్నగారి రచన ప్రభావం నాపైన ఉన్నది.

          వర్తమాన సమాజంలో దళిత గిరిజనవర్గాలలోనూ శూద్ర వర్గాలలోనూ బ్రాహ్మణీయ భావజాలం బలంగా కుదురుకుంటున్నది. రాజకీయాలు ఆ భావజాలం చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఆయా కాలపు మానవ సమాజాలకు సంబంధించిన చిత్రణలు. అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను అవి కళాత్మకంగా చెబుతున్నాయి. ఒక్కొక్కసారి అతిశయించి చెప్పాయి. ఒక్కోసారి వక్రీకరించాయి. వాటిని ఇప్పటి సమాజం ప్రామాణికంగా గ్రహిస్తున్నది. వాటి పూర్వాపరాలను సంయమనంతో  పరిశీలిస్తే చారిత్రకాంశాలెన్నో అవగతమవుతాయి. నమ్మకాలకూ వాస్తవాలకూ ఉన్న తేడాలను తెలుసుకోవటం సాధ్యపడుతుంది.

          రామాయణంలో రాముడు వనవాస సందర్భంగా అసురులను చంపాడన్నారు. భారతంలోనూ పాండవుల వనవాస సందర్భంలో అసురుల వధ జరిగింది. దేవగణాలకు హితం చేయటానికీ కొన్ని సంహారాలు జరిగాయి. ఇవి యాదృచ్ఛికాలు కావు. ఒక వర్గంవారు తమ విజయాలనే చెప్పుకుంటూ వచ్చిన కథలు. పురాణ కథల ప్రపంచం ఏ సమాజం కోసం ఏర్పడిందో ఏ వర్గాలను అణచిపెట్టటానికి ఉద్దేశించబడిందో స్పష్టంగా తెలుసుకోగలిగినప్పుడు వర్తమాన నియంతృత్వాన్ని ఎదుర్కోగలుగుతాము.

          తారకంగారు ఆ దిశలోనే ఆలోచించేవారు. రామాయణ మహాభారతాల పూర్తి పరిశీలన జరగాలనేవారు. సంస్కృతమూలమూ ఇంగ్లీష్‌ అనువాదమూ ఉన్న గ్రంథాలను పరిశీలించాలనేవారు. ఆ క్రమంలో ధర్మశాస్త్రాలనూ ఇతిహాసాలనూ పరిశీలించి ఆయన ఎంతో నోట్సు రాసుకున్నారు. రామాయణ  పరిశీలన పూర్తి చేశారు. అవి అచ్చుకావలసి ఉంది.

          పరిమల్‌ పబ్లికేషన్స్‌ (ఢిల్లీ) వారు ప్రచురించిన మహాభారత సంపుటాలను డా. వార కృష్ణశాస్త్రి మాకు బహూకరించారు. అవి ఈ నా పరిశీలనకు ఉపకరించాయి. మూలంలోని కొన్ని ప్రాథమిక అంశాలనే – ముఖ్యంగా కులం – జండర్‌ వంటి వాటినే పరిశీనలోకి తీసుకున్నాను. అవి ఆలోచింపదగినవే.

నరమేధాలూ – నియోగాలూ : రచన – బి. విజయభారతి

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు, బొజ్జా తారకం ట్రస్టు ప్రచురణ.

ప్రథమ ముద్రణ : ఆగస్టు 2019

1/8 డెమ్మీలో 388 పుటలు, వెల : రు. 250/-

ప్రతులకు : హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు, ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌, గుడి మల్కాపుర్‌, హైదరాబాద్‌ – 500006.

ఫోన్‌ : 040-23521849.

admin

leave a comment

Create Account



Log In Your Account