‘ది గ్రేట్ హ్యాక్’ (2019)

‘ది గ్రేట్ హ్యాక్’ (2019)

– బాలాజీ (కోల్ కతా)

          ‘‘మీ ఫోన్లో మీకో ప్రచారం కన్పించినపుడు మీ ఫోను మిమ్మల్ని వింటోందని మీలో ఎంతమంది కనిపించింది?’’ – ప్రశ్నిస్తాడు డేవిడ్‌ కరోల్‌ తన క్లాసులోని విద్యార్థులతో. అమెరికాలోని పార్సన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైనింగ్‌లో డిజిటల్‌ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ల గురించి బోధిస్తుంటాడాయన. డేవిడ్‌ వేసిన ప్రశ్నకు విద్యార్థులంతా గొల్లున నవ్వుతారు. ఆయన కూడా వారితో కలిసి నవ్వేసి, ‘మన ఫోను మనల్ని కనిపెడుతూ వుండడం ఏమంత నవ్వులాట విషయం కాదు’ అని వివరిస్తాడు. మన స్వభావాన్ని, మన ఇష్టాఇష్టాల్ని కనిబెట్టి మన మీదికి గురిపెట్టి విసురుతున్న ప్రచారాలివి. ఇవి పెట్టుబడిదారుడి లాభాల కోసం ఉద్దేశించినవి. కానీ అంతకు మించి ‘వేసేది మీరు, వేయించెడిది మేము’ అన్న చందంగా మీ చేత బలవంతంగా ఒక ప్రత్యేక రాజకీయ పార్టీకి వోటు వేయిస్తేనో?  అలా గెలిచిన పార్టీ మీ జీవితాలను ఛిన్నాభిన్నం చేసే నిర్ణయాలతో ముందుకు దూసుకుపోతేనో? ఇటువంటి భయంకర పరిస్థితిని పరిచయం చేస్తుంది ‘ది గ్రేట్‌ హ్యాక్‌’ (2019) అనే డాక్యుమెంటరీ సినిమా. ఆ సినిమాలోనిదే పైన చెప్పిన సన్నివేశం.

          ‘‘పరస్పర సంబంధిత ప్రపంచం అన్న కలతోనే మొదలైంది ఈ కథంతా. ఒకరి అనుభవాలు మరొకరు  పంచుకోవచ్చు. ఎవరూ ఒంటరితనంతో బాధపడరు అని కలగన్నారు. ఈ (సోషల్‌ మీడియా ఇంటర్నెట్‌)  ప్రపంచం మన పెళ్లిళ్లు కుదిర్చింది,  దేని గురించైనా తెలుసుకోవాలంటే సహాయపడింది, వినోదాన్నిచ్చింది, మన జ్ఞాపకాల సంరక్షకురాలైంది, అవసరమైనవేళ వైద్యుడిగా కూడా ఉపయోగపడింది. కానీ డిజిటల్‌ మీడియా గురించి బోధిస్తున్న నేను మరింత శోధించగా నాకో సంగతి తెలిసింది. మన ఆన్లైన్‌ యాక్టివిటీ అంతా ఎక్కడికో ఆవిరైపోవడం లేదనీ, అది నేడు మన మీదే ఏడాదికి ట్రిలియన్‌ డాలర్ల వ్యాపారం చేసే పరిశ్రమగా  మారిపోయిందని నాకర్ధమైంది. ఫ్రీ కనెక్టివిటీ అనే ఉచిత బహుమానం మనల్ని ఎలా దోపిడి చేస్తోందో మనకు సాధారణంగా అర్ధం కాదు’’ – అని చెబుతాడు డేవిడ్‌.

          కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే బ్రిటీష్‌ సంస్థ అమెరికన్‌ ఓటర్ల డేటాను ఫేస్‌ బుక్‌ ద్వారా సేకరించి, దాన్ని విశ్లేషించి, టార్గెటెడ్‌ పొలిటికల్‌ అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా అమెరికన్‌ ఎన్నికలను ప్రభావితం చేసి ట్రంప్‌ను గెలిపించిందని 2018లో పెద్ద దుమారం చెలరేగింది. ఇది కేంబ్రిడ్జ్‌ అనలిటికా కుంభకోణంగా ఖ్యాతి గాంచింది. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ యునైటెడ్‌ స్టేట్స్‌ ప్రత్యేక కమిటీ ముందు ముద్దాయిలా నిలబడి సెనేటర్ల ప్రశ్నకు బదులు చెప్పాల్సిన స్థితి కూడా వచ్చింది. ఆ నేపథ్యంలో తయారైన పరిశోధనాత్మక  డాక్యుమెంటరీ ‘ది గ్రేట్‌ హ్యాక్‌’. కంప్యూటర్‌ను ఉపయోగించి అనుమతి లేకుండా అక్రమంగా సమాచారం దొంగిలించడాన్ని ‘హ్యాకింగ్‌’ అంటారు. అటువంటిది సోషల్‌ మీడియా నడుపుతున్న సోషల్‌మీడియా సంస్థే తన వినియోగదారుల సమాచారాన్ని భారీ ఎత్తున హ్యాకింగ్‌ చేసిందన్న మాట! అందుకే ఈ సినిమాకు ఆ  పేరు. జరిగిన ఉదంతాన్ని వెలికితీసి విప్పిచెప్పిన ప్రధాన పాత్రధారులు ఈ సినిమాలో కొందరున్నారు. వారి వివరాలు చెప్పేముందు కేంబ్రిడ్జ్‌ అనలిటికా పూర్వాపరాలు కొంచెం చూద్దాం.

కేంబ్రిడ్జ్‌ అనలిటికా సంక్షిప్త చరిత్ర :

          టీవీ ప్రచారాలు రూపొందించే పనిలో భాగంగా సమూహాల మనస్తత్వాలను మలిచే పరిశోధనలు చేసే ఎస్‌ సి ఎల్‌ గ్రూప్‌ (అనగా స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్‌ లేబరేటరీస్‌ గ్రూప్‌) అనే ప్రైవేటు సంస్థను 1993లో నిగెల్‌ ఓక్స్‌ అనే బ్రిటీష్‌ దేశస్థుడు ఏర్పరచాడు. సమూహాల ప్రవర్తనను అధ్యయనం చేస్తూ, దాన్ని ప్రభావితం చేసే  వ్యూహాలు రూపొందించే వ్యాపార ప్రచారరంగాన్ని దాటి, 1990లలోనే ప్రపంచ వ్యాప్తంగా సైనిక రాజకీయరంగాల్లో కూడా పనిచేయడం ప్రారంభించింది ఈ సంస్థ. అమెరికా ఎన్నికల వ్యవహారం చూడడం కోసం కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే అనుబంధ సంస్థను 2012లో ఏర్పరిచింది. ‘ఏజెంట్‌ ఆరెంజ్‌’ను తయారుచేసిన మన్సంటో విత్తనాలు, ఎరువుల కంపెనీగా ఎదిగిన లాంటి చరిత్రే ‘ఎస్‌ సి ఎల్‌ – కేంబ్రిడ్జ్‌ అనలిటికా’ది కూడా అని మనకర్ధమౌతుంది. 2016లో యుఎస్‌ రిపబ్లికన్‌ నామినేషన్ను గెలుచుకోవటానికి టెడ్‌ క్రజ్‌ కేంబ్రిడ్జ్‌ అనలిటికా సేవల్ని వినియోగించుకుంటూ వచ్చాడు. ఫేస్‌బుక్‌ డేటా సహాయంతో ఓటర్లపై నిఘా కొనసాగించింది ఈ సంస్థ. కానీ ఆ తర్వాత క్రజ్‌ ఆ రేసు నుండి తప్పుకున్న తరువాత, కేంబ్రిడ్జ్‌ అనలిటికా అదే వ్యూహాలను ఉపయోగిస్తూ డోనాల్డ్‌ ట్రంప్‌ 2016 యుఎస్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సహాయపడింది. ‘ప్రాజెక్ట్‌ అలమో’లో భాగంగా ఆమెరికన్‌ ఓటర్ల డేటాను తవ్వితీసి, బ్రిటన్‌లోని అనలిటికా కేంద్రకార్యాలయానికి చేర్చి, అక్కడ ప్రాసెసింగ్‌, పరిశోధనలు చేసి, టార్గెటెడ్‌ మెసేజులు, వీడియోలు పంపిస్తూ అమెరికన్‌ వోటర్లను ప్రభావితం చేశారని ఈ సినిమా వివరిస్తుంది. యురోపియన్‌ యూనియన్‌ నుండి బ్రిటన్‌ వైదొలగడానికి ముందు జరిగిన బ్రెగ్జిట్‌ ఎన్నికలను కూడా ఇలానే హైజాక్‌ చేశారన్న విషయం కూడా వెలుగులోకొస్తుంది. ఊగిసలాటలో వున్న కొంతమంది అతి కీలకమైన ఓటర్లను తమ అభ్యర్ధి వైపుకు తిప్పుకోవడంలోనే వుంటుంది అసలు కిటుకంతా.

         ఈ సినిమా కొంతమంది ప్రధాన పాత్రధారుల చుట్టూ, వారి పరిశోధనలూ, పోరాటాల చుట్టూ సాగుతుందని ముందే చెప్పుకున్నాం. వారి కథల ద్వారా ఈ సినిమా కథ సాగుతుంది. ఆ పాత్రల వివరాలు చూద్దాం –

1. డేవిడ్‌ కరోల్‌ : ఈయన గురించి ముందే కొంత చెప్పుకున్నాం. ప్రతి అమెరికన్‌ ఓటరుపైనా తన వద్ద  5,000 డేటా పాయింట్లు ఉన్నట్లు కేంబ్రిడ్జ్‌ అనలిటికా మాజీ సీఈఓ అలెగ్జాండర్‌ నిక్స్‌ ఛానల్‌ 4 స్టింజ్‌ ఆపరేషన్‌లో బహిర్గతం చేసినప్పుడు డేవిడ్‌ కారోల్‌ దాన్ని సీరియస్‌గా పట్టించుకున్నాడు. ఇంగ్లాండులో డేటా గోప్యతపై నిపుణుడైన న్యాయవాది రవి నాయక్‌ సహాయంతో దొంగిలించిన తన డేటాను తనకు తిరిగి ఇవ్వమని డిమాండు చేస్తూ లండన్‌ హైకోర్టులో కేసు వేస్తాడు. ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ కార్యాలయానికి పిర్యాదు చేస్తాడు. ఎస్‌ సి ఎల్‌ – కేంబ్రిడ్జ్‌ అనలిటికా సరైన జవాబు ఇవ్వనందుకు ఆ సంస్థపై ఇన్ఫర్మేషన్‌ కార్యాలయం 15,000 పౌండ్ల జరిమానా విధిస్తుంది. అంతేకాకుండా, ఈ కుంభకోణంలో ‘పారదర్శకత లేకపోవడం, డేటా దొంగతనానికి సంబంధించిన భద్రతా సమస్యల’ కారణంగా ఫేస్‌బుక్‌ కూడా 500,000 పౌండ్లు జరిమానా చెల్లించాల్సి వస్తుంది.

2. కరోల్‌ కాడ్వల్లాడర్‌ : మరో ముఖ్యమైన పాత్ర ‘ది అబ్జర్వర్‌’ కోసం పనిచేస్తున్న ప్రముఖ జర్నలిస్ట్‌ కరోల్‌ కాడ్వల్లాడర్‌. ఆమె మొదట కేంబ్రిడ్జ్‌ అనలిటికాపై దర్యాప్తు ప్రారంభించినప్పుడు, ఆమె పనిని కించపరిచేలా  వైరల్‌ మీమ్‌లతో దాడి చేశారు. కానీ దేనికీ తల వంచకుండా కరోల్‌ తన అద్భుతమైన పరిశోధనాత్మక రిపోర్టింగ్‌ కొనసాగించింది. వాస్తవానికి బ్రెగ్జిట్‌ ఉదంతం ట్రంప్‌ 2016 కోసం ఉపయోగపడ్డ ‘ప్రయోగ పాత్ర’ (పెట్రి డిష్‌) అని అంటుందామె. ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎన్నడైనా స్వేచ్ఛాయుతమైన స్వచ్ఛమైన ఎన్నికలు జరుగుతాయా అని ప్రశ్నిస్తారావిడ. అనేక కోణాల నుండి వస్తున్న బెదిరింపులను లెక్కచేయకుండా ఆమె తన దర్యాప్తును కొనసాగిస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆమె క్రిస్టోఫర్‌ వైలీ అనే విజిల్‌-బ్లోయర్‌ని (మోసాన్ని బహిర్గతం చేసిన వ్యక్తిని) కలుస్తుంది.

3. క్రిస్టోఫర్‌ వైలీ : ఈయన కేంబ్రిడ్జ్‌ అనలిటికాను ఏర్పాటు చేయడంలో సహాయపడిన ఒక యువ డేటా శాస్త్రవేత్త. ఫేస్‌బుక్‌ నుండి స్క్రాప్‌ చేసిన యూజర్‌ డేటాతో సైకోగ్రాఫిక్‌ ప్రొఫైలింగ్‌ వ్యూహాలు తయారుచేశాడు. ఈ పనిలో ఆయనకు కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అలెక్జాండర్‌ కోగన్‌ సహాయపడ్డాడు. ‘‘ఫేస్‌బుక్‌ యాప్స్‌ అందించే ప్రత్యేక పర్మిషన్ల ద్వారా వ్యక్తుల భోగట్టా అంతా రాబట్టేవాళ్లం. మీ స్నేహితుల జాబితాలోని ఒక వ్యక్తి మా ఉచ్చులో పడితే, మీరు కూడా మా ఉచ్చులో ఉన్నట్టే’’అని చెబుతాడు వైలీ. ‘‘మేము మీ అప్‌డేట్స్‌, మీ ఇష్టాఇష్టాలు, కొన్ని సందర్భాల్లో మీ ప్రైవేట్‌ సందేశాల వంటివీ సేకరించాం. మేము మిమ్మల్ని కేవలం ఓటర్లుగానే లక్ష్యం చేసుకోలేదు, మీ వ్యక్తిత్వాన్నే దోచేశాం’’ అని వైలీ చెబుతాడు. 50 మిలియన్లకు పైగా వినియోగదారుల డేటా గోప్యతను ఉల్లంఘించినట్లు వైలీ వెల్లడిస్తాడు. అంతర్జాతీయ పరిశీలనను ఎదుర్కోవడమంటే మార్క్‌ జుకర్‌బర్గ్ కు చెడ్డ భయమని వైలీ గేలి చేస్తాడు. తను చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా కేంబ్రిడ్జ్‌ అనలిటికా కుంభకోణంలో సాక్షిగా మారి బ్రిటన్‌, అమెరికా విచారణల్లో నిర్భయంగా పాల్గొన్నాడు. తదనంతర కాలంలో ‘మైండ్‌..క్‌’ అనే పుస్తకంలో మరిన్ని విషయాలు రాసి ప్రజాసమక్షంలో పెట్టాడు.

4. బ్రిటనీ కైజర్‌ : ఈ సినిమాలో ఆమాటి కొస్తే ఈ కుంభకోణంలో ఈమెది చాలా ముఖ్యమైన పాత్ర. ఈమె కేరీర్‌ గ్రాఫ్‌ చూస్తే చాలా విచిత్రంగా అన్పిస్తుంది. మొదటి దృశ్యంలోనే ఒబామా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రచారం చేస్తూ కన్పిస్తుంది. నిజానికి ఆ కాలంలోనే కేంబ్రిడ్జ్‌ అనలిటికా ఒబామా కోసం మొదటిసారి ఎన్ని(కలలో) పనిచేసింది. ఆ తర్వాత కైజర్‌ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లో మానవ హక్కుల కోసం కూడా పనిచేసింది. 2015-18 మధ్య సి.ఇ.ఓ అలెగ్జాండర్‌ నిక్స్‌ ఆధ్వర్యంలో కేంబ్రిడ్జ్‌ అనలిటికా బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ హోదాలో పనిచేసింది. కాబట్టి ఈవిడ ఆ లోగుట్టులు బాగా తెలిసిన ఆవిడే. అనలెటికా కుంభకోణం బట్టబయలైనపుడు థాయ్‌ల్యాండ్‌ పారిపోయి, తన లొకేషన్‌ డివైసులు ఆపేసి దాక్కుంది. థాయిలాండ్‌లోని ఓ కొలనులో ఈత కొడుతున్న కైజర్‌ మనకు సినిమాలో కనిపిస్తుంది. గడ్డు పరిస్థితి వలన తీసుకున్న నిర్ణయమో లేక నిజంగానే హృదయ పరివర్తనో చెప్పలేం గానీ ఆమె కూడా విజిల్‌ బ్లోయర్‌గా మారుతుంది. సినిమా ఆరంభంలోనే ఆమె ఒక వెదురు శిల్పానికి విజిల్‌ కడుతుండే దృశ్యం చాలా ప్రతీకాత్మకంగా నిజమౌతుంది. పాల్‌ హిల్డర్‌ సహాయంతో ఆమె వాషింగ్టన్‌కు వచ్చి విచారణకు సహాయపడుతుంది. సెనేట్‌ జ్యుడీషియరీ హియరింగ్‌ కోసం మార్క్‌ జుకర్‌బర్గ్ కు వేయాల్సిన ప్రశ్నలను రూపొందిస్తుంది. ‘యూజర్ల వ్యక్తిగత డేటాను తాకట్టు పెట్టడం ద్వారా ఫేస్‌బుక్‌కు ఎంత ఆదాయం వస్తుంది?’ అని అడిగినప్పుడు, ‘మొత్తం ఆదాయమంతా దాన్నుంచేగా’ అని బదులిస్తుంది. ‘‘మా సృజనాత్మక బృందం మేము టార్గెట్‌ చేసుకున్న వ్యక్తులను ప్రేరేపించడానికి వారికి మాత్రమే ప్రత్యేకమైన కంటెంట్‌ను రూపొందిస్తుంది. మేము కోరుకున్న విధంగానే అవతలి వారు ప్రపంచాన్ని చూసేంత వరకూ మేము వారిపై (పర్సనలైజ్డ్‌ మెసేజింగ్‌ ద్వారా) దాడిచేస్తునే వుంటాం’’ అని వివరిస్తుందామె. 2018లో ఈమె ‘ఓన్‌ యువర్‌ డేటా’ (మీ డేటాను మీరు స్వాధీన పరచుకోండి) అనే ఫేస్‌బుక్‌ ఉద్యమాన్ని ప్రారంభించింది.

5. అలెగ్జాండర్‌ నిక్స్‌ : ఈయన కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా వ్యవస్థాపక సీఈఓ. ఒబామా తన ఎన్నికల్లో సోషల్‌మీడియాను షా వినియోగించాడు. ఆదిలో రిపబ్లికన్‌ అభ్యర్థులకు తమ ప్రచారాల కోసం సోషల్‌మీడియాను ఉపయోగించడం చేతనయ్యేది కాదు. కానీ ట్రంప్‌ ఎన్నికల కాలంలోనైతే ఈ పార్టీ అతి పెద్ద మోసకారి ఎత్తులే వినియోగించింది అనలిటికా సహాయంతో. ట్రినిడాడ్‌ – టొబాగో ఫుటేజిని చూస్తే ట్రంప్‌లానే నిక్స్‌ కూడా జాత్యహంకారి అన్న సంగతి మనకర్ధమౌతుంది. ట్రంపూ, నిక్సూ దొందు దొందే. ఆ ఫలితాలు నేటి అమెరికాలో కన్పిస్తున్నాయి. విచారణ జరుగుతున్న సమయంలో ఎదురైన ప్రశ్నలకు నిక్స్‌ మహాశయుడు నీళ్లు నములుతున్న దృశ్యాలు మనకు పరమానందంగా వుంటాయి.

ఎన్నికను ముపు తిప్పిన విధానం :

          చాలాచోట్ల ఎన్నికల ఫలితాలు కొద్దిపాటి మార్జిన్లతోనే నిర్ణయ మౌతుంటాయి. 2016 అమెరికన్‌ అధ్యక్ష ఎన్నికల విషయానికి వస్తే, కేవలం మూడు రాష్ట్రాలలోని 70000 మంది ఓటర్లు కీలక పాత్ర వహించారు. గాలివాటు ఓటర్లు కొందరుంటారు. వారిని ‘పర్సుయేడేబుల్స్‌’ (నచ్చజెప్పబడగలవాళ్లు) అని అభివర్ణిస్తుంది కైజర్‌. వారిని ఎలా మాయ చేశారో చెప్పే ఉదాహరణ ఒకటి సినిమాలో చూపారు. ట్రినిడాడ్‌ – టొబాగోలో చాలా మంది ఆఫ్రో-కరేబియన్‌ నల్లజాతి యువకులు, భారతీయ యువ వోటర్లు వున్నారు. నల్లజాతి వారిలో పైలా పచ్చీసుగా తిరుగుతూ ర్యాప్‌ పాడేవారూ, బ్రేక్‌-డాన్సు చేసేవారూ వున్నారు. అన్యధా వీరంతా డెమాక్రటిక్‌ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌కు వోటు వేసేవారే! వీరిని కేంబ్రిడ్జ్‌ అనలిటికా ‘‘డు సో’’ అనే నాన్‌-పొలిటికల్‌ ప్రచారంతో ఆకర్షించి ఓటును తిరస్కరించేలా చేసింది. నాన్‌-పొలిటికల్‌గా కనిపిస్తున్నదంతా హైలీ పొలిటికల్‌ అన్నది అవతలివారు తెలుసుకోలేకపోయారు. అందుకని ఓటు వేయకపోవడమే పెద్ద ప్రతిఘటనా చర్య అనుకున్నారు. ఇక, భారతీయ యువకుల విషయానికి వస్తే ‘మీరు మీ తల్లిదండ్రులతో కలిసి ఓటు వేయడం ద్వారా మీ పెద్దలను గౌరవించండి’ అన్న ప్రచారాన్ని చేరవేశారు. ఇవన్నీ మొబైల్‌ సెట్లలోకి వచ్చే మెసేజ్‌లు, వీడియోల రూపాల్లో వుంటాయి. ఈ విధంగా 18-35 సంవత్సరాల వయస్సు గల ఓటర్ల శాతాల్లో 40% తేడాను తెచ్చి మొత్తం ఓట్లలో 6% శాతం సమతూకాన్ని మార్చి ట్రంప్‌ను గెలిపించారు. ప్రజాస్వామ్యం అనే మేడిపండు పొట్టలోని పురుగుల ఆధునిక రూపం ఇలా వుంటుందని ప్రపంచానికి తెలిసివచ్చింది.

నా డేటా నా హక్కు :

          ‘డేటా ఈజ్‌ ది న్యూ ఆయిల్‌’ అని అన్నాడు క్లయివ్‌ హంబీ. నూనె బావుల అవసరం తెలిసొచ్చిన తరువాత నూనె కోసం యుద్ధాలు జరిగేవి. ఈనాడు డేటా కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. డేటా వ్యాపారం కోసమే కాదు రాజకీయం కోసమూ అవసరమే. అందుకే ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితాల లిస్టులో వున్న రిలయెన్స్‌ అంబానీకి తన దేశీయుల డేటా విదేశీయుల చేతుల్లో వుండడం నచ్చడం లేదు. ఆ డేటా తనకందితే మొత్తం వ్యాపారమంతా ఎంచక్కా తనే చేసుకోవచ్చు. డేటా కోసం ఓ సరికొత్త స్వాతంత్య్ర పోరాటమే అవసరం అనంటున్నాడు ముఖేశ్‌ భయ్యా. ఆయన మరోచోట చెప్పిన ప్రకారం – “In this new world, data is the new oil. And data is the new wealth. India’s data must be controlled and owned by Indian people and not by corporates, especially global corporations’’. కేవలం ముడిచమురుతో పని కాదు. దాన్ని శుద్ధి చేసి ప్రయోగ యోగ్యమైన పెట్రోలియం ఉత్పత్తులు తయారు చెయ్యాలి. అలానే ఉత్త డేటాతో పని సాగదు. దాన్ని మనస్తత్వశాస్త్ర పనిముట్లతో సాగుచేసి, ఈ సినిమాలో చెప్పినట్టు ‘సైకోగ్రాఫిక్‌ ప్రొఫైల్స్‌’ (‘మనస్తత్వాన్ని వివరించే జాతకాలు’) తయారుచెయ్యాలి. దీనికి తోడుగా కృత్రిమ మేధస్సును వినియోగిస్తూ సరుకుగా మారిన మనతో ట్రిలియన్‌ డాలర్ల వ్యాపారాలూ, వారు కోరిన పార్టీకి ఓట్లేయించడాలూ చేయగలరు. ఇంకా మున్ముందు ఇంకెంత భయంకర కార్యక్రమాలు రూపొందిస్తారో ఇప్పుడే ఊహించలేము. అందుకే అన్నీ తెలిసిన డేవిడ్‌ కరోల్‌ లాంటి ప్రొఫెసర్లు ‘నా డేటా నా మానవహక్కు’ అంటూ ఖండాంతరాలు దాటి కోర్టుకెక్కారు. కేంబ్రిడ్జ్‌ అనలిటికా 2018లో దివాలా తీసెయ్యడంతో ఆయన డిమాండు చేసిన డేటా ఆయనకేనాడూ దొరక్క పోవచ్చు. కానీ భవిష్యత్తులో మరో భయంకర పరికల్పనతో మరో సంస్థ ముందుకురాదన్న గ్యారంటీ లేదు. మన డేటాతో మరో పన్నాగానికి వ్యూహరచన జరక్కమానదు. నేడు బహుళజాతి కంపెనీల కళ్ళన్నీ మన డేటాలపైనే!

ఎన్నో దురాగతాకు కారణమైన ఫేస్‌బుక్‌ :

          కేంబ్రిడ్జ్‌ అనలిటికా వంటి సంస్థ తను చురుకుగా పనిచేసిన రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏటా పది ప్రధాన మంత్రుల లేదా అధ్యక్షుల ఎన్నికల్లో పాల్గొనేది. ఆమెరికా, బ్రిటన్లే కాకుండా మలేషియా, రుమేనియా, ఘనా,  నైజీరియా, ఇండియాల్లో కూడా ఎన్నికలను ప్రభావితం చేసింది. ఈ సంగతే కాకుండా ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాలు విభిన్న దేశాల్లో హింసలకూ, హత్యలకూ కారణమైన విషయాలను కూడా ప్రస్తావిస్తుందీ సినిమా. హానికరమైన కంటెంట్‌ను సకాలంలో తొలగించకపోవడం వలన ఈ మాధ్యమాలు బర్మాలో రోహింగ్యాల వూచకోతకు, 7 లక్షలమంది రోహింగ్యా ముస్లింల ప్రవాసాలకూ కారణమయ్యాయి.  అలానే శ్రీలంకలో ముస్లింల వూచకోతలకు, ఫిలిప్పీన్స్ లో ప్రైవేటు హత్యలకు దోహదపడ్డాయి. బ్రజిల్‌, కాంబోడియాల్లో దుష్ప్రచారాల ద్వారా బోల్సనారో, హున్‌సెన్‌ వంటి నియంతల గెలుపుకూ, ఆగడాలకూ కారణమైనాయి. సామాజిక మాధ్యమాల దుర్వినియోగాలకూ, ప్రపంచ వ్యాప్తంగా నియంతృత్వాల స్థాపనకూ మధ్య ఏదో అవినాభావ సంబంధం వున్నట్టనిపిస్తుంది. భారతదేశం గురించి రాయాలంటే ఒక ప్రత్యేక అధ్యాయమే అవసర మౌతుంది. అసక్తి వున్న వారు ‘ది రియల్‌ ఫేస్‌ ఆఫ్‌ ఫేస్‌బుక్‌ ఇన్‌ ఇండియా’ (సిరిల్‌ సామ్‌, పరంజయ్‌ గుహా థకుర్తా), ‘ఇండియా మిస్‌ఇన్ఫోర్మ్ డ్‌ – ది ట్రూ స్టోరీ’ (ప్రతీక్‌ సిన్హా, డా. సుమయ్యా షేక్‌, ఆర్జున్‌ సిద్ధార్థ్‌), ‘హౌ టు విన్‌ ఎన్‌ ఇండియన్‌ ఎలక్షన్‌’ (శివమ్‌ శంకర్‌ సింగ్‌) వంటి పుస్తకాలు చదువుకోవచ్చు.

          ప్రపంచంలో ఎవరూ దేన్నీ ఫ్రీగా ఇవ్వరు అన్న విషయం అర్ధమైతే మనకు ఫ్రీ కనెక్టివిటీ, ఫ్రీ వైఫై, ఫ్రీ జియోల మాటున వున్న మర్మం అర్ధం అవుతుంది. మనుషుల్ని కలుపుతానంటూ ముందుకొచ్చిన సోషల్‌మీడియా మనుషుల్ని విడదీస్తోంది. సరుకుల ప్రపంచంలో మనల్నీ సరుకుగా మార్చేసి, మనల్ని వాణిజ్యపరంగా, రాజకీయంగా కొల్లగొట్టడమే కాక, మానవ సంబంధాలను తీవ్ర వొత్తిడికి గురిచేస్తూ, నూతన మానసిక రోగాలకు కారణమౌతోంది సోషల్‌ మీడియా. మరోసారి ఆండ్రాయిడ్‌ ఫోను చేతిలోకి తీసుకున్నప్పుడు, మరో కొత్త యాప్‌ డౌన్లోడ్‌ చేసినపుడు ఆ మాత్రం మన వెన్నులో వొణుకు పుడితే ఈ సినిమా ఉద్దేశం కొంత ఫలించినట్టే! చాలా నామినేషన్లు, అవార్డులు పొందిన ఈ చిత్రానికి దర్శకులు కరీమ్‌ ఆమిర్‌, జెహానే నౌజైమ్‌. నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో వుంది.

admin

leave a comment

Create Account



Log In Your Account