మే నెల మొదటిరోజున

మే నెల మొదటిరోజున

(స్వతంత్ర రచన 1947)

– పి. లక్ష్మీకాంత మోహన్

          పమిడిముక్కల లక్ష్మికాంత మోహన్‌ పాతతరం సాహితీ ప్రపంచానికి షేక్పియర్స్‌ మోహన్‌గా పరిచయం. 8వ తరగతి (థర్డ్‌ పారం) వరకే చదివి, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడై, బుర్రకథ లాంటి ప్రజాకళారూపాలపై పట్టు సాధించి, ప్రజాకళాకారునిగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో నిబద్ధ కార్యకర్తగా కృషిచేశాడు. తెలంగాణలో నిజాంకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఆ కాలంలో జరిగిన పోరాటాన్ని పోరాటకాలంలోనే ‘సింహగర్జన’ అదే నవలను రచించాడు. దీనినే ఇంగ్లీషులో ‘తెలంగాణ థండర్స్‌’ అనే పేరుతో తానే అనువదించగా, దీనికి ముందుమాట ప్రముఖ కవి, వామపక్షవాది హరీంద్రనాథ్‌ చటోపాధ్యాయ (హరీన్‌) రాశారు. ఎన్నో కథలు స్వయంకృషితో రచించాడు. జానపద సాహిత్యాన్ని సృష్టించాడు. షేక్స్పియర్‌ నాటకాలపై పట్టు సాధించి, వాటిలో 22 నాటకాలను సరళమైన తెలుగులోకి అనువదించాడు. అవన్నీ ప్రస్తుతం ప్రజాశక్తి ప్రచురణాలయంలో దొరుకుతున్నాయి. అంతేగాక షేక్ప్సియర్‌ పాత్రలపై ఆయన రాసిన విమర్శనాత్మక పుస్తకాన్ని నాగపూర్‌ విశ్వవిద్యాలయం తన ఎం.ఎ (ఇంగ్లీషు) విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా నిర్ణయించింది.

          లక్ష్మీకాంత మోహన్‌ రేపల్లే తాలూకా వెల్లటూరు గ్రామానికి చెందినవాడు. బుర్రకథ కళాకారుడు షేక్‌ నాజర్‌ ఆయన వద్ద కొన్ని మెళుకువులు నేర్చుకున్నారు.

          1949లో త్రిలింగ పబ్లిషింగ్‌ హౌస్‌, విజయవాడ వారు ‘ఆత్మబలి’ పేరుతో ప్రచురించిన లక్ష్మీకాంతమోహన్‌, 17 చిన్న కథల సంపుటి (క్రౌన్‌లో 140 పుటలు) ఇటీవల ‘జనసాహితి’ కార్యాలయానికి చేరింది. ఆ సంపుటి నుండి మే నెల మొదటిరోజున కథను పునర్ముద్రిస్తున్నాం. విదేశీయుల పేర్లుగల పాత్రలతో కూడిన ఈ కథ అనువాదం కాదు. లక్ష్మికాంతమోహన్‌ సొంతంగా రాసిన కథ.

          ఆయన 1928లో జన్మించారు. 1995 మే 5న హైదరాబాదులో మరణించారు. ఆయన ప్రథమ వర్థంతి సందర్భంగా 1996 మే లో ‘ప్రజాసాహితి’ ప్రత్యేక సంచికను ప్రచురించి వెల్లటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆవిష్కరించింది. ఈ సభకు వామపక్షవాది, ఉపాధ్యాయ నాయకుడు ఎం.జె.మాణిక్యరావు. బుర్రకథ కళాకారుడు షేక్‌ నాజర్‌ వక్తలుగా హాజరయ్యారు.

– సం ॥

          అది అమెరికాలోని చికాగో నగరం; ఒకనాడు ఆ నగరంలోని పెద్ద బజారుగుండా యొక ముసలి కార్మికుడు పరుగెత్తుతున్నాడు. ఆ పరుగెత్తటంలో అతనొక గుర్రపుబగ్గీ కింద పడేవాడయ్యేడు; కాని కొద్దిలో తప్పిపోయింది. ‘తాగుబోతు ముండాకొడకా’ అంటూ బండితోలే మనీషి కాండ్రించి వూసి గొణుక్కుంటూ బండి తోలుకుపోయేడు.

          అతను యిదేమీ వినకుండా పరుగెత్తుతున్నాడు. పక్కనే జర్‌ మంటూ కార్లు దూసుకు పోతున్నాయి. అతను తొడుక్కున్న లాగు ఆ తొందరలో పిర్రల కిందకి జారుతోంది. పాత బూట్లు తాళ్లు తెగి కాళ్ళ నుండి జారిపోతూ తపతప కొట్టుకుంటున్నాయి. వుండివుండి అతను ఆ రోడ్డుమీద బోర్ల పడ్డాడు. పక్కనే ఒక షాపులోని లావాంటి స్త్రీ యిది చూసి పక పక మనింది. అతను లేచి, ఆ స్త్రీ వంక గుడ్లురిమి చూసి, తిరిగి పరుగు లంకించు కొన్నాడు. కాని, మోచిప్పలు కొట్టుకొని పోనియ్యేమో అతను బాధతో పరుగెత్తలేక, కొంగనడక పుచ్చుకున్నాడు.

          కొంతసేపటికి యెలాగైతేనేం ఫ్యాక్టరీ వద్దకి చేరుకున్నాడు. అప్పుడే గేటు తలుపులు గటుక్కున మూసుకున్నాయి! ఆయాసంతోనూ, ముసలితనపు బలహీనతవల్లా అతను నీరసంగా అక్కడే కూలబడినాడు.

          ఆ ఫ్యాక్టరీ ఇనుప పరిశ్రమకి సంబంధించింది. అక్కడ రకరకాల యినుప సామాగ్రి తయారుచేస్తారు.

* * * * *

          1880 నాటికి అమెరికాలో చాలా మిల్లులూ, ఫ్యాక్టరీలూ యేర్పడినాయి. యెన్నో వస్తువులు గుట్టలుగుట్టలుగా తయారుచేసేరు. అంతకు చాలా పూర్వమే అమెరికాకి యితర దేశాలకీ వ్యాపార   సంబంధమయిన రాకపోకలుండేవి. ఈ సౌకర్యాన్ని బాగా ఉపయోగించుకొని, లాభాలు తియ్యాలనే రాక్షసి దాహం అప్పుడప్పుడే వృద్ధినందుతూన్న ఆ పారిశ్రామికులకి గలిగింది. దాంతో రేయింబవళ్ళు స్త్రీలతోనూ, ఆఖరికి పిల్లలతో గూడా పనిచేయించనారంభించేరు. గడ్డివామిలో పడిన నిప్పురవ్వ యెలాంటిదో వృద్ధిపొందుతూన్న పారిశ్రామికుల ఆశ అలాంటిది.

* * * * *

          ఆ ముసలి కార్మికుని పేరు విల్లియం; అతను పొడగరి; కాని లావుపాటి మనిషి. అతని ముఖం కోలగా వుంది; వొత్తుపాటి కనుబొమలు; బట్టతల; గడ్డం వుంది. వాటిలో అక్కడక్కడా తెల్లని వెంట్రుకలున్నాయి. యెండచేతా, పనివల్లా అతని చర్మం బిరుసెక్కి గోధుమరంగుగా వుంది. అతని చిన్నని నీలివర్ణపు కళ్ళు యెర్రబడి వున్నాయి. వొత్తుగా వుండి పెదిమల్ని పూర్తిగా కప్పివేసిన మీసాల గుండా బుష్‌మనే ఆయాసం బయటికి వస్తోంది.

          విల్లియం కాళ్ళుజాపి, పిర్రమీద కూచుని, నడుం బలహీనతవల్ల రెండు చేతుల్నీ వెనుక భాగాన నేలకానించి, మూసివున్న గేటువంక చూస్తో రొప్పుతున్నాడు.

          ఇంకా పొద్దన్నా సరిగా పొడవలేదు. అప్పుడే గేటు మూసేరు. రోజుకి పన్నెండు గంటల పని! లోపల  నుంచి కార్మికుల సుత్తిదెబ్బలూ, గుసగుసలూ, కరిగి పోతపోయ బడుతూన్న యినుము యొక్క బుస్సుమనే ధ్వనీ, మేస్త్రీల కస్సుబుస్సులూ – వినవస్తున్నాయి. బైటవున్న పెద్ద గొట్టాల నుండి వేస్తూన్న నల్లని పొగ ఆకాశాన్ని కప్పేస్తోంది.

          కాసేపటికి ఆయాసం పోగా, విల్లియం లేచి గేటు వద్దకి తూలుతుపోయి, తలుపు మీద మెల్లగా  చేత్తోకొట్టి దీనంగా ‘అయ్యా యీ యేసుప్రభువు దాసుడికి తలుపు తియ్యండి బాబూ, అయ్యా తలుపు యేసునాధుడ్ని మరవమాకండి. అయ్యా….’ అంటూ మొరపెట్టుకొన్నాడు.

          ఆవిధంగా అతను చాలాసేపు అతి దీనంగా ప్రార్థించేడు, వుహూం – యెవరూ వినుపించుకోలేదు. లోన పనిచేసే ఒక కార్మికుడు సానుభూతితో గేటు కంతలోనుంచి తొంగిచూసేడు, అతన్ని చూచి విల్లియం అసూయతో ముఖం చిట్లించాడు.

          వున్నకొద్దీ అతని వోర్పు తగ్గిపోతోంది. చిరాకూ, ఆవేదనా, భుగభుగలాడే కోపము పెరుగుతున్నాయి.  ఇక ఆగలేక విల్లియం దభీదభీ ఆ గేటు తలుపుల్ని బాదసాగేడు, చేతులు నొప్పి పుడుతున్నాయి. దాంతో అతనికి కోపం హెచ్చుతోంది.

          ‘తియ్యండి తలుపు. లేకపోతే తలుపులు పగలగొట్టేస్తా ఏమనుకున్నారో? నాకసలు కోపం రానేరాదు ఇక రాక రాక వచ్చిందంటే నన్ను బ్రహ్మరుద్రాదులు గూడా ఆపలేరు! తెల్సిందా? మర్యాదగా తియ్యండి తలుపు? అని బొబ్బరించేడు.

          భౌవ్‌ వెవ్‌’ మేనేజరు పెంచుతున్న బొచ్చుకుక్క లోపలనుంచి గేటు కంతలోగుండా మూతిపెట్టి  మొరిగింది. విల్లియం దాని మూతిమీదొక చిన్న రాయి బెట్టి నూకేడు. ఖయ్యోం ఖయ్యోం అంటూ అది లోనికి పరిగెత్తింది.

          మరుక్షణంలో పొట్టిగా దున్నపోతుకుమల్లే బలిసివున్న ఒక పోలీసు ఒక తెల్లగుర్రంమీదెక్కి వచ్చేడు. విల్లియం ఆ పోలీసుకి సాల్యూట్ చేసి ‘సార్‌. ఏసుప్రభు భక్తుణ్ణి తలుపు తియ్యమనండి’ అని వేడుకొన్నాడు.  దానికి జవాబుగా ఆ పోలీసు చేతిలోని కొరడా విల్లియం వీపుమీద ఛెళ్ళుమంది. మెలికలు తిరుగుతూ చాపచుట్టగా విల్లియం పడిపోయేడు. గుర్రాన్ని పోలీసు అదలించేడు. టకటకమంటూ గుర్రం పరుగెత్తింది.

          తర్వాత అనేకమంది కార్మికులు యితనిలాగే రొప్పుతూ రోజుతూ పరుగెట్టుకొచ్చేరు. మూసివున్న గేటునుచూచి మొదళ్లు నరికిన చెట్లకిమల్లే కూలబడిపోయేరు. సారాసీసా చేత్తో పట్టుకొని అందరికంటే ఆఖరున ఒక నడివయస్సు కార్మికుడొచ్చేడు. అతడు మస్తుగా తాగివున్నాడు. నెత్తిమీద టోపీ మెడవెనకాల వేలాడుతోంది. గుండీలు లేని చొక్కా చేతులు వూగులాడుతున్నాయి. అతని నోటిమూలల చొంగ కారుతోంది.

          అతనన్నాడు; ‘హేయ్‌, యీ షారాసీసా తాగండి, ష్వర్గం చేరండి. అక్కడ ఆకలిబాధ లేదు…. పెళ్ళాంపోరు లేదు…. అక్కడిగూడా ఫ్యాక్టరీ మేనేజరొస్తే బుర్ర పగలగొడదాం…. అక్కడ గేట్లు మూసివుండవ్‌’

          ఈ వాగుడికి కొంతమంది నవ్వేరు; మరికొంతమంది అసహ్యించుకొన్నారు; కొందరు మామూలుపనిగా చూసేరు.

          ఆ కార్మికులంతా తలుపులు తియ్యండని బతిమాలారు; కేకలు బెట్టేరు; తిట్టేరు. తిమ్మేరు తలుపులు  మాత్రం తెరుచుకోలేదు. ఆ తాగుబోతు కార్మికుడు సీసాలోని సారా చప్పగా తాగేసి, సీసాని గేటుకేసి కొట్టేడు; కొద్దికాలంలో తీవ్రమైన మత్తుతో అతను నేలమీద బోర్లగా పడిపోయేడు.

          కార్మికులు అసంతృప్తితో, ద్వేషంతో తమలో తాము యిలా ఆవేశంతో మాట్లాడుకున్నారు.

          ‘పాడు జీవితం!’

          ‘మనకంటే యింకా మేనేజరెంబటుండే ఆ కుక్క మెరుగు, యేం ఛార్లెస్‌’?

          ‘యిదుగో స్టూవర్ట్‌. యిదంతా యెందుకొచ్చిందో తెలుసా? మనకర్మ’!!

          ‘ఆపు. యికనాపు. వోరినీ ముసలాడు తగలెయ్యా మెదిల్తే వేదాంతం యెత్తుతాడు. కర్మలూ గిర్మలూ తర్వాత చూడొచ్చు ముందు ముద్ద సంగతేంటో చూడు తాతా’

          ‘తెల్లారుజామున లేస్తే పొద్దుగూకేదాకా యిక్కడే వుండాలయ్యే’

          ‘యిక యింటికాడ పనిచేసుకునే తీరిక వుండదు’

          ‘పైగా చాలిచాలని జీతం’

          ‘నీగ్రోవాళ్లకంటే మనబతుకు కనాకష్టం’

          ‘యెట్టాగోయ్‌మరీ? బతికేదెట్టా?’

          ‘యెట్టాగేముంది? తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టటమే!’

          వోరేయ్‌ మాట. యీ గేటు కాపర్ని నాలుగు తన్నుదామంటారా?’

          ‘వాడేం చేశాడు? అంతా మేనేజరు యిష్టం. వాడిదేముంది?’

          ‘మరి అయితే యింకో ఫ్యాక్టరీలోకి పనికి పోదామా?’

          ‘యెక్కడైనా యిదే యేడుపు!!’

          ‘వొరెయ్‌ నామాట వింటారా? భో అని బిగ్గరగా అరుద్దాం పట్టండి’

          యీ సలహా అందరికీ నచ్చింది. భోమని అంతా బొబ్బలు పెట్టేరు కాని తలుపులు తెరుచుకోలేదు. యీ మ్రోతకి త్రాగుబోతు కార్మికుడు లేచి, యేదో తానుగూడా అరిచి, వాళ్లని తిట్టి తిరిగి పడుకొన్నాడు. విల్లియం యీ గొడవేమీ పట్టించుకోకుండా పరధ్యానిగా వున్నాడు.

          రోజూ యిదేవరస టైముకి వొక్క నిముషం ఆలస్యంగా వచ్చినా ఫ్యాక్టరీలోనికి రానియ్యరు; లోనికొచ్చినవాళ్లని పొద్దుకూకముందే పోనియరు.

          యీ కార్మికులు పగలల్లా పనిచేయటం వల్ల బడలికతో మత్తుగా పడుకొంటారు, ఇంతలో తెల్లవారుజాము అవుతుంది. భోమని ఫ్యాక్టరీకూత వేస్తూంటుంది. కార్మికులు యిది వింటూనే వుంటారు. కాని లేవబోతే నరాలు నీరసంగా వుంటాయి; నడుము నొప్పిపెడుతూ వుంటుంది; తల దిమ్ముగా వుంటుంది; లేవలేరు, యెలాగో లేవగల్గినవాళ్ళు బూతులు తిట్టుకుంటూ వెళ్తారు. ఇక లేవలేనివారి గతి ఫ్యాక్టరీదాకా ఆశతో వచ్చి, మూసిన గేటుని చూసి నిరాశతో కొంపలకి చేరటమే వీరికి సరైన తిండి, బట్ట, యిళ్ళు, వైద్యసౌకర్యం యేమీలేవు.

          అందరికిమల్లే విల్లియం కాళ్లీడ్చుకుంటో యింటికొచ్చేడు. అదొక చిన్న యిల్లు; రెండు గదులు మాత్రమే వున్నాయి; అవిగూడా యిరుకువి. వొక గదిలో ఇక్ష్వాకులనాటి పాత సామగ్రి వుంటుంది.  రెండొదాంట్లో నెగడీ (వోవెకా) కుక్కిమంచాలూ వుంటాయి. ఆ యింటి చుట్టూ పందుల గూడుల్లాంటి కార్మికుల కొంపలు క్రిక్కిరిసి వుంటాయి.

          విల్లియం రెండోగది తలుపుతీసి లోనికి బోయేడు. వొక కుక్కిమంచంలో అతని కూతురు (ఆమెపేరు జీనెట్‌) కొడుకు – పదినెలల పసిగందు – నిద్రిస్తూన్నాడు, విల్లియం కూతురు జీనెట్‌, అతని భార్యా ఫ్యాక్టరీలోకెళ్లేరు.

          కిందకూచుని మనుమడిమీదికి వొంగి నుదురు మీద విల్లియం ముద్దు పెట్టుకున్నాడు. ఆ పసిపాప  వొంటినిండా దద్దుర్లున్నాయి. మందిచ్చే దిక్కులేదు. ఆ పసిబిడ్డ తండ్రి విల్లియం అల్లుడు ఒక కార్మికుడు. క్షయవ్యాధితో అతను కాలంచేసేడు. అల్లుడు యెలాంటివాడు! అతడు వుంటే తనకి యే దిగులూ వుండేదిగాదు. అల్లుడు చనిపోయేప్పుడు ఆ పసిపాపకేసి చేత్తో దీనంగా చూపుతూ ప్రాణాలు వదిలేడు. ఇది తల్చుకోగానే ఆ ముసలివాని కళ్ళు నీళ్లతో నిండేయి.

          విల్లియం భార్యపేరు మేరీ. ఆమె సన్నట్టి రోగిష్టి మనిషి ముక్కోపి, తక్కిన కార్మికులమల్లే ఆమె పొద్దుకూకినాక కూతురుతో యింటికొచ్చింది.

          ‘లెగువ్‌ ముసిలితొక్కూ, పొద్దున్నే లెగిసి చావకుండా, యింకా నిద్రపోతున్నావా? దున్నపోతల్లే నువ్వు కూచుంటే, ఆడాళ్ళం నీకు చాకిరీచేసి పెడతామా? లెగవ్వేం యింకా?’ అని మేరీ భర్తని లెగ్గొట్టింది. తాను తిండిలేమి వల్లా, బడలికతోనూ పొద్దుగూకేదాకా నిద్రపోయిన సంగతి విల్లియంకు తెలీదు. కళ్ళు నులుముకొంటూ లేచి, యెందుకని భార్య నడిగేడు.

          ‘యెందుకా? నా బొందకి! నీతో మనాళ్లు మాట్లాడాలంటున్నారు. అందుకూ’ మేరీ గుంజుకొంది.   జీనెట్‌ తన పసివాడికి పాలిస్తోంది.

          ‘‘యెందుకబ్బా?’’

          ‘యేమో’

          కాసేపటికి బిలబిలమంటూ అనేకమంది కార్మికులు అతని యింటికొచ్చేరు. విల్లియం బేటికొచ్చి యేమిటని అడిగాడు.

          ‘నువ్వు మేనేజరుతో మాటాడాలి తాతా’

          ‘అమ్మో’ మేరీ భయంతో తన యెదురు రొమ్ముమీద క్రాస్‌ చేసుకుంది.

          ‘‘యేమని మాట్లాడాలి?’’

          ‘రోజుకి ఎనిమిదిగంటల పనే వుండాని’

          ‘నేనా? అమ్మో మేనేజరుతోనే!!!’

          ‘ఫరవాలేదులే తాతా’

          వెనకోసారి ఒకర్ని పంపించితే, అతడు మేనేజరు వద్ద నీళ్ళు నమిలేడు. కనక ఈసారి నమ్మకస్తుణ్ణి, ధైర్యంగలాణ్ణి పంపాలనుకున్నారు. అందుకు తగినవాడు విల్లియం అనుకొన్నారు.

          చికాగో నగరంలోని అనేక ఫ్యాక్టరీల్లో పనిచేసే వేలమంది కార్మికులు యిలాగే సంప్రదించుకొని  తమతమ ప్రతినిధుల్ని మేనేజర్ల వద్దకి పంపించేరు, వాళ్ల కోర్కెలు పూర్తిగా నిరాకరించబడినాయి.

          తర్వాత యిక యిదిగాదని, ఆ ప్రతినిధులంతా కల్సుకొని 1886 మే 1వ తేదీన పనులు మానేసి తమ  నిరసన తెల్పాలనుకున్నారు.

          మే 1వ తేదీ దగ్గరకొస్తోంది. కాల్పులు జరుగుతాయని కార్మికుల గుండెల్లో గుర్రాలు పరుగెత్తుతున్నాయి, విల్లియం యింట్లో ఆడవాళ్లిద్దరూ భోరుమని యేడ్చారు.

          ఐనప్పటికి ఒక నూతనోత్సాహం బయలుదేరింది. వీధి మొగల్లోనూ సారా దుకాణాలలోను, హోటళ్లలోనూ, యిళ్ళలోనూ – యెక్కడ కార్మికుడుంటే అక్కడ – వుద్రేకమైన చర్చలు జరుగుతున్నాయి.

          చికాగో నగరానికి ప్రత్యేకమైన మిలిటరీ, పోలీసు సిబ్బందులొచ్చినాయి. బజార్లలో వీళ్లు విచ్చలవిడిగా తిరగసాగారు. యెక్కడచూచినా తుపాకీల చివర వుండే కత్తుల తళతళలే! గుర్రపు డెక్కల టకటకలే!!

          మే 1వ తేదీ!  ప్రభాత  సమయం; ఒక యెర్రటి నిప్పుగోళం తూర్పున వుదయిస్తోంది, అప్పటికప్పుడె వీధులలోకొస్తూన్న వేలమంది కార్మికుల ముఖాల మీద ఆ యెర్రటి కాంతిరేఖలు నాట్యమాడుతున్నాయి. నగరానికి తూర్పున వున్న మిచిగాన్‌ సరస్సు నుండి గిజగిజలాడించే చలిగాలి రాసాగింది. బోనులలోనుంచి వదలబడిన పులుల్లాగ కార్మికుల ముఖాలు భీకరంగా వున్నాయి.

          విల్లియం, మేరీలు గూడా ఆ గుంపులలో వున్నారు. వద్దన్నకొందీ. వుత్సాహంలో జీనెట్‌ తన పది నెలల పసికందుని చంకనేసుకొని వచ్చింది.

          అనేక వేలమంది కార్మికులు – స్త్రీలు, పురుషులు, పిల్లలు – చికాగో వీధుల్ని నింపేశారు. ట్రాఫిక్‌ అంతా బందయింది. హోటళ్ళూ షాపులు, మోటారుశాలలూ – అన్నీ మూసుకున్నాయి, మేడల పై అంతస్తులలోనూ, కిటికీలవద్దా యెవరెవరో నుంచుని యీ చిత్రం చూడబోతున్నారు.

          వీధి మొగలలో గుర్రపుదళాలూ, పదాతిసేనలూ వున్నాయి. మెయిను రోడ్డుకి వచ్చే కార్మికుల  గుంపుల్ని ఆ దళాలు అడ్డుకున్నాయి. ‘యెనిమిది గంటల పని! సరైన జీతం – కావాలి!!’ ఆ గొంతుకలు గర్జించాయి చికాగో నగరం బ్రద్దలైపోయేట్లు ఆ గర్జన ప్రతిధ్వనించింది. జవాబుగా మిలిటరీవాళ్ళ తుపాకులు నోళ్ళు తెరుచుకొని వున్నాయి; ధన్‌, ధన్‌, ధన్‌, ధన్‌ వీధులు దద్దరిల్లిపోయాయి. ముందుకు తోసుకొస్తూన్న కార్మికులలో, కొందరు మెలికలు తిరుగుతూ నేలమీద పడిపోయేరు, స్త్రీలు ఘోల్లుమన్నారు.

          ఒక గుంపు విల్లియంతో పెద్దబజారుకి తోసుకొస్తోంది – అతని ముఖం గంభీరంగా వుంది; దవడలు బిగబట్టివున్నాయి. ఆ గుంపుని వొక ఫిరంగిదళం అడ్డుకొంది, కార్మికులు తటపటాయిస్తూన్నారు.

          ‘పదండి ముందుకి’ విల్లియం గాండ్రించేడు. కార్మికులంతా ముందుకు సాగేరు. పెంగ్‌…. పెంగ్‌…. పెంగ్‌…. ఫిరంగులు అగ్నిగోళాల్ని చిమ్ముతున్నాయి.

          వొక గుండు విల్లియం మెదడుకి తగిలింది; తల పగిలి మెదడు బైటికి వచ్చింది. అతను పడిపోతూ ‘పదండి ముందుకి’ అని గర్జించేడు.

          కార్మికులావేశంతో రెచ్చిపోయేరు. ఆజానుబాహుడైన ఒక కార్మికుడు, విల్లియంను కాల్చిన గుర్రపురౌతు పైకి లంఘించి, గుర్రాన్ని ముందుకాళ్ళు పట్టి యెత్తిపడేసి, ఆ రౌతుని పచ్చడిపచ్చడి చేసేడు. యెక్కడినుంచో వొక గుండు దూసుకొచ్చి అతని పొట్టకి తగిలింది. అతను దాన్ని లక్ష్యపెట్టలేదు.

          ‘పదండి ముందుకి’ మేరీ ముందుకు వురికింది. పెంగ్‌…. పెంగ్‌…. ఆమె పడిపోయింది.

          ‘పదండి ముందుకు’ జీనెట్‌ చంకలోని పసిబిడ్డతో సహా వుద్రేకంతో ముందుకు దుమికింది. వొక గుండు ఆమె గుండెకు తగిలింది; ఆమె పడిపోయింది. చంకలో పసిపాప దూరంగా పడిపోయాడు. ఆ పసిగందు తల పగిలింది ఎర్రని పసినెత్తురు నేలమీద చారికలు గడుతోంది. ఆ బిడ్డ కేరుమన్నాడు. దానిలో ‘పదండి ముందుకి’ అనే ధ్వని వుంది. గుర్రం మీద యెక్కిన వొక పోలీసు తన గుర్రంతో పసిపాపని తొక్కించేడు. ఆ పదినెలల నెత్తురుగుడ్డు చితపలు చితపలుగా చితికిపోయింది.

          చికాగో నగర వీధులన్నిటా కార్మికుల వేడిరక్తం ప్రవహించుతోంది. ‘పదండి ముందుకి’ కార్మికులు గర్జిస్తూనే వున్నారు; కాల్పులు జరుగుతూనే వున్నాయి.

admin

leave a comment

Create AccountLog In Your Account