– ఎస్. అశ్వని
ఆడది అమ్మ వంటిది. కాని ఇప్పుడు ఆమె మీద ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. ఎలా అంటే పూర్వం రామాయణంలో రాముడు సీతమ్మను అడవులపాలు చేశాడు కదండి. రామాయణంలో రాముడు దేవునిగా పేరు పొందినా కాని సీతమ్మను మాత్రం అగ్నిప్రవేశం చేయించాడు. అయినా చెప్పుడు మాటలు విని రాముడు అలా చేశాడు. కానీ మన తాత, నాయనమ్మలు మాత్రం అతన్ని ఇప్పటికీ దేవునిగానే కొలుస్తున్నారు. ఇది నిజమేనంటారా? రాముడు నిజంగా దేవుడా? అసలు దేవుడు ఉన్నాడంటారా? దేవుడు ఉన్నాడే అనుకుందాం ఆడవాళ్ళపై ఇన్ని అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే చూస్తూ ఉన్నారని అంటారా? సరే అదే అనుకుందాం. పాండవులు కౌరవుల మధ్య జూదంలో ధ్రౌపదిని పాండవులు ఫణంగా పెట్టారు కదండి. ఎంతో శక్తిసామర్థ్యాలు ఉన్న పాండవులు ఆడదాన్ని అడ్డుగా పెట్టుకోవచ్చండి. పోనీ ఆ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వాళ్ళ అమ్మలాంటి వదినను ద్రౌపదిని వస్త్రాపహరణం అనే నీచమైన పని చేయాలనుకున్నారు. ఇలా ఆనాటి నుండి ఈనాటి వరకు ఆడపిల్లలపై హత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. కష్టాలలోనూ, కన్నీళ్ళలోనూ మగవాళ్ళ పట్ల ఆడది అమ్మవలే ఉంటుంది కదండి. అటువంటి ఆడదాన్ని ఎందుకండీ ఇంత నీచమైన ఆలోచనలతో ఆమె శరీరాన్ని దక్కించుకోవాలనుకుంటున్నారు. 3 సంవత్సరాలు అయిన పసిబిడ్డ అని కూడా చూడకుండా ఆ బిడ్డకు చిన్న వయస్సులోనే మారణాపాయస్థితికి తెప్పిస్తున్న ఈ మూర్ఖపు ఆలోచనలు మానరా?
ఈ సమాజం ఆడదాన్ని అమ్మలా చూసేది ఎప్పుడు ? తరాలు మారినా, యుగాలు మారినా ఆడదానిపై అన్యాయాలు, అక్రమాలు జరుగుతూనే ఉండాలా? ఈ అలవాటు మార్చేవారు ఎవరూ లేరా? మగ, ఆడ, అనే భేదం చూపిస్తున్న ఈ సమాజం మారదా ? లేకపోతే ఇవన్నీ మారాలంటే మరికొందరు ఆడవాళ్ళు అన్యాయాలతో చనిపోవాల్సిందేనా: ఆడపిల్ల ఇల్లు దాటాలంటే బాధ. ఎక్కడ ఈ మగపురుగులు వాళ్ళను చిత్రవధలు చేస్తారేమోనని భయం ఉన్నా, బాధ ఉన్నా ఆమె బయటకువచ్చి ఇది తప్పు అని ఎదిరిస్తే ఆమెను నీచమైన మాటలతో హింసిస్తుంది ఈ సమాజం. ఇలా ఆడవాళ్ళపై అన్యాయాలు పెరిగితే అప్పుడు ఆడది ఇలా ఉండేదట అని మ్యూజియంలో చూడాల్సివస్తుంది. కాబట్టి మనం మారుదాం. రేపటి ఈ సమాజాన్ని మార్చుదాం.