అంతర్యుద్ధం సృష్టిస్తున్న వేదనను చిత్రిస్తున్నసిరియా కవులు, కవయిత్రులు

అంతర్యుద్ధం సృష్టిస్తున్న వేదనను చిత్రిస్తున్నసిరియా కవులు, కవయిత్రులు

– కొత్తపల్లి రవిబాబు

          పశ్చిమ ఆసియాలోని దేశం సిరియన్‌ అరబ్‌ రిపబ్లిక్‌ – దీనికి నాలుగు దిక్కులా లెబనాన్‌, టర్కీ, జోర్డాన్‌, ఇజ్రాయేల్‌ దేశాలున్నాయి. విభిన్న తెగలు, వివిధ మతశాఖలవారు సిరియాలో వుంటారు. వారిలో అరబ్బులు, కుర్దులు, టర్క్ మన్స్‌, అసీలియన్స్‌, ఆర్మీనియన్లు, గ్రీకులు మొదలగువారు ముఖ్యులు. సున్నీలు, క్రిస్టియన్లు, ఇస్మాయిల్స్‌, మాండనీస్‌, షియాలు, యూదులు మొదలగు మతశాఖలు వున్నాయి. అత్యధికులు సిరియన్‌ అరబ్బులు.

          ఫ్రెంచివారి వలస పాలన నుండి సిరియా 1965 అక్టోబరు 24న స్వేచ్ఛ పొందింది.  ఫ్రెంచి సైన్యం  ఆ దేశం నుండి ఏప్రిల్‌ 1946లో నిష్క్రమించింది. 1949-1971 మధ్యకాలంలో పాలకులపై ఎన్నో ఆకస్మిక తిరుగుబాట్లు జరిగాయి. 1931 నుండి 2000 వరకు హఫీజ్‌ ఆల్‌ అస్సాద్‌ పరిపాలించగా, 2000లో అతని కొడుకు బషార్‌ ఆల్‌ అస్సాద్‌ పాలన చేబట్టాడు. ఇతని బాతిష్ట్‌ పార్టీ మానవ హక్కులను ఉల్లంఘిస్తూ, పౌరులకు, రాజకీయ ఖైదీలకు మరణశిక్షలు విధిస్తోంది. సెన్సార్‌షిప్‌ అమలు చేస్తోంది.

          ప్రస్తుతం సిరియా అంతర్యుద్ధంలో నాలుగు గ్రూపులు వున్నాయి. 1. సిరియా సైన్యం – దాని మిత్రులు 2. టర్కీ వత్తాసుతో వున్న స్వతంత్ర సిరియా సైన్యం 3. కుర్దిషుల ఆధిపత్యంలో వున్న సిరియా ప్రజాతంత్ర శక్తులు 4. ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాన్‌ & సిరియా (ఐఎస్‌ఐఎస్‌). సిరియా ప్రభుత్వానికి ఇరాన్‌, రష్యా, లెబనాన్‌ సహకరిస్తున్నాయి. సిరియన్‌ తిరుగుబాటు దళాలకు అమెరికా, టర్కీ, సౌదీ అరేబియా, ఖతర్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇజ్రాయేల్‌, నెదర్‌లాండ్స్‌ సహకరిస్తున్నాయి.

          ఈ అంతర్యుద్ధంలో సిరియా వారసత్వ సంపదగా ఉన్న దేవాలయాలు, కట్టడాలు అత్యధికంగా ధ్వంసమయ్యాయి. మ్యూజియంలు, ప్రాచీన జ్ఞాపక చిహ్నాలు – క్రీ.పూ. 1వ శతాబ్దం నాటివి నాశనమయ్యాయి. విచక్షణా రహితంగా జరుగుతున్న బాంబుదాడుల వల్ల లక్షలాది పౌరులు జోర్డాన్‌, టర్కీ, ఇరాన్‌ దేశాలకు వలసపోయారు. 2015 నాటికే టర్కీలోని శరణార్ధుల 12 శిబిరాలలో 17 లక్షలమంది వున్నారు.

          ఈ సంక్షుభిత వాతావరణం సహజంగానే కవులు, రచయితలను స్పందింపచేసింది. శాంతియుత వాతావరణాన్నీ, ప్రజాస్వామ్యయుత పరిపాలననూ, నిర్బంధరహిత జీవితాలనూ ఆశిస్తూ వారు రచనలు కొనసాగించారు. కొందరు ఇతర దేశాలకు పోయి అక్కడి నుండే మాతృదేశపు కడగండ్లను వర్ణించారు. మరికొందరు దేశంలో వుండే నిర్బంధ వాతావరణంలో వారి నిరసన వ్యక్తపరుస్తూ రాజ్యం చేతిలో శిక్షలు అనుభవిస్తున్నారు.

          అక్కడి సాహిత్యమంతా రక్తప్లావితమైన సంఘటనల గురించే. శ్మశానాల గురించీ – విరిగిపోయిన ఎముకల ధ్వనితో నిండినదే ఆ సాహిత్యం. విచ్ఛిన్నమైన కుటుంబాలు, బాంబుల బెల్టులూ, ఎకె47లు ధరించిన వయోజనులుగా ఎదిగిన ప్రతీకారవాంఛతో రగులుతున్న బాలుర గురించీ ఆ సాహిత్యంలో చూస్తాం. నల్లజెండాలు వూపుతున్న ఉన్మాదుల దేశం శరణార్ధుల ప్రవాహాలతో, ధ్వంసమైన నగరాలతో నిండి వుంది.

          ఇతర దేశాలలో తలదాచుకొన్న సిరియన్‌ రచయితలు, డాక్టర్లు, మాతృమూర్తులు, క్రియాశీల కార్యకర్తలు తమ తాతలనాటి దేశంలోని బాధామయ గాధలను చెప్తున్నారు. టర్కిష్‌ శరణార్ధి శిబిరంలోని ఒక వృద్ధుడు తాను రాసిన కవితల కాగితాలను చూపెడతాడు. సిరియా – అమెరికన్‌ జాతికి చెందిన కళాకారుడు ఓమర్‌ అఫెండమ్‌ తన పాటల ద్వారా జరిగిన నష్టాన్ని తెలుపుతూ తన పాటల ద్వారా ప్రచారం చేస్తున్నాడు. అమల్‌ కాస్సిర్‌ అనే రచయిత్రి బొబ్బలెక్కిన చేతులనూ, చెల్లాచెదరైన తన అమ్మమ్మ వ్యవసాయ క్షేత్రాన్ని జ్ఞప్తి చేసుకుంటూ ఇలా :

                    అందరికంటే బాగా తెలుసు

                   మా అవ్వకు సిరియా గురించి

                   ఆమె మోకాళ్ళనొప్పులే సిరియా!

                   ఆమె వ్యవసాయ క్షేత్రంలోని మట్టిపేరామెకు తెలుసు

                   నియంత కూడా ఆమెకు తెలుసు

                   అక్కడి దుమ్ము వాడికోసం వేచి వుంది

                   మనందరిలాగానే

                   తన సమాధి గురించి తెలుసుకుంటాడు

                   అతని గుండెలపై ఈ దేశపు భారాన్నంతటినీ

                   అనుభవిస్తుంటాడు!

          20 ఏళ్ళ వయసు గల ఈ కవయిత్రి కాస్సిర్‌ తన కుటుంబ సభ్యులతో డమాస్కస్‌ బయట 2002-05 మధ్య నివసించారు. ఆ కాలమంతా ఆమె ప్రపంచవ్యాప్తంగా పర్యటించి సిరియా గురించి ప్రదర్శనలు, కవితా పఠనాలు నిర్వహించింది. ఆమె చెంత ఒక పుస్తకాల సంచి ఎప్పుడూ వుంటుంది. హిజాబ్‌ ధరిస్తుంది.

          ‘నా కవిత్వం నిండా యుద్ధ దృశ్యాలే!’

          2011లో విప్లవం ప్రారంభమైన కాలం నుండీ 2 లక్షలమంది మరణించారు. 40 లక్షలమంది పైగా శరణార్ధులు సిరియా సరిహద్దు దేశాలకు వలసపోయారు. 70 లక్షలకు పైగా తమ ఇళ్ళు కోల్పోయారు. రోజువారీ జీవితమంతా వైమానిక దాడులు, రసాయనిక దాడులు, తిరుగుబాటుదార్లు, ఇస్లామిక్‌ మిలిటెంట్లు – అమెరికా రష్యాల కుట్రలతో నిండిపోయింది.

          క్రియాశీల కార్యకర్త, కవయిత్రి ఖావ్లాదునియా, నటి ఫద్వాసులేమాన్‌ సమకాలీన సిరియాపై ప్రతిభావంతమైన రచనలు రచించారు. సులేమాన్‌ ఐతే అస్సాద్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలకు నాయకత్వం వహించారు. దునియా తన ఫేస్‌బుక్‌లో సిరియా జైళ్ళ నుంచి అదృశ్యమైన స్త్రీల గురించీ, స్త్రీల దయనీయ పరిస్థితుల గురించీ రాశారు. ‘‘పూర్తికాని విప్లవ దినచర్యలు : టునీస్‌ నుంచి డెమాస్కస్‌ వరకు వినిపిస్తున్న గొంతులు’’ అనే పుస్తకంలో ఒక వ్యాసం రాస్తూ ఆమె, ‘‘తుపాకీ ధ్వనుల మధ్య ఎవరి గొంతూ వినపడటంలేదు’’ అన్నారు. అర్కన్సాస్‌ విశ్వవిద్యాలయంలో సాహిత్యశాఖ ఆచార్యులు, అరబ్‌ అమెరికన్‌ కవయిత్రి మోహ్ జా కాఫ్‌, ఖావ్లా దునియా, కవితలను ఇంగ్లీషులోకి అనువదించారు. ఆమె కవిత ‘‘దొంగ కాల్పులు’’ ఇలా సాగింది.

                   ట్రిగ్గరపై ఆ వేలికి విశ్రాంతి లేదు

                   విధిపై ఆధారపడిన అవయవాల

                   మూగరైఫిల్‌ పాలనలో వుంది విధి

                   నేనెవరో నీకు తెలిసిందా

                   నా పట్ల నీ ప్రవర్తన ఎవరు నేర్పారు నీకు?

                   ఎవరు నిన్ను ఇంత కఠినంగా మార్చింది?

                   ఈ క్షణం మనల్ని కలుపుతోంది

                   నీ కన్ను

                   ఒక తూటా

                   ఇటు నేను

                   ఈ క్షణం

                   మనలను ఐక్యం చేస్తోంది

                   నా కలల నుండి దూరం చేస్తోంది

                   నీకు పేరు తెచ్చిపెడుతుంది.

                   దొంగ కాల్పుల ద్వారా!

          30 ఏళ్ళపాటు పరిపాలించిన హఫీజ్‌ హయాంలోనూ, ఇప్పుడు పరిపాలిస్తున్న అస్సాద్‌ కాలంలోనూ ఎంతోమంది రచయితలు, మేధావులు మరణశిక్షలకు గురయ్యారు. 2011లో వెల్లువెత్తిన అరబ్‌స్ప్రింగ్‌ (అరబ్‌ వసంతం) ప్రజాస్వామిక ఆందోళనా ఉద్యమం టునీసియా, ఈజిప్ట్‌, యెమన్‌, బహ్రైన్‌, సిరియాలను చుట్టుముట్టింది.

          ఘడా  అలాట్రాష్‌, కెనడాలో నివసిస్తున్న పూర్వ సిరియా రాయబారి కూతురు. ఆమె యుద్ధభూమి నుండి వస్తున్న కవితలను ఇంగ్లీషులోకి అనువదిస్తున్నారు. ‘‘ఈ కవులు కొత్త భాషను వాడుతున్నారు. ఎంతో శక్తిమంతమైన కవితలు రాస్తున్నారు. సిరియన్‌ పౌరులందరినీ అవి ఆకర్షిస్తున్నాయి. ఎంతో ధైర్యాన్నీ నింపుతున్నాయి.’’ అని ఆమె అభిప్రాయపడింది.

          సిరియాలో వుంటూ కవిత్వం రాస్తున్న నజాత్‌ అబ్దుల్‌ సమద్‌ ఒక డాక్టరు. ఆమె దక్షిణాన గల స్వేదా నగరంలో వుంటారు. ఒక కవితలో ఆమె ఇలా అంటున్నారు. ‘‘నిన్ను నీరసం ఆవహించినపుడు, ప్రతికూల పరిస్థితుల్లో స్త్రీలు చూపే సంయమనంతో నా హృదయానికి కట్టు కడతాను.’’

          ‘‘ఆమె విస్తాపన అనే మృత్యుకుహరం నుండి బయటపడి, తన జీవితాన్ని కొనసాగిస్తోంది. శోకమూ, పేదరికమూ, విస్తాపన ఆమెను కృంగదీయలేవు. ఆమె హుందాగా నిటారుగా నిల్చుని పోరాడుతోంది. ఆమె పోరాటస్ఫూర్తితో నా గుండె గాయానికి కట్టు కడతాను. ఎముకలు కొరికేసే చలిని తట్టుకోడానికి ఆమె ఎంతో వంట చెరకును సేకరిస్తుంది. ఆమె చెట్లను నరకదు. వంట చెరకును దొంగిలించదు. విసుగును దరికి రానీయదు. ఎవరి దయా దాక్షిణ్యాలకూ చేయి చాపదు. బరువుకు వంగిపోదు. తన ప్రయాణాన్ని మధ్యలో ఆపదు. దేనికీ లొంగదు. ఈ కవితను ఈ క్రింది వాక్యంతో ఆమె ముగించింది.

                   ‘‘నా గుండె గాయానికి కట్టు కడతాను

                   నా నినాదం మృత్యువే, అవమానం కాదు’’

          తమ దేశానికి ప్రపంచంలోని ఇతర దేశాలన్నిటితోనూ సంబంధం లేకుండా పోయిందనీ, అది ఒక బీడు భూమిగా మారిపోయిందనీ, సిరియన్లలో అత్యధికులు వ్యధ చెందుతున్నారు. ‘‘శాంతికోసం ఆకాంక్ష నా మతం అలాగే మానవత్వమూ నా మతం’’ అని సమద్‌ రాశారు. ‘‘ఈనాడు నా దేశంలో ప్రపంచంలోని ఏడు ఖండాల వాసనా వుంది – కాని అది ఒక అనాథగా మారింది’’ – అని కూడా ఆమె రాశారు.

          మరికొందరు అజ్ఞాతకవులు తమపై నిర్బంధం విరుచుకు పడుతుందన్న భయంతో తమ పేర్లు బయట పెట్టకుండా రాస్తున్నారు. సిరియాలో వాస్తవంగా జరుగుతున్న అత్యంత విషాద పరిస్థితిని కేవలం రేఖామాత్రంగానే వారి రచనలున్నాయని చెప్పారు.

          ఓమర్‌ అఫెండమ్‌ సిరియన్‌ అమెరికన్‌ హిప్‌-హాప్‌ కళాకారుడు. అంటే నృత్యం చేస్తూ పాట పాడే కళాకారుడు. అతని కుటుంబసభ్యులు సిరియా నుండి పారిపోయి వచ్చేవరకూ, తన నిరసన గేయాలను పాడకుండా మౌనం వహించాడు. అస్సాద్‌ వ్యతిరేక గేయం ‘‘సిగ్గు పడదాం’’లో యుద్ధం ప్రజల మనస్సులను ఎలా స్థంబింపచేస్తుందో చెప్పాడు.

                   సిరియా ఇప్పుడొక గందరగోళంలో వుందని

                   వారంటున్నారు

                   ఏ పక్షంవైపు వుండాలో

                   నిర్ణయించుకోలేని దుస్థితిలో వుంది

                   ఆలోచించండి

                   మనం సర్వస్వం కోల్పోతున్నామని

                   గుర్తిస్తున్నారా –

                   యుద్ధంలో ఏ మర్యాదా వుండదు

                   పసిబిడ్డలను కత్తులతో పొడిచి చంపేస్తారు

                   తల్లులను వంట ఇంట్లోనే గొంతు పిసికేస్తారు’’

          సిరియా నుండి లక్షలాదిమంది ప్రజలు బోటుల ద్వారా, కాలినడక ద్వారా, కార్లు, రైళ్ళద్వారా లెబినాన్‌, జోర్డాన్‌లకు, టర్కీ ద్వారా యూరప్‌ దేశాలకు పారిపోయారు. ఒక శరణార్ధి ఇలా అన్నాడు. ‘‘కత్తి అంచులపైన, వాచిపోయిన పాదాలతో నేను నడుస్తున్నాను.’’

          అమల్‌ కాస్సిర్‌ టర్కీలోని ఒక శరణార్ధుల శిబిరంలో వున్న అసంఖ్యాక సిరియన్లనూ, ప్రవాసంలో వారి దుర్భర జీవితాన్ని చూచి చలించి ఇలా వ్రాశారు. ‘‘యువకులు లేరు. పసిపిల్లలు, బాలలు, స్త్రీలు, వృద్ధులు మాత్రమే వున్నారు. ఒక వృద్ధుడు గుడారంలోకి పోయి మూడు కాగితం ముక్కలు తెచ్చాడు. దానిలో స్థిరనివాసం కోల్పోయిన వారి గురించి రాస్తూ, ‘‘యుద్ధమనేది ఒక రాక్షసి, పచ్చదనాన్నంతా మింగేసింది.’’ అన్నాడు.

          మధ్యప్రాచ్యమంతా వలసపోయిన సిరియన్‌ కవులు కన్పిస్తారు. అరిఫ్‌ అక్రెజ్‌, అమ్మార్‌ తీబ్బాబ్‌ అనే  కవులు ఇద్దరూ విప్లవం తొలిదశలో క్రియాశీల కార్యకర్తలు. ఇద్దరూ ఒక ప్రజాస్వామిక సిరియా కోసం కృషిచేశారు. ‘‘శాంతిని సృష్టించే కవిత్వం రాయడం నా ఆకాంక్ష’’ అంటాడు అమ్మార్‌. కుర్దిష్‌ సిరియన్‌ నవలా రచయిత, కవి సలీమ్‌ బారాకట్‌, సిరియా నుండి బహిష్కరింపబడిన, నోబెల్‌ బహుమతికి ఎదురుచూస్తున్న ఎడ్యునిస్‌ (Adunis), పాలస్తీనా రచయిత మహమ్మద్‌ దర్వీష్‌ తాను మెచ్చిన రచయితలంటాడు అరెఫ్‌ అక్రెజ్‌. అమ్మార్‌ తబ్బాబ్‌, అరెఫ్‌ అక్రెజ్‌ల కవితావస్తువు అంతర్యుద్ధం, అది సృష్టిస్తున్న నష్టం. ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌ఐఎస్‌) అనే తీవ్రవాద సంస్థ అలెప్పోలో అత్యధిక భాగాన్ని చేజిక్కించుకున్న ఫలితంగా, అరెఫ్‌ సిరియాను సంవత్సరం క్రితం వదలివెళ్ళాడు. విప్లవకారుల్లో ప్రముఖ కవి అమ్మార్‌ ఒకటిన్నర సంవత్సరం క్రితం డమాస్కస్‌కు పారిపోయాడు. అతనికి పాలకుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. ప్రవాసంలో వుండి రచనలు చేయడంపై స్పందిస్తూ అరెఫ్‌ ‘‘ఇక్కడ వుండి నాకిష్టమైనది నేను రాసుకోవచ్చు. ఇక్కడ మేం స్వేచ్ఛాజీవులం’’ అన్నాడు. అయితే ‘‘సిరియా లేకుండా సిరియన్‌ కవిత్వం వుండదు’’ అని కూడా అన్నాడు. అరెఫ్‌ తన మణికట్టు నుండి మోచేయి వరకు అరబిక్‌ లిపిలో ఒక వాక్యాన్ని పచ్చబొట్టుగా రాయించుకున్నాడు. అది ప్రముఖ కవి మహమ్మద్‌ దర్వీష్‌ రాసిన కవితలో ఒక పాదం ‘‘రేపటి వరకు సమయం లేదు’’ అనే అర్థం ఇస్తుంది.

          ‘‘సిరియా కోసం శోకగీతం’’ అనే కవితకు 2017 బెట్జ్మాన్‌ కవితాబహుమతి లభించింది. 10-13 ఏళ్ళ వయసు రచయితలకు ఇచ్చే ఈ బహుమతి 2017లో అవిూనెఅబు కెరిచ్‌ అనే 13 ఏళ్ళ సిరియన్‌ శరణార్థి బాలికకు లభించింది. దీనిని ఆమె సగం ఇంగ్లీషులోనూ, సగం అరబిక్‌లోనూ రాసింది. ఈ జాన్‌ బెట్జ్మాన్‌ (1906-1984) ఇంగ్లండ్‌లో 1972 నుండి 1984 వరకు ఆస్థాన కవి – జాతీయ కవి (Poet Laureate)గా వున్నారు. ఆయన పేరుతో స్థాపించిన కవితా ఫౌండేషన్‌ ప్రతి ఏడాదీ ఈ బహుమతులు ప్రకటిస్తుంది.

సిరియా కోసం శోకగీతం

                   మా సిరియా పావురాళ్ళ కువకువలు

                   నా తలపై వినబడుతున్నాయి

                   వాటి అరుపులు

                   నా కళ్ళను పిలుస్తున్నాయి

                   నా కవితతోపాటు

                   ఒక దేశాన్ని చిత్రించాలన్నదే నా ప్రయత్నం

                   నా ఆలోచనలకు అడ్డురాని దేశాన్ని

                   సైనికులు తమ బూటుకాళ్ళతో నా ముఖాన్ని

                   పచ్చడి చేయని దేశాన్ని

                   చిత్రించాలని ప్రయత్నిస్తున్నా

                   నేనొక దేశాన్ని,

                   నేనే కవినైతే, నాకు సరిపోయే దేశాన్ని

                   కన్నీటి ప్రవాహమైతే నన్ను భరించే దేశాన్ని

                   గందరగోళాలు, యుద్ధం, ధ్వంసం, దైన్యం లేకుండా

                   ప్రేమ, శాంతి, సుగుణాలతో నిండిన

                   నగరాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నా!

                   ఓ సిరియా! నా ప్రియతమా!

                   ద్వేషంతో చీలిపోయిన నీవు

                   శాశ్వతంగా స్వేచ్ఛ పొందాలి

                   చమురు కోసం

                   అసత్యాలతో చెలరేగే యుద్ధాలు జరుగుతుంటే

                   నీవు స్వేచ్ఛగా వున్నట్లు భావించడం తెలివితక్కువ

                   వ్యక్తిగతంగా, మతపరంగా నీవు

                   స్వార్ధపూరితంగా ప్రవర్తిస్తున్నావు

                   ఇలా ఎందుకు జరుగుతోందో

                   నీకు నీవే ప్రశ్నించుకో

                   నీ మానవత్వం

                   అక్కడ సమాన దృష్టితో వుందా?

          అంతర్యుద్ధం సిరియా కవిత్వ రంగంలో ఒక నూతన వెల్లువను సృష్టించింది. సాంఘిక మాధ్యమాలలోనూ, వీధుల్లోనూ అది ఎల్లెడలా విన్పిస్తోంది. రోజురోజుకూ పెరిగే మరణాలను సృష్టిస్తున్న అంతర్యుద్ధం కాలంలో సిరియా ప్రజల గొంతు లోతుల్లో నుంచి వస్తున్న కవిత్వం సిరియా సాహిత్య చరిత్రలో ఎన్నడూ లేదు. కొన్నేళ్ళ క్రితం కూడా ఇటువంటి సాహిత్యం వస్తుందని ఎవరూ వూహించలేదు. మధ్యప్రాచ్యంలో వాక్స్వాతంత్య్రంపై జరిగే దాడులపై పరిశోధించిన సిరియన్‌ రచయిత ఘియాస్‌ ఆల్‌ జుండి ప్రకారం సిరియన్‌ బూడిద నుండి ఎంతో బలమైన, అందమైన కవిత వస్తోంది. విప్లవానికి ఉన్న సాంస్కృతిక కోణం చాల ప్రకాశవంతంగా వుంది.

          అర్కన్సాస్‌ విశ్వవిద్యాలయంలో తులనాత్మక సాహిత్యంపై అసోసియేటెడ్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సిరియన్‌ అమెరికన్‌ రచయిత మోహ్ జా కౌహ్ ఫ్‌ 2001లో ‘‘సమకాలీన సిరియన్‌ సాహిత్యంలో స్థబ్దత’’ అనే వ్యాసం రాస్తూ, భయమూ, ప్రభుత్వ సెన్సార్‌షిప్‌, నిర్బంధం వారిని ఆ స్థబ్దతలోకి నెట్టాయని రాసింది. కాని ఇప్పుడు ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాల వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఒక నూతన సిరియన్‌ వ్యక్తిత్వం, సాహిత్య సంప్రదాయం బయటకు వచ్చాయి. ఈనాడు కవిత్వం సిరియాలో ఒక పెద్ద పాత్ర నిర్వహిస్తోంది. అన్ని ప్రదర్శనలలో, వీధుల్లో ఈ కవితలను ప్రజలు పాడుకుంటున్నారు.

          హింస తీవ్రం కావడంతో శాంతియుత ఆందోళనల సంఖ్య తగ్గింది కాని పూర్తిగా అదృశ్యం కాలేదు, కవులు, రచయితలు దేశవ్యాప్తంగా అదృశ్యమౌతున్నారు. వారు ఒకవైపు పాలకులు, మరోవైపు ఇస్లామిస్టుల మధ్య చిక్కుకొని పోయారు. వారికి వ్యతిరేకంగా రాయడం, మాట్లాడటం అపాయకరంగా మారింది. 2011 జులైలో కవి ఇబ్రహీం ఘఫీుస్‌ను కిడ్నాప్‌ చేసి చంపేశారు. డియా అల్‌ అబ్దుల్లా, తాల్‌-తీ-మల్లొహి అనే ఇద్దరు కవులు జైల్లో వున్నారు. వారిని కలుసుకోడానికి లాయర్లకు అనుమతినీయడంలేదు. ఖలేద్‌ ఖాలిఫా అనే రచయితపై 2012 మే లో డమాస్కస్‌లో దాడిచేసి, ఆయన ఎడమచేతిని నరికివేశారు. కవులు, రచయితలకు ప్రాణభయమూ, జైలుకో ప్రవాసానికో వెళ్ళాల్సిన స్థితీ వుంది. వారు దేశం విడచి పారిపోయినా విదేశాల్లోనైనా వారిని చంపేస్తారు.

          మాస్రి అనే కవయిత్రి ‘‘స్వేచ్ఛ : నగ్నంగా వస్తోంది’’ అనే కవితా సంపుటి ఇటీవల ప్రచురించారు. దీనిని ప్రచురించినందుకు ఆమెను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. సిరియాలో ఆమె బంధువులు, మిత్రులు రహస్య జీవితంలోకి వెళ్ళారు.

          మరికొందరు కవులు, ఇతర పేర్లతో రాయడం ద్వారా నిర్బంధాన్ని తప్పించుకుంటున్నారు. 2011 మే ముందు కవి సమ్మేళనాలను కూడా ప్రభుత్వం అదుపు చేసింది. కాని ఇప్పుడు సిరియన్‌ రచయితలు ఈ నిబంధనలను ధిక్కరిస్తున్నారు. బహిరంగసభల్లో పాల్గొని తమ కవితలు, గేయాలు చదువుతున్నారు.

admin

Related Posts

leave a comment

Create AccountLog In Your Account